వ్యక్తి జీవన గమ్యం...
రోషమయ మహాతరువు సుయోధనుఁ డురు
స్కంధ మందులోనఁ గర్ణుఁ, డలరుఁ
గొమ్మ సౌబలుండు, గుసుమ ఫలములు దు
శ్శాసనుండు, మూల శక్తి తండ్రి!
(భారతం - ఉద్యోగపర్వం - తిక్కన - 1-
355)
దుర్యోధనుడు
క్రోధరూప మహావృక్షం. కర్ణుడు దానికి పెద్ద బోదె. శకుని పూలకొమ్మ, దుశ్శాసనుడు పుష్ప ఫలములు. తండ్రి అయిన ధృతరాష్ట్రుడు దానికి మూలబలము..
ధర్మరాజు ధర్మతరు, వర్జునుఁడు ఘన
స్కంధ మనిల సుతుఁడు శాఖ, కవలు
పుష్ప ఫలము; లేను, భూసురులును, వేద
ములుఁ దదీయమైన మూల చయము!
(భారతం - ఉద్యోగపర్వం - తిక్కన - 1-
356)
ధర్మరాజు
ధర్మమనే చెట్టు. అర్జునుడు దాని బోదె. భీముడు దాని కొమ్మ. నకుల సహదేవులు పూలు, పండ్లు.. నేనూ (కృష్ణుడు)
బ్రాహ్మణులు, వేదాలు దాని వేళ్ళ సమూహం..
సంజయ
రాయబారం సమయంలో కృష్ణుడు.. సంజయునితో పలికిన పలుకులు పై రెండు పద్యములు. సంజయుని రాయబార
సారాంశం.. కౌరవులు.. పాండవులకు రాజ్యభాగం ఇవ్వరు.
అయినా పాండవులు యుద్ధం చేయవద్దు. ఇదీ కౌరవుల
మాటగా సంజయుడు చెప్పదలచిన మాట. సాధారణంగా సంధి రెండువర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా, సమంజసంగా Win/ Win పద్ధతిలో ఉంటే సంధి పొసగుతుంది..
కాని ఇక్కడ తన సంభాషణా నైపుణ్యాన్ని ప్రదర్శించి. కౌరవులేమీ ఇవ్వరు కాని మీరు మాత్రం
యుద్ధం చేయవద్దని చెప్పే సాహసం చేసాడు, సంజయుడు. దానికి కృష్ణుడు
స్పందించిన సందర్భంలో చెప్పిన మాటలే కౌరవ పాండవుల మధ్య పోలికలు చెప్పడం.
రెండు
వృక్షాలను చెప్పడం విశేషంగా ఉన్నది. అదీ వాటిపోలికలు ఉదాత్తమైన విషయాన్ని చెప్పడమే
కాక.. కౌరవ పాండవ మానసిక వైశిష్ట్యాన్ని తెలియచేస్తున్నాయి.
మొదటి
పద్యంలో .. దుర్యోధన నేతృత్వంలో దుష్ట చతుష్టయాన్ని రూపించాడు.. రెండవ పద్యంలో ధర్మరాజు
నేతృత్వంలో అతని సోదరులనూ, తనను (కృష్ణునిని),
బ్రాహ్మణులను రూపించాడు. మొదటి వృక్షంలో ధృతరాష్ట్రుని చెట్టుకు మూలంగా
చెప్పగా రెండవ పద్యంలో ధర్మరాజును మూలంగా చెప్పాడు. మొదటి పద్యంలో.. దుర్యోధనుని మన్యుమయంగా
అనగా క్రోధమయంగా చెప్పగా రెండవ పద్యంలో ధర్మరాజును ధర్మానికి ప్రతినిధిగా చెప్పడం కనిపిస్తుంది.
నిజానికి
ఈ రెండు పద్యాలు బింబ ప్రతిబింబాలుగా కనిపిస్తుంటాయి. ఒకటి అవిద్యను రెండవది విద్యను
సూచిస్తున్నవి. ధృతరాష్ట్రుడు... జాత్యంధుడు.. అంధత్వం అజ్ఞానానికి ప్రతీక. స్వస్వరూప
జ్ఞానరహితమైనది. ఈర్శ్యాసూయా ద్వేషాలు, అహంకార మమకారాదులకు ఆలవాలమైన
వృక్షం ఒకటి.. తద్భిన్నమైనది మరొకటి.
ధార్మికుడైన
ధర్మరాజుకు ప్రతీకగా చెప్పిన వృక్షం.. ఊర్ధ్వమూలమైనది.. అందుకే చివరగా స్వర్గారోహణ
ఫలితంగా ధర్మరాజుకు అమరింది. రెండవది.. అధోమూలము.. పాప సంజనితమైన, దురాశకు నిలయమై, దుశ్శీల సంయుతమై దుర్యోధనుని
నరక వాసానికి మూలమయింది. పాండురాజు సంకల్పంలో ధార్మిక దృష్టి ఉన్నది అందుకే కుంతితో సమవర్తియైన యమధర్మరాజును ఆహ్వానించమని చెప్పడం కనిపిస్తుంది.
తదనుగుణమైన జన్మగా ధర్మజుడు జనించాడు. అలాగే దుర్యోధనుని జననంలో గాంధారి మాత్సర్యం..
అసహనం, ధృతరాష్ట్రుని ఈర్ష్యాసూయలు ప్రతిబింబించాయి.
కలి
పురుష అంశతో జన్మించిన దుర్యోధనుడు కాని, ధర్మ పురుషుని అంశతో జన్మించిన
యుధిష్ఠరుడు గాని.. ఇరువురి పేర్లూ యుద్ధాన్నే సూచిస్తున్నాయి. ధర్మాధర్మాల మధ్య అనునిత్యం
సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. దుర్యోధనుడు.. అంటేనే జయించడానికి అసాధ్యమైన వాడు. అతడు
అధర్మాన్ని ఆదరించిన సమయంలో.. ధర్మ పక్షాన నిలిచిన వారు అప్రమత్తులై ఎదిరించే సమయంలో
సమరశీలంతో సర్వదా సిద్ధంగా ఉండాల్సిందే. ధార్మికమైన యుద్ధంలో అనుక్షణం స్థిరంగా,
సంసిద్ధంగా ఉండేవాడు యుద్ధిష్ఠరుడు.
వృక్షం..
స్థిరత్వాన్ని సూచిస్తుంది. శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంయొక్క నిలకడయే కాక అది
ఇచ్చే ఫలాలూ.. దాని మూలంపై ఆధారపడి ఉంటాయి. ఈ రెంటి పోలికను అనంతమైన చైతన్యం లేదా ప్రజ్ఞ
జగత్తుగా అవతరించే సమయంలో "వ్యక్తావ్యక్తముల మధ్య సంఘర్షణగా" చెప్పుకోవచ్చు.
అలాగే.. జీవేశ్వరులకు, దేవ దానవులకు లేదా వారి
ప్రవృత్తులకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
తల్లి
గర్భంలో నుండి బయటకు వచ్చే శిషువు.. ఆ గర్భంయొక్క పరిమితులను ఛేదించుకోవడానికి పడే
సంఘర్షణ లేదా పరిణామ క్రమంలో ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరే క్రమంలో పూర్వ ఉత్తర
స్థితుల మధ్య జరిగే సంఘర్షణ.. శక్తి పదార్ధంగా పరిణామం చెందే సమయంలో లేదా పదార్ధం శక్తిగా
పరిణామం చెందే క్రమంలోనైనా "మహత్తును" అనగా మాయను అధిగమించాల్సి ఉంటుంది.
ఇది కూడా యుద్ధమే..
చివరగా
.. భారతాన్ని వ్రాసినవాడు, వేదవ్యాస మహర్షి. వేదాలను
విభాగించిన జ్ఞానమయుడు ఆ మహర్షి. కాబట్టి వేదప్రతిపాదిత సత్య సమావిష్కరణయే ఆయన లక్ష్యంగా
ఉంటుంది. తదనుగుణంగా వెలువడిందే మహాభారతం. కొద్దిగా లోపలికి దృష్టి సారించి భారతాన్ని
పరిశీలిస్తే.. వ్యక్తి సాధనలో అలవరచుకోవలసిన అంతర్దృష్టిని, విడిచి
పెట్టవలసిన బాహ్యదృష్తిని గూర్చిన భావనలనూ పై రెండు పద్యాలు సూచించిన వైనం కనిపిస్తుంది.
రెండు
వృక్షాలు.. మృత్యువు, అమృతత్వాలకు ప్రతీకలుగా
తీసుకుంటే.. రెండూ మనలోనే నిక్షిప్తమై ఉన్నాయనీ.. దేనిని మేల్కొల్పి చైతన్యవంతం చేసుకుంటామో తత్సంబంధిత ఫలాన్ని ఆస్వాదిస్తామని,
ఆనందిస్తామనీ అంతర్లీనంగా చెప్పడం కనిపిస్తుంది.
నిజానికి
పై పద్యాలను ఎవరికి వారు తమకు అన్వయించుకొని తాము దేనికి ప్రతినిధులుగా ఉన్నారో తెలుసుకొని..
దేనిని ఆదరించాలో గుర్తెరిగి తదనుగుణమైన ప్రవర్తనను అలవరచుకోవడం అవసరమనే సుబోధ కూడా
కనిపిస్తుంది.
మాన్యులు
పెద్దలు ఆచార్య రాణి సదాశివమూర్తి గారికి నమస్సులతో..
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment