ద్రోణుని రెండావుల యాచన.. పరిణామం..
ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణ శూరుతోడ భీ
రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జను తోడఁ గష్ట దు
ర్జననుకు నెవ్విధంబున సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే!
(మహాభారతం - ఆదిపర్వము- 5-204)
ధనవంతునితో దరిద్రునికి, తత్త్వాన్ని తెలిసిన పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచాన్ని ధరించిన వానితో కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? అని ప్రశ్నిస్తున్నాడు ద్రుపదుడు, ద్రోణుడిని. మానవ సంబంధాలలో లోక సహజమైన ఒక విధానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, నన్నయగారు. ఇలా ఉండాలని కాదు కాని ఎలా ప్రపంచం "ఉన్నదో" ఆ స్వరూపాన్ని దర్శింప చేస్తున్నాడు.
స్నేహితుడు కష్టాలలో ఉన్నప్పుడు అతనిని ఆదరించడం స్నేహధర్మం. ఆదరించక పోయినా ఎత్తిపొడుస్తూ అవమానించడం అతిశయానికీ గర్వానికీ ప్రతీకగా నిలుస్తుంది. తాను క్షత్రియుడననీ.. ఎదుటి వాడు బ్రాహ్మణుడని చెపుతూ "వర్ణాన్ని", స్వభావాన్నీ, అంతరాలను సభలో ఎత్తి చూపుతూ మిత్రుని మనస్సును చివుక్కుమనే విధంగా ద్రుపదుడు ప్రవర్తించాడు. ఏ మాత్రం అభిమానం కలిగిన వాడైనా ఆ మాటలకు బాధపడతాడు. పోలికలలో కూడా తనను తాను ఉత్తమునిగా (ధనపతిగా, తత్త్వవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, సజ్జనునిగా) చెప్పుకుంటూ.. అధమ లక్షణాలను (దరిద్రునిగా, మూర్ఖునిగా, క్రూరునిగా, పిరికివానిగా, అరక్షకునిగా, దుర్మార్గునిగా) ద్రోణునికి ఆపాదించడం వల్ల పుండుపై కారం చల్లినట్లుగా కనిపిస్తుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలన్న లోక సహజోక్తిని ఇక్కడ అన్యాపదేశంగా చెప్పడం గమనార్హం.
మహాభారతం ప్రకారం.. ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాగా ద్రుపదుడు వాయువు అంశ. భరద్వాజుడు ఘృతాచీని చూచిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జన్మించిన వాడు.. ద్రోణుడు.. కాగా వృషతుడు మేనకను దర్శించిన సమయంలో జరిగిన రేతః పతనం వల్ల జనించిన వాడు, ద్రుపదుడు. వృషతుడు తన మిత్రుడైన భరద్వాజుని ఆశ్రమంలో ద్రుపదుని చేర్చి విద్యాభ్యాసం చేయించాడు. దానివల్ల ద్రోణునికి ద్రుపదునికి మధ్య గాడమైన మైత్రి ఏర్పడింది.. కాలాంతరంలో అటు వృషతుడు ఇటు భరద్వాజుడు మరణించడం.. కారణంగా ద్రుపద.. ద్రోణులు విడిపోయారు.. తన రాజ్యానికి వెళ్ళే సమయంలో ద్రుపదుడు.. ద్రోణునితో నీకే సమయంలో ఏ విధమైన అవసరం వచ్చినా నేనున్నానని మరచిపోకు.. పాంచాల దేశానికి ప్రభువునైన నా సహాయాన్ని నిస్సంకోచంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు.
తదుపరి ద్రోణుడు అగ్నివేశుని వద్ద విలువిద్యను అభ్యసించడం జరుగుతుంది. కృపుని చెల్లెలయిన కృపితో వివాహం జరిగి అశ్వత్థామ అనే కుమారునికి జన్మనిచ్చాడు. వేదవేదాంగాలూ నేర్చాడు, అస్త్రవిద్యలో ఆధిక్యాన్ని సాధించాడు.. అయినా అపరిగ్రహ వ్రతంతో (ఎవరి వద్దా దేనినీ తీసుకోననే) జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నాడు. కటిక పేదరికం వల్ల కనీసం కుమారునికి పాలుకూడా ఇవ్వలేని దుర్భరస్థితిలో లౌకిక జీవనం సాగేందుకై.. పరుశురాముడు దానధర్మాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆతనిని ధనార్థియై ఆశ్రయిస్తాడు. అయితే అప్పటికే తన ధనాన్ని అంతా ఇతరులకు దానం చేసిన పరశురాముడు.. తనవద్ద అస్త్రశస్త్ర విద్యలు మాత్రమే ఉన్నాయని కావాలంటే వాటిని ఇవ్వగలనని చెప్పడం వాటినే అతడు కోరి పరశురాముని శిష్యరికంలో సాంగోపాంగంగా అన్ని యుద్ధ విద్యలను నేర్చుకుంటాడు.
అస్త్రం ఎప్పుడూ హింసనే కోరుకుంటుంది... బ్రాహ్మణునిగా తన వృత్తిని అనాదరించినా.. శస్త్రవిద్యను నేర్చిన అతనిలో.. ఆ భావ తీవ్రత కనిపిస్తుంటుంది. దానికి తోడుగా శుక్రాచార్యుల అంశ.. ప్రేరణనిస్తుంది. ఎన్ని విద్యలు నేర్చినా "కలనాటి ధనము లక్కర గలనాటికి" ఉపయుక్తం కాకపోతే ప్రయోజనం ఏమిటి? పేదరికం వెంటాడగా.. చిన్ననాటి మిత్రుడు.. ద్రుపదుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన చేసిన "బాసా" జ్ఞాపకం వచ్చింది. వెంటనే ద్రుపదుని పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు.. సభలో ద్రుపదుని దర్శించి తనను పరిచయం చేసుకొని.. అతని నుండి ఆశించిన ప్రతిస్పందనను కరవవడం వల్ల నేను నీ మిత్రుడనని జ్ఞాపకం చేస్తూ.. రెండావులను యాచించాడు. అది విన్న ద్రుపదుడు.. పరిహాస భావనతో చూచాడు.. పరుషమైన పదాలతో అవమానించాడు. రాజ్యాహంకారం దుశ్శీలత స్పష్టంగా కనిపిస్తున్నది, పై పద్యంలో..
ద్రోణుడు.. తాను పేదవాడే కాని దరిద్రుడు కాడు. సంపద లేకపోవడం పేదరికం.. సంపద లేకపోవడానికి తోడుగా ఆశ.. గుణహీనత కలిగియుండడం దరిద్రం.. అస్థిత్వానికి మూలాన్ని తెలుసుకోవడం తత్త్వజ్ఞత.. తెలిసిన దానిని ఆచరణలో పెట్టకపోవడం మూర్ఖత్వం... ప్రశాంతత.. స్థిత ప్రజ్ఞతకు ప్రతీక కాగా చాంచల్యత సంఘర్షణా మనస్సుకు ప్రతీక.. కార్య సాధనా శీలత.. సజ్జన లక్షణం కాగా పిరికితనం దుర్జన లక్షణం.. వీటిలో ఉత్తమ లక్షణాలను తనకు ఆపాదించుకొని అనుత్తమ లక్షణాలను ద్రోణునికి ఆపాదించడం వల్ల .. ద్రోణుని అభిమానాన్ని రెచ్చగొట్టి ప్రతీకారేఛ్ఛకు బీజం వేసాడు.. ద్రుపదుడు. "పొంగు క్రుంగు" లను సమంగా చూడగలిగిన ద్రోణుని వ్యక్తిత్వ పరిణతి.. అవమాన జ్వలితమై రగిలిపోయింది. తన శస్త్రాస్త్రబలంతో ద్రుపదుని ఎదిరించి.. పోరాడడం ఒక పద్ధతి.. అయితే తాను వచ్చింది యాచనకు.. ఇవ్వలేదనే కారణంతో చక్రవర్తిపై యుద్ధానికి సన్నద్ధమైతే.. తాను జయించవచ్చూ.. ఓడిపోనూవచ్చు.. ఏది లభించినా యుద్ధం వల్ల అత్యంత విలువైన మానవ వనరులు, ఆర్థిక వనరులు నాశనమౌతాయి. ఫలితం ఏదైనా రాజ్య ప్రజలకు క్షోభనే మిగులుస్తుంది. తన అవమానానికి మరింత ఆజ్యాన్ని అందిస్తుంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయాడు. అప్పటివరకూ ద్రోణుడు క్షాత్రధర్మాన్ని స్వీకరించినా హింసను కోరకుండా బ్రాహ్మణ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు.
అయినా ద్రోణుడు శుక్రాచార్యుల అంశ.. కాబట్టి అవమానాన్ని మరచిపోలేదు.. ఆలోచించాడు.. కౌరవ సామ్రాజ్యం భీష్ముని రక్షణలో ఉన్నది. ఆ రాజ్యంలో రాజ కుమారులకు తన బావమరిది కృపుడు ఆచార్యకత్వం నిర్వహిస్తున్నాడు.. భీష్ముని ఆశ్రయిస్తే.. రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.. ఒకటి తన పేదరికం.. తొలగిపోతుంది.. రెండవది.. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.. తదనుగుణంగా కౌరవ సామ్రాజ్యంలో ధనురాచార్యునిగా చేరాడు.. గురు దక్షిణగా ద్రుపదుని ప్రాణాలతో పట్టి తెమ్మని శిష్యులకు పురమాయించాడు. అర్జునుడు ద్రుపదుని బంధించి ద్రోణుని ముందు నిలిపాడు.. "బ్రాహ్మణస్య క్షణం కోపం" అంటారు. ద్రుపదుని బంధించడంతో సంతృప్తి పడవచ్చు. కాని శ్రుక్రాంశ.. ఆగనీయదు.. ద్రుపదుని అవమానించాడు..
"వీరెవరయ్య? ద్రుపద మహారాజులె.. యిట్లు కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె.. యహహ! మహారాజ్య మదాంధకార మది వాసెనొకో!" అంటూ అవమానకరమైన మాటలతో పరిహసించి... ద్రుపదుని విడిచిపుచ్చుతూ.. మిత్రమా.. ఇప్పుడు నీ రాజ్యం అంతా నా వశమయింది.. అయినా మిత్రధర్మంగా గంగానదికి ఉత్తరంగా ఉన్న పాంచాల దేశాన్ని నీకు ఇస్తున్నాను.. దక్షిణభాగాన్ని నేను తీసుకుంటున్నాను వెళ్ళుమంటాడు.. దీనితో... ద్రోణుని ప్రతీకారేఛ్ఛ సమసిపోయినా.. ద్రుపదునిలో జనించింది.. తనను రెండావులను కోరి పరిహసించబడిన ద్రోణుని దాతృత్వం వల్ల తాను రాజ్యాన్ని పొందవలసి వచ్చింది.. ఆ అవమానం ద్రోణుని వధ లక్ష్యంగా దృష్టద్యుమ్నుని జననానికి కారణమయింది.. కురుక్షేత్ర యుద్ధంలో అది ఆవిష్కృతమయింది.
నిజానికి మహాభారతాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి ప్రధాన పాత్ర జననానికి ఒక కారణం ఉన్నది. అవన్నీ చివరగా భూభారాన్ని తగ్గించే కార్యానికి ఉపకరణాలయ్యాయి.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment