Friday, August 15, 2025

 అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద;

 

అమ్మకు మ్రొక్కెదన్, పలుకు లమ్మకు మ్రొక్కెద; ఐదు నాల్గు మా

సమ్ములు మోసి గర్భమున, జన్మము నిచ్చి, ప్రసన్న మూర్తియై

రమ్మని జేర బిల్చుచు, శిరమ్ము నురమ్మున జేర్చి, స్పర్ష సౌ

ఖ్యమ్ముల దేర్చి, నిల్పి యొడి( నగ్గలమౌ యనుకంప నిండు చి

త్తమ్మున ముద్దు జేసి; అమృతత్త్వము ప్రేమయు క్షీర ధారలై

పమ్మగ స్తన్యమిచ్చి, మృదుభావ సుశబ్ద పరీమళమ్ము ప

ద్యమ్ముల పాటలన్ కథల నార్ద్ర వచస్సుల సౌరు జూప, శ్రా

వ్యమ్ముగ జోలబాడుచు; నిహమ్ము పరమ్మును జూపు విద్యలన్

గొమ్మని సుస్వరావళిని గూర్చి, తదీయ వికాస శోభ, పూ

ర్ణమ్ముగ పల్లవింపగ, సనాతన జీవన వైఖరుల్ సమా

జమ్మును వ్యక్తి బాధ్యతల సారము నా హృదయాంతరమ్ములం

దిమ్ముగ నిండ; నొజ్జయయి యెంతయు ప్రేమను బోధ జేయు మా

యమ్మకు మ్రొక్కెదన్; సతత మాత్మను జ్యోతిగ వెల్గునట్టి మా

యమ్మ; నవ ప్రఫుల్ల దరహాస మయూఖ వికాస మాలికా

సమ్మిళితాస్య దీప్తి, మనసా వచసా కరుణార్ద్ర పూర్ణ నే

త్రమ్ముల జాలువారెడు నిరంతర వత్సలతా ప్రవృత్తి, చే

తమ్మున నిత్య సత్య నిరత క్రమ  ధర్మ పథాను రక్తి, వా

క్యమ్ముల సంస్కృతీ రుచి సమాశ్రిత భావ సుధామయోక్తి, యా

యమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ పా

దమ్ముల భక్తి నిష్ఠల సతమ్మును గొల్చెడి చిత్త వృత్తి, శా

స్త్రమ్ముల సార మన్వయము సల్పి హితమ్ముగ జాతి అజ్ఞతాం

ధ్యమ్మును బాపు జ్ఞాన రతి, తాత్త్విక చింతన లేకమై ప్రపం

చమ్మున శాంతి దాంతి పృధు సారము నింపగ నుద్యమించు మా

యమ్మ పవిత్ర పాదముల కర్మిలి మ్రొక్కెద; పాలకుర్తి వం

శమ్మున విజ్ఞతామతి, ప్రశాంతు డుదీర్ణ మనస్వియున్, సుగీ

తమ్ముల సర్వమంగళ యుదాత్త పదాబ్జ సమర్చనారతుం

డమ్మహనీయ భావనలహర్నిశలంచిత భక్తి తత్త్వ రా

జ్యమ్ము పదమ్ము జూపగ నహమ్ము నిహమ్మును మాని నిష్ఠ ని

త్యమ్మును తచ్ఛరిత్రములు ధ్యానము చేయుచు తన్మయుండునౌ

యమ్ముని సన్నిభుండు చరితార్ధుడు నౌ నరసింహరాము చి

త్తమ్ము వికాస దీప్తిగను తాత్త్విక చేతన శక్తి యౌచు భ

ద్రమ్ముగ వంశ గౌరవము రాజిల జేసిన తల్లి మా సుభ

ద్రమ్మకు మ్రొక్కెదన్; స్వర సుధా మధు వాహిను లార్ణవంబులై

నెమ్మది పొంగగా; సతత నిశ్చల నిర్మల మూర్తి యైన దు

ర్గమ్మ సభన్ మహాజనుల ప్రక్క సమంచిత పీఠి నాత్మ తే

జమ్మును ధీ విలాసము లజేయములై రహి మించ శ్లాఘనీ

యమ్ములు సారవంతములు నైన పదమ్ముల ముచ్చటించు మా

యమ్మ సుభద్ర పాదయుగ మాత్మను నిల్పి నమస్కరించెదన్!

పాలకుర్తి రామమూర్తి

No comments: