కురుక్షేత్ర
యుద్ధంలో బంధు మిత్రులు, స్నేహితులు మరణించాక
"కొంతకాలం మడుగులో దాగి, అనుకూల సమయంలో ఎక్కడికైనా పోయి,
ఏదో విధంగా నా పగ తీర్చుకుంటాను".. అని సంజయుని ద్వారా ధృతరాష్ట్రునికి
సందేశాన్ని పంపి దుర్యోధనుడు ఒంటరిగా ద్వైపాయనం అనే మడుగులో జల స్తంభన విద్యతో దాగుకొని
ఉంటాడు. ఆ సమయంలో కొందరు వేగులవారి వల్ల దుర్యోధనుడు దాక్కొన్న మడుగును చేరి పాండవులు
అతనిని సూటిపోటి మాటలతో హింసిస్తూ.. ఆ మడుగులో నుండి బయటకు రప్పించే ప్రయత్నం చేస్తారు.
ఆ సందర్భంలో తిరుపతి వేంకట కవులు వ్రాసిన పద్యం..
చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ
కచ్చకు మూలకందమగు కర్ణుడు, మామయు చచ్చిరీ గతిన్
పచ్చని కొంప మాపితివి బాపురె, కారవ నాథ! నీ సగం
బిచ్చెద జీవితేఛ్చ గల దేని బయల్పడు మయ్య
గ్రక్కునన్!
సమూలంగా
కౌరవ బలం నాశనమయింది. పగలు ప్రతీకారాలు ఎంతటి నాశనానికి దారితీస్తాయో జగత్తుకు అవగతమయింది.
అలా
దాగిన దుర్యోధనుని వెలికి రప్పించడ మెలాగా అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణుడు ధర్మరాజుతో..
మాయతో జయించాలని భావించే వారిని మోసంతోనే జయించాలే కాని మరో మార్గం కనిపించదు. శత్రుశేషం, ఋణశేషం మిగలడం అపాయకరం కాబట్టి అభిమాన ధనుడైన దుర్యోధనుని ఎలాగైనా
సూటిపోటి మాటలతో వెలుపలికి రప్పించి సంహరించడమే ఉత్తమం.. కాబట్టి దయా దాక్షిణ్యాలని,
సోదరుడని భావించక ఆ విధానానికి ఉపక్రమించమని చెపుతాడు. ఆ సందర్భంలో ధర్మరాజు..
దుర్యోధనా..
లోకంలో ఇలాంటి నీచమైన స్థితి వీరులకే దగదు.. అందునా అభిమానవంతుడవైన నీకు అసలు తగదు...
నీ తోబుట్టువులు చచ్చారు, కుమారులూ చచ్చారు.. నీకునై
యుద్ధం చేసిన రాజులు అందరూ చచ్చారు.. ఇంత కక్షలకూ కార్పణ్యాలకూ మూలమైన కర్ణుడూ.. శకునీ
చచ్చారు. ఇందరు యోధులూ, సైనికులు చచ్చేందుకు మూలమైన నీవు మాత్రం
బ్రతికి సాధించేది ఏమి ఉన్నది? పచ్చగా ఉన్న కౌరవవంశం అనే కొంపలో
జ్యోతిని ఆర్పివేసావు. ఇంకా రాజ్యేఛ్ఛ నీకు ఉన్నట్లయితే రాజ్యంలో సగ భాగం ఇస్తాను..
త్వరగా రా.. వచ్చి ఏలుకో.. అంటాడు.
అంతేకాదు, నిన్ను శూరునివి అంటారు కదా.. కొలనులో దాక్కోవడం శూరకర్మమా,
వీర ధర్మమా, రణనీతియా.. సాధారణమైన రాజులే ఇలా యుద్ధం
నుండి పారిపోయి దాక్కోరే.. అలాంటిది నీవు.. కురువంశంలో జన్మించి.. కీర్తినీ,
గొప్పదనాన్ని కాదని వైరులు నవ్వే విధంగా కొలనులో దాక్కుంటావా.. ఇంత మందిని
రణభూమికి బలిచేసి నీ ప్రాణాలను మాత్రం కాపాడుకోవడం క్షాత్ర ధర్మమా? దుర్యోధనా యుద్ధంలో మమ్ములను జయిస్తే.. ఈ సమస్త భూమండలాన్నీ పాలించుకోవచ్చు..
అలా కాక యుద్ధంలో మరణిస్తే స్వర్గభూమిలో సౌఖ్యాలను అనుభవించవచ్చు. అలాకాక.. మడుగులో
దాక్కొనడం అవమానం కాదా..
ఇలా
ఎన్నో విధాలుగా నిష్ఠూరంగా ఎద్దేవా చేస్తూ పలికిన ధర్మరాజుతో దుర్యోధనుడు మడుగులో నుండే
బదులు చెపుతాడు.. ముఖ్యంగా తనవారితో కూడి సౌఖ్యాలను అనుభవించడమే ఉచితం కాని ఇలా ఒంటరినై
అనుభవించడం సమంజసమూ కాదు.. అంటూ.. చివరగా...
ఓడి వచ్చినాడ యుద్ధతి నాకేల?
యుడుకు మాని నీవ యుర్వి నేలు
గుఱ్ఱములును నేనుగులును లేని బయలు నీ
తలనె కొట్టుకొనుము ధర్మ తనయ!
అంటాడు.
సంఘర్షణ
ఎప్పుడూ అనర్ధానికే దారి తీస్తుంది. దుర్యోధనుడు పదకొండక్షోహిణుల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు..
భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామ, బాహ్లిక సోమదత్త భూరిశ్రవసుడు
ఆదిగా గలిగిన అతిరథ మహారథ శ్రేష్ఠులను యుద్ధావనికి నడిపించాడు. పాండవ పక్షంలోనూ ఏడక్షోహిణుల
సైన్యం సమకూరింది.. ఇంత సైన్యం యుద్ధార్ధులై సమరాంగణంలో నిలిచిన వేళ ఎవరు గెలుస్తారు
ఎవరు ఓడుతారనే సమస్యను ప్రక్కన పెడితే.. కొందరు ఆ పక్షంలో కొందరీ పక్షంలో మరణించడం
అనివార్యమే కదా.. అందులో తన తమ్ములూ ఉండవచ్చు.. కుమారులూ ఉండవచ్చు, స్నేహితులూ ఉండవచ్చు..
కొద్ది
సంయమనత, చిన్న త్యాగభావన, మరికొంత ఔదార్యం మనసులో నిలిస్తే.. యుద్ధం అనివార్యమౌతుందా? సూత పుత్రుడైన కర్ణునికి అంగరాజ్యాన్నే ఇచ్చాడు కదా.. ఆ పాటి సౌహార్ద్రత పాండవులపై
చూపితే ఇంతటి దారుణ మారణ కాండ జరిగియుండదు కదా? ఈ రాజ్య కాంక్ష
ఎందుకు? శాశ్వతంగా ఎవరైనా ఇప్పటి దాకా ఉన్నారా? ఇక ముందు ఉంటారా?
ఎవరికోసం
ఎవరు చావాలి? ఎందుకు చావాలి? భూమి
కొరకు రాజులు యుద్ధాలు చేస్తున్నారు.. అందులో అమాయకులు మరణిస్తున్నారు. కౌరవులు గెలిస్తే..
లేదా పాండవులు గెలిస్తే.. మరణించిన వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? రాజులు సపరివారంగా వినోదయాత్రకు వెడలినట్లు యుద్ధావనికి వెళ్ళి పీనుగులై యమపురికి
పోవడం.. అమూల్యములైన ఎన్నో వనరులు ధ్వంసమవడం యుద్ధం వల్ల జరిగే నష్టం.. దానిని ఆనాడూ
గుర్తించలేదు.. ఈనాటి పాలకులూ గుర్తించడం లేదు.. పాలక వర్గమైనా వ్యాపార వర్గమైనా పరస్పరాధారితమైతే
అమిత ప్రయోజనాలను పొందగలరనే సత్యం తెలిసీ స్వార్థ ప్రయోజనాలకై, ఆధిపత్యాన్ని సాధించాలనే అధికార లాలసతతో పరస్పర హననం జరుపుకోవడం గర్హణీయమే.
సగం
ప్రపంచాన్ని జయించాననే అహంభావంతో ఉన్న అలగ్జాండర్ తాను మరణించిన సమయంలో కాఫిన్ లో నుండి
తన చేతులు పైకి వచ్చేట్లుగా పెట్టమని వీలునామా వ్రాసుకున్నాడట. ఇంత భూమినీ జయించినా..
నేను రిక్త హస్తాలతోనే వెళ్ళిపోతున్నాననే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఆ
విధంగా వ్రాసాడట.
చిన్న
మాట పట్టింపులు.. రక్త సంబంధీకుల మధ్య పెద్ద కాలం పలకరింపులను దూరం చేస్తున్నాయి. కొద్ది
పాటి అధికారం.. తనవారి నుండి దూరం చేస్తున్నది. ఇది అవసరమా.. ఇప్పుడు ఈ భూమిపై ఉన్న
ఏ వ్యక్తీ .. గత రెండు వందల సంవత్సరాల క్రితం లేడు కదా.. అలాగే మరో రెండు వందల సంవత్సరాల
పిమ్మట ఇప్పుడున్న ఎవరైనా ఉంటారా? అనంతమైన కాలంలో నాలుగు
వందల సంవత్సరాలు చాలా చాలా చిన్న సమయం.. ఎందుకు వచ్చామో తెలియక.. ఎందుకు పోతున్నామో
ఎఱుగక.. రాకపోకలు మాత్రమే లక్ష్యంగా జననమరణ చక్ర బంధంలో మ్రగ్గిపోవడం అవసరమా?
ఆలోచించాలి.
రమేశ్
అడిగిన ప్రశ్న చిన్నదే కావచ్చు కాని అందరూ సమాధానాన్ని ఆలోచించుకో వలసిన అవసరం మాత్రం
ఉన్నది.
రమేశ్
ఇప్పటికే వ్యాఖ్య విషయాంతరమయింది.. ఇక్కడికి ఆపేస్తున్నాను..
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment