Sunday, August 17, 2025

 సంఘర్షణలో సానుకూలత ఆదరణీయం..


యః సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం

నభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా!

(భగవద్గీత - 2-57)

దేనియందూ మమతాసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు సంతోషము, ప్రతికూల పరిస్థితుల యందు దుఃఖములాంటి వికారములకు లోనుగాని వాడే స్థితప్రజ్ఞుడు అంటున్నాడు, కృష్ణపరమాత్మ. జీవిత గమనంలో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకోగలిగే శక్తిసామర్ధ్యాలు, సమస్యలను అధిగమించే బుద్ధి సంపద, దేనికోసం దేనిని ఆదరించాలనే విచక్షణతో కూడిన స్వేఛ్చ.. స్థిత ప్రజ్ఞునిలో సహజ లక్షణాలుగా ప్రకాశిస్తాయి.

సృష్టిలో ద్వంద్వాలు సహజాలు. అలాగే ఒక పనిని చేస్తున్నప్పుడు లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతాయి. శుభమైనా అశుభమైనా.. మంచైనా చెడైనా అవి మనస్సులో వెలుగు చూచే అభిప్రాయాలే కాని బాహ్య సన్నివేశాలు కావు. పుస్తకంలో వర్ణించిన నవరస భరిత సన్నివేశా లెలాగైతే పుస్తకానికి అంటుకుపోవో అలాగే శుభాశుభములు స్థితప్రజ్ఞునికి అంటుకుపోవు. ఒకరంగు పాత్రలో పోసిన నీరు మరొకరంగు పాత్రలో పోసిన నీటికి భిన్నంగా కనిపించినా రెంటిలో ఉన్నది ఒకేనీరనే భావన స్థితప్రజ్ఞుడు పొందగలుగుతాడు.

రెండూ భిన్నమనే భావనయే సంఘర్షణకు దారితీస్తుంది. అలాంటి సంఘర్షణలో కూడా సానుకూలతను అన్వేషించడమే స్థితప్రజ్ఞత. యుద్ధవిద్యలో ఎదుటి వ్యక్తి దాడి చేసిన సమయంలో ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవరచుకోవాలని నిపుణులు చెపుతారు. ప్రశాంత స్థితిని పొందిన మనసును యదేఛ్చగా వదిలివేస్తే .. అది పరిష్కారం దిశగా సాగుతుంది. ప్రశాంతత జీవన కేంద్రమై, ఆలోచన ఉత్తేజితమౌతుంది. కర్తవ్యం బోధపడుతుంది. ఎక్కువలో ఎక్కువగా ఏమవుతుంది?  ఎదుటి వ్యక్తి బలవంతుడైతే మనలను చంపేయవచ్చు. పెనుగులాడినా అదెలాగూ జరుగుతుంది. ప్రశాంతతను ఆదరిస్తే.. ప్రమాదం నుండి బయటపడే పరిష్కారం స్పురించవచ్చు. ప్రశాంతమైన మనసును దేనిపై లగ్నం చేస్తే దానినే సాకారం చేస్తుందది. మనసును వదిలివేస్తే అది పసిపాపలా అన్నింటినీ అద్భుతాలుగా భావిస్తుంది.. ఆస్వాదిస్తుంది. పసిపిల్లల మనసులో భేదభావనలు నిలువవు.. గతం పట్ల విచారం కాని భవిష్యత్తు పట్ల ఆందోళనకాని ఉండవు.. వర్తమానాన్ని అస్వాదిస్తారు.. ఆనందిస్తారు. సగటున పసిపిల్లలు రోజుకు మూడు వందల మార్లు నవ్వుతారని చెపుతారు.

ప్రశాంతమైన మనసుతో సముద్ర తరంగాలపై విహరించే వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. తరంగాలు పైకి లేపిన వేళ పూర్తి స్పృహతో తెలివితో దానికి అనుకూలంగా స్పందిస్తాడు.. పడిపోయినా "ఎఱుక"తో పడిపోతాడు.. పడిలేవడాన్ని సమచిత్తంతో ఆహ్వానిస్తాడు..  ఆనందిస్తాడు.. అద్భుతంగా భావిస్తాడు.. ఆస్వాదిస్తాడు. ఇక్కడ "పడడం" అనేది సమస్యగా భావిస్తే.. జయాపజయాలకు అతుక్కుపోతాడు.. దానితో ఒత్తిడి పెరుగుతుంది.. నిరాశానిస్పృహలు పెరిగిపోయి.. మనసును సంఘర్షణకు గురిచేస్తాయి. అలాకాక వాటిని సహజంగా భావిస్తే స్థితప్రజ్ఞతను ప్రదర్శిస్తాడు. సమస్య నుండి పారిపోవడం కాక దానిని ఎలా ఎదిరించాలో ఆలోచిస్తూ.. సానుకూలతను ఆదరిస్తే సంఘర్షణను అధిగమించడం సాధ్యపడుతుందని కృష్ణపరమాత్మ బోధిస్తున్నాడు.

దానిని సాధించడం ఎలా? ప్రశాంతమైన మనసుతో.. సమస్య పట్ల అవగాహనను పెందుకుంటే.. అంతర్మనస్సు పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. కాని చాలా మంది పరిష్కారంలో భాగంగా కాక సమస్యలో భాగమౌతుంటారు. అదే సంఘర్షణను పెంచుతుంది. రెండావులను అడిగి ద్రుపదునితో అవమానింపబడిన ద్రోణుడిలోని సంఘర్షణ ద్రుపదునిపై ప్రతీకారానికి ప్రేరణనిచ్చింది. తద్వారా ద్రుపదునిలో వెలుగుచూచిన సంఘర్షణ ద్రోణవధ లక్ష్యంగా దృష్టద్యుమ్నునికి జన్మనిచ్చింది. అస్త్రవిద్యా ప్రదర్శనలో అవమానింపబడిన కర్ణుడు, అర్జునునిపై పెంచుకున్న మాత్సర్యం అతడిని జీవితాంతమూ సంఘర్షణకు లోనుచేసింది. కర్ణుని పరాక్రమాన్ని తలుచుకొని ధర్మరాజూ సంఘర్షణకు లోనయ్యాడు.. దానికి ప్రతిగా వారు సానుకూల వైఖరితో ఆలోచించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.

పాలకుర్తి రామమూర్తి

No comments: