స్వీయ అవగాహన..
క్షత్రియుఁ డోడునే? తగదు కౌరవ రాజ, యొకండ నేఁ బృథా
పుత్రులలోనఁ బిన్న; నినుఁ బోరికిఁ బిల్వగ, మాని నాఁగ ని
ద్ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కి బల దర్ప సమగ్రుఁడవైన
నీవు నీ
మిత్రులుఁ గూడ నిట్లయిన మెత్తురె? వత్తురె కొల్వ భూభుజుల్!
(విరాటపర్వం - తిక్కన - 5- 203)
వ్యక్తి
ఒక కార్యాన్ని సంకల్పించిన సమయంలో తనా కార్యాన్ని సాధించగలడా.. అవకాశాలు, అవరోధాలు ఎలా ఉన్నాయి. తన బలాబలాలు ఎలాంటివి.. ఎదుటి వారి బలాబలాలు
ఎంత.. కార్య సాధనలో లాభనష్టాలు ఎలా ఉంటాయి.. వీటి గూర్చిన ఖచ్చితమైన అంచనాలతో ముందుకు
సాగాలి. అయితే కొన్ని మార్లు ఆ అవకాశం ఉండకపొవచ్చు. మన ప్రమేయం లేకుండానే మనమా కార్యంలో
భాగస్వామ్యులం కావాల్సిన అవసరం రావచ్చు.
స్వీయ-అవగాహన
అనగా మన నమ్మకాలు, ఆలోచనలు, భావనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను సరిగా అంచనా
వేసుకొని, అర్థం చేసుకునే సామర్థ్యం. ఇది మనం తీసుకునే సంక్లిష్ట
నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇతరులతో మన సంబంధ
బాంధవ్యాలను పటిష్టం చేసుకునే విధానానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాక, స్వీయ అవగాహన అంటే.. మనపై ఇతరుల ప్రభావం ఎంత? మనలను ఇతరులు
ఎలా ప్రభావితం చేస్తారో అవగాహన చేసుకునే సామర్ధ్యం కూడా. అందులో వ్యక్తి బలాలు, బలహీనతలు,
విలువలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఇతరులు మనలను ఎలా అంచనా వేస్తారు,
గుర్తిస్తారో అంచనా వేసుకునే భావనా ఉంటుంది. ముఖ్యంగా, స్వీయ అవగాహన మనలను గూర్చి మనం లోతుగా తెలుసుకోవడమే కాక మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంగా భావించవచ్చు.
ముఖ్యంగా
వ్యక్తిగత అభ్యున్నతికి స్వీయ అవగాహన ప్రామాణికమైన కొలమానంగా నిలుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని
పెంచి.. మరింత ఉన్నత బాధ్యతను భుజానికి ఎత్తుకునేందుకు ప్రేరణగా నిలుస్తుంది.
మహాభారతంలో
విరాటపర్వంలో ఉత్తర గోగ్రహణ సన్నివేశంలో అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఎదిరించి
గెలిచిన సన్నివేశం కనిపిస్తుంది. ఆ సందర్భంలో అర్జునునికి తనపై తనకున్న స్వీయ అవగాహన..
పరోక్షంగా కనిపిస్తూనే.. ఎదుటివారిని అధిక్షేపించే విధానమూ కనిపిస్తుంది.
ఓ
కౌరవ రాజా! దుర్యోధనా! నీవు క్షత్రియుడవు.. అందునా మాన ధనుడవు. యుద్ధానికి వచ్చిన వేళ
క్షత్రియుడు ఎక్కడైనా ఓడి పారిపోతాడా? ఇటు వైపు నేనా ఒక్కడిని..
అందునా కుంతీ పుత్రులలోన కూడా చిన్నవాడిని.. మరి నీవో.. అపార సేనా వాహినితో అతిరథులైన
విత్రులతో యుద్ధానికి సన్నద్ధుడవై వచ్చిన వాడివి. బలం దర్పం సమగ్రంగా కలిగిన వాడిననే
అభిమానం కలిగిన వాడివి.. నా కన్నా పెద్దవాడివి.. యుద్ధానికి పిలుస్తుంటే.. కాదని తగుదునమ్మాయని
పారిపోవడం గౌరవప్రదమా.. రేపు నీ మిత్రులు, సామంతులైన రాజులు వచ్చి
నిన్ను సభాంగణంలో సేవించడానికి వస్తారా.. గౌరవిస్తారా? ఆలోచించమని..
ఎద్దేవా చేస్తూ.. దుర్యోధనుని అధిక్షేపిస్తున్నాడు, అర్జునుడు.
విరాటపర్వంలో
ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుని పరాక్రమానికి తట్టుకోలేని కౌరవసైన్యం.. భీష్మద్రోణకర్ణాది
యోధులతో సహా యుద్ధభూమిని విడిచి పారిపోవడం, వారి వెంటబడి తరుముతూ
అర్జునుడు దుర్యోధనుని పరిహసించడం కనిపిస్తుంది.
మిత్రులు..
అనడంలో అధిక్షేపం ఉన్నది. కర్ణుడు అర్జునునికి సరిజోదుగా భావించిన దుర్యోధనుడు పాండవులతో
కయ్యానికి ఉపక్రమించాడు. కాని తన ప్రాణానికన్నా మిన్నగా భావించిన కర్ణుడు ఘోషయాత్ర
సందర్భంలో తనను విడిచి పారిపోవడం.. ఈ యుద్ధంలోనూ పారిపోవడాన్ని అన్యాపదేశంగా చెపుతున్నాడు, అర్జునుడు. కష్టకాలంలో మిత్రుడిని విడిచి తన మానాన తాను పారిపోవడం
మిత్రధర్మం కాదు. ఆ మాత్రం తెలియని కర్ణుని నమ్మి అపార బలపరాక్రమాలు కలిగిన మాతో కయ్యానికి
కాలు దువ్వడం అవివేకమనే వ్యంగ్యమూ ఉన్నది.
క్షత్రియుడు
శస్త్రజీవి. ప్రజలకు రక్షణనివ్వడం అతని కర్తవ్యం. ఆపత్తులు సంభవించిన సమయంలో ప్రాణాలకు
తెగించి ఉద్యమించాలి. ఆ కర్తవ్య నిర్వహణా దీక్షలో విజయమో వీరస్వర్గమో క్షత్రియుని ఉచితమౌతుంది
కాని వెన్ను చూపి పారిపోవడం క్షాత్ర లక్షణం కాదు.. కానేరదు. మానం ప్రాణానికన్నా మిన్న
యని భావించే క్షాత్రం.. పారిపోవడానికి ఒప్పుకోదు. అందునా.. మాన ధనుడనని చెప్పుకుంటున్న
నీ వంటి వారు పారిపోయి అపకీర్తి పాలవడం కౌరవ యశస్సును మంటగలపడం కాదా.. అనే అధిక్షేపణ
కనిపిస్తుంది.
ఓడునే..
అంటే.. భయపడునా అని భావన. భయం అపజయానికి తొలి మెట్టు. భయం ఆలోచనను మ్రింగివేస్తుంది.
అవకాశాలను గుర్తింపనీయదు. భయం వల్ల హేయమైన సందిగ్ధత, దాని వల్ల అనుమాన మేఘాలు క్రమ్ముకొని కర్తవ్యాన్ని విస్మరించేందుకు పురికొల్పుతాయి.
తగదు
కౌరవరాజా! కౌరవ వంశం ఉదాత్తమైన పరాక్రమానికి పేరుపొందినది. నీవు పారిపోయి దానికి అపకీర్తి
మచ్చను అంటించడం తగదు. వంశ ప్రతిష్ఠను దిగజార్చే పనులు చేయడం ఉత్తమ వంశ సంజాతులకు తగదు.
అది అసమంజసం కూడా.. మంచి పనులు చేసిన వ్యక్తి బ్రతికి యున్నప్పుడు పొందేది యశస్సు.
మరణానంతరం పొందేది కీర్తి.. తరతరాలుగా అతని గూర్చి, అతని వంశం గూర్చి చెప్పుకునేది ప్రతిష్ఠ.
ఒకండను
నేను పృథా పుత్రులలోన పిన్న.. దుర్యోధనా.. నేను నీకన్నా చిన్నవాడిని.. నీవు అపార సైన్య
సంపత్తితో,, సర్వ సన్నద్ధుడవై యోధానుయోధులతో కూడి ప్రణాళికాబద్ధంగా
వచ్చావు. అయినా నీ ప్రణాళికా రచనా సామర్ద్యం పటాపంచలైంది. అంచనాలను వ్యూహాలను సరిగా
అమలు చేయలేని అసమర్ధత నీలో కనిపిస్తున్నది. ఇంత సైన్యంతో వచ్చావంటేనే నీ కుటిల నీతి
అవగతమౌతున్నది. విలువలకు తిలోదకాలిచ్చి, విరాటుని సంపదను హరించాలనే
దుర్మార్గపు ఆలోచన ఎందుకు? దండయాత్ర చేయడం ధర్మబద్ధమే అనుకున్నా..
యుద్ధంలో ఒక్కని జయించలేక పారిపోవడం ఏ విధమైన క్షాత్రధర్మం. ఒక్కడిని, చిన్నవాడిని, సన్నద్ధుడనై లేని వాడిని, అనుకోకుండా యుద్ధానికి వచ్చిన నన్నే ఎదుర్కొనలేని నీవు.. రేపు మా సోదరు లందరమూ
సకల సైన్యాలతో.. సన్నద్ధులమై వచ్చిన వేళ ఎలా
నిగ్రహించుకోగలవు. అంతేకాదు, ఒకండ.. అనడంలో.. నేను ఒక్కడినే వీరుడిని..
మీరంతా భీరులు, అసమర్ధులు అనే వ్యంగ్యమూ ఉన్నది.
మాని
నాఁగ నిద్ధాత్రి ప్రసిద్ధి కెక్కి.. అభిమాన ధనుడనని నీకు నీవిచ్చుకున్న బిరుదుతో ప్రసిద్ధమైన
నీవు.. యుద్ధాన్ని మాని.. ప్రాణభయంతో పారిపోవడం.. హవ్వ.. ఎంతటి.. అపఖ్యాతి.. బలమూ దర్పమూ
కలిగిన వాడిననే అహంకారం ఇకపై ఎవరిపై చూపుతావు.. నీవు నీ మిత్రులు కూడా ఇలా యుద్ధరంగం
నుండి పారిపోవడం వల్ల ప్రపంచానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నావు. ఇప్పటివరకూ ప్రజలు
నీ బలదర్పాలను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలా పారిపోయి వారికి ఏ విధమైన సందేశాన్ని
ఇస్తున్నావనే అధిక్షేపం కనిపిస్తున్నది.
క్షాత్రం
చూపని క్షత్రియుడు జీవఛ్ఛవం లాంటివాడు. నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను..
అయినా నా ఆహ్వానాన్ని పెడచెవిని పెట్టి వెళ్ళిపోవడం అభిమాన ధనునికి తగునా?
ఎవరిని
నమ్మావో వారంతా నీకన్నా ముందుగా యుద్ధభూమిని విడిచి పారిపోయారు.. సోదరా.. ఇక ఎవరిని
నమ్మి ఇకపై రానున్న మహాహవానికి తెరలేపుతావో తేల్చుకో అనే వ్యంగ్యమూ కనిపిస్తుంది.
స్వీయ
అంచనాలు, అవగహనలు, ఎదుటివారి
బలాబలాలను గుర్తించి సరైన వ్యూహాలు రచించుకోలేని అసమర్ధత అపజయానికి తొలిమెట్టుగా భావించాలి.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment