భావవ్యక్తీకరణ ప్రాముఖ్యత
మహాభారతం జనమేజయునికి వైశంపాయనుడు చెప్పాడు. శ్రీశుకులు భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పాడు. ఒక నిర్వహణాధికారి తన క్రిందివారికొక పనిని చెప్పాడు. ఇలా ఎవరు ఎవరికి ఏది చెప్పినా దానిని భావవ్యక్తీకరణ అంటారు.. భావవ్యక్తీకరణ చెప్పినవారు (వక్త), సమాచారం, విన్నవారు (శ్రోత).. ఇలా మూడు స్థాయిలలో ఉంటుంది. ప్రభావవంతమైన భావవ్యక్తీకరణలో ముఖ్యమైనవి కూడా మూడు అంశాలే. చెప్పేవారికి వినేవారికి మధ్యనుండే సంబంధం, సమాచారం, సమాచారాన్ని అందుకున్నవారు దానిపై స్పందించిన విధానం. నిజానికి సమాచారాన్ని సరిగా అందించామా లేదా అనేది అవతలి వ్యక్తి దానిపై సరిగా స్పందించడంలోనే విదితమౌతుంది. ఇరువురికీ ఆసక్తి కలిగిన అంశంపై జరిగిన భావవ్యక్తీకరణ ఉత్తమ ఫలితాల నిస్తుంది. చెప్పిన వ్యక్తిలో అస్పష్టత, అసందర్భత వల్ల సమాచారం ఎదుటివారిలో ఆసక్తిని తగ్గించవచ్చు. అప్పుడు ఎదుటివారి స్పందన సరిగా ఉండకపోవచ్చు.
రామాయణంలో హనుమంతుడు మొదటిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు.. ఆత్మవిశ్వాసంతో, వినయంతో, తత్తరపాటు లేకుండా, సంక్షిప్తంగా, సందేహానికి తావులేకుండా, మధ్యమ స్వరంతో, సందర్భానికి అనువైన పదాలను ఎన్నుకొని సంస్కారవంతంగా తన మనసులోని మాటను స్పష్టంగా మృదుమధురంగా చెప్పాడు. మాట్లాడుతున్న సమయంలో ముఖంలో, కనులలో ఏ విధమైన వికారాలు కనిపించకుండా, సమయస్ఫూర్తితో మాట్లాడాడు, హనుమ. అలాకాక, వక్త ఆగిఆగి మాట్లాడడం, అర్థరహితంగా పదాలను విరిచి మాట్లాడడం, సాగదీస్తూ మాట్లాడడం, వేగంగా మాట్లాడడం, తొందరపాటుతో పదాలను ఉచ్చరించడం.. వినేవారిలో విసుగుకు కారణమౌతుంది.
భావవ్యక్తీకరణ అనేది.. మన దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా ఎదుటివారికి చేరుస్తున్నామనేది తెలుపుతుంది. అలాగే వినడమనేది ఎదుటివ్యక్తి దృష్టికోణాన్ని, ఆలోచనలను, భావనలను ఎంత ప్రభావవంతంగా అవగాహన చేసుకుంటున్నామనేది తెలుపుతుంది. ఈ ప్రక్రియలో స్పష్టత లేనిచోట ప్రశ్నించడం, ఎదుటివారి దృష్టికోణాన్ని తెలుసుకోవడం వల్ల ఉత్తమమైన భావవ్యక్తీకరణ జరుగుతుంది. అవసరమైన చోట ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
భారతీయ సాహిత్యంలో ప్రశ్నోపనిషత్తు అనేపేరుతో ఒక ఉపనిషత్తే ఉన్నది. సరిగా ప్రశ్నించడం.. ఎదుటివారి పలుకుల కతీతంగా వారి హృదయాన్ని అవగాహన చేసుకోవడం ఉత్తమ సంభాషణకు ప్రతీకగా చెపుతారు. ఈ ప్రక్రియ సనాతన సంప్రదాయంలో గురుశిష్య సంభాషణలో కనిపిస్తుంది. లక్ష్యాన్ని నిర్వచించడంలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమంలో ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడం, సమయపాలనతో ముగించడం, వితండవాదాన్ని నివారించుకోవడం వల్ల వక్తకు శ్రోతకు మధ్య సదవగాహనతో కూడిన సంబంధాన్ని ఏర్పరచడం సాధ్యపడుతుంది.
రామాయణంలో హనుమంతుడు సీతను చూచాక వెనుతిరిగి తన సహచరులను కలుసుకున్న సమయంలో "దృష్ట్వాసీతా".. సీతను చూచాను అంటాడు. తక్కువ మాటలతో సహచరులందరికీ అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించాడు. చాలా కాలంగా వారంతా అమితమైన ఒత్తిడికి లోనై, ఎంతో ఆసక్తితో, ఉద్వేగంతో హనుమ రాకకోసం ఎదురుచూస్తున్నారు. చూచాను అనడం వల్ల దేనిని చూచేందుకు వెళ్ళాడో దానిని చూచాడనే భావన వెల్లడయింది. కార్య సాఫల్యతను సూటిగా చెప్పడం వల్ల భావవ్యక్తీకరణ లక్ష్యం నెరవేరింది. సహచరులు కుతూహలం చూపితే వివరాలు చెప్పవచ్చు.
ఈనాటి సంస్కృతిలో కూడా భావవ్యక్తీకరణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. తప్పుడు భావాలు అనుచరులకు చేరితే ఫలితాలు అసమంజసంగా రావచ్చు. కాబట్టి ఉత్తమ స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న నాయకులు సరైన సంభాషణా నైపుణ్యాలను సంతరించుకోవాలి.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment