వారు మహాబలుల్, హరియు వారికిఁ బ్రాపు గలండు, వారలన్
బోర జయింప రామియును బుద్ధి నెఱుంగుదు, నైనఁ గౌరవ
క్షా రమణుండు సేయు తగు మన్నన లెల్లఁ దలంచి
చూచినన్
భూరి వివేక! యే విడిచి పోవుట ధర్మమె? వీర కర్మమే?
(భీష్మపర్వము - 3- 448 - తిక్కన)
భీష్ముడు
పడిపోయాక కర్ణుడు భీష్ముని దర్శించి పాండవులపై యుద్ధానికి అనుమతిని కోరిన సందర్భంలో, భీష్ముడు కర్ణుని జన్మ రహస్యాన్ని చెపుతూ.. నీవు కుంతీ పుత్రునివి
కాబట్టి పాండవేయుడవు.. అందువలన నీపై నాకు పుత్రవాత్సల్యమే ఉన్నది. అంతేకాదు అజేయులైన
పాండవులతో వైరము వద్దని, వేరు ఆలోచన చేయకుండా కలసి మెలసి ఉంటే శ్రేయస్సు కలుగుతుందని చెప్పిన
సందర్భంలో కర్ణుడు సవినయంగా.. భీష్మునితో తాను కౌంతేయుడననే సత్యాన్ని ఇదివరకే విన్నానని
చెపుతూ.. పై విధంగా చెపుతాడు.
పాండవులు
మహా బలవంతులు. వారికి తోడుగా ఉన్నవాడు సాక్షాత్తూ భగవంతుడైన శ్రీహరి. అందువల్ల వారిని యుద్ధంలో జయించడం అసాధ్యమనే విషయాన్ని
కూడా నాకు తెలుసు. అయినా.. ఇన్ని దినాలుగా దుర్యోధనుడు నా పట్ల తగు విధంగా చూపిన గౌరవాదరాలను
ఒక్కసారి వివేకంతో లోతుగా ఆలోచించి చూస్తే.. అతనిని విడిచి పోవడం ధర్మమా.. వీరులు చేయవలసిన
పనియేనా? అంటే సముచిత నిర్ణయం కాదని కర్ణుని నిర్ణయం..
అనేది తెలుస్తుంది.
అలా
పలు విధాలుగా చెప్పిన కర్ణుడు.. చివరగా తన నిశ్చయంగా.. "దైవాధీనము సర్వమున్ మన
మతిన్ దప్పింపగా శక్యమే" అంటూ తనకు యుద్ధానికి అనుజ్ఞనీయమని వేడుకోవడం కనిపిస్తుంది.
ఆరంభంలో
"వారు మహాబలుల్ హరియు వారికిఁ బ్రాపు గలండు, వారలన్ బోర జయింప రామియును బుద్ధి నెఱుంగుదు" అనడంతో ముందుగా భీష్ముని
మాటలను ఒప్పుకున్నట్లుగా చెపుతున్నాడు. ఎదుటివారిని తప్పు అనకుండా నీవన్నదీ నిజమే..
అయినా.. అంటూ తన వాదనను వినిపించడం వల్ల అక్కడ
సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. "But" is
bit of poison అన్నారు.
"భూరివివేక" అనే సంబోధన ఉదాత్తంగా ఇక్కడ
కనిపిస్తుంది. "గొప్పనైన వివేకం కలిగిన వానివి" అని భీష్ముని సంబోధిస్తున్నాడు.
అలా సంబోధించడంతో వివేచనతో, విచక్షణతో ఆలోచించి
"కల రూపును" గ్రహించి కర్తవ్యాన్ని బోధించమని వేడుకున్నట్లుగా భావించాలి.
ఇన్ని నాళ్ళుగా పాండవులకు జరిగిన ప్రతి అన్యాయంలోనూ నేనే భాగస్వామిని. ఇప్పుడు నీవు
(భీష్ముడు) పడిపోయాక, అంతిమ ఫలితం అవగతమయ్యాక, ప్రాణ రక్షణ కోసమై యుద్ధాన్ని ఆపేందుకు పాండవ పక్షంలో చేరడం సమంజసమూ కాదు..
దుర్యోధనుడు ఆ సంధికి ఒప్పుకుంటాడని భావించలేము.. ఒకవేళ సంధి జరిగినా కౌరవ పాండవుల
మనసులలో ఆ అవమాన జనిత కశ్మలత తొలగిపోతుందని భావించగలమా? ఇన్నింటినీ
ఆలోచించి చెప్పమనే భావన అన్యాపదేశంగా చెప్పినట్లుగా భావించాలి.
ఈ
సంబోధన మరొక ఆలోచనకూ మార్గం చూపుతుంది.. ప్రతివ్యక్తీ రెండుమార్లు పుడతాడు.. మొదటిసారి
తల్లి గర్భంలోనుండి బయటపడడం.. రెండవ మారు "తానెందుకు పుట్టాడో.. తెలుసుకున్న సమయంలో"..
అలాగే రెండు మార్లు మరణిస్తాడు.. మొదటిసారి.. ఊపిరి ఆగిపోయినప్పుడు.. రెండవ మార్లు
మనలను గూర్చి ఎవరూ జ్ఞాపకం చేసుకోని నాడు.. భూరి వివేక అనడంలో వివేకంతో ఆలోచిస్తే..
ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలిసి నాకు మార్గం చూపమని చెప్పడం కనిపిస్తుంది. కర్ణుడు
తన పుట్టుకకు.. దుర్యోధనుని స్నేహధర్మానికి కట్టుబడడమే అనే ప్రయోజనాన్ని ఏర్పరచుకున్నాడు..
అలాగే.. స్నేహ ధర్మం ఉన్నంత కాలం తన పేరు నిశ్చితంగా భూమిపై ఉంటుందనీ విశ్వసించాడు..
ధర్మ
పక్షం జయిస్తుందనీ, అందునా శ్రీహరియైన కృష్ణుడే
ఆ పక్షంలో ఉండడం మూలంగా కౌరవులకు ఓటమి తప్పదనీ తెలిసీ కర్ణుడు యుద్ధానికి ఎందుకు సన్నద్ధమయినట్లు?
పాండవులు జయించాలి అంటే తాను మరణించాలి.. దానినీ ముందే ఊహించాడు కర్ణుడు..
అయినా యుద్ధానికి అనుజ్ఞను కోరుతున్నాడు. దానికి కారణం అంతరంతరాలలో అర్జునునిపై ఉన్న
ఈర్ష్యాసూయలు.. దుర్యోధనుడు తనకు చేసిన ఉపకృతి. అందించిన స్నేహధర్మానికి కట్టుబడి ఉండాలనే
తాను పెట్టుకున్న నియమం.. అవసరానుగుణంగా పార్టీలు మారే రాజకీయం చేయడానికి మనసురాని
కర్ణుని చిత్తశుద్ధి.
తగు
మన్ననలు.. నిజానికి ఈ పదమూ సాభిప్రాయమే.. రాజుగా దుర్యోధనుడు.. ఎవరైనా రాజ్యానికి గాని, తనకు గాని సహాయకారులైన వేళ వారిని మన్నన చేయడం, గౌరవించడం సహజమే.. కాని "తగు మన్నన" చేయడం ఉచితానుచితాలను తెలిసిన
పాలకులు చేసే మర్యాద. కర్ణునిలోని వీరత్వాన్ని గుర్తించి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా
ప్రకటించాడు, దుర్యోధనుడు. కర్ణుని వీరత్వానికి తగిన మర్యాదను,
మన్ననను దుర్యోధనుడు చేసాడు. దానికి ప్రత్యుపకృతిగా కర్ణుని స్నేహాన్నీ
కోరాడు.. అయితే కర్ణుడు ఆ స్నేహధర్మాన్ని పాటించే సమయంలో అర్జునునిపై ఉన్న మాత్సర్యంతో
ధర్మ పరిధులను అతిక్రమించి దుర్యోధనుని ప్రతి దుశ్చేష్టకూ వత్తాసు పలికాడు.. ముఖ్యంగా
మాయా జూద సమయంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని "బంధకీ" అని సంబోధించడం
వల్ల ఘోరమైన తప్పిదం చేసాడు. "ఏక వస్త్రయైన వివస్త్రయైన" .. అనడం వల్ల దుర్యోధనునిలో
లేని ఆలోచనను రేకెత్తించి.. దుశ్శాసనుని చేత వస్త్రాపహరణకు మూలమయ్యాడు.
బంధకీ
అనే పదం వేశ్య అనడం కన్నా నీచమైన పదం. సంసారం చేసుకుంటున్న పురుషుని భార్యతో విడదీసి
తన పొందును కోరేవిధంగా చేసే స్త్రీని బంధకీ అంటారు. వేశ్యగా కూడా ఊహించలేని ద్రౌపదిని
బంధకీ అని సంబోధించడం అపచారమే. అలాగే తగుననీ, తగదనీ విచారించకుండా అన్న
చెప్పాడని వస్త్రాపహరణకు ఉపక్రమించిన దుశ్శాసనుడూ కురుక్షేత్రంలో నీచమైన చావే చావవలసి
వచ్చింది. శ్రీరాముని మాటకు ఎదురు పలకని లక్ష్మణుని వలెనే.. దుర్యోధనుని మాటకూ ఎదురాడని
వాడు దుశ్శాసనుడు.. అయితే ధార్మికుడైన రాముని పక్షంలో లక్ష్మణుడు ఉత్తమునిగా యశస్సు
పొందగా అధర్మపక్షంలో నిలిచిన దుశ్శాసనుడు దుర్మార్గునిగా గణింపబడ్డాడు.
అసంతృప్తిలో
ఉన్న తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రాలేరు.. ఉత్తములుగా రాణించలేరు.
ఏ స్త్రీ అయితే తన శక్తియుక్తులను తాను గుర్తింస్తుందో..
అలాగే తనలోని శక్తి యుక్తులను ఇతరులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు
గుర్తించి మెచ్చుకుంటారో.. అలాంటి సమయంలో లేదా వాతావరణంలో సంతృప్తితో ఉంటుంది.
ఇక్కడ
కుంతి పెరిగిన వాతావరణంలో.. అలాంటి నిష్కల్మశమైన కుటుంబ వాతావరణం నెలకొనగా గాంధారిలో
ఈర్ష్యాసూయలు నెలకొని దుర్యోధనాదుల జననానికి కారణమయింది.
తదనుగుణమైన
శక్తి యుక్తులు వారికి అమరాయి.. దానికి సంబంధించిన సంపదలనూ వారు పొందారు.. అలాంటి స్వేఛ్ఛాయుత
వాతావరణాన్నే తమ చుట్టూ వారు ఏర్పరచుకున్నారు.. ఆ ఫలితాన్నే చివరగా ఆస్వాదించారు.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment