Friday, August 15, 2025

 

కలన గురుండు భీష్ముఁడును గాండివిచేఁ బడి, రంగరాజు వా

రల కధికుండె? యాతని దురంబున నోర్వఁ గలండె? పూని యే

వలదని బుద్ధి  సెప్పిన నవశ్యము నాతఁడు నిల్చు, నీతనిన్

నిలుపుము, నీవు ధర్మసుతునిన్ దగు మాటలఁ దేర్పఁ జొప్పడున్!

(భారతం - కర్ణపర్వము- 3-267)

 

            యుద్ధంలో భీష్మద్రోణులు గాండీవిచేత పతనమయ్యారు. ఈ కర్ణుడు వారికన్నా మొనగాడా ఏమిటి? అర్జునుని యుద్ధంలో గెలువగలడా? నేను పట్టుదలతో అర్జునుడికి తగిన మాటలు చెపితే తప్పక నా మాటలకు కట్టుబడి యుద్ధం మానుతాడు. ఇక నీవు ఈ కర్ణుడిని యుద్ధ ప్రయత్నం నుండి మాన్పించుము. నీవు ధర్మరాజును సమయోచితమైన మాటలతో మనసు కుదుటపడేటట్లు చేయగలిగితే అంతా సర్దుకొని పోతుంది, అంటాడు దుర్యోధనునితో అశ్వత్థామ.

            ఆవేశపరుల స్వభావం చిత్రవిచిత్రంగా ఉంటుంది. సహజంగా ఆవేశపరుడైన అశ్వత్థామలో దురంహాకార, దుస్సాహసాలు చాలా తీవ్రమైనవి. ఆవేశకావేశాలు ఎంత తీవ్రంగా ఉంటాయో సత్యదర్శనమూ అంతే స్పష్టంగా కనిపిస్తుంది. కృంగిపోవడమూ, పొంగిపోవడమూ అధికంగానే కనిపిస్తుంది.

            అస్త్ర విద్యాభ్యాసంలో అర్జునునితో మాత్సర్యం పెంచుకున్నాడు. అయినా అర్జునుని పరాక్రమం గూర్చిన స్పష్టమైన అవగాహన అశ్వత్థామలో ఉన్నది. ఎదుటివారి గుణదోషాలను గుర్తించినట్లే తనలోని గుణదోషాలనూ గుర్తించేందుకు అభిమానపడని నైజం అశ్వత్థామది. అయితే దోషాలను దాచుకొని గుణాలను ప్రకటించుకునే సంకుచిత స్వభావమూ అశ్వత్థామలో అధికంగానే కనిపిస్తుంది. తమ పక్షంపై అసంతృప్తి కలిగిన వేళ వైరి పక్షాన్ని ప్రశంసించడానికి, స్వపక్షాన్ని విమర్శించడానికి వెనుదీయని మానసిక స్థిత్ఇని అశ్వత్థామలో చూస్తాము.

            ఉత్తర గోగ్రహణ సమయంలో ద్రోణుడు అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తాడు. దానికి కోపగించిన దుర్యోధనుడు, కర్ణుడు ద్రోణుడిని తూలనాడడం కనిపిస్తుంది. దానితో ఆవేశపడ్డ అశ్వత్థామ అర్జునుని గుణగణాలను పరాక్రమాన్ని ప్రశంసిస్తాడు. అంతటితో ఆగక కౌరవ పక్షంలోని దురాగతాలను ప్రస్తావించి విమర్శించడమూ కనిపిస్తుంది. ద్రోణ వధ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుని తలను నరికిన ఘట్టంలో అపరిమితమైన కోపావేశాలతో దివ్యాస్త్రాలను పాండవులపై ప్రయోగించడం, కృష్టార్జునుల వల్ల అవి రిత్తపోవడం జరుగుతుంది. దానిని గమనించి తన నిస్సహాయతను, తండ్రి దుర్గతిని తలచుకొని దుఃఖించడమూ కనిపిస్తుంది.

            ఇక ప్రస్తుత పద్యానికి వస్తే.. దుశ్శాసనుని దుర్మరణాన్ని, భీష్మద్రోణుల పతనాన్ని, కర్ణార్జునుల ద్వంద్వయుద్ధంలో అర్జునుని ప్రతాపాన్ని గమనించాక.. తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు. వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు. అపజయం తప్పదనీ, యుద్ధం కొన సాగిస్తే సర్వనాశనమూ జరుగుతుందనీ గ్రహించాడు కనుకనే దుర్యోధనుని వద్దకు వెళ్ళి ఆప్యాయంగా అతని చేతిని పట్టుకొని సాంత్వన స్వరంతో సంధిని చేయడం ఉత్తమమని చెపుతాడు. "సంధి యొనర్చుట మేలు వారితోన్".. "బ్రతికిన నెల్ల శుభములు గలువు", "చచ్చిన నేమి కలదు".. అంటూ "ఈసుమానుము" అంటాడు.

            ఒక వ్యక్తిలో విభిన్న మానసిక స్థితిగతులు అవసరానుగుణంగా ప్రకటితమౌతుంటాయి. భావోద్వాగాలను అదుపులో పెట్టుకోలేని బలహీనత ఒక్కొక్కమారు విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అది అశ్వత్థామలో సౌప్తిక పర్వంలో పాండవశిబిరాన్ని విధ్వంసం చేసిన సందర్భంలో ప్రకటితమౌతుంది. బుద్ధియొక్క విచక్షణను కాదని ఆవేశం ముందుకు నడిస్తే వివేచన నశించి ప్రళయాన్ని సృష్టిస్తారు.

            తీవ్రమైన ఆవేశానికి అడ్డుకట్టగట్టి ఆ ఆవేశ ప్రవాహాన్ని దారి మళ్ళిస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుందనే దానికి అశ్వత్థామ ఆలోచనా స్థితియే తార్కాణంగా చెప్పుకోవచ్చు. అయితే.. ఈ సందర్భంలో దుర్యోధనుడు అశ్వత్థామ హితోక్తులను పడచెవిని పెట్టడం, యుద్ధాన్ని కొనసాగించేందుకే నిర్ణయించడం, కర్ణుని మరణం తదుపరి ఫలితాలుగా కనిపిస్తాయి.

            పెద్దల జోడిపింపులు వ్యాఖ్య విలువను పెంచుతాయని విశ్వసిస్తూ..

పాలకుర్తి రామమూర్తి

No comments: