Friday, August 15, 2025

 

            ఒక దేశ అభ్యుదయం ఆ దేశ ప్రజల ధార్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాసంపై ఆధారపడి ఉంటుంది. విద్య, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, వ్యాపారవాణిజ్య రంగాలు అభ్యుదయ సూచికలుగా చెప్పుకోవచ్చు. ప్రజల ధార్మిక చైతన్యం సంపదను పెంచుకోవడం, పంచుకోవడంల కొలమానంగా చెప్పుకోవచ్చు. "ధర్మస్య మూలం అర్థః" అంటాడు, ఆచార్య చాణక్య. సంపద సృష్టింపబడితేనే ఉపాధికల్పన, సంక్షేమాల అమలు సాధ్యపడుతుంది. ప్రభుత్వ పాలనా విధానంలో దూరదృష్టి, జాతీయ సమగ్రత, ప్రజారక్షణలకు ప్రాధాన్యత లభిస్తేనే వికసన, విస్తరణ కలుగుతుంది.. జాతికూడా యువశక్తిని సరైన మార్గంలో వినియోగించుకొని అభ్యుదయాన్ని సాధించగలుగుతుంది.

            ఈనాడు జాతీయ ఆర్థిక అభ్యుదయాన్ని గణించేందుకు దేశీయ స్థూల ఉత్పత్తులు/ సేవలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాము. దానినే జి.డి.పి. గా వ్యవహరిస్తారు. జి.డి.పి. లొ వృద్ధి ఆ దేశాభ్యుదయ వికాసంగా విస్తరణగా చెప్పుకుంటము. అలాగే.. మొత్తం దేశం సాధించిన ఆర్థికాభివృద్ధిని దేశ జనాభాతో విభాగించి దానిని దేశ తలసరి ఆదాయంగా గణించడం జరుగుతుంది. అది దేశ ప్రజల కొనుగోలుశక్తినీ, ప్రామాణికమైన జీవన విధానానికి సూచికగా నిలుస్తుంది. ఉత్పత్తులు/ సేవల వినియోగంలో ప్రజల జీవనవ్యయం, కొనుగోలు శక్తి.. ద్రవ్యోల్బణ గణనలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. అసమర్ధ ప్రభుత్వ నిర్వహణ వల్ల సంపద కొందరి స్వార్థ ప్రయోజనాలకు, విలాసాలకు మాత్రమే పరిమితమయితే దేశంలో నిరుద్యోగత పెరిగిపోయి అరాచకాలకు దారితీయవచ్చు. తద్వారా.. అశాంతి పెరిగిపోయి పెట్టుబడులకు దారులు మూసుకుపోవచ్చు.

            ఈ క్రమంలో ఊర్ధ్వముఖంగా సాగే జి.డి.పి. ప్రజల కొనుగోలు శక్తికి అద్దంపడుతుంది.. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దృష్టిని కేంద్రీకరించి, సాగునీటి లాంటి మౌలిక వసతులను అందించడం, వాణిజ్య రంగానికి అవసరమైన విద్యుఛ్ఛక్తి లాంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తే వ్యాపారవాణిజ్య వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. రహదారుల విస్తరణ, విమానాశ్రయాల ఏర్పాటు, ఓడరేవుల అభివృద్ధి వల్ల వస్తు రవాణా వేగవంతమై వ్యాపార నిర్వహణ సులభతర మౌతుంది.  దానివల్ల యువతకు ఉపాధి కలుగుతుంది. జాతికి ఆర్థిక సుస్థిరత కలుగుతుంది.

            శాస్త్రీయ పరిశోధనలు, భారీపరిశ్రమలు, విమానాశ్రయాలు, విమానరవాణరంగం, విద్యుత్ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగాలు ప్రజలకు ఉపాధినివ్వడమే కాక జాతీయ అభ్యుదయంలో ప్రముఖపాత్రను పోషిస్తున్నాయి. వీటిని స్థాపించి నిర్వహించే వ్యాపారవేత్తల భాగస్వామ్యం, సహకారాలు జాతీయ ఉపాధిరంగానికి, ఆర్థిక రంగానికి ఊతమిస్తూ.. దేశ జి.డి.పి. అభ్యుదయాన్ని బలోపేతం చేయడంలో ప్రముఖపాత్రను పోషిస్తున్నాయి.

            ఈ వరసలో భారతీయ జాతీయ అభ్యుదయానికి వీధివ్యాపారుల భాగస్వామ్యం చెప్పుకోదగినది. అసంఘటిత రంగంలో జీవనాన్ని సాగిస్తున్న వీధివ్యాపారుల ఆధ్వర్యవంలో National Association of Street Vendors of India (భారతీయ జాతీయ వీధి వ్యాపారుల సంఘం) అంచనాల ప్రకారం ప్రతిరోజు దాదాపుగా 8000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.  వీరి భాగస్వామ్యం జాతీయ జి.డి.పి.లో దాదాపుగా 63 శాతంగా అంచనా. ఇది అంచనా మాత్రమే.. నిజానికి దేశాభ్యుదయంలో వీధివ్యాపారుల భాగస్వామ్యమే సింహభాగంగా చెప్పుకోవాలి. (పరిశ్రమలు 28.25% మరియు వ్యవసాయం 18.42% గా అంచనా). వీధి వ్యాపారాలు దేశవ్యాప్తంగా దాదాపుగా 60 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తునాయని అంచనా. వీరిపై దాదాపుగా 10 నుండి 11 లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెపుతారు. అంతేకాదు, సాధారణ ప్రజలు నిత్యావసర వస్తువులు సమకూర్చుకోవడానికి ఈ వీధి వ్యాపారులపైనే ఆధారపడుతున్నారని అంచనా.

            జాతీయ అభ్యుదయ వికసనలో వీధివ్యాపారుల భాగస్వామ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం..  పి.యం. స్వనిధి (Prime Minister's Street Vendors Atmanirbhara Nidhi) ద్వారా ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వీధివ్యాపారులు ఆర్థిక స్వావలంబనను సాధించేందుకు,  జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.

           

           

No comments: