అర్హత, సాధన, విచక్షణలే జీవితాన్ని ఉన్నతీకరిస్తాయి
విద్యార్జనకు గాని, ఉన్నత బాధ్యతా నిర్వహణకు గాని అర్హతాపరీక్షలో ఉత్తీర్ణులయిన వారినే
అనుమోదించడం భారతీయ సంప్రదాయంలో అనాదిగా అనుసరిస్తున్న విధానం. మహాభారతంలో ఉత్తమ యోధునిగా, ధర్మవేత్తగా పేరుబడిసిన అర్జునుడు
ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని వాటిలో ఉత్తీర్ణుడై అనేక అస్త్రశస్త్రాలను సాధించడమే
కాక ఎన్నో అతిమానుష కృత్యాలను నిర్వహించాడు. యోగసాధనలో పురోగతి
సాధించి సూర్యునితో సమానమైన తేజస్సంపన్నునిగా పేర్కొనబడ్డాడు. క్రియాశీలిగా, మహత్తర కార్యాలను సాధించాడు. నీతి నియమాల చట్రంలో జీవించి మహాత్మునిగా కీర్తిని పొందాడు. బాధ్యతాయుతంగా ధర్మబద్ధ కార్యక్రమాలను నిర్వహించి తన దీక్షాదక్షతలను ప్రదర్శించాడు.
విద్యార్జనను
వ్రతంగా, నిష్ఠగా, ఉత్సాహంగా పూర్తిచేసి
గురువైన ద్రోణాచార్యుల మన్ననలను పొందాడు. ఆ సందర్భంలో ద్రోణుడు
ఒకసారి నదిలో స్నానం చేసే సమయంలో అతనిని ఒక మొసలి పట్టుకున్నది. దాని బారి నుండి తప్పుకునే నైపుణ్యం కలిగిన వాడే అయినా ద్రోణుడు శిష్యులకు
పరీక్షను పెట్టాలని నిశ్ఛయించుకొని "ఈ మొసలి నుండి నన్ను
రక్షించండి" అని శిష్యులను కోరాడు. మొసలి పైకి కనిపించడం లేదు. దానిని కొడితే గురువుగారి
కాలికీ దెబ్బతాకవచ్చు.. గురువుకు బాధ కలుగకుండా మొసలిని కొట్టడం
అసాధ్యం అని అందరూ వెనుకకు ఒదిగిపోయారు.. కాని అర్జునుడు సన్నద్ధమై
ముందుకు వచ్చాడు.. దానికి కారణం.. అర్జునుడు
నేను కొట్టగలనని త్రికరణశుద్ధిగా భావించడమూ.. దానికి తగ్గ మానసిక
ధైర్యమూ, సాహసమూ, నిర్భయత్వమూ, సాధించాలనే తపన, గురువుపై అచంచలమైన భక్తి, తాను నేర్చిన విద్యపై ఉన్న విశ్వాసములే కారణలుగా చెప్పుకోవాలి. మొసలిని కొట్టాడు. అలా అర్హతను సాధించి గురువు నుండి
పలు దివ్యాస్త్రాలను సాధించాడు. అస్త్ర గురువైన ద్రోణాచార్యులు
పెట్టిన పలు అర్హతా పరీక్షలలో విచక్షణాబుద్ధి, యోగసాధన,
బల పరాక్రమాలను ప్రదర్శించి ఉత్తీర్ణుడైన అర్జునునికి, తన కుమారుడైన అశ్వత్థామకు కూడా ఇవ్వని మహత్తర అస్త్రాలను ద్రోణుడు ఇచ్చాడు.
పరాక్రమమే కాదు
మానవతా పూర్ణుడైన అర్జునునిలో కరుణా స్వభావమూ కనిపిస్తుంది. ఒకసారి
పాండవులు ఒక నదిలో స్నానానికి ఉద్యుక్తులైన సమయంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు ఆ నది
తనదని అడ్డగిస్తాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో అంగారపర్ణుని ఓడించి
అతనికి ప్రాణభిక్షను పెట్టడంతో పాటుగా, మిత్రునిగా స్వీకరించి
అతనికి దివ్యాస్త్రాలను ఉపదేశిస్తాడు. ప్రతిగా అతని నుండి చాక్షుషీ
విద్యను గ్రహించి మిత్ర ధర్మాన్ని నిలబెడతాడు. ఆ అంగారపర్ణుడే
పేరు మార్చుకొని చిత్రరథునిగా ప్రసిద్ధిని పొందాడు.
ధర్మరాజు భీమార్జునులను
రెండు నేత్రాలుగానూ కృష్ణుడిని మనసుగానూ పేర్కొనడం సభాపర్వంలో కనిపిస్తుంది.
భీమార్జును లిరువురూ కన్నులే అయినా పలు సందర్భాలలో భీమునిలో ఆవేశమూ,
అర్జునునిలో ఆలోచనాపూర్వకమైన స్థిర చిత్తమూ కనిపిస్తాయి. నాయకునిలో ఉండవలసిన మానసిక సమతుల్యతను అర్జునుడు పలు సందర్భాలలో ప్రదర్శించడమూ
భారతంలో కనిపిస్తుంది.
అరణ్యపర్వంలో
వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చి పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాల
పిమ్మట జరగబోయే పరిణామాలను వివరిస్తూ.. కౌరవుల పోషణలో ఉండడం మూలంగా
భీష్మద్రోణులు కౌరవుల పక్షాననే యుద్ధం చేస్తారని.. కర్ణ భీష్మద్రోణులనే
కాక ఆ పక్షంలో నిలిచిన పలువురిని ఎదుర్కునేందుకు ప్రస్తుతం పాండవుల వద్దనున్న అస్త్రసంపద
సరిపోదని అందువల్ల ఇంద్రాది దేవతలను ప్రసన్నం చేసుకొని అస్త్రశస్త్రాలను సంపాదించాలని
సూచిస్తాడు. దానికి అనుగుణంగా "ప్రతిస్మృతి"
అనే విద్యను ధర్మజునికి ఉపదేశించి దానిని అర్జునునికి ఉపదేశించమని..
దాని ద్వారా దేవతలను దర్శించడం సులువవుతుందనీ, మహేశ్వరుని గూర్చి అర్జునుడు తపించి ప్రసన్నుని చేసుకోవాలని చెపుతాడు.
వ్యాసుని ఆదేశానుసారం.. ధర్మరాజు కూడా "ధృతి నియమవ్రతుడునూ, దీక్షితుడు"నైన అర్జునునికి "ప్రతిస్మృతి" విద్యను ఉపదేశించి, తపోయోగ బలంబున ఇంద్రుడిని ప్రసన్నుడిని
చేసుకోవలసిందిగా గురుతర బాధ్యతను అప్పగిస్తాడు. ఆ విద్యను అర్జునునికి
ఉపదేశించడంలో ధర్మరాజు లక్ష్యం శత్రువులను జయించడమే. దాని ఫలితంగా
అర్జునునిలో తదనుగుణమైన విజయకాంక్షాపూర్ణమైన దృఢదీక్ష ఏర్పడుతుంది. యోగసాధనను, తపస్సును చేసి ఇంద్రాది దేవతలను ప్రసన్నం
చేసుకొని అర్జునుడు అజేయమైన అస్త్రశస్త్రాలను వరంగా పొందుతాడు. ఎప్పుడైనా విద్యకు రెండువైపులా పదనుంటుంది. దానిని ఏ
లక్ష్యంతో సాధిస్తే దానికి అనుగుణమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాసుల
వద్ద ఉన్న సమయంలో ఆ విద్య యుద్ధ సంబంధిత ఫలితాలను కోరలేదు. ధర్మరాజు,
అర్జునుల వద్ద మాత్రం దానినే ఫలితంగా కోరింది, దానినే సాధించింది.
ఇక్కడ ఒక విషయాన్ని
గమనించాలి. వేదవ్యాసుడు ప్రతిస్మృతి విద్యను అర్జునునికే నేరుగా
ఉపదేశించక ధర్మరాజుకు ఇచ్చి అర్జునునికి చెప్పమనడంలో ఔచిత్యం ఏమిటి? ధర్మరాజు అర్జునునికి అన్నగానే కాక పాలకుడు కూడా. వచ్చిన వాడు ధర్మం తెలిసిన
కృష్ణద్వైపాయనుడు. రాజ్యన్ని పాలించే అధికారిక విధానం, నియమాల
పరిమితులు ఉంటాయి (Protocall). దాని ప్రకారం పై నుండి క్రిందికి
ఆదేశాలు వెళ్ళడమే ఉచితమైనది. ఉదాహరణగా గంగాదేవి
ఆకాశం నుండి భూమిపైకి రాకుండా శంకరుని జటాజూటం నుండి దిగింది. ఆ క్రమాన్నే పాటించాడని
భావించవచ్చు.
అర్జునుడు తపోభూమిలో
తపోనిష్ఠలో ఉన్నా గాండీవాన్ని ధరించి ఉండడం గమనించిన .. ఇంద్రుడు
బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయుధాలను విసర్జించి తపస్సు చేయాలని ప్రబోధించినా అర్జునుడు
గాండీవాన్ని విడనాడలేదు. యోధుడు లేదా శస్త్రజీవి తన ఆయుధాన్ని
మరణంలో తప్ప విడవకూడదు. ఈనాడూ ఉన్నత సైనికాధికారులు కూడా తమ ఆయుధాన్ని
తామే ధరించి తిరుగుతారే కాని ఇతరులకు ఇవ్వరు. చేసిన తపోసాధన ఫలితంగా,
ప్రతిస్మృతి విద్యవల్ల ఇంద్రుడు ప్రత్యక్షమై అర్జునుని ప్రలోభపెడుతూ..
పుణ్యలోకాలను అమరత్వాన్ని ఇస్తానన్నా వాటిని కాదని దివ్యాస్త్రాలను మాత్రమే
కోరడం లక్ష్యంపట్ల అతని ఏకాగ్ర దృష్టికి అద్దంపడుతుంది. అది అర్జునుని
నిబద్ధతకు, కార్య సాధనలోని నియమ పాలనా విశేషానికీ ప్రతీకగా నిలుస్తుంది.
ఇంద్రుడు పెట్టిన ఈ పరీక్షలోనూ అర్జునుడు నెగ్గి తన దీక్షను ప్రకటించాడు.
శివుని గూర్చి
తపించే సమయంలో కూడా శివుడు అర్జునుడిని పరీక్షించే క్రమంలో అర్జునుని అమ్ములపొదిలో బాణాలను మాయం చేసినా భయపడక
గాండీవాన్నే ఆయుధంగా చేసుకొని అతనిని ఎదిరించాడు. అది అతని క్షాత్రనిష్ఠకు,
విద్యాగ్రహణ దీక్షకు, సవాలు లెదురైన వేళ చూపాల్సిన
ధైర్యసాహసాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. తద్వారా పరమశివుని పరీక్షలోనూ
నెగ్గి ఆతనిని ప్రసన్నం చేసుకొని పాశుపతంతో సహా పలు దివ్యాస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో
సహా వరంగా పొందాడు. అస్త్రప్రయోగంలో మూడు ముఖ్యమైన అంచెలు లేదా
క్రమాలు ఉంటాయి. మంత్ర సహితంగా వింటికి బాణాన్ని సంధానించడం,
లక్ష్యాన్ని గురిచూసి ఏకాగ్రతతో విడవడం, అవసరమైన
వేళ దానిని ఉపసంహరించడం.. బాణాన్ని సంధానించడం, విడవడం నైపుణ్యంగా పరిగణింపబడతాయి.. కాగా ఉపసంహారం విలుకాని
నైతిక, ఆధ్యాత్మిక సాధనపై ఆధారపడి ఉంటుంది. దివ్యాస్త్రాలు ఒక్కొక్కసారి ఎదుటివారినే కాక ప్రయోగించిన వారికీ అపకారం చేయవచ్చు.
దానికి ప్రత్యుపకృతి చేయదగిన వనరులను, శక్తిసామర్ధ్యాలనూ
సమకూర్చుకున్నాకే అస్త్రాలను ఉపయోగించడం వివేకం కలిగిన వారి లక్షణం.
అలా శివుని అనుగ్రహంతో
దివ్యాస్త్రాలను సాధించిన పిమ్మట ఇంద్రుడూ, ఇంద్రునితో పాటుగా
దిక్పలకులూ అస్త్రశస్త్రాలను అనుగ్రహిస్తారు. ఇంద్రుడు తన సారథి
మాతలితో రథాన్ని పంపి అర్జునుని పిలిపించుకొని అర్ధ సింహాసనంపై ఆసీనుని చేస్తాడు,
అమరావతిలో ఆతిథ్యం ఇస్తాడు. ఆ క్రమంలో ఊర్వశి అర్జునుని
పొందుకోరి వస్తుంది. అది అపరాధమని, తానామెను
తల్లి భావనతో చూస్తున్నానని, ఆమెతో సంగమించడం అధర్మమని తిరస్కరిస్తాడు.
దానికి ఊర్వశి అమరావతి భోగనగరమని అక్కడ వావివరసలు ఉండవని.. అక్కడి ఆచారాలు పాటించాలని చెపుతుంది. నిజానికి ఎక్కడికి
వెళితే అక్కడి సంస్కృతిని గౌరవించడం ధర్మమే కాని మన విలువలను తాకట్టుపెట్టి అక్కడి
సంస్కృతిని పాటించడం సమంజసం కాదు. ఎక్కడ కాదని చెప్పాలో అక్కడ
కాదని చెప్పడానికి మనోనిబ్బరత కావాలి.. ధైర్యం కావాలి.
ఆ ధైర్య సాహసాలను, మనోనిబ్బరతను ప్రదర్శించి మరొక
పరీక్షను నెగ్గాడు, అర్జునుడు. ఊర్వశి ఎన్ని
విధాలుగా చెప్పినా తన మార్గాన్ని విడనాడని అర్జునుని ఆమె కోపంతో నపుంసకునిగా శపిస్తుంది.
ఆ విషయం విన్న ఇంద్రుడు వచ్చి అర్జునుని నిష్ఠను మెచ్చి ఊర్వశి శాపాన్ని
ఒక సంవత్సరానికి పరిమితం చేస్తూ.. అదీ పాండవుల అజ్ఞాత వాస సమయంలో
అర్జునుడు అనుభవించేట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాక అమరావతిలో
అక్కడి గంధర్వాది దేవతల ప్రసాదంగా నాట్యగాన శాస్త్రాలను అనతికాలంలో అభ్యసించి తిరిగి
భూలోకానికి వెళతాడు, అర్జునుడు.
ఒక ఉదాత్త లక్ష్యాన్ని
నిర్ణయించుకున్న సమయంలో ఎంతో నిబ్బరంగా వ్యవహరించ వలసి ఉంటుంది. ప్రజ్ఞాపాటవాలను అసందర్భంగా వినియోగించినా, ప్రలోభాలకు
లోబడి నిష్ఠను, విలువలను విడనాడినా పతనావస్థకు చేరుకుంటారు.
అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, నిరంతర ప్రయత్నానికి,
ఏకాగ్ర చిత్తానికి ప్రతీకగా నిలవగలిగిన వ్యక్తులే భౌతిక ఆధ్యాత్మిక జీవితంలో
ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. అయితే సాధించిన శక్తిసామర్ధ్యాలను
ఎక్కడ వినియోగించాలో, ఎక్కడ వినియోగించ కూడదో స్పష్టంగా తెలియాలి.
అందుకే అర్జునుడు పదునెనిమిది రోజుల యుద్ధంలో.. సైంధవుని తలను అతని తండ్రి
చేతిలో పడవేసే అసాధారణమైన కార్యంలో తప్ప ఏనాడూ పాశుపతాన్ని సాధారణ శత్రు సంహారానికై
వినియోగించలేదు. ఆ నిబద్ధత, నిబ్బరత లేని
అశ్వత్థామాదులు బ్రహ్మశిరోనామకాస్త్రంతో సహా పలు దివ్యాస్త్రాలను అసందర్భంగా వినియోగించడం
కనిపిస్తుంది.
విచక్షణా జ్ఞానంతో
కూడిన అర్హతలే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరిస్తాయి. ప్రగతిని సుగతినీ అనుగ్రహిస్తాయి..
కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment