ఫలిస్యతీతి విశ్వాసః సిద్ధేః
ప్రథమ లక్షణం
ద్వితీయః శ్రద్ధయా యుక్తః, తృతీయం గురు
పూజనం
చతుర్ధశ్చా~ స్మతా భావః
పంచమేంద్రియ నిగ్రహం
షష్ఠించ ప్రమితాహారః సప్తమం నైవ
విద్యతే!
(ఈ శ్లోకం
ఎక్కడో లభించింది. ఎక్కడిదో, ఎవరు
వ్రాసారో తెలియదు)
జీవితంలో విజయ సాధన అనేది
సాధారణంగా ఏడు అంశాలపై ఆధార పడి ఉంటుంది. అందులో మొదటిది, "ఫలస్యతీతి విశ్వాసః".... నా యత్నం ఫలిస్తుంది అనే నమ్మకం, మొదటి అంశం. తనపై తనకు సాధించగలననే అచంచలమైన విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి యైనా
తప్పని సరిగా విజయ సాధకుడౌతాడు. దృఢమైన, నిశ్చయమైన నిర్దారణ
విశ్వాసానికి ఊతమిస్తుంది.
అయితే ఈ దృఢమైన, నిశ్చయమైన
నిర్దారణ అంటే ఏమిటి? నేనొక
లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. దాని పర్యవసానాలను, అనుకూల
ప్రతిబంధకాలను సంపూర్ణంగా అధ్యయనం చేసాక, ఏ పరిస్థితులలో నైనా దానిని
సాధించాలనే నిర్ణయానికి వచ్చాను. నా మార్గం దుర్గమ మైనదని నన్ను నా మిత్రులు కావచ్చు శత్రులు కావచ్చు నన్ను
వారించే ప్రయత్నం చేయవచ్చు. సమాజం హర్షించ వచ్చు లేదా
దూషించ వచ్చు. కాని నేను వారి మాటలను పట్టించుకోను. నా సంపద
అమితంగా వృద్ధి కావచ్చు లేదా మొత్తంగా హరించుకు పోవచ్చు, నా
ప్రయత్నంలో మరణమే సంభవించ వచ్చు అయినా నేను బాధపడను నా ప్రయత్నాన్ని చివరి వరకూ
కొనసాగిస్తాను, అనే
పట్టుదలతో కూడిన ఒక నమ్మకం. అదే దృఢమైన, నిశ్చయమైన
నిర్దారణ విశ్వాసం. ఇదే విజయ సాధనలో మొదటి అంశం.
రెండవ అంశం, శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రత్ + ధ = శ్రద్ధ. "శ్రత్" అనగా
గుర్తించదగిన సత్య సంధత యొక్క స్థితి లేదా నిష్ఠతో కూడిన సత్య సంధత "ధ" అనగా దాని వైపు (సత్య సంధత వైపు) మన ఉద్యమం (ప్రయత్నం). ఆదర్శవంతమైన ఒక లక్ష్యాన్ని సాధించేందుకు సత్య మార్గంలో మాత్రమే
ప్రయత్నించడాన్ని ఒక విధంగా శ్రద్ధగా చెప్పుకోవచ్చు.
మూడవ అంశం, గురు పూజనం. భక్తి శ్రద్ధలతో గురువును
ఆరాధించడం. గురువు ఎప్పుడూ ఒక వ్యక్తి కాదు, సమష్టి. తానుగా సాధన చేసి సాధించి తాను
గమించిన మార్గాన్ని శిష్య సంఘానికి ఉపదేశిస్తూ... ఎవరికి వారు
తమదంటూ ఒక లక్ష్యాన్ని, మార్గాన్ని
ఎన్నుకునేందుకు ఉత్ప్రేరకంగా నిలిచేవాడు, గురువు. నా మార్గమే అంతిమ మైనది, అది తప్ప వేరు లేదు అని చెపితే అతడు గురువు కాలేడు. అయితే గమ్యాన్ని ఏర్పరచుకున్న
శిష్యుని మార్గంలో ఎదురయ్యే అవరోధాలను తొలగించ గలిగిన విజ్ఞత గురువుకు ఉండాలి. తాను సేకరించిన దత్తాంశాలను హేతువు ద్వారా పరిపుష్టం చేసి, ఒక
సిద్ధాంతాన్ని లేదా మార్గాన్ని ఏర్పరచ గలిగిన వాడు గురువవుతాడు కాని ఒక
సిద్ధాంతాన్ని ఏర్పరచుకోని దాని చుట్టూ అవసరానుగుణంగా హేతువును లేదా ఉపపత్తిని
నిర్మించ జూచే వాడు ఎప్పుడూ గురువు కాలేడు. అలాంటి సద్గురువును ఆశ్రయించి
సమర్పణా భావంతో అనుసరించడం మూడవ అంశంగా చెప్పబడుతుంది.
నాలుగవ అంశం, అస్మతా భావః. అనగా మానసిక సమతుల్యత. గమ్యాన్ని చేర్చాల్సిన గమనంలో మానావమానాలు, అవరోధాలు, అవకాశాలు
సహజమైనవి. భావోద్వాగాలకు
బానిసయైన వారెవరూ తమ ప్రయాణాన్ని కొనసాగించలేరు. అర్ధాంతరంగా
ఆగిపోయిన ప్రయాణం ఎప్పుడూ సపలం కాలేదు. కాబట్టి మానసిక సమతుల్యత విజయ
సాధనలో అత్యంత ప్రముఖమైన అంశం
అయిదవ అంశం, ఇంద్రియ
నిగ్రహణం. అపజయానికి
దోహదపడేది ఇంద్రియాల బలహీనతయే. అమృతమూ, కల్ప
వృక్షాది అన్ని ఐశ్వర్యాదులూ తన వద్ద ఉన్నా ఇంద్రుడు చంచల మనస్వయై, భయం నీడలో, వ్యగ్రమనస్కుడై
ఉంటాడు. దానికి కారణం
"ఆశ". ఆశయం లేని ఆశ వల్ల చాంచల్యత, చపలత
ఆవరిస్తాయి. "బలవానింద్రియోగ్రామః విధ్వాంస మపికర్ష్యతి" అంటారు. అలాంటి బలవత్తరమైన ఇంద్రియాలను, ధ్యానం, ఉపాసన లాంటి
నైమిత్తిక మార్గాలలో మచ్చిక చేసుకొని ఇంద్రియాలకు బానిస కాకుండా నిలవడం ముఖ్యమైన
అంశంగా చెప్పబడుతుంది.
ఆరవ అంశం, ప్రమితాహారః
ఆహార విహారాదులలో పరిమితులను పాటించడం. ప్రాణం నిలవాలి అంటే తపనిసరిగా
ఆహారం తీసుకోవాలి. కాని అదే ఆహారం పరిమితులను
దాటితే.... విషమవుతుంది. అందుకనే శరీర పోషణకు అవసరమైన
ఆహారాన్ని సమయ పాలన చేస్తూ తీసుకోవడం విజయ సాధనలో మ్రాధమిక అంశంగా
చెప్పబడింది. సాధారణంగా తీసుకొన గలిగే మొత్తంలో ఒక వంతు నీరు రెండు భాగాలు ఘన పదార్ధంగా
తీసుకొని ఒక భాగాన్ని వాయు (గాలి) సంచారానికి
వదలి వేయాలని చెపుతారు. అలా పరిమిత ఆహారం వల్ల భౌతిక
శరీర ఆరోగ్యం, మానసిక
ఆరోగ్యం చక్కగా ఉండి సాధనలో సహకరిస్తాయని విజ్ఞుల ప్రబోధ.
చివరిది, ఏడవ అంశం, సప్తమం నైవ
విద్యతే అంటారు. పైన మనం చర్చించిన ఆరు అంశాలు కాక మరేమీ లేవు అంటుంది పై శ్లోకం. అంటే పై నియమాలను త్రికరణ శుద్ధిగా పాటించిన నాడు విజయ ద్వారం మనకై తెరిచి
ఉంటుంది.
ఇలా ముఖ్యమైన ఏడు అంశాలను ఒక శ్లోకం ద్వారా మానవ కోటి
విజయ సాధనా మార్గంలో ఉపకరిస్తాయని చెప్పిన మహనీయునికి (ఎవరో తెలియక పోవడం వల్ల) నమస్సులర్పిస్తూ....
No comments:
Post a Comment