సత్కవి వాణి మనకెలాంటి సందేశాన్నిస్తుందో ఒక పద్యంద్వారా పరిశీలిద్దాం
పోరుగడ్డ యైన ఓరుగల్లులో జన్మించి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో స్థిరపడిన గొప్ప కవి... కవియే కాదు అతడొక సత్కవి... వారే కీ.శే. శ్రీ వానమామలై వరదాచార్యులు గారు. వారి పోతన చరిత్రలో నుండి ఒక పద్యం ఎలా సర్వ కాలీనమూ సర్వజనీనమైన ప్రబోధ చేస్తుందో చూద్దాం.
ధర నుపాధ్యాయుడెదొ యొక్క తరుణ మందు
భ్రాంత పరిమిత జనులకు పాఠమిడును
గాని సత్కవి వాణి శిక్షణ మొసంగు
సకల కాలమ్ము లందు విశ్వ ప్రజలకు! (ద్వితీయాశ్వాసము -129 వ పద్యం)
భ్రాంత పరిమిత జనులకు పాఠమిడును
గాని సత్కవి వాణి శిక్షణ మొసంగు
సకల కాలమ్ము లందు విశ్వ ప్రజలకు! (ద్వితీయాశ్వాసము -129 వ పద్యం)
అంటారు కీ. శే. శ్రీ వానమామలై వరదాచార్యులు గారు తన పోతన చరిత్ర గ్రంథంలో.
ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుడు ఏదో సమయంలో విభ్రాంతులైన పరిమిత సంఖ్యలో ఉండే ప్రజానీకానికి పాఠం చెపుతాడు కాని ఒక సత్కవి తన వాక్కు ద్వారా అన్ని కాలాలలో విశ్వంలోని ప్రజలందరికీ శిక్షణ నిస్తాడు, అంటారాయన. ఇది ఆయన పద్యానికి బాహ్యాంగా చెప్పుకునే పరిమితమైన అర్థం. కాని లోతుగా చూస్తే వారు వాడిన భాషలో వారి ఆలోచనా విధానం ప్రస్ఫుటమౌతుంది.
ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుడు ఏదో సమయంలో విభ్రాంతులైన పరిమిత సంఖ్యలో ఉండే ప్రజానీకానికి పాఠం చెపుతాడు కాని ఒక సత్కవి తన వాక్కు ద్వారా అన్ని కాలాలలో విశ్వంలోని ప్రజలందరికీ శిక్షణ నిస్తాడు, అంటారాయన. ఇది ఆయన పద్యానికి బాహ్యాంగా చెప్పుకునే పరిమితమైన అర్థం. కాని లోతుగా చూస్తే వారు వాడిన భాషలో వారి ఆలోచనా విధానం ప్రస్ఫుటమౌతుంది.
మొదటగా "ఉపాధ్యాయుడు" అన్నారు. ఉపాధ్యాయుడు పాఠం చెపుతాడంటాడు. అవును, ఉపాధ్యాయుడు పాఠం చెప్పడంతో సరిపెడతాడు. కాని ఆచార్యుడు సంస్కృతిని పరంపరగా భావి తరాలకు అందిస్తూ వస్తాడు. మరి గురువు శిష్యునిలోని అజ్ఞానం అనే తమస్సును (చీకటిని) తొలగిస్తూ ఆత్మ తత్త్వాన్ని (తనను తాను) తెలుసుకునే ప్రక్రియలో మార్గ దర్శన చేస్తూ తగిన ఉత్ప్రేరకంగా పనిచేస్తాడు.
అంతేకాదు, సాధారణ ఉపాధ్యాయుడు పాఠం చెపుతాడు. మంచి ఉపాధ్యాయుడు విషయాన్ని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రామాణికంగా చూపిస్తాడు... కాని అత్యుత్తమ ఉపాధ్యాయుడు విద్యార్థి తనంత తానుగా విషయాన్ని నేర్చుకునేందుకు సహకరిస్తాడు, తగిన ప్రేరణ నిస్తాడు. అంతేకాదు ఈ పాఠం చెప్పడమనే ప్రక్రియా ఉపాధ్యాయునికీ విద్యార్థికీ మధ్య నిరంతరం జరిగేదీ కాదు... ఏదో ఒక్క సమయంలో మాత్రమే జరుగుతుంది. అంతేకాదు, విద్యార్థి భ్రాంతిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఒకసారి ఆ భ్రాంతిని వీడితే విద్యార్థికి ఆ పాఠం అవసరం లేదు ఎందుకంటే అతను నేర్చుకునే విధానాన్ని తెలుసుకొని నేర్చుకుంటాడు, కాబట్టి.
ఇక "కాని, సత్కవి వాణి" అంటాడు. సత్కవి అనడంలో మంచి కవి అనే అర్థంతో సరిపెట్టుకోకూడదు. నిజానికి భావాన్ని ఇతరులతో పంచుకోగలిగే ఏ ప్రాణియైనా "కవి"యే. మరి సత్కవి... అంటే ఏ కవి వాణి లేదా వాక్కు అయితే పాఠకుడిని "అసత్ నుండి సత్" కు తీసుకు వెళుతుందో ఆ కవిని సత్కవి అనాలి, అంతే కాని అందరినీ సత్కవి అనలేము.
అసత్ నుండి సత్ కు తీసుకువెళ్ళే సత్కవి వాక్కు జిజ్ఞాసువును తమస్సు నుండి జ్యోతి వైపూ నడిపిస్తుంది. అంతే కాదు... మృత్యువు నుండి అమృతత్త్వం వైపు నడిపిస్తుంది. అలా నడిపించే శక్తి గలిగిన సత్కవి పలుకులు తపనతో సాధన చేసే వారికి శిక్షణనిస్తాయి. ఆత్మ వికాసాన్ని కోరుతూ సమాజ పురోగతికి అంకితమైన మనస్సుతో ఉపాసనా భావనతో చేసిన సాధనా బలిమితో ఆ సత్కవి వాక్కు విశ్వ ప్రజలకు, సకల కాలములందూ వికసన దిశలో మార్గాన్ని చూపుతుంది. అంతేకాదు, అది సర్వకాలీనమూ సర్వజనీనమైన కాలపరీక్షకూ నిలుస్తుంది.
అలా ఎందుకు నిలుస్తుంది?
కాలానికి అతీతంగా దర్శించ గలిగిన వారు మాత్రమే ఏ సన్నివేశం లేదా పరిస్థితులలో నైనా అనంతమైన అవకాశాలను దర్శించగలుగుతారు. ప్రతి అవకాశంలో వీలైనన్ని ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాడు. వానిలో ఉత్తమమైన దానిని తను స్వీకరిస్తాడు. సాధారణంగా ఒక గ్లాసులో సగ భాగం నీళ్ళుంటే ఆశావాది సగం నీళ్ళూన్నాయని సంతసిస్తాడు. నిరాశావాది సగం ఖాళీగా ఉందని బాధ పడతాడు. నిజానికి గ్లాసు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. సగం నీళ్ళతో ఉంటే సగ భాగం గాలితో నిండే ఉంటుంది. దార్శనికుడు ఆ సూత్రంపైనే ఆలోచిస్తాడు... అంతర్నిహితమైన అవకాశాలను అన్వేషిస్తాడు. ఆ ఆలోచన నిరంతరం జ్వలిస్తూ పరిణతిని అనుగ్రహిస్తుంది. ఆ పరిణతితో కూడిన సంవిధానం వల్ల ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి అక్కడి నుండి అత్యున్నత స్థితికీ చేరుకుంటాడు, సత్కవి. అలాంటి వారి వాక్కు మనకు ప్రేరణ నిస్తుంది... మార్గం చూపుతుంది. అవసరమైన శిక్షణ నిస్తుంది.
మార్గ దర్శన చేసే వాక్కు ఒక్కరిదే అయి ఉండ వలసిన అవసరం లేదు. మన ప్రయాణం ఏ స్థాయిలో ఉంటే అక్కడినుండి ముందుకు వెళ్ళేందుకు అనువైన దారిని అప్పటికే అక్కడికి చేరుకున్న మహనీయులు మనకు చూపుతారు.
సత్కవి వాణి ఇచ్చిన శిక్షణ ద్వారా పెరిగిన స్థాయి వల్ల అక్షరాలను చదవడంతో సరిపెట్టుకోకుండా ఆ అక్షరం యొక్క ఆత్మను అవగతం చేసుకోగలుగుతాడు పాఠకుడు. ఆలోచనా పరిధి పెరగడం వల్ల పాఠకుడూ ఒక దార్శనికుడైపోతాడు.
అక్షరం అక్షరం కావాలంటే... దానికొక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం అవకాశాలను గుర్తించ గలగాలి. ప్రయత్న లోపం లేకుండా శ్రమించాలి. ఎదురయ్యే అవరోధాలను అధిగమించ గలగాలి. సేవాభావంతో సమున్నతంగా చేర వలసిన స్థానానికి చేరుకోదగిన సన్నద్ధతను సాధించాలి. అప్పుడే అతడు సత్కవి కాగలుగుతాడు.
ఈ క్రమాన్ని చూపుతూ..... ఉపాధ్యాయుల వల్ల పాఠాలు నేర్చుకొని విభ్రాంతిని విడిచి పెట్టి సత్కవుల మార్గంలో శిక్షణపొంది ముందుకు సాగడం మన జీవితాలకు శ్రేయస్సు నిస్తుందని ఆచార్యులవారి వాణి బోధిస్తుంది
No comments:
Post a Comment