Friday, August 15, 2025

 

ఆత్మీయులకు ప్రాభాత నమస్సులు..

 

క్రింది పద్యానికి "అస్తిత్వ పరమైన" వ్యాఖ్య...

 

అరుణ గభస్తి బింబముదయాద్రి పయిన్ బొడతేర, గిన్నెలోఁ

బెరుఁగును, వంటకంబు, వడపిందియలున్ గడుపార బెట్టు, ని

ర్భర కరుణాధురీణయగు ప్రాణము, ప్రాణము తల్లి యున్నదే

హరహర! ఎవ్వరింక గడుపారసి పెట్టెదరీప్సితాన్నముల్!

(కాశీఖండము - శ్రీనాథుడు)

           

            వ్యక్తి వ్యక్తిత్వం ప్రపంచానికి తన అస్తిత్వాన్ని చాటుతుంది. వ్యక్తిత్వం.. వ్యక్తి పెంపకం, వ్యక్తిగత స్వేఛ్ఛ, చుట్టూ ఉన్న వాతావరణం, ఏర్పరుచుకున్న జీవనలక్ష్యాలు, ఆచరిస్తున్న నైతిక విలువలను బట్టి ప్రకటితమౌతుంది. అంతేకాక జీవితంలో ఎదురైన/ ఎదురౌతున్న జీవన సంక్లిష్టతలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావాన్ని చూపుతాయి.

            పై పద్యం కాశీఖండంలో గుణనిధి చేత శ్రీనాథుడు పలికించినది. తన దుర్మార్గాలను సహించలేని తండ్రి తనను ఇంటి నుండి వెళ్ళగొట్టగా ఇంటినుండి వెళ్ళిపోయిన గుణనిధి ఆకలి బాధను తట్టుకోలేక అలారుముద్దుగా పెంచిన తల్లిప్రేమను తలుచుకుంటూ తానా ప్రేమకు ఇకపై దూరమౌతున్నందుకు అంతరంగ ఆవేదనతో స్వగతంగా వ్యక్తీకరించుకునే బాధ.. చాలా మృదువుగా హృదయాన్ని స్పర్శించే విధంగా భావస్పోరకమై సున్నితంగా పాఠకుల హృదయాలను స్పృషిస్తుంది. తల్లి-బిడ్డల మధ్య భావోద్వేగపరమైన బంధాలకు ప్రతీకగా కూడా ఈ పద్యం నిలుస్తుంది.

            గుణనిధి కాస్తా కలిగిన కుటుంబానికి చెందినవాడే. జీవితం కేవలం భోగానికే అన్న విధంగా పెరిగిన గుణనిధి అన్ని దుర్వ్యవహారాలకూ చిన్ననాడే అలవాటుపడ్డాడు. వాడి దుర్వ్యసనాలు తండ్రికి తెలియరాకుండా తల్లి కప్పిపుచ్చుతుంటుంది. వాడిక్కావలసిన డబ్బు ఇస్తూ ఉంటుంది. వాడి ‘కడుపారసి’ ‘ఈప్సితాన్నాలు’ తినబెడుతుంటుంది. జూదానికి బానిసయై డబ్బును దుర్వినియోగం చేస్తున్నా, అతని తల్లి మాత్రం దండించకుండా, తెల్లవారేసరికి గిన్నెలో పెరుగన్నం, బాగా తాళింపు వేసి కలిపి ఆవకాయ ముక్కో, నిమ్మ ఊరగాయ బద్దో, వడపిందెలో (వడపిందెలను పెరుగన్నంలో నంచుకుంటారట) నంచుకోవడానికి ఉంచి, స్వయంగా చేత్తో ముద్దలు చేసి తినిపించేది. తల్లి ప్రేమ ఎంత ఆప్తంగానో, ఎంత ఆర్ద్రంగానో  వ్యక్తీకరించబడింది, పై పద్యంలో. ఒకనాడు, వాడి దుష్కృత్యాలు తెలిసి తండ్రి వాడిని ఇంటి నుండి వెళ్ళగొడుతాడు. తండ్రి ఇంటినుండి వెళ్ళగొట్టే సరికి.. ఆకలితో అలమటించిన సమయంలో తల్లి గోముగా రోజూ పెట్టే పెరుగన్నం గోరు ముద్దలు మదిలో మెదిలి, అయ్యో ఇవి ఇక దొరకవే అని వాపోతాడు. తాను ఆకలిని గుర్తించక ముందే తల్లి తన ఆకలిని గుర్తించి భోజనాన్ని సిద్ధం చేయడానికి అలవాటు పడ్డ గుణనిధిలో తన ఆహారాన్ని స్వయంగా సంపాదించుకునే నైపుణ్యం కొరవడింది.

            పద్యంలో మానవ వ్యసనాల ప్రభావాన్ని చెప్పాడు కవి. గుణనిధి జూదవ్యసనం తండ్రితో సంఘర్షణకు దారితీసింది. నిజానికిది కుటుంబానికి సంబంధించినదే అయినా వ్యక్తిగత ఇష్టాయిష్టాలు "వ్యక్తిపై సమాజ అంచనాలకు" మధ్య ఘర్షణగా చూడవచ్చు. తల్లియొక్క అవాంఛనీయమైన అవ్యాజమైన ప్రేమ తనను సౌకర్యవంతమైన వలయంలో నిలపడం వల్ల నిన్నటిదాకా భవితపై ఏ విధమైన అంచనాలు లేకుండా పెరిగిన వ్యక్తి.. ఆకలి, అవసరాలను ఎదుర్కోలేని బలహీన మనస్కుడైన సమయంలో ఆత్మ పరిశీలనను చేసుకున్నట్లుగా కూడా భావించ వచ్చు.

            మానవ జీవితంలో ఆకలి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కడుపుకు తినడమే ఆకలి కాదు. జ్ఞానసాధన కావచ్చు , అధికారం కావచ్చు, గౌరవం కావచ్చు ఇలాంటి మరెన్నో జీవిత అవసరాలు ఆకలిగా గుర్తింపబడతాయి. వాటి అన్వేషణ జీవిత ప్రయోజనాన్ని నిర్వచిస్తుంది. దీనికి అదనంగా ఇష్టాయిష్టాలూ అనుక్షణం పలకరిస్తుంటాయి. జీవిత ప్రయోజనం మానవ జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది.. ఇష్టాయిష్టాలు పతనాన్ని దర్శింపచేస్తాయి. ఇష్టాయిష్టాలను ఆదరిస్తూ జీవిత ప్రయోజనాలను విడిచిపెడితే.. జీవితం వ్యర్థమౌతుంది.

              పై పద్యంలో తండ్రి కోపం, తల్లి అమితమైన శ్రద్ధ, షరతులు లేని ప్రేమల మధ్య వైవిధ్యం మానవ సంబంధాల మధ్య సంఘర్షణగా రూపుదాలుస్తుంది. తల్లి ప్రేమ తనకు సౌకర్యవంతమైన వలయాన్ని ప్రసాదించింది. తండ్రి ఆవేదనను కోపంగా భావించేందుకు సహకరించింది. పర్యవసానంగా గుణనిధి ఇంటి నుండి వెళ్ళవలసి వచ్చింది.

            స్వేఛ్ఛ, బాధ్యతల మధ్య భేదాన్ని గుర్తించలేని మానసిక స్థితి గుణనిధిలో కనిపిస్తుంది. ఈ ఎంపిక మంచిదా చెడుదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అలాగే గుణనిధి ఆత్మపరిశీలన కూడా అతనిని సన్మార్గంలో నడపవచ్చు.. దుర్మార్గంలో నడుపుతూ సమాజంపై మరింతగా ద్వేషం పెంచుకొని దేశద్రోహిగా మార్చవచ్చు.

            ఈ పద్యంలో మానవ మానసిక వికాస పరిమితులు సంక్లిష్టతలు, సంఘర్షణలుగా రూపుదాల్చి వ్యక్తిగత జీవన ప్రస్థానంలో, వ్యక్తి అభ్యున్నతిలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. గుణనిధి జీవన ప్రస్థానం మానవ జీవితానికి ప్రయోజనాన్ని గుర్తించగలిగే పాఠంగా భావితరాలకు మార్గదర్శన చేయాలి.

            చిన్నప్పుడు పిల్లలలో గ్రహణ శక్తి, అనుసరించే లక్షణం అధికంగా ఉంటుంది. నిజానికి పిల్లలు చెపితే ఏదీ నేర్చుకోరు. తల్లిదండ్రులు ఆచరణలో చూపించే ప్రవర్తనను చూస్తూ నేర్చుకుంటారు. పిల్లలు పెరిగిన వాతావరణం సమాజంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లి దండ్రి మధ్య సయోధ్య ఉంటే పిల్లల మానసిక ప్రవర్తన ఉదాత్తంగా ఉంటుంది. తల్లి దండులు ఒకరిని ఒకరు విమర్శించుకునే వాతావరణంలో పెరిగిన పిల్లలలో ప్రతిదానినీ ఖండించే మానసిక స్థితి వెలుగుచూస్తుంది. అన్నింటినీ అడగకముందే అందించే వాతావరణంలో పెరిగిన పిల్లలలో సృజనాత్మకత తగ్గుతుంది. అవసరం అన్నింటినీ అన్వేషించేందుకు ప్రేరణనిస్తుంది. అమితమైన గారాబం చేస్తే సౌకర్యవంతమైన వలయంలో.. ఊహాలోకంలో విహరిస్తూ.. ప్రాపంచిక స్థితిగతులకు దూరమౌతారు. ప్రేమ అనురాగం ఓదార్పు నిజాయితీ అనుమానం అభద్రతాభావన, అవమానం ప్రోత్సాహం విమర్శలు ఇలాంటివి పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

            చివరగా.. ఒక అంచనా ప్రకారం.. మగపిల్లలలో పదునైదు సంవత్సరాలు వచ్చే సరికి ఒకే ఇంట్లో ఉంటూ తండ్రితో మాట్లాడని పిల్లలు అధిక శాతం ఉంటారట. అలాగే తల్లిని ఏ మాత్రం లక్ష్యపెట్టని మగ పిల్లల శాతమూ అధికమేనట.. ఆ అంచనాలూ ఆడ పిల్లలలోనూ తక్కువ కాదని చెపుతున్నారు, మానసిక శాస్త్రజ్ఞులు.

            మీ స్పందన లేదా జోడిపింపులు నన్ను నేను ఉన్నతీకరించుకునేందుకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తూ.. మీ ఆత్మీయ స్పందనను ఆహ్వానిస్తూ..

నమస్సులతో

పాలకుర్తి రామమూర్తి

No comments: