Friday, August 15, 2025

 

ప్రయత్నశీలికే దైవబలం తోడౌతుంది..

 

            ప్రయత్నశీలి ఏనాడూ నిరుత్సాహపడడు. ఒకపనిని సాధించడంలో కృషికి తోడుగా సహనం, ఓర్పు అవసరం. విజయం వెంటే అపజయం, దాని వెనకాల విజయమూ ఉంటాయి. అమావాస్య దాటగానే వృద్ధిని పొందిన చంద్రుడు పౌర్ణమి తదుపరి క్షీణించడం ఆరంభిస్తాడు. మళ్ళీ వృద్ధిని పొందుతాడు. ఉదధిలో ఉప్పొంగే కెరటం పడిపోతుంది. అంతమాత్రాన ఆగిపోదది. ఉత్సాహంతో తిరిగి ప్రయత్నిస్తుంది.. విజయమనేది ఒక లక్ష్యం కాదు.. గమనం మాత్రమే.. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తిసామర్ధ్యాలు, ప్రయత్నం ఎవరిలో ఉంటాయో వారినే దైవబలం వరిస్తుంది. దైవబలమే అదృష్టం.

            బలమైన సంకల్పం, దానిని సాకారం చేసుకునే తపన, అవసరమైన విజ్ఞాన సేకరణ.. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే నైపుణ్యం, నిబద్ధత కలిగిన వ్యక్తి ఇహపరములను సాధించగలడు. ఆలోచనలలో పరిణతి, విస్తృతి, ఆచరణాత్మకమైన వ్యూహం, నిరంతర ప్రయత్నం సఫలత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆవగింజంత అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకునే వానికే దైవబలం తోడౌతుంది. ఒక పామునొక బుట్టలో బంధించారు. రాత్రి పూర్తిగా అది ప్రయత్నించి బయటకు రాలేక విసిగిపోయింది. ఇంతలో ఒక ఎలుక ఆ బుట్టకొక రంధ్రాన్ని చేసి లోనికి వెళ్ళింది. పామా ఎలుకను తినేసి ఆకలితీర్చుకొని ఎలుక చేసిన రంధ్రం గుండా బయటకు వచ్చేసింది. దానినే అదృష్టం అంటారు. ఇక్కడ పాము ప్రయత్నానికి ఎలుక రూపంలో అదృష్టం కారణమయింది.

            అలాగే ఒక్కొక్కమారు ఎంతగా సహాయం లభించినా పయత్నం విఫలం కాకపోవచ్చు. దేవదానవ సంగ్రామంలో దేవతలు పలుమార్లు విజయం సాధించినా.. వనరులు, వసతులెన్ని సమకూర్చుకున్నా.. పలుమార్లు ఓటమినీ పొందారు. ఇంద్రునికి అత్యంత ధీశాలి బృహస్పతి గురువు.. ధైర్యసాహసాలు, బలమూ కలిగిన సుపర్వులు సేనాపతులు. వజ్రాయుధమే ఆయుధం. పటిష్టమై, శత్రుదుర్భేద్యమైన ఇంద్రభవనమే కోట. సాక్షాత్తూ మధుసూధనుడే అత్యంత ఆత్మీయుడూ సహాయకుడైన.. చెలికాడు. ఐరావతమే వాహనము. ఇన్ని వనరులూ తనకమరినా.. దానవుల చేతిలో ఓడిపోయాడు. అయినా ఓటమి శాశ్వతం కాదని తిరిగి ప్రయత్నిస్తేనే అదృష్టం వరించింది.

            కుండలు చేసేవాని విధంగా సృష్టికర్తయైన బ్రహ్మ నిత్యమూ బ్రహ్మాండాన్ని సృజిస్తూ ఉంటాడు.. విష్ణుమూర్తి దుష్టశిక్షణ పేరుతో అవతారాలను ఎత్తుతూ ఉంటాడు. అన్నపూర్ణాదేవియే తనకు భార్యయయినా రుద్రుడు భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఇక సూర్యుడు నిరంతరం ఆకాశంలో తిరుగుతూనే ఉంటాడు. ఆ కర్మాచరణలో వారు సంతృప్తిని ఆస్వాదిస్తారు. ప్రతిఫలాపేక్షలేక, శ్రద్ధాసక్తులతో బాధ్యతా నిర్వహణలో ఆనందించే వారు, వారి ప్రయత్నాన్నే విజయంగా భావిస్తారే కాని అంతిమ ఫలితంపై ఆశతో పనిచేయరు. నిస్పృహాచిత్తులు, నిరాశావాదులు, అనుమాన మనస్కులు, పిరికివారు, శీలహీనులు సాధించేది ఏదీలేదు.. వారికి దైవమూ తోడ్పడదు. అదృష్టం పలకరించినా అది నిలవదు. మనప్రమేయం లేకుండా ఒక్కొక్కమారు కష్టాలు, నష్టాలు పలకరించవచ్చు. అప్పుడు ధైర్యసాహసాలు, మనోస్థైర్యమే వారిని నిలబెట్టుతుంది. చైతన్య స్వరూపమైన ప్రయత్నమే.. అదృష్టాన్ని సాధిస్తుంది. అందుకే అదృష్టం ప్రయత్నానికి తోబుట్టువు అంటారు.

పాలకుర్తి రామమూర్తి

 

No comments: