Sunday, July 10, 2016

"ఈ నాటికీ అవధానమేనా"


ఈ రోజు నమస్తే తెలంగాణ లో ప్రచురితమైన "ఈ నాటికీ అవధానమేనా" అనే వ్యాసం శ్రీ తోకల రాజేషం గారు వ్రాసింది చదివాను. సమున్నత సాహితీ విలువలు భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో నింపడానికి నడుం బిగించి ప్రాచీన సాహితీ రూపాలన్నింటినీ రూపుమాపాలనే సంకల్పంతో కృషి చేస్తున్న విధానం కనిపిస్తుంది అందులో. (అలా కాకపోతే మంచిదే) కుల నిర్మూలనా లక్ష్యం మంచిదే కాని అందులో బ్రాహ్మణ ద్వేషం ఎంతవరకు సమంజసం. అత్త మీది కోపం దుత్త మీద చూపారనే సామెత ఉంది. బ్రాహ్మణుల మీది కోపం అవధాన కళమీద కాని పద్య సాహిత్యంపైన కాని చూపటం వల్ల ప్రయోజనం ఉండదు.
"ఈ అవధానాలు ఫ్యూడల్ భావజాలంలో పుట్టి అదే భావజాలానికి కట్టుబడి, అదే భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ముందుకు సాగుతున్నాయి". చాలా చక్కగా సెలవిచ్చారు. ఫూడల్ భావజాలం అనే గొప్ప మాట నాకైతే అర్థంకాదు.. మరి పల్లెలలో నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ లేదా కూలీలుగా బ్రతుకులోడ్చే ఎంతమందికి ఫ్యూడల్ భావజాలం అర్ధం అవుతుందో నేనూహించలేను కూడ. వ్రాసే వారికి కూడా సరైన అవగాహన లేని పడికట్టు పదాలను ఉపయోగించడం ఈ నాటి సాహితీ వేత్తలమనుకునే వారికి ఒక ఫ్యాషనయింది. ఒకనాడు ఈ తెలుగు గడ్డపై పల్లెలలో తిరుపతి వెంకట కవుల పద్యం ఒక్కటైనా రాని వ్యవసాయదారుడు లేడు. పద్య నాటకాలను ఆదరించింది బ్రాహ్మణులే కాదు సామాన్య ప్రజానీకం కూడ.
ఒకే సమయంలో ఒక వ్యక్తి ఎన్ని విషయాలపై తన ఏకాగ్రత నిలుపగలడు? అలవాటు చేస్తే మానవ మేధ ఎంత గొప్పగా పని చేస్తుందో తెలియాలంటే ద్వేష భావన వీడి అవధాన విద్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధారణా శక్తిని పెంచుకునేందుకు ఉపయోగ పడేది అవధాన విద్య. అనేకానేక ప్రాచీన ఆధునిక సాహిత్య రీతులపై విశ్లేషణా పూర్వకమైన సరైన అవగాహన పెంచుకుంటే కాని ఒక అవధాని సభారంజకంగా అవధానం చేయగలడు. ఆ అవధానం యువతకు ఉపకరిస్తుంది. అవధానికి ధైర్యంతో పాటుగా సమయ స్ఫూర్తి, భావావేశం, భాషపై పట్టు, ఏకాగ్రత, ధారాశుద్ధి, ధారణ, స్ఫురణ లాంటి ఎన్నో లక్షణాలు అవసరమౌతాయి. ఇవి అన్నింటినీ బాగా ఆలోచించి ప్రదర్శించేందుకు సమయం ఉండదు. తక్కువ సమయంలో ప్రదర్శించాలి.
ఈనాటి ఉన్నత ఉద్యోగాలకు తీసుకునే అభ్యర్ధులకు కావలసిన అర్హతలుగా అటు ప్రభుత్వంకాని, ప్రైవేటు సంస్థలు కాని ఈ లక్షణాలనే కోరుకుంటున్నాయి. పై అంశాలపై అయాచితంగా లభించే అవగాహన వివేచనల లాంటివి అవధాన విద్య అందిస్తుంది. ఆ విద్యను అనాదరం చేస్తున్నాం కాబట్టే వీటికి కావలసిన శిక్షణ నిచ్చే శిక్షణా సంస్థలూ పుట్టుకొచ్చాయి. ఇలా ఎంత వ్రాసినా నిద్ర నటించే వారు గ్రహించేందుకు సిద్ధ పడరు.
జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు. పారిపోతారా లేక పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తారా? అలాగే అవధానంలో ఒక సమస్య నిస్తారు. దాని పరిష్కారంలో మనలోని సృజనాత్మకతకు పదను పెడతాము. ఉదాహరణకు... "రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతంబునన్" ఇది నిజానికి క్లిష్టంగా కనిపిస్తుంది. కాని అవధానిలోని సమయ స్ఫూర్తి, సృజనాత్మకతలు, బహు గ్రంథ పారీణత, అభ్యసన లాంటివి వెలుగు చూడడం వల్ల కొన్ని సెకన్ల కాలం లోనే దానికి పరిష్కారం కనుగొన గలిగాడు. Out of Box thinking లేదా Lateral thinking వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మూసలో పోసిన ఆలోచనలు, అవగాహనలు, ద్వేషభావనలు ఎన్నటికీ Vertical thinking నే అనుగ్రహిస్తాయి కాని ఆలోచనా పరిధిని పెంచవు. చేకూరి రామారావు గారు కానీ మరెవ్వరైనా వారి ఆలోచనలకు బంధీలే కాని పరిధి దాటి చూస్తేనే పరిణతి కనిపిస్తుంది. మనకిష్టం కానంత మాత్రాన, మనకర్ధం కానంత మాత్రాన, మనం చేయలేనంత మాత్రాన ఒక ప్రక్రియపై విషం చిమ్మడం, సమాజంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఒక సామాజిక వర్గాన్ని కించబరుస్తూ వ్యాసాలు వ్రాయడం ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించండి.
మరొక్క మాట... ఏ ప్రక్రియ యైనా ఆదరణ ఉన్నంత వరకే మనగలుగుతుంది. అవధాన విద్యకూడా ఆదరించ గలిగిన వారున్నంత వరకూ ఎవరెంత ఛీదరించుకున్నా, రసజ్ఞుల నలరిస్తూనే ఉంటుంది. మరొక్క అంశం... అవధానులకే కాదు... ఎవ్వరికైనా ఈనాటి గ్లోబల్ మార్కెట్ లో తమకు తెలిసిన లేదా తమకు పట్టున్న అంశాన్ని మార్కెట్ చేసుకోవడం అలవాటయింది. వ్యవసాయదారునికి గిట్టుబాటు ధర రావడం లేదంటూ గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నాయకులు గాని వారికి సానుభూతిగా ఉద్యమించే ఉద్యోగులు గాని జీతభత్యాలు తీసుకోవడం లేదా? అది జీవనోపాధికి అంటారేమో... జీత భత్యాలు పెరగాలని ఉద్యమించడం ఎందువల్ల. మన జీవన స్థితిగతులను మెరుగు పరుచుకునేందుకే. అందరూ అలానే కాకపోవచ్చు. కొందరు తమ జీతాలలోనుండి కొద్ది భాగాన్ని సమాజ సేవకై వ్యయిస్తున్న వారు నాకు తెలిసి ఎందరో ఉన్నారు. అందులో అన్ని కులాల వారు ఉన్నారు.
ముగింపుగా... దయచేసి సాహితీ విలువలు నడి బజారులో అమ్మబడుతున్న ఈ నాడు వాటికి విలువలే కాదు అంతకన్నా ఉత్తమమైన సంస్కారాన్ని ఇచ్చిన ప్రాచీన సాహితీ ప్రక్రియలను ద్వేషించకండి. అనాదరణకు గురైతే అవే కనుమరుగవుతాయి.
పాలకుర్తి రామమూర్తి .... 9441666943

No comments: