Friday, August 15, 2025

 

గురువు యొక్క ప్రాముఖ్యత

 

ఏకమేవాక్షరం యస్తు గురుః శిష్యం ప్రబోధయేత్

వృథివ్యాం నాస్తి తద్రవ్యం యద్దత్వా చాఽనృణీ భవేత్!

(చాణక్య నీతి - 15- 2)

            గురువు ఒక్క అక్షరం నేర్పినప్పటికీ, ఈ భూమి మీద ఆ గురువు ఋణాన్నుండి విముక్తి కలిగేందుకు ఇవ్వగలిగిన విలువైన వస్తువు ఏదీ లేదు, అంటారు ఆచార్య చాణక్య. ఈ శ్లోకం ద్వారా ఆచార్య చాణక్య గురువు పట్ల శిష్యులకు ఉండాల్సిన కృతజ్ఞతా భావనను, గౌరవ ప్రతిపత్తులను తెలియ జేస్తున్నాడు. ఒక్క అక్షరం కూడా వ్యక్తి జీవితంలో పెను మార్పులకు నాంది పలుకుతుంది. ఆ అక్షర స్వరూపాన్ని స్వభావాన్ని తెలియచేసేవాడు గురువు. సాధకులను తరింపచేసే ఒక్క అక్షరం.. ఓంకారము కూడా.

            గురువు వ్యక్తికాదు. గురువు ఒక శక్తి. అఖండామైన మండలాకారంలో అంతటా వ్యాపించిన గురువు అర్హతను అనుసరించి  ఉన్న స్థితినుండి ఉన్నతస్థితికి మార్గాన్ని చూపుతాడు. శిష్యుడు సాధన ద్వారా ఆ మార్గంలో తాను నిశ్చయించుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. గురువు సజీవుడైనా కాకపోయినా శిష్యుని ఉన్నతికి సహాయకారియై నిలుస్తాడు. తరించగలిగిఅన విద్యను ప్రకాశితం చేస్తాడు. స్పురింప చేస్తాడు. అందుకే గురువు ఆరాధనీయుడు. అక్షరం అంటే నాశనం లేనిది. అదిుగురమ్మల మూలపుటమ్మ పదం మాత్రమే. అక్కడి నుండే వచ్చాము.. అక్కడికి వెళ్ళడమే మానవ జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో సాగే ప్రయాణంలో ఎదురుగా అంతా చీకటియే.. ఆ చీకటియే అజ్ఞానం.. దానిని అధిగమింప చేసే ఒక్క అక్షరమైనా అక్ష్యమై జన్మసార్ధకత్వానికి మార్గం సుగమం చేస్తుంది.

            ఆ మార్గాన్ని చూపే గురువును ఆరాధించడం ఆ పరమేశ్వరిని ఆరాధించడమే. గురుపౌర్ణిమ సందర్భంగా గురు పరంపరను స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ.. ముందుకు సాగడమే కర్తవ్యం.

            కృతజ్ఞతా పూర్వక నమస్సులు..

పాలకుర్తి రామమూర్తి

No comments: