Friday, August 15, 2025

 

            ఒక రచనను ఆధ్యయనం చేసిన సమయంలో ఎంత నిష్పాక్షింగా ఆలోచించాలన్నా.. వ్యక్తి పెరిగిన వాతావరణం, చేసిన ఆధ్యయనశీలత, విస్తృత పరిధిలో అంది వచ్చిన సాహిత్యపు లోతులు, చుట్టూ ఉన్న సాహితీ మిత్రుల వైఖరి ఇలాంటి పలు అంశాలు వారిపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పూర్వ నిశ్చితాభిప్రాయాలు ఆయా పాత్రలపై ఏర్పడుతాయి. అయితే.. వాటిని అధిగమించేందుకు అవసరమైన అంశాలు ఆ రచనలో ఉండవచ్చు కాని వాటిని పరీశీలనకు తీసుకునేందుకు మనసు సహకరించదు.

            భారతంలో దుర్యోధనుని పాత్రపై చాలామందిలో పూర్తిగా దురభిప్రాయమే ఉన్నది. కాని ఆశ్రమవాస పర్వంలో ప్రథమాశ్వాసంలో 98 వ పద్యంలో "వినుము దుర్యోధనుండు చేసిన యనర్హ మొక్కటియు లేదు" అంటాడు.  ధృతరాష్ట్రుడు వనవాసం చేయాలని ధర్మరాజు అనుజ్ఞను తీసుకున్నాక ప్రజల అనుమతినీ కోరుతాడు. ఆ సందర్భంలో "శంబువు అనే బ్రాహ్మణుడు ప్రజల అందరి పక్షాన మాట్లాడుతూ "నిజానికి దుర్యోధనుడైనా ప్రజలకు చేసిన అకృత్యమంటూ ఏమీ లేదు" అంటాడు. రాజ్యం కొరకై రాజకీయ కక్షల నేపథ్యంలో పాండవులతో విభేదించిన దుర్యోధనుడు వారికి అపకారం చేసి ఉండవచ్చు కాని ప్రజాపాలనలో అపమార్గం త్రొక్కిన సందర్భాన్ని చూపలేదు.. పైపెచ్చు ప్రజలకు అపకారం చేయలేదని చెప్పడం కలిపిస్తుంది.

            జీవితంలో ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలని భావించడం తప్పుకాదు.. అధర్మమూ కాదు.. అయితే ఎదుటి వారిని త్రొక్కుతూ ఉన్నత స్థానాన్ని చేరాలని భావించడమే తప్పు, అధర్మం. సక్రమమైన మార్గంలో అందివచ్చిన అవకాశాలను అంది పుచ్చుకొని ఎదగడానికి, ఎదిగిన స్థానాన్ని నిలుపుకోవడానికి సహనం కావాలి, ఆత్మ నిబ్బరం కావాలి, నిగ్రహం కావాలి, సమయస్పూర్తి కావాలి, ధైర్యసాహసాలు కావాలి. సమస్యల పరిష్కారానికి ఆవేశకావేశాలు ఉపయుక్తం కావు. ఆలోచనా పరిణతి, పతిష్టమైన వ్యూహరచనా సామర్ధ్యం, దానిని అమలు చేయడంలో నైపుణ్యం, ఫలితాన్ని ఆస్వాదించే సమయంలో పొంగిపోని లేదా క్రుంగిపోని నిలకడ గలిగిన మానసిక చైతన్యం అవసరం.

            మహాభారతంలో ధర్మరాజు, దుర్యోధనుడు ఇరువురూ అధికారాన్ని కోరుకున్నవారే.. ఐశ్వర్యాన్ని కోరుకున్నవారే.. అయితే ఆ సంకల్ప సాధనలో వారెన్నుకున్న మార్గాలే భిన్నమైనవి. సహనం కలిగిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఓటమి కలిగినా దానితో నిరాశానిస్పృహలను దరిచేరనీయరు. అవమానాలు, అపకారాలు ఎదురైనా ఎవరు మోసగించినా క్రుంగిపోరు. శక్తిహీనులై చతికిలబడరు. నైతిక వర్తనతో ఆర్మబలాన్ని పెంచుకుంటారు. వివేకంతో ఆలోచిస్తారు. సానుభూతితో సహాయపడే బంధుమిత్రుల సంపదను పెంచుకుంటారు. దూరదృష్టితో కూడిన ఉదారత కలిగిన వ్యక్తి  జీవితం ప్రశంసార్హమౌతుంది.

            అర్థకామాల సమాహారమే మానవులలో కనిపించే స్వార్థం. భౌతిక జీవన విధానానికి స్వార్థం సహజమే. అయితే స్వార్థం పెరిగిపోయి ప్రక్కవారి స్వార్థాన్ని అడ్డుకుంటే.. సంఘర్షణ తలెత్తుతుంది. అది వ్యక్తి జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సామాజిక జీవితంలోనైనా అశాంతిని పెంచుతుంది.. సుఖసంతోషాలను త్రుంచుతుంది. స్పర్ధలను, కక్షలను కార్పణ్యాలను రాజేస్తుంది. తద్వారా వ్యక్తి పతనంతో పాటుగా, సమాజ ఉనికికీ ప్రమాదం కలుగుతుంది. నిజానికి వ్యక్తి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చేవి విజ్ఞత, విచక్షణాయుత నిర్ణయాలు.

            రక్త సంబంధీకులతో స్పర్ధలు, కక్షలు కలిగినప్పుడు.. యుద్ధాలు జరిగినప్పుడు వ్యక్తి దృష్టి విజయసాధనపైనే నిలుస్తుంది కాని.. బంధుత్వాలపై, మైత్రిపై ఉండదు. వైరంతో కలిగే కష్టనష్టాలను పట్టించుకునే మానసిక స్థితి కూడా ఉండదు. విజయ సాధనకై ఇరు పక్షాలూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ తమ ప్రజ్ఞలను వినియోగిస్తారు. గెలిచినా ఓడినా సంభవించే పరిణామాలు అనేక సందర్భాలలో సంతోషానికన్నా విషాదాన్నే మిగులుస్తుంది. చాలామందిలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. సంపదనూ కోల్పోతారు.

            ఏ యుద్ధమైనా.. ఏ కాలంలోనైనా అపార జననష్టాన్ని, ధననష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆత్మీయులను కోల్పోయినా, ముఖ్యమైన శిక్షణపొందిన వ్యక్తులను కోల్పోయినా జరిగే నష్టం అపారం. అంతేకాక, తిరిగి శిక్షణ పొందిన మానవ వనరులను తయారు చేసుకునేందుకు, ఎంతో సమయం అవసరమౌతుంది.

            ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే.. పాలకుడు ధార్మికుడు మాత్రమే అయితే సరిపోదు. ప్రజలకు సుపరిపాలన నందించడం ఏమంత సులభమైన పనీగాదు. ఎన్నో సమస్యలను అధిగమించాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందరో ఆ నిర్ణయాలను వ్యతిరేకించవచ్చు. వారిని ఒప్పించాలి.. అధికారం అన్ని సమస్యలను పరిష్కరించలేదు. అందరినీ సమన్వయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను నిశితంగా పరిశీలించి, పరిగణనలోనికి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ధార్మికతతో పాటుగా ప్రాంతీయ ఆచారవ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

            పాలకులకు ఎన్ని సుగుణాలు ఉన్నా, ఎంతటి ధార్మికులైనా, వృత్తిధర్మాన్ని బట్టి, తమకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేయక తప్పదు. అధర్మం ఒకవిధంగా అపరిశుభ్రతకు ప్రతీకగా చెప్పుకోవాలి. అపరిశుభ్రత వల్ల అనర్ధాలు కలుగుతాయి.. అలాగే అధర్మం వల్ల కూడా అనర్ధాలు కలుగుతాయి. అధర్మాన్ని అజ్ఞానానికి చిహ్నంగా కూడా చెపుతారు.

 

 

 

 

 

 

ఒకటికి మూడుసార్లు చదివాను మీ ఈ వ్యాసాన్ని!

మీ సవిస్తర ధర్మ ప్రబోధచే మేల్కొన్న ' ప్రజ్ఞలు ' గలవాడినయ్యాను!

ధర్మస్వరూపం ఏమిటో తెలియక నానాగందరగోళం పాలౌతున్నాను!

మీ సమర్థన- మీమాటలతోనే ఉద్బుద్ధమైన ప్రజ్ఞాప్రేరిత విమర్శల మధ్య భారత / భారతీయ ధర్మ స్వరూపమేమిటో తెలియని విమూఢత పాలయ్యాను...

 ఔరా!.. మహాప్రస్థానమంటే ఇదా!!??

గందరగోళం పాలై జాత్యంతరీకరణం మేలని భావించటమా!!

ఇంతకు మునుపు దేన్ని చదివితే నాకు మహాప్రస్థానం బోధపడిందని భ్రాంతి కలిగిందో ,

    దేని పఠనంతో మానవుని అంతిమయానం, స్వర్గ నరకాల స్వరూపం సుబోధమయిందని భ్రమ పొడమిందో,

      ఆ రచన - Peter Brooks అనువదించి, తెరకెక్కించిన Jean-Claude Carriere గారి మహాభారత నాటకాన్ని

      మరోమారు మనసారా చదువుకొన్నాను...

      మునుపు గ్రహించిన అర్థమే హాయిగా ఉందని నెమ్మదిపడ్డాను...   

      జాత్యంతరీకరణ ఎంత సుఖప్రదమో నాలో ధర్మువుకు బోధపరిచాను...

 

    కొండ ఉన్నతి గ్రహించాలంటే

    కష్టపడి ఎక్కటం కాదు

    విమానం నుంచి ఉపరివీక్షణం చేయాలన్న మాట

    ఎంత సత్యం!! ...

 

అంత మాటనంటున్నారంటే మీ మనస్సునెంత నొచ్చుకొనేలా చేశానో అర్థమవుతున్నది.. క్షంతవ్యుణ్ణి..

      నా ఫిర్యాదు మీ రచన గూర్చి కాదు.. అందులో ధర్మ రాజు ధర్మ మీమాంస గూర్చి... దాన్ని మీరు ఎంత కష్టపడి సమర్థిస్తున్నా, నా మట్టి బుర్రకందని  తార్కికత గూర్చి... నా దృష్టిలో స్వర్గం లో దుర్యోధనుని చూసి, ధర్మజునికి కలిగిన సందేహం చాలా సమంజసమైనది.. కానీ దానికి ఇంద్రుడు సతార్కికంగా సందేహ నివృత్తి చేయకపోగా, నీవింకా నీ రాగద్వేషాలను వదిలిపెట్ట లేదనటం, నారదుడు కూడా అలాటి కప్పదాటు మాటే చెప్పటం అర్థం కాలేదు.. అసలు ధర్మ స్వరూపమే తలక్రిందులైనట్లు అనిపించింది.. యుద్ధంలో చనిపోయిన వారందరూ స్వర్గాన్ని చేరలేరు అని కూడా చెబుతున్నారన్నారు.. అప్పుడు దుర్యోధనుడు చేసింది ధర్మయుద్ధమే నని నొక్కి వక్కాణించటమే కదా... అక్కడ నాకు కలిగిన గందరగోళం శిఖర స్థాయి నందుకొంది...

   అదీ విషయం.. మీరు మరికొంత తేలిక మాటల్లో, (ప్రబోధ భాషలో కాక) ఆ ధర్మమీమాంసను వివరిస్తే తెలుసుకోవాలని ఎంతో కోర్కెతో ఉన్నాను.

    మహాభారతంపై నా శ్రద్ధాసక్తులు, దాన్ని సవిమర్శంగా అర్థం చేసుకోడానికి నా ప్రయత్నమూ మీకు తెలుసు.. వాటిని మీరు గ్రహించగలరనే నా నమ్మకం....

 

No comments: