ధర్మాచరణకు దైవం అనుకూలిస్తుంది
మహాభారతంలో అరణ్యపర్వం సాధనాపర్వంగా చెప్పబడుతుంది. పాండవులు
అరణ్యవాసం చేస్తున్న సమయంలో భీముడు ధర్మరాజుతో.. అసమర్ధులవలె బహుకాలం అడవిలో బ్రతకడం, తదుపరి ప్రఛ్ఛన్నంగా
ఉండ వలసిన అజ్ఞాత వాసమనే ఆపదను దాటడం కన్నా
ఇప్పుడే యుద్ధం చేయడమే పరిష్కారమని అంటాడు. దానికి సమ్మతించని ధర్మరాజు.. కార్య సాధనలో
పాండిత్యం, పరాక్రమం, ఆటోపం,
ప్రతిభాపాటవాలు అవసరమే. అయితే చిన్న ప్రయత్నం చేత సిద్ధించే పనిని తెగువతో
(సాహసంతో) ఆరంభించినా తప్పులేదు కాని మహాకార్యాన్ని ఆరంభించే సమయంలో తొందరపాటు,
సాహసంతో చొచ్చుకు పోవడం సముచితం కాదు. తమ బలాబలాలు, ఎదుటివారి బలాబలాలు, వనరులు, వసతులు
పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జాగరూకతతో
భవితను దర్శించి, లాభనష్టాలను విచారించి, తక్కువ నష్టంతో ఎక్కువ ఫలితాన్ని సాధించే ప్రణాళికలను రచించుకొని దానిని పటిష్టంగా
ప్రభావవంతంగా ఆమలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ధర్మాన్ని అతిక్రమించడం సరికాదు. ధార్మికుల
ప్రయత్నానికి దైవబలమూ తోడవుతుంది. సమస్యను లోతుగానూ, విస్తృతంగానూ
విచారించి నిర్ణయం తీసుకోవడం సమంజసమంటూ.. భీముని ఆవేశాన్ని తగ్గిస్తాడు.
ధర్మరాజు
వివరణ.. సార్వకాలికమైనది. ఏకాలంలోనైనా నాయకుడు ఒక పనిని నిర్వహించాలని భావించిన సమయంలో
సమస్య పూర్వాపరాలను, సాధ్యాసాధ్యాలను,
బలాబలాలను సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని పతిష్టమైన వ్యూహాన్ని రచించుకొని
దక్షులు, సమర్ధులైన వారిని కార్య నిర్వహణకు నియోగించాలే కాని
ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళిక లేకుండా ఉద్యమించడం
వల్ల కార్యభంగం జరుగుతుంది.
ఆ
సమయంలో పాండవుల వద్దకు కృష్ణద్వైపాయనుడు వచ్చి ధర్మరాజుకు.. "అధిక యోగ లబ్ధ మతిరహస్యము"
నైన "ప్రతిస్మృతి" విద్యను నీకు ఉపదేశించేందుకు వచ్చాను.. దానిని అర్జునునికి
ఉపదేశించు.. దానివల్ల అర్జునుడు సత్ఫలితాన్ని సాధిస్తాడు, మీ సంకల్పమూ నెరవేరుతుంది, అంటాడు. రహస్యము అంటే.. ఆ అంశంపై ఎవరికైతే శ్రద్ధాసక్తులు,
గౌరవ ప్రతిపత్తులు, సాధించాలనే తపన, చెప్పిన వారిపై గౌరవం ఉంటాయో అలాంటి వారి అర్హతను గుర్తించి వారికి చెప్పాలని
అర్ధం. విద్య పరంపరాగతంగా ముందుకు సాగాలంటే ఒకరికి ఉపదేశింపబడాలి. అనర్హుల చేతిలో అది
దుర్వినియోగం అవుతుంది లేదా చులకన చేయబడుతుంది.
అధికయోగలబ్ధము..
యోగము అంటే చాలా అర్ధాలు ఉన్నాయి. యోగము అంటే పొందదగినది. "సమత్వం యోగ ముచ్యతే"
, "యోగః కర్మసుకౌశలం" అంటుంది భగవద్గీత.
"యోగః చిత్తవృత్తినిరోధః" అన్నారు, పతంజలి మహర్షి.
అన్నింటినీ క్రోడీకరించుకుంటే.. యోగం అంటే.. సమతాభావన, క్రియాకౌశలం,
సామరస్యత, కలయిక, పొందిక
లాంటి పలు అర్ధాలను చెప్పుకోవచ్చు. యోగము అంటే పొందదగినది అనుకున్నాము కాబట్టి యోగ
సాధకులు సాధించాల్సింది.. చిత్తవృత్తి నిరోధం, నిస్సంగత్వం లేదా
సమబుద్ధి, క్రియాకౌశలం
ఈ మూడూ త్రిభుజాలుగా కార్యసాధనలో ఉపయుక్తమౌతాయి.
వ్యాసుని
సూచన ప్రకారం "ప్రతిస్మృతి" విద్యను పొందిన అర్జునుడు తన ధార్మిక వర్తనతో, ప్రతిస్మృతి విద్యవల్ల అధిక ఫలితాన్నే పొందాడు. ఇంద్రాది దేవతలచే
అస్త్రశస్త్రాలను పొందాడు.. అర్హత ప్రాతిపదికగా క్రియాకౌశలాన్ని పెంపొందించుకొని పాశుపతాస్త్రంతో
సహా దివ్యాస్త్రాలను సాధించాడు. కురుక్షేత్రంలో కృష్ణునిచే భగవద్గీతను పొందాడు. యుద్ధంలో
విజయసాధకుడై నిలవడానికి ప్రతిస్మృతి విద్య అతనికి దోహదపడింది. కృష్ణుడు అర్జునునికి
భగవద్గీతను బోధించడానికి ముందుగా ఆ అర్హతను సాధించేందుకు అవసరమైన యోగసాధన ప్రతిస్మృతి
విద్యను పొండడం నుండే ఆరంభమయినదిగా చెప్పుకోవచ్చు.
ధార్మిక
వర్తనతో అర్హతను సాధించిన వారికే భగవంతుడూ సహాయకారి అవుతాడు.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment