Friday, August 15, 2025

 

ఘనతర శోక వేగమునఁ గన్నుల నీళలు నించి, యా సుయో

ధను నవినీతియున్ బిదప ధర్మ తనూజుఁడు సంధి గోరి ప

ల్కిన తగవుం గడంగి యనికిం దలకొన్న నిజోద్యమంబుఁ దోఁ

చిన విధిఁ దిట్టుచున్ వినుతి సేయుచు రోయుచు నుండె నయ్యెడన్!

(మహాభారతం - భీష్మపర్వం - తిక్కన - 3- 156)

 

            అర్జునుని కుమారుడు ఇరావంతుని అలంబసుడు అనే రాక్షసుడు కురుక్షేత్రంలో చంపివేస్తాడు. ఆ విషయాన్ని భీముడు అర్జునునికి చెప్పగా విన్న అర్జునుడు.. పుత్రశోకం భావావేశం పెల్లుబ్బగా.. అధికమైన దుఃఖంతో కన్నుల నీరు ఒలకగా.. ముందుగా దుర్యోధనుడు చేసిన అవినీతిని, అన్యాయాన్ని, తదుపరి ధర్మరాజు ఉదారంగా అయిదూళ్ళిచ్చినా సంధి జరుగుతుందని చెప్పి యుద్ధాన్ని నివారించడానికి చ్సిన ప్రయత్నాన్ని, ఆ పిదప తగుదునమ్మా అని అసహ్యకరమైన యుద్ధానికి సన్నద్ధమైన తన ఉద్యమాన్ని వరసగా జ్ఞాపకం చేసుకొని విధిని తిట్టాడు, ధర్మరాజు న్యాయాన్ని, ధర్మాన్ని ప్రశంసించాడు.. ఆపై తన మూలంగా ఇరు పక్షాలలో జరిగిన మారణకాండను తలచుకొని తనను తాను ఏవగించుకున్నాడు..

            కుమారుడు మరణించాడనగానే.. యుద్ధంలో వీరమరణం సహజమే అయినా పుత్రప్రేమ వల్ల ఘనమైన శోకం కలగడం సహజం.. కలిగింది. భావోద్వేగంతో కన్నులలో నీళ్ళు తిరిగాయి. కారణం ఏమిటి.. ఆలోచన మొదలయింది. యుద్దం విశాలమయింది. ఎవరు ఎవరిని రక్షించాలన్నా అవకాశం కలగవచ్చు.. కలగక పోవచ్చు. తనకు ముందు తెలిస్తే కాపాడుకునే అవకాశం ఉండేది.. భీమాదులకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో.. క్రమాలంకారంలో చెప్పిన పద్యంలో మానవ మానసిక వైచిత్రాన్ని... వివిధ సందర్భాలలో వ్యక్తులు స్పందించే భావోద్వేగాల పరిణామాలను ప్రకటించాడు, తిక్కనగారు. ఈ పద్యంలో తిక్కన ధిషణా దీప్తిని గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

            ఈ మహా యుద్ధానికి మూల కారణం దుర్యోధనుని దురాశ, ఈర్ష్యాసూయలు, అధికార దాహం, పాండవులపై అకారణ ద్వేషం. ఎన్నో అవమానాలకు గురిచేశాడు.. చంపాలని మాయోపాయాలు చేశాడు.. పాండవ పత్నిని నిండు సభలో పెద్దలు పిన్నలు చూస్తుండగా అవమానించాడు. ఘోషయాత్రలోనూ, ఉత్తర గోగ్రహణంలోనూ తన కుటిలత్వాన్ని చాటుకున్నాడు. న్యాయంగా రావలసిన రాజ్య భాగాన్ని అడిగితే సంజయుని చేత మీకు రాజ్యభాగాన్ని ఇవ్వము.. అడవులలో భిక్షాటన చేయండని చెప్పి పంపాడు.. ఇన్ని అవమానాలే కాక 18 అక్షోహిణుల సైన్యం యుద్ధావనిలో పోరాడేందుకు కారణమయ్యాడు.. ఈ విచక్షణారహిత దుర్నీతిని ప్రదర్శించిన దుర్యోధనుడే ఇంత మంది మరణాలకు కారణమని దుర్యోధనుని పట్ల అసహ్యభావాన్ని చూపాడు..

            యుద్ధం అనర్ధానికి హేతువనే సత్యాన్ని తెలుసుకున్న వాడు కాబట్టే ఆది నుండీ సంధి ప్రయత్నాలతో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తూ.. తమ ఆవేశ కావేశాలను అణిచి వేస్తున్న ధర్మరాజును తామంతా తప్పుగా అర్థంచేసుకున్నారు. అది అతని చేతకాని తనమని, క్షాత్రధర్మం కాదని భావించారు. కాని మానవతా మూర్తియై శాంతితో, అహింసతో కార్యాన్ని సాధించాలని భావించిన ధర్మజుని ప్రయత్నం నెరవేరితే పెద్దలు, పిన్నలు అంతా సురక్షితంగా ఉండేవారు కదా.. అంటూ ధర్మరాజు సంధి వచనాలను, ఆతని వైఖరినీ ప్రశంసించాడు..

            యుద్ధారంభంలో.. తాను ఇరుపక్షాలలో ఉన్న తనవారిని సంహరించి "తినజాలను నెత్తుటి కూడు మాధవా" అంటూ విశాదాన్ని పొందిన సందర్భాన్ని, దానికి కృష్ణ పరమాత్మ బోధించిన గీతా రహస్యాన్ని అవగాహన చేసుకొని యుద్ధానికి సన్నద్ధమైన వైఖరినీ... తత్ఫలితంగా సంభవిస్తున్న మారణకాండనూ చూస్తూ.. తనపై తనకే ఏహ్యభావన కలుగగా బాధపడ్డాడు.

            తిక్కన గారు మూడు భావాలను సమర్ధవంతంగా ఒక్క పద్యంలో ఇమిడ్చి.. రసపోషణ చేసాడు. మానవ మానసిక స్థితులను విశ్లేషణ పూర్వకంగా అవగతం చేశాడు.

            ఆయుధం యుద్ధాన్నే కోరుతుంది. యుద్ధం ఎప్పుడూ.. మారణకాండనే సృష్టిస్తుంది. దానికి తన పర భేదం ఉండదు. పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. పగలు ప్రతీకారాల వల్ల మానవ హననమే జరుగుతుంది. ఆ సత్యం ఆనాటి నుండి నేటివరకూ పాలకులకు అవగతమౌతున్నా ఎవరూ తమ అహంకార మమకారాలకు దూరంగా జరగడంలేదు. అధికార దర్పం ప్రదర్శించే అహంభావం తోటివారిని నీచభావనతోచూస్తుంది. వికాసం చెంద వలసిన శాస్త్రసాంకేతిక ప్రగతి, పరిణతి.. మానవ మారణ హవనానికి ఋత్విజులను పంపుతున్నది. చాలా కాలం క్రితం జరిపిన ఒక సర్వే అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30000 మందికి పైగా శాస్త్రజ్ఞులు అత్యంత అధునాతన మారణాయుధాలను సృష్టించే ప్రయత్నంలో రోజులు 15 నుండి 18 గంటల పాటు శ్రమిస్తున్నారట. శాస్త్రజ్ఞులు మహర్షుల స్థాయి సాధిస్తే.. వారి పరిశోధనలను ఎక్కడ ఆపాలో తెలుసుకోగలుగుతారు.

            నిజానికి యుద్ధరంగంలో అడుగు పెట్టాక ఎవరు ప్రాణాలతో బయటపడతారు.. ఎవరు శారీరకంగా వైకల్యం పొందుతారు.. ఎవరు మరణిస్తారు.. అనేది నిర్ధారించడం అసాధ్యం. గొప్ప వీరుడూ మరణించవచ్చు.. సాధారణ సైనికులు బ్రకతనూ వచ్చు. జయాపజయాలనూ ముందుగా నిర్ధారించడమే సాధ్యపడదు. ఎవరికోసం యుద్ధం చేస్తున్నారో ఆ నాయకుడే మరణిస్తే..  విజయం అంది వచ్చినా ఉపయోగం ఏమిటి? ఒకవేళ విజయం లభించినా .. కుమారులు, సోదరులూ, అయిన వారు అందరూ మరణించాక ఆ విజయాన్ని ఎవరు ఆహ్వానించాలి, ఆమోదించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి? విశాదాన్ని మిగిల్చే యుద్ధం వల్ల ప్రయోజనం ఏమిటి? రాజ్యాన్ని సాధించినా అది నిరర్ధక విజయమైతే ప్రయోజనమేమిటి? మరణించిన వారి త్యాగానికి చెల్లించే మూల్యమెంత?

            ఆయుధ వ్యాపారంతో ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలనుకునే అగ్రరాజ్యాలుగా తమను తాము భావిస్తున్న దేశాధినేతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దేనికోసం దేనిని వదులుకోవాలో తెలియని అహంకార మదాంధుల వల్ల జరిగే నష్టానికి బాధ్యత వహించేది ఎవరు?

             బెంజ్ కారు లాంటిది.. భారతదేశం.. చెత్తను తీసుకుపోయే ట్రక్కులాంటిది పాకిస్థాన్.. ట్రక్కు కారును ఢీకొడితే.. ట్రక్కుకు వచ్చే నష్టం ఏమీలేదు అన్నాడు, పాకిస్థాన్ సైనిక ఫీల్డ్ మార్షల్.. ఆసిమ్ మునీర్. దుర్యోధనుడు.. ఆసిమ్ మునీర్ లాంటి వాడే.. వాని అవినీతిని సైరించడమూ భావ్యం కాదు.. అలాగని ఎదిరించి పోట్లాడితే వానికి పోయేది ఏమీలేదు. వైఖరి, ప్రవర్తన, ప్రయత్నం, ప్రతిచర్యలు.. ఇవన్నీ ధర్మస్థాపనకు అనుకూలంగా లేనినాడు.. పొందిన విజయమూ నిష్ప్రయోజనమౌతుంది.

            ఇలా ఆలోచించిన కొద్దీ యుద్ధం వల్ల కలిగే కష్టనష్టాలు అవగతమౌతాయి.. అయితే అధర్మం జరుగుతున్న సమయంలో.. బలహీనులు పీడనకు గురౌతున్న సమయంలో.. అరాచకం రాజ్యమేలుతున్న సమయంలో సమర్ధుడైన వాడు ఉపేక్షించడమూ సమంజసమూ కాదు. ప్రతి ఫలితమూ త్యాగాన్ని కోరుతుంది..

            ఇక్కడ కూడా అర్జునుని విశాదాన్ని చూచి కృష్ణ పరమాత్మ చిన్నగా నవ్వాడట.. ఆ నవ్వులోని ఆంతర్యాన్ని గ్రహించిన అర్జునుడు.. శోకభావనను విడిచిపెట్టి కర్తవ్యోన్ముఖుడయ్యాడు.

పాలకుర్తి రామమూర్తి

No comments: