Friday, August 15, 2025

 

ఆత్మీయ సాహితీ మిత్రవరులకు నమస్సులు..

 

ప్రయత్నశీలతయే విజయం

 

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమా ప్రజ్ఞానిధుల్ గావునన్ !

            అన్నారు ఏనుగు లక్ష్మణ కవి. లక్ష్మణకవి వ్యక్తులను మూడు రకాలుగా గుర్తించారు. విఘ్నాలు కలుగుతాయని ముందే ఊహించి భయంచేత ఆ పనినే చేయరట కొందరు.. కొందరు ఆరంభిస్తారు కాని ఏ విధమైన అడ్డంకులు ఎదురైనా దానిని అక్కడితో ఆపేస్తారట. మరికొందరు మాత్రం ఏ పనిని ఆరంభించినా ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడకుండా ధైర్యంతో, ఉత్సాహంతో చివరకంట లక్ష్యం కోసం శ్రమిస్తారట. వారినే కార్య సాధకులుగా చెపుతారాయన.

            ప్రజ్ఞ అంతర్గత చైతన్యం. అది సుషుప్త్యావస్థలో ఉంటే.. వ్యక్తిలో వికసన ఉండదు. అది జాగృతమైన వేళ అసాధ్యాలు సుసాధ్యమౌతాయి. ప్రజ్ఞ ఏ వ్యక్తిలో ఎంతమేరకు ఉంటుంది. ప్రజ్ఞ అందరిలో సమంగానే ఉంటుంది.. అయితే ఎవరిలో ధైర్యం ఉత్సాహం పాలు ఎక్కువ ఉంటాయో వారు ప్రజ్ఞను ఎక్కువగా ఉపయోగించుకో గలుగుతారు. అందుకే వారిని ప్రజ్ఞానిధులు అంటాడు, లక్ష్మణకవి. అలాంటివారి నిఘంటువులో అసాధ్యమనే పదం ఉండదు.. ప్రయత్నమే వారికి తెలిసిన పదం. ఒక మార్గంలో అపజయం ఎదురైతే మరొక మార్గంలో ప్రయత్నించడం.. చివరగా సాధించడమే వారికి తెలిసిన విద్య.

            సాధారణంగా ఏ పనినైనా ఆరంభించి సాకారం కాకపోతే ఆ కారణాన్ని ఎవరిపైనో నెట్టివేయాలనే భావన చాలామందిలో కనిపిస్తుంది. వ్యక్తులపై నెపాన్ని రుద్దకపోయినా.. కనీసం ప్రారబ్ధకర్మల ఫలితంగా నేను అపజయం పాలయ్యానని చెప్పుకుంటారు. వారికి కార్య సాఫల్యత కన్నా సానుభూతి కావాలి. దానికి ఉపపత్తిగా "భాస్కరా" శతకంలో మారన చెప్పిన "ఎంతగా ఆశపడినా అల్పమతియైన నక్కకు ఏనుగు కుంభస్థలము మీది మాంసము దొరకదుగదా... అదే సింహము అనుకుంటే లభిస్తుంది" అన్న ఉపమానాన్ని ఉదహరిస్తారు.

            పైపైన చూస్తే ఇది ఒకవిధంగా అదృష్టాన్ని ఉన్నతంగా చెప్పడం వల్ల యువత కొద్దిగా నిరాశపడే విధంగా కనిపిస్తుంది. కాని అంతర్లీనంగా మారన చెప్పిన చక్కని సూక్తిని విస్మరిస్తున్నారు చాలామంది.

            జీవిత ప్రయోజనాన్ని గుర్తించకపోవడం, నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడం, పట్టుదల లేమి, అవగాహనా రాహిత్యం, ప్రయత్నహీనత, బలమైన సంకల్పం లేకపోవడం, ఆచరణాత్మక జ్ఞానాన్ని ఆర్జించకపోవడం, క్రియాశీలత లోపించడం, తనలో నిక్షిప్తమైన ప్రజ్ఞాపాటవాలను గుర్తించక పోవడం, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని ఆహ్వానించలేక పోవడం, అన్వయించుకోలేక పోవడం, "మార్పు"కనుగుణంగా మారకపోవడం... ఇవన్నీ వ్యక్తిని నిర్వీర్యతకు, నిష్క్రియాపరతకు గురిచేసే అంశాలే. వీటినే అల్పత్వాలుగా చెప్పుకోవాలి. ఈ స్థితిలో ఏ వ్యక్తికీ పరిణతి రాదు... విజయం సిద్ధించదు. అలాంటి వ్యక్తికి పరులపై ఆధారపడడం, పరులను మోసగించి ఆనాటికి పబ్బం గడుపుకోవడం లక్షణాలుగా... ఏదో విధంగా బ్రతకడం అలవాటుగా మారుతుంది. నక్కకు ఈ లక్షణాలు అన్నీ ఉండడమే కాక... పరులపై ఆధారపడి బ్రతికే బానిస జీవన విధానం లక్షణమైంది.

            అదే సింహం... తనకు తానుగా వేటాడి భుజిస్తుంది, మరొక జంతువుకు భుక్తినిస్తుందే కాని ఎవరో అయాచితంగా ఇచ్చే భోజనానికి ఆశపడదు. నిరంతర ప్రయత్నం దాని లక్షణం. తాను సాధించగలననే నమ్మకం ఉండడం వల్ల దాచుకోవడం.. దోచుకోవడం దానికి లేదు. తన అవసరానికి మించి ఆశపడదు. ఉన్నతమైన లక్ష్యం ఏర్పరుచుకుంటుందే కాని... చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందదు. ఒక విజయాన్ని మరొక విజయానికి ప్రేరణగా స్వీకరిస్తుందే కాని.. అదే అంతిమమని విశ్రాంతిని కోరుకోదు.

            జీవిత ప్రయోజనాన్ని గుర్తించిన యే వ్యక్తియైనా సమున్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటాడు. దానిని సాధించే క్రమంలో  అడ్డంకులు ఎదురైనా దానిని విడిచిపెట్టడు.. అపజయాలలో తాను ప్రేరణను పొందుతాడు.. అనుచరులను, అనుయాయులను భాగస్వాములను చేసుకుంటాడు. వారు నిరుత్సాహపడినా వారికి అవసరమైన ప్రేరణ నిస్తాడు. ఎన్ని కఠినమైన పరీక్షలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై నిలుస్తాడు. తాను ఉదాత్తమైన నాయకత్వ లక్షణాలను సంతరించుకుంటాడు.  ఆ లక్షణాలను ప్రదర్శిస్తాడు. అనుచరులలో నాయకత్వ లక్షణాలను నింపుతూ స్పూర్తినిస్తాడు.. రెండవ స్థాయి నాయకులను తయారుచేస్తాడు. సాధించిన ఫలితాన్ని పంచుకుంటాడు, పెంచుకుంటాడు.. పదుగురి శ్రేయస్సుకై వినియోగిస్తాడు.

            మానవులు ఎప్పుడూ ప్రయత్నశీలురై ఉంటే దైవ సహాయం లభిస్తుంది. భూమిని దున్ని, విత్తనాలు విత్తి, కలుపుతీసి, నీరు పెట్టిన రైతుకు దైవ సహాయం అందుతుందే కాని అంతా భగవంతుడే చూచుకుంటాడని కూర్చుంటే ఫలితం లభించదు. అదృష్టం కృషిచేసిన వాని వెంటనే ఉంటుంది కాని చిత్తశుద్ధితో పనిచేయని వాని వెంట ఉంటుందను కోవడం అవివేకం.. ప్రయత్నశీలత పరివర్తనకు దారిచూపుతుంది.

            రెండు పొటేళ్ళు పోట్లాడుకున్న సమయంలో బలహీనమైనది వెనుకకు తగ్గుతుంది, అంటుంది యోగవాసిష్ఠం. అలాగే మానవ ప్రయత్నం, ప్రారబ్ధకర్మ ఫలితం.. పోట్లాడుకున్న సమయంలో ఏది బలీయమైనదో అదే గెలుస్తుంది. కాబట్టి ప్రారబ్దమంటూ, ప్రయత్నాన్ని విడిచిపెట్టడం అవివేకం.. అప్రశస్తం.

            అర్హత ప్రాతిపదికగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం... ఆవైపు సర్వశక్తియుక్తులను ఒడ్డి ప్రయత్నించడం అవసరం... ఆ ప్రయత్నశీలతయే సింహలక్షణము.. అదే అదృష్టం... ఆ ప్రయత్నశీలతకు దూరమవడమే అల్పత్వం.. నక్క లక్షణం. నక్క అర్హతను పెంచుకోవడం వల్ల సింహసదృశమౌతుంది...

            విఘ్నాలు కలుగుతాయని ఆరంభింపక పోవడానికి కారణం.. అవిద్య లేదా విద్య లేకపోవడం. విద్యనే జ్ఞానం అందాము. అయితే విద్య లేదా జ్ఞానం.. వీటిని నేనిక్కడ తాత్వికంగా చెప్పడంలేదు. లౌకిక వస్తు, విషయ పరివర్తన మూలకారణమే జ్ఞానం... జ్ఞానం, నైపుణ్యం రెండూ కలిగిన వ్యక్తి అహంకారాన్ని వదిలివేస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్యాన్ని సాధిస్తాడు. To do RIGHT THING is Knowledge.... and To do the THINGS RIGHT is SKILL.. Efficiency (ప్రతిభ-- దానినే జ్ఞానం అందాము) is defined as the ability to accomplish something with the least amount of wasted time, money, and effort or competency in performance. Effectiveness (ప్రభావశీలత.. దానినే నైపుణ్యం అందాము) is defined as the degree to which something is successful in producing a desired result; success. పరివర్తన... Transformation... మార్పు... Change..

            అందరికీ నమస్సులతో...

పాలకుర్తి రామమూర్తి

No comments: