Friday, August 15, 2025

 

అహంకారం పరిమితులను దాటితే అనర్ధమే..

 

 

            ఆద్యమూ, అనంతమూ, సర్వవ్యాపితమైన ఆదిశక్తి తనలాంటి మరికొన్నింటిని పొందాలని సంకల్పించిందట. ఆ సంకల్పంలో ఒకస్థితి నుండి మరొకస్థితికి పరివర్తన చెందే క్రమంలో మహత్తు, అహంకారం, పంచభూతాలు ఆవిష్కృతమయ్యాయి. మహత్తు తన స్వస్వరూపాన్ని, స్వభావాన్ని గుర్తించలేని అజ్ఞానానికి ప్రతీకగా మారింది. అహంకారం "నేను" అనే ఉనికికి లేదా భావనకు చిరునామాగా నిలిచింది. పంచభూతాదులు పదార్ధంగా ఏర్పడి ఆకృతికి దర్పణాలుగా నిలిచాయి. "రయించ ప్రాణంచేతి, రయించ చంద్రమా, ఆదిత్యోహవై ప్రాణాః" అంటుంది ప్రశ్నోపనిషత్తు. చంద్రుడు పదార్ధానికి, ఆదిత్యుడు శక్తికి ప్రతీకలుగా చెపుతారు. శక్తి పదార్ధంగా ఆకృతి తీసుకొని జగత్తుగా, సృష్టిగా ఆవిష్కృతమయింది. దానితో సృష్టికి ఆరంభంలో పదార్ధము శక్తి ఆవిషృతమయ్యాయని తెలుస్తుంది. అనంతమైన శక్తి ఒకచోట ఆకృతి తీసుకుంటే అది పదార్ధంగా రూపుదిద్దికుంటుంది.. అదే పదార్ధంలో నుండి శక్తి తొలగిపోతే అది నిర్జీవమై పంచభూతాలలో కలసిపోతుంది.

            "నేను" అనంతమైన చైతన్యాన్ని అనే స్ఫురణకు దూరమైన వేళ వ్యక్తిలో అస్తిత్వానికి ప్రతీకగా నిలవాల్సిన అహంకారం  అహంభావంగా ప్రకటితమౌతుంది. అస్తిత్వానికి పరిమితమైన  అహంకారం ఆదరణీయమై ఆత్మవిశ్వాసానికి, ధైర్యసాహసాలకు, కార్యావిష్కరణకు ప్రేరణనిస్తుంది. కాని మోతాదును మించితే దానివల్ల ప్రమాదం వచ్చిపడుతుంది. రావణుడు వేదవేదాంగాలను నేర్చాడు. తత్త్వశాస్త్రాలను అభ్యసించాడు. జ్ఞాననిధియై ప్రకాశించాడు. బయట ప్రపంచాన్నీ, అంతశ్చేతనలోని జగత్తునూ దర్శించగలిగాడు. తనపర భేదంలేని మనోభావనలో సకల జీవరాసులలో జీవచైతన్యాన్ని దర్శించగలిగాడు. సకల జీవ సౌభ్రాతృత్వాన్ని, సమస్త జీవ కల్యాణాన్ని కాంక్షించే స్థితికి ఎదిగాడు. అప్పుడు అంతకన్నా మించినది ఏదో సాధించాలనే తపనలో బ్రహ్మను ఉద్దేశించి గొప్ప తపస్సు చేసాడు.. బ్రహ్మ వరాలను కోరుకొమ్మనగానే తాను సాధించిన తత్త్వాన్ని విస్మరించి.. భౌతిక జగత్తు శాశ్వతమనే భ్రమలో అజ్ఞానమయమైన వరాలను కోరాడు, వాటినే పొందాడు. ఇప్పుడతనిలో శ్రేష్ఠమైన జ్ఞానజీవితంపై అహంభావమనే ముసుగులు క్రమ్మి ఆధిక్యతా భావనలను తట్టిలేపాయి. భౌతిక జీవితంలో ప్రతి గెలుపూ అతనిలోని అహంభావాన్ని మరింతగా పెంచింది. భగవత్తత్త్వంపై తనకున్న అవగాహన, సాధించిన దివ్యత్వం, విజ్ఞానం వీటి ప్రకాశాదులు.. కన్నుమిన్నూ కానని అహంభావ రాహుగ్రస్తమై.. అహంభావ ప్రకటను నిలయాలయ్యాయి. ప్రపంచాన్ని చుట్టివస్తూ పాలకులందరినీ యుద్ధానికి ఆహ్వానించడం, వారిని ఓడించడం లేదా సంహరించడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. నచ్చిన స్త్రీలను చెరబట్టాడు. బంధుత్వాన్నీ విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తించాడు.

            ఆ క్రమంలో మానవులను, వానరులను తృణప్రాయంగా భావించి చేసిన దండయాత్రలలో దక్కిన విజయాలు ప్రేరణగా.. పెల్లుబికిన అహంభావనతో కార్తవీర్యార్జునుని యుద్ధానికి ఆహ్వానించి ఓడి బంధీగా చెరసాలలో మ్రగ్గాడు. తదుపరి రావణుని తాత పులస్త్యుడు కార్తవీర్యుని యాచించి రావణుని బంధవిముక్తుడిని చేయడం దానితో రావణుడు అతనితో స్నేహం చేస్తాడు. అంతతో ఆగక వానర రాజైన వాలి తూర్పు సముద్రంలో సంధ్యావందనం ఆచరిస్తున్న సమయంలో వెనుక నుండి వెళ్ళి అతనిని ఎత్తి సముద్రంలో పడవేయాలని భావించాడు. ఆ ప్రయత్నాన్ని కనిపెట్టిన వాలి అప్రమత్తుడై రావణుని చంకలో ఇరికించుకొని నాలుగు సముద్రాలలో ముంచి తన రాజ్యమైన కిష్కింధకు తీసుకువచ్చాడు. తదుపరి వాలితో స్నేహం చేశాడు.

            పై రెండు ఉదాహరణలూ.. ఎంత జ్ఞానియైనా అమితమైన అహంభావం కనులను క్రమ్మి అంధకారాన్ని ప్రసాదిస్తే ఎదుటివారి బలాబలాలను గుర్తించలేక పతనావస్థకు చేరుకుంటాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇహపరాలను సాధించాలనుకునే వ్యక్తి అహంబావాన్ని వదిలివేయాలి. ప్రజ్ఞ జాగృతమైతే జీవిత పరమార్ధం బోధపడుతుంది. సమతాదృష్టి అలవడితే వికసన విస్తరణగా.. వ్యాప్తంగా పరిణామం చెందుతుంది. అలాకాని నాడు ఎంతటి విజ్ఞానియైనా ఇహపరాలకు దూరమౌతాడు. వ్యక్తి జీవితంలో అంగబలం, అర్థబలం, అధికారమదం అహంభావానికి ఆజ్యంపోస్తే.. ఫలితంగా పతనావస్థ పలకరిస్తుంది.. అందుకే ఆదరంగా పలకరించే అహంబావ మమకారాలను పరిమితం చేసుకొని జీవితాలను ఉన్నతీకరించుకోవడం ఆదరణీయం.

పాలకుర్తి రామమూర్తి

           

No comments: