Friday, August 15, 2025

 

మృత్యుస్పర్శ

 

            శీలాన్ని, జ్ఞానాన్ని పెంచి పోషించేది విద్య. ఉపనిషత్తులు విద్యను జీవితంపట్ల స్పష్టమైన దృక్పథంగా చెపుతున్నాయి. చిత్తశుద్ధి, సంకల్పబలాన్ని పెంచుకోవడం, ఉదాత్తమైన భావనలను జాగృతం చేసుకోవడం లక్ష్యంగా గురుశిష్యులు పరస్పరం విశ్వాసంతో సహకరించుకొని చేపట్టే ఉద్యమమే విద్యాభ్యాసం. విద్యాభ్యాసం.. గ్రహింపుశక్తిని పెంచి, మనసును నిర్మలంగా, ప్రశాంతపరుస్తూ జ్ఞానార్జనకు సన్నద్ధం చేసే ప్రక్రియకు తొలిమెట్టు. జీర్ణమైన ఆహారం ఎలాగైతే పుష్టినిస్తుందో.. అలాగే ఆకళింపు చేసుకోగలిగిన విద్య వికాసానికి, అభ్యుదయానికి ఉపకరిస్తుంది. అలాంటి విద్యాభ్యాసానికి గురువు స్పూర్తినిస్తాడు, శిష్యుడు స్పూర్తిని పొందుతాడు. ఒక దీపంతో మరొకదీపాన్ని వెలిగించిన విధంగా గురువు శిష్యునిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.. గురుశిష్యులు జ్ఞానవ్యాప్తిలో ఉపకరణాలుగా ప్రపంచానికా వెలుగులు పంచుతారు.

            కఠోపనిషత్తులో వాజశ్రవసుడు (ఉద్ధాలకుడు) అనే ముని విశ్వజిద్యాగం చేస్తాడు. అందులో తనకున్న సర్వస్వాన్ని దానం చేస్తున్న సమయంలో.. తానూ తండ్రి సంపదలో భాగమని భావించిన అతని కుమారుడు నచికేతుడు.. నన్నెవరికి ఇస్తావని పదేపదే అడగుతాడు. దానికి తండ్రి విసుగుతో "మృత్యువు"కు ఇస్తానంటాడు.

            మృత్యువు అంటే సాధారణంగా మరణం అనుకుంటాము. కాని మృత్యువు అంటే గురువు లేదా ఆచార్యుడు. "ఆచార్యో మృత్యుః" అంటుంది, అధర్వవేదం. అజ్ఞాన భరితమైన భౌతిక శరీరాన్ని దగ్ధం చేసి, జ్ఞాన శరీరాన్ని ప్రసాదించేవాడు, ఆచార్యుడు. అతడే మృత్యువు. సాధకుడు, అజ్ఞాన శరీరాన్ని విడిచి జ్ఞాన శరీరాన్ని ధరించే సంధి సమయంలో సాధకునికి మృత్యుస్పర్శ కలుగుతుంది. అది తెలిసి గాని తెలియక గాని కలగవచ్చు.

            తండ్రి మాటను అనుసరించి నచికేతుడు యముని ఇంటికి వెళతాడు. యముడిని యోగాచార్యునిగా భావించవచ్చు. అప్పుడు యముడు ఇంటిలో లేకపోవడంవల్ల అక్కడ మూడు రాత్రులు ఉపవసించిన నచికేతునికి యముడు  వచ్చాక మూడు వరాలను ఇస్తానంటాడు. దానికి నచికేతుడు, తండ్రికి తనపై ప్రేమాభిమానాలు కలగాలని, మొదటివరంగానూ, స్వర్గానికి తీసుకువెళ్ళే అగ్నిని గూర్చిన విద్యను రెండవ వరంగానూ కోరగా యముడు అనుగ్రహిస్తూ.. ఇకపై ఆ ఆగ్నిని నచికేతాగ్నిగా వ్యవహరిస్తారని చెపుతాడు.

            సత్యాన్వేషణ లక్ష్యంగా, నచికేతుడు మనిషి మరణం తదుపరి ఏమి జరుగుతుంది, ఆత్మ ఏమవుతుందో తెలుపమని మూడవవరంగా కోరుతాడు. దానికి యముడు.. పిన్నవాడివి గంభీరమైన గహనమైన తత్త్వాన్ని కాక మరొకవరం కోరుకొమ్మంటాడు. అయితే పరిపక్వ మనస్కుడు, సూక్ష్మగ్రాహి, దృఢచిత్తుడునైన నచికేతుడు.. జ్ఞానాఢ్యుడైన ఆచార్యుడు ఎదురుగా ఉన్నప్పుడు అల్పవిషయాలను అడగడం సమంజసం కాదంటూ.. ఆత్మస్వరూప స్వభావాలను మాత్రమే బోధింపవలసిందిగా ప్రార్థిస్తాడు. యముడు ప్రలోభాల రూపంలో నచికేతుడిని ఎన్నో విధాలుగా పరీక్షించి.. మానవుడి అంతరంగ మర్మాన్ని తెలుసుకోవడంలో నచికేతుని  శ్రద్ధను, జిజ్ఞాసను గుర్తించి.. చివరగా, నిత్యశుద్ధము, నిత్యబోధము, నిత్యముక్తము, అత్యంత రహస్యమూ, అత్యున్నతమూ నైన పరతత్త్వ జ్ఞానాన్ని బోధిస్తాడు. ముఖ్యంగా ప్రేయోమార్గాన్ని శ్రేయోమార్గాన్ని వివరించి అందులో శ్రేయోమార్గం శాశ్వతమైన బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తుందని చెపుతాడు.. జీవుడు శాశ్వతుడనీ, పదార్ధరూపమైన శరీరం పతనమయ్యాక ప్రాణశక్తి సహాయంతో మరొక శరీరంగా పరివర్తన చెందుతాడంటాడు.       

            శ్రద్ధ అంటే అస్తిత్వంపై, ఆత్మబలంపై అపారమైన నమ్మకం.. సత్యంపట్ల, ధర్మంపట్ల సడలని విశ్వాసం. సాధారణంగా ఇంద్రియాకర్షణ శక్తి మానవులను సత్యధర్మాల నుండి తప్పుకునేందుకు ప్రేరణనిస్తుంది. ఇంద్రియాల ఔద్ధత్యాన్ని శమింపచేస్తేనే ఆత్మబలం ఉద్దీపనమౌతుంది.

            జిజ్ఞాస అంటే క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక, అమితమైన అసక్తి, క్రొత్తదానితో సమన్వయం చేసుకునే ఉత్సాహం, సృజనాత్మకత.. ఆ దారిలో అన్వేషణ, అభ్యాసం, అభివృద్ధి. శద్ధా జిజ్ఞాసలు శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రతీకలుగా నిలుస్తాయి.

            భౌతిక ఆధ్యాత్మిక జీవితాలకు ప్రగతిని సుగతిని చూపుతూ.. ప్రేయస్సును, శ్రేయస్సును సమన్వయం చేసుకునే ప్రక్రియలో అశాశ్వతమైన అజ్ఞాన శరీరాన్ని దగ్ధం చేసి శాశ్వతమైన జ్ఞాన శరీరాన్ని అనుగ్రహించే మృత్యుస్పర్శను అవగతం చేయిస్తున్నది, కఠోపనిషత్తు.

పాలకుర్తి రామమూర్తి

           

No comments: