Friday, August 15, 2025

 

ఆత్మీయులైన సాహితీ మిత్రులకు నమస్సులు..

 

చంచత్తుంగ తురంగ సత్వరగతి స్ఫారీ భవత్కేతనో

దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతి సాంద్రంబై శరశ్రేణికా

సంచారంబు నితాంత ఘోరముగ నాచార్యున్ వడిన్ దాఁకె న

ప్పాంచాల క్షితిపాల నందనుఁడు శుంభద్వీర్య సంరంభుడై!

(ద్రోణపర్వము - 1-150)

            పాంచాల రాజపుత్రుడైన దృష్టద్యుమ్నుడు ప్రకాశించే వీర్యవంతుడై, అమితమైన సంరంభంతో ద్రోణుడిపై యుద్ధానికి వెళ్ళాడట.. అది ఎలా ఉన్నదో చెపుతున్నారు, తిక్కనగారు. చలిస్తూ ఉన్నటువంటి ఎత్తైన గుర్రముల యొక్క తీవ్రమైన, వేగవంతమైన నడకచేత.. స్ఫారీభవత్.. అధికంగా జనించిన లేదా వేగంగా కదల్చబడిన కేతనము యొక్క.. ఉదంచత్.. గొప్పనైన దీప్తులు లేదా ప్రకాశం అతి సాంద్రంబై  లేదా దట్టమై యొప్పగా.. శరముల శ్రేణి లేదా బాణముల వరస ఎడతెగకుండా వస్తూ ఘోరమైన విధంగా కనిపించగా  దృష్టద్యుమ్నుడు ఆచార్యుడైన ద్రోణుడిని ఎదుర్కొన్నాడు, అంటున్నాడు, తిక్కనగారు.

            వీర రసాన్ని ప్రకాశింప చేస్తున్న ఈ పద్యం తిక్కనగారి భాషా పాండిత్యానికి, కవితా చాతురికీ ఉదాత్తమైన ప్రతీకగా నిలుస్తుంది.

            భీష్ముడు యుద్ధంలో పడిన పిమ్మట కౌరవసైన్యానికి ద్రోణుడిని సర్వసైన్యాధిపతిగా నిర్ణయించాడు, దుర్యోధనుడు. ఆ సందర్భంలో దుర్యోధనునికి ద్రోణుడు ధర్మరాజును పట్టి ఇస్తానని మాట ఇస్తాడు. ఆ ప్రయత్నంలో ద్రోణుడు దివ్యాస్త్రములచేత పాండవ సైన్యంపై చెలరేగి  ఉద్ధతిని చూపడం,  పాండవ సైన్యం అంతా కకావికలై పోవడం గమనించిన ధర్మరాజు దృష్టద్యుమ్నుని, అర్జునుని పిలిచి ద్రోణుడిని ఎదుర్కొనేందుకు నియమిస్తాడు. ఆ సందర్భంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై దండెత్తిన సమయంలో తిక్కనగారు వ్రాసిన పద్యం వారు ప్రదర్శించిన సమున్నత వస్తు కళకూ, భావకళకూ, రచనాకళకూ దర్పణంగా నిలుస్తుంది.

            దృష్టద్యుమ్నుడు అంతటి వీర రసోల్లాస మూర్తియై ద్రోణుడిపై యుద్ధానికి వెళ్ళేందుకు కారణాలు పరిశీలిస్తే..

1. యువకుడై ఉత్సాహంతో ఉండడం

2. తాను ద్రోణుడిని సంహరించేందుకే జన్మించాననే నమ్మకం..

3. తన సోదరి ద్రౌపదికి కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అవరోధంగా కౌరవసైన్యాన్ని కాపాడుతున్న ద్రోణుడిపై కోపం

4. ద్రుపదుని ద్రోణుడు అవమానించిన విధానం తన మనసులో నాటుకు పోవడం

5. ధర్మపరాయణులైన పాండవులను అధర్మంగా జూదంలో ఓడించి రాజ్యాన్ని అపహరించిన కౌరవులను సమర్ధిస్తున్న వారిపై ప్రతీకారేఛ్ఛ

6. తాను పాండవ సైన్యానికి సర్వసైన్యాధిపతిగా తన బలాన్ని కాపాడుకోవలసిన కర్తవ్య పరాయణత

            వీటన్నింటికీ మూలం.. దృపదుడు.. ద్రోణాచార్యుల పుట్టుకలోనే ఉన్నదని భావించవచ్చు. శుక్రాచార్యుల అంశతో జనించిన వాడు.. ద్రోణుడు కాగా వాయువు అంశతో జనించిన వాడు, ద్రుపదుడు. అందుకే వారి వారి ప్రవృత్తులూ వారి జననాన్ని బట్టి వెలుగు చూచాయి. బాల్య స్నేహితుడు, ఆదరిస్తాడనే నమ్మకంతో రెండు ఆవులను యాచించిన ద్రోణుడి నొకనాడు ద్రుపదుడు అవమానించాడు. నిజానికది అమానుషం.. ఒక చక్రవర్తి రెండు ఆవులను చిన్ననాటి స్నేహితునికి ఇవ్వడం... కష్టమా అంటే కాదు.. పోనీ ఇవ్వనని పంపవచ్చు కాని అంతరాలను అడ్డంపెట్టి అవమానించాడు.. ద్రోణుడైనా బ్రాహ్మణునిగా దానిని మరచిపోవచ్చు. కాని శుక్రాచార్యుల అంశ కారణంగా ద్రోణుడా అవమానాన్ని మరవడమే కాదు ప్రతీకారేఛ్ఛతో  రగిలిపోయాడు. శుక్రాచార్యుని రాక్షసాంశ భీభత్సానే కోరింది. అంతశ్చేతనలో ఆసురీ ప్రవృత్తిని జాగృతం చేసింది. అనువుకాని చోట శమించినా భీష్ముని ప్రాపకంలో కౌరవ పాండవులకు గురువుగా అస్త్రవిద్యను నేర్పి గురుదక్షిణగా ద్రుపదుని పట్టి తెమ్మని శిష్యులను నియోగించాడు. పట్టితెచ్చిన ద్రుపదుని చూడగానే "బ్రాహ్మణస్య క్షణం కోపం" అన్న నానుడికి భిన్నంగా శూలాల వంటి మాటలతో ద్రోణుడు ద్రుపదుని అవమానించాడు.. ద్రుపదుడు అనే గాలి సోకగానే ద్రోణుడనే అగ్ని ప్రజ్వరిల్లింది.. ఫలితంగా ద్రుపదుడు కూడా ద్రోణుడిని సంహరించ గలిగిన కుమారుడు కావాలని తపించాడు. అవమాన జనిత క్రోధానల జ్వలితుడైన ద్రుపదుని మనసులో ద్రోణుడిని సాధించాలనే భావన కారణంగా  హవనాగ్ని గుండంలో దృష్టద్యుమ్నుడనే కుమారుడు ఉదయించాడు. దానితో సహజంగానే ద్రుష్టద్యుమ్నునిలో రౌద్రభావన ఉంటుంది. దానికి పైన పేర్కొన్న కారణాలు తోడై వీరరసోత్తుంగ తరంగ మూర్తియై ద్రోణుడిని తాకాడు.

            ఇంకొక కారణమూ కనిపిస్తుంది. తాను సేనానాయకునిగా ఉన్న సమయంలో తన పక్షంలోని నాయకుని ఎదుటి పక్షంలోని వారు పట్టుకుంటే తన పరాక్రమానికి అవమానకరమూ.. తనకు అపకీర్తి. కాబట్టి ఆ ఆటోపాన్ని చూపుతూ ముందుకు సాగాడు, దృష్టద్యుమ్నుడు. అంతేకాదు అది ఇరువురు సేనానాయకులు పరస్పరం తాకే మహత్తర సన్నివేషం. అందుకే అలాంటి పద్యం వెలుగు చూచింది అనుకోవచ్చు.

            ఇక్కడ మరొక విషయాన్నీ గుర్తించాలి.. ఒకవేళ ద్రుపదుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపాన్నిచెంది ద్రోణుడిని క్షమించమని ఉంటే ద్రోణుడిలో అంతటి తీవ్రమైన అవమాన ప్రతీకారేఛ్ఛ ఉండేది కాదేమో కాని.. ద్రుపదునిలో తన పరాభవం క్రోధానికి బీజం వేయడమే ఇంతటి యుద్ధానికి కారణమయిందని భావించవచ్చు.

            ఇన్ని భావాలను చూపేందుకే తిక్కనగారు సమాసఘటితమైన పద్యాన్ని రచించారు. ముఖ్యంగా "పాంచాల క్షితి పాల నందనుడు" అనడం వల్ల పూర్వ కథ అంతా సూచన ప్రాయంగా స్పురించడం లక్ష్యంగా పై భావాలనన్నింటినీ పలికించాడని భావించాలి.

            ద్రోణుడిలో ఇంతటి భయంకరమైన ఆసురీభావనలు ఉన్నా.. సౌజన్యానికీ కొదువలేదు. తనకు మారకునిగా జన్మించిన దృష్టద్యుమ్నునికి అస్త్రవిద్యను నేర్పినదీ ద్రోణుడే కావడం విశేషం.

పాలకుర్తి రామమూర్తి

 

 

ఆత్మీయులకు నమస్సులు

 

            ద్రోణుడు మూడవనాటి యుద్ధంలో పద్మవ్యూహాన్ని పన్నాడు. పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికేగి ఆపదలు క్రమ్ముకున్న వేళ దానినుండి బయటకు వచ్చే విధానం తెలిసింది పాండవ సైన్యంలో కృష్ణార్జునులకు మాత్రమే. లోనికి వెళ్ళడమే కాని ఆపదలు చుట్టుముట్టిన వేళ బయటకు రావడం తెలియని వాడు అభిమన్యుడు. అర్జునుడు లేని సమయంలో ధర్మరాజును పట్టుకునే వ్యూహంతో ద్రోణుడు ముందుగా సంశప్తకులను ప్రేరేపించి అర్జునుని యుద్ధభూమికి దూరంగా తొలగచేసాడు. దానితో పాండవులు ముఖ్యంగా ధర్మరాజు, అయితే యుద్ధభూమి నుండి తొలగిపోవాలి లేదా అందులో చిక్కుపడాలి. ఆ సమయంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కాని బయటకు వచ్చే విధానం తెలియని అభిమన్యుడు  సాహసించి అందులో ప్రవేశించాడు.. అతని వెంటే పాండవ సైన్యమూ ప్రవేశించడం పాండవుల వ్యూహం కాని పాండవులు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం సైంధవుడు అడ్డుపడడంతో నెరవేరలేదు.. కారణం ఏమిటి?

            పద్మవ్యూహమే విచిత్రమైనది. ఎప్పటి కప్పుడు అది మూసుకుపోతూ ఉంటుంది. దానిలోనికి ప్రవేశించేందుకు కాని ఆపదలు చుట్టుముట్టిన సమయంలో వెలుపలికి రావడానికి కానీ పరిమిత ద్వారాలే ఉంటాయి. దానిని సమగ్రంగా తెలియకుండా లోనికి వెళ్లడం ప్రమాదకరమే. అయినా ఓడారనే అపకీర్తికన్నా ప్రయత్నించి అందులో విఫలం కావడమే ఉన్నతమనే భావనతో అభిమన్యుడు దానిని చించి లోనికి వెళ్ళాడు. అయితే అతను లోనికి వెళ్ళగానే ప్రణాళ్లిక ప్రకారం అది తిరిగి మూసుకు పోయింది. అందులోకి వెళ్ళాలంటే పాండవులకు దానిని భేదించే నైపుణ్యం లేదు దానికి తోడుగా సైంధవునికి శివుడు ఇచ్చిన వరమూ ఉపకరించింది. లోపల అభిమన్యుడు ఎంతటి నష్టాన్ని కలిగించినా ద్రోణుడు బయటి నుండి అభిమన్యునికి సహాయం అందకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సైన్య నష్టం జరిగినా పాండవులు అభిమన్యుని లాంటి యోధుని కోల్పోవక తప్పలేదు.

            అభిమన్యుని పరాక్రమం వల్ల తన ముఖ్య యోధులను కాపాడుకోవడంలోనే ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం వచ్చిన ద్రోణుడికి ధర్మరాజును పట్టుకునే అవకాశం చిక్కలేదు. తిరిగిపోలేని పరిస్థితి తెలిసిన అభిమన్యుడూ తనకు వీలైనంత మందిని సంహరించి వీరస్వర్గాన్ని అలంకరించక తప్పలేదు.

            దీని వల్ల మనమేం నేర్చుకోగలం?

1. ఏ పని చేయాలన్నా సరైన వ్యూహాన్ని లొసగులు లేకుండా రచించుకోవడం, దానిని పటిష్టంగా అమలు పరచడం అవసరం

2. ఎవరు ఏ పనికి సమర్ధులో గుర్తించి వారికి అర్హత ప్రాతిపదికగా ఆయా పనులను అప్పగించడం

3. తన సాహసం ప్రాణాంతకమని తెలిసినా చివరవరకూ పోరాడి ప్రయత్నించడం. అందులో ప్రాణాలు పోయినా ఎదుటివారికి ఎక్కువ నష్టం కలిగించడం

4. ఓడిపోకుండా ఉండేందుకు కాదు గెలిచేందుకు పోరాడాలనే దృఢమైన సంకల్పాన్ని కలిగియుండడం

5. ఎంత పటిష్టమైన వ్యూహాన్ని రచించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని దానిని పటిష్టంగా అమలు చేసినా అపజయం ఎదురుకావచ్చు.. అయినా దానిని ఉద్యమ స్పూర్తితో ఆస్వాదించాలే కాని వెనుదిరిగి చూచుకొని బాధపడడం అసమంజసం.. అవివేకము

6. ప్రాధాన్యతా క్రమాన్ని ఎప్పటికప్పుడు అవసరానుగుణంగా మార్చుకోవడం అవసరం.. ద్రోణుని ప్రాధాన్యత ధర్మరాజును పట్టుకోవడం.. కాని అది అభిమన్యుని వధగా మార్పుచెందింది

7. యుద్ధం ఆరంభం వరకే ధర్మాధర్మాల చర్చ.. ఒకసారి ఆరంభమయ్యాక అది గెలుపే పరమావధిగా సాగుతుంది

8. దేని కోసం దేనిని వదులుకోవాలో తెలియడమే విజ్ఞత

పాలకుర్తి రామమూర్తి

 

 

No comments: