Sunday, July 10, 2016

శ్రీ అబ్దుల్ కలాం గారి ఆత్మ శాంతికై నివేదించే అక్షరాంజలి
పల్లెలో కడు పేద వారింట జన్మించి
సర్కారు బడిలోన చదువు నేర్చి
జ్ఞానార్తి శ్రమియించి శాస్త్ర సాంకేతిక
ప్రకటితాంశమ్ముల పార మరసి
ద్యోమార్గ విహరణోద్యోగమ్ము నాశించి
తద్జ్ఞాన సంపత్తి ద్రచ్చి బొంది
అన్వేషణా తప్త మై ప్రజ్వరిల్లెడి
ఆత్మ సంవేదన నార్పుకొనగ
శోధనా రంగ జిజ్ఞాస చూప దారి
నిరత సాధనా నిష్టల నియమ గతుల
అంత రిక్షాన భరతోర్వి యశము నిలిపి
తల్లి ఋణమును దీర్చిన ధన్య జీవి!
పేపర్లమ్మిన వాడె రాష్ట్రపతిగా వెల్గొందె; తృష్ణాత్త సం
తాపోద్వేగ విశీర్ణ దేశ జననీ దాహార్తి మాన్చెన్; సుధీ
రూపంబై యువశక్తికిన్ నడచు దారుల్ జూపె; నుద్ధారణో
ద్దీపంబయ్యె విలక్షణాక్షర లసద్విజ్ఞాన సంవ్యాప్తికిన్!
అమలిన శేముషీవిభవ మార్జవ మార్తియు దూరదృష్టియున్
సమరస భావనా బలిమి, సంస్కృతి సారము నౌదలించుటన్
సముచిత యోజనా పటిమ సంభృత నిర్వహణోద్యమ క్రియల్
అమిత వికాసనా రతి సమాదరణమ్మును లక్షణమ్ములై!
నెమ్మది నిండ; పట్టుదల నిశ్చయ బుద్ధియు సత్య దీక్ష భా
వమ్మున బొంగ; దక్షత విభాసిల; ఏమరుపాటు లేక లే
శమ్మును కార్య లగ్నమయి స్వాంతము వెల్గగ; కార్య రూపు ని
త్యమ్మును తోటి వారలకు దర్శన జేయుచు; సాగు యోగియై!
శాస్త్ర సాంకేతిక స్వాధిష్ట చిత్తులై
యువత సామర్ధ్యమ్ము యుర్వి వెలుగ
సామాజికార్ధిక సమతను సాధించి
క్రాంత దర్శనులౌచు కదల యువత
ప్రతిభాఢ్యులై ద్రచ్చ వరలు విజ్ఞానమ్ము
జాజ్వల్య మానమై సాగ జగతి
వ్యవసాయమును విద్య వైద్యమ్ము శాస్త్రమ్ము
లాది రంగాలలో ప్రోది యైన
ఫలము లర్ధి జనాళి ముంగిలికి జేర్చ
జాగృతము సేయ శాస్త్రజ్ఞ సమితి నెల్ల
నిత్య వైతాళికుండయి నిర్మలాత్ము
డలుపు నెరుగని శ్రమజీవి అస్తమించె!
మతమేదైనను మానవత్వమె మహిన్ మాన్యమ్ము; జ్ఞానమ్ము ని
త్య తపోలబ్ధము; యూహ హేతువులు మేధస్సున్ మధించంగ సా
ధిత శాస్త్రమ్ము సుధార్ణవంబయి జనార్తిన్ బాపు; సంశోధనా
రతియున్ సాధన బోధనాదులలరారన్ గల్గు సంక్షేమముల్!
అనుచహరహమ్ము యువతలో అణిగి యున్న
ప్రతిభ వెలిదీసి దేశ సౌభాగ్య దీప్తి
పెంపు సేయంగ తపియించు విమల యోగి
భాస్కరుని జేరె, విజ్ఞాన భాస్కరునిగ!
అట్టి జ్ఞానార్కు డబ్దుల్ కలాము నాత్మ
శాంతి దాంతుల సుస్థితి సార మాని
సకల మంగళ శుభమూర్తి శాశ్వతుండు
నౌపరాత్పరుసన్నిధి నలరు గాక !
పాలకుర్తి రామమూర్తి

No comments: