Sunday, July 10, 2016

భారత గాథ సర్వ కాలీనమైనది

౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
అ) అసూయాగ్రస్తులైన సవతుల మధ్య జరగబోయే పరిణామాలను ముందుగా గ్రహించ గలిగాడు కాబట్టి కశ్యపుడు ఆ పరిణామాలకు తాను సాక్షీభూతుడుగా ఉండదలచుకోక తపస్సు చేసుకోవడానికై వెళ్ళాడు.
ఆ) ఒకరు ఇద్దరు లేదా పది మంది సంతానాన్ని కోరడం లోక సహజం కాని కద్రువ వేయి మందిని అదీ దీర్ఘదేహులు, అనిల తేజులు, వినుత సత్వులను కోరడంలోనే ఆమె అత్యాశ తెలుస్తుంది.
ఇ) తాపసి సంతానం విజ్ఞానార్జన లక్ష్యంగా దానికి అవసరమైన దేహాభిరతి తో ఉండాలి. కాని ఆమె కోరిక దానికి వ్యతిరిక్తంగా ఉండడమే కాక వారి నుండి ఆమె ఆశించేదేమిటి?
ఈ) ఇక వినత... కోరింది ఇరువురినే కాని సుపుత్రులను కోరింది. ఐనా అందులోనూ సవతిపై మాత్సర్యం కనిపిస్తుంది. అమిత సత్వులను, వీరులను ముఖ్యంగా కద్రువ సంతానాని కన్నా బలవంతులనూ కోరుకొంది.
ఉ) ఇరువురూ స్వధర్మాన్ని కాదని పరధర్మానికి అవసరమైన లక్షణాలు కలిగిన కుమారులను కోరారు.
ఊ) దీని వల్ల జరగబోయే పరిణామాలను ఊహించగలిగిన కశ్యపుడు తానారంగం నుండి నిష్క్రమించాడు.
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
అ) నమ్మక పోయే అవకాశం లేదు. ఎందుకంటే... మొదటగా భర్త తపోశక్తిపై అపార విశ్వాసం ఉంది అందునా కద్రువకు పుత్ర సంతానం కలిగింది. అదీ వేయి మంది దీర్ఘదేహులు... తక్షకాది అమిత సత్వులు కలిగారు.
ఆ) కద్రువకు రోజుకు కొంతమంది చొప్పున చాలా రోజులుగా సంతానం కలుగుతూ ఉంది. ఒకరి తదుపరి ఒకరుగా కలుగుతున్న సంతానాన్ని గూర్చిన సమాచారం చెలికత్తెల ద్వారా చిలువలు పలువలుగా అందుతూనే ఉంది. ఆ పిల్లలు చేసే ముద్దు ముచ్చట్లు తెలుస్తున్నాయి. కద్రువ ఎంత సంతోషిస్తున్నదో అర్థం అవుతూనే ఉంది. ఆ సమాచారం మనసులో తెలియని ఆవేదనను కలిగిస్తున్నది. తనకు తెలియకుండానే మనసు అసూయాగ్రస్తమై తొందర చేస్తుంది. కద్రువకు సంతానం కలగనంత వరకు తనూ ప్రశాంతం గానే ఉంది. ఎప్పుడైతే సవతి సంతానవతి యై ఆనందిస్తున్నదో అప్పుడే తనలో తెలియని ఆవేదనాపూర్ణ భావనలు అసూయను ఆశ్రయించడం చేత తాను చేస్తున్న పనిపైన ఆలోచిస్తున్న విధానంపైన అవగాహనను, పట్టును కోల్పోయింది.
ఇ) ఒక దానిని విచ్ఛిన్నం చేసి చూద్దామనే కోరిక తీవ్రమై తనను నిలువనీయని స్థితిలో అదుపు తప్పి ప్రవర్తించడం వల్ల అండ విచ్ఛిత్తికి పాల్పడింది.
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
అ) ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వినత తొందరపాటు వల్ల అనూరుడు జన్మించాడు, తల్లిని శపించాడు. నిజంగా తన తప్పును తెలుసుకున్న వినత పశ్చాత్తాప పడుతుంది. ఇక కద్రువ తన చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కారణంగా, సవతియైన వినతను దాసీగా పొందాలనే దురాలోచనతో దాసీత్వం పందెంగా పెట్టింది.
ఆ) సొమ్ముల లాంటివి భర్తతో సాధించుకునే అవకాశం ఉంది... కాని మాత్సర్యగ్రస్తయైన కద్రువ భౌతిక సంపదలకతీతంగా సవతి దాసీత్వాన్ని కోరుకుంది.
ఇ) రోగీ పాలనే కోరాడు... వైద్యుడూ పాలే ఇచ్చాడు... అన్నట్లుగా శాప నిమిత్తంగా వినతా దాసీత్వం వైపే ఆకర్శితురాలైంది.. కద్రువా అదే కోరుకున్నది. కాబట్టి ఇక్కడ న్యాయాన్యాయాలకన్నా వారిరువురి మనసులు ఆవిష్కరింప బడ్డాయని అనుకోవడం సమంజసం.
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
అ) నిజానికైతే ఉండకూడదు. కాని వినత మనసులో చెలరేగుతున్న అపరాధ భావన ఆ ప్రమత్తతను ఆహ్వానించింది.
ఆ) సవతికి వేయి మంది సంతానం కలిగారు. తనకు పుత్రులు పుట్టలేదని ఒకప్పుడు బాధ పడింది. తన అవివేకం వల్ల పుట్టిన వాడు శారీరక అవలక్షణంతో జన్మించాడు. తన కుమారుడే తనను శపించాడు... అయినా బాధలేదు. తనకు దాసీగా ఉండే యోగం ఉంటే ఉండవచ్చుగాక. కాని అమిత సత్వపూర్ణుడైన కుమారుడు పుడతాడనే సంకేతం ఆమెకందింది ఆ శాపంలోనే అదే ఆమె ప్రమత్తతకు కారణం.
ఇ) తను పొందిన శాపంలోనే ఒక ఊరట ఉంది. ఐదు వందల సంవత్సరాల తదుపరి తనకు పుట్టే కుమారుని వల్ల తన దాస్య విముక్తి జరుగుతుంది అలాగే తాను అనూరుని పట్ల అనుసరించిన అపచారం దాసీత్వం వల్ల ఉపశమిస్తుంది. కాబట్టే వినతకు ఆ ప్రమత్తత.
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
అ) దాస్యం చేయడం వల్ల ఏం కలుగుతుంది? ఆమె అంతరంగంలోని ప్రశ్న... దానికి జవాబు తనకు రెండవ అండంనుండి కలిగే కుమారుని వల్ల తనకు దాస్య విముక్తి. తాను దాసీ అయితేనే కదా దాస్య విముక్తి, శాప విముక్తి. అందుకే ఉచ్ఛైశ్రవం యొక్క తోక నల్ల అని కద్రువ అంటే తనకది అబద్ధమని తెలిసినా దగ్గరికి వెళ్ళి చూడలేదామె. దగ్గరకు వెళితే తన దాసిత్వం కద్రువకు చెందుతుంది. అది తన లక్ష్యానికి వ్యతిరిక్తమవుతుంది. కాబట్టే దగ్గరకు వెళ్ళే ఆలోచనను వినత చేయలేదు... అందులోని మోసం దగ్గరకు వెళితే తేటతెల్లమవుతుంది కాబట్టి కద్రువా దూరం నుండే చూద్దామని అంది.
ఆ) ఐదు వందల సంవత్సరాలు సవతిని సేవించినా వినత ఆ పనిని ఇష్టంగానే చేసిందట. చేసే పనిని ఇష్టపడండి... ఇష్టాన్ని ప్రేమించండి... ఆ ఫలితాన్ని ఆస్వాదించండి అనే సామాజిక, వ్యక్తిత్వ సూత్రానికి ప్రతినిధిగా ఆమె కనిపిస్తుంది.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
అ) ఇక్కడ లోక సహజమైన రీతిని ప్రతిబింబించాడు మరియు స్త్రీ మనసును ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు లోకంలో సహజంగా రోగం తగ్గాక వైద్యుని సేవలను వైద్యుడినీ మరచిపోతాడట రోగి అలాగే భార్యను పరిగ్రహించాక తల్లిని మరచిపోతారట... ఇంకా సంతానం కలిగాక భర్తను దూరంగా ఉంచుతారట. ఆ లోక రీతిని ఆవిష్కరిస్తున్నాడు వ్యాసభగవానుడు.
ఆ) అసూయాగ్రస్తులైన వారి పాట్లు ఎలా ఉంటాయనే విధానాన్ని చెపుతున్నాడు
ఇ) ఓర్పు, క్షమా గుణాన్ని సంతరించుకోవడం వల్ల ఎలాంటి ఉత్తమ ఫలితాలను సాధిస్తామో చెపుతున్నాడు. వినత దాసీత్వాన్ని నిష్ఠతో ఆచరించింది. కుమారుడు కలిగాక కూడా కద్రువపై చాడీలు చెప్పి వాని మనసు విరిచే ప్రయత్నం చేయలేదు.
ఈ) సమయం, సందర్భం వచ్చే వరకు నిరీక్షించింది. కద్రువ కుమారులను మోసుకుంటూ గరుత్మంతుడు సూర్యమండలానికి ఎగరడం వల్ల ఆ తాపాన్ని తట్టుకోలేని పాములు మూర్ఛపోవడం.. దాన్ని చూసి కద్రువ కోపంతో గరుడుని కోపగించడం, ఆ పరిణామానికి వ్యధ చెందిన గరుత్మంతుడు తన తల్లిని దాసీత్వం గూర్చి ప్రశ్నించడం కనిపిస్తుంది వ్యాసుల రచనలో.
ఉ) కార్య సాధకుని నిబద్ధతను గరుత్మంతుని అమృతాపహరణ నేపథ్యంలో చూపాడు. గరుత్మంతుడు నిబద్ధతతో అమృతాన్ని తాను వినియోగించక, తల్లికి గాని సోదరునికి గాని వినియోగించక కద్రువ కడకు తీసుకు వెళ్ళడం ఆతని నియమ బద్ధతకు తార్కాణం.
ఊ) దీనివల్ల గరుత్మంతునికి విష్ణువుకు వాహనంగా సేవచేసుకునే భాగ్యం కలిగింది. అంతేకాక, ఏ అమృత సేవన వల్ల జరామృత్యు భయం లేకుండా ఉండగలమో ఆ భాగ్యం విష్ణువు వరం వల్ల పొంద గలిగాడు.
ఋ) గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి పాములకు ఇచ్చాడు. అయినా ఆ అర్హతను వారు సాధించుకోలేక పోవడం వల్ల వారది అనుభవించుకోలేక పోయారు. కోరుకునే ముందే దానికి తగిన అర్హత సాధించాలనే సామాన్య సూత్రం ఇక్కడ ప్రతిపాదించబడింది.
ౠ) ఫలితంపై ఆశలేకుండా.. చేసే పని పెద్దదా చిన్నదా అనే భావన లేకుండా నియమబద్ధంగా మనసుతో చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే సందేశం కనిపిస్తుంది.
ఎ) అనింటికన్నా ముఖ్యంగా ఈ కథ ద్వారా భారత గాధను ఆవిష్కరించాడు వేదవ్యాసుడు. ఇక్కడ వినత కద్రువల మధ్య అసూయా ద్వేషాలు అదీ సంతానం కారణంగా. భారతంలో గాంధారీ కుంతిల మధ్య అసూయాద్వేషాలు. కుంతికి కుమారుడు కలిగాడు... గాంధారి ఆ మాటను విన్నది... వెంటనే ఈర్ష్యాసూయలు క్రమ్ముకొనగా తన గర్భాన్ని తాడనం చేసింది. గర్భం వంద ముక్కలయింది. అసూయతో చేసిన తాడనం వల్ల అసూయాగ్రస్తులైన కౌరవులు జన్మించారు. నిష్కల్మషంగా కుంతి సంతానాన్ని కనింది. వారిలో సౌజన్యం వెల్లివిరిసింది. వినత అసూయతో చేసిన ప్రయత్నం వల్ల అనూరుడు జన్మించాడు. ఫలితాన్ని చూచాక పశ్చాత్తాపంతో తన మనసులోని అసూయను కడిగి వేసుకున్నాక తనకు కలిగిన సంతు బలవంతుడూ, కార్య దక్షుడూ అయ్యాడు. కద్రువ సంతానం క్రూరాత్ములు కాగా కౌరవులూ క్రౌర్యచిత్తులుగానే మిగిలిపోయారు.
ఏ) కౌరవులు అనుక్షణం పాండవుల శక్తి సామర్ధ్యాలు తలుచుకొని భయపడుతూ జీవచ్ఛవాల వలె జీవించారు. అందుకే వారి నంతమొందించేందుకు అవసరమైన అన్ని దుర్మార్గ ప్రయత్నాలనూ అనుసరించారు. బ్రతికినన్ని రోజులూ చస్తూ బ్రతికారు. అలాగే కద్రువ సంతతీ అనుక్షణం భయపడుతూ ఆ భయాన్నుండి బయట పడేందుకు అమృతాన్ని తెచ్చి ఇవ్వమని కోరారు. భయగ్రస్తులై ద్వేషానికి బానిసలై బ్రతికారు. ఇక పాండవులు తమను రక్షించేది తామారించే ధర్మం మరియు తమ స్వ ప్రయత్నమనే సిద్ధాంతాన్ని నమ్మడం చేత తమ పౌరుషాన్నే నమ్ముకొని "జీవించారు". అలాగే గరుత్మంతుడూ అమృతాన్ని సంగ్రహించినా స్వశక్తిపై ఉన్న నమ్మకంతో ఆ అమృతాన్ని సేవించలేదు.
ఐ) ఇలా పలు విధాలుగా భారతంతో సంబంధం కలిగిన ఈ కథను చేర్చి ముందుగా చెప్పడం ద్వారా భారత పాత్రలను సర్వకాలీనం చేస్తూ... అసూయాద్వేషాలకు దూరంగా ఉండండని ప్రజలను హెచ్చరించడం కనిపిస్తుంది.

No comments: