Wednesday, July 13, 2016

భిన్నత్వంలో ఏకత్వం

చేతికి ఉన్న ఐదు వేళ్ళు సమానంగా ఉన్నాయా? అని కొందరి ప్రశ్న. సామాజిక ఆర్ధిక అంతరాలు ఉంటాయనే వాదన వారిది. పులి న్యాయపు చూపు ఎంత ప్రమాదకరమైనదో, ఈ వాదనా అంతే ప్రమాదకరమైనదనే వాదన మరొకరిది. విభిన్న దృక్కోణాలతో సమాజాన్ని పరిశీలించే వారికి ఈ రెండు వాదనలు సమంజసమే అనిపిస్తాయి. ఎందుకంటే, ప్రతి సమాజంలో వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తుల ఆలోచనా సరళి వారి వారి నైపుణ్యాలు, పనిచేసే విధానాలు వేరు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వారి లక్ష్యాలూ వేరుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ మనుషులందరూ సమానమే అనేది వారు ఒప్పుకోరు. అలాగే సమసమాజ స్థాపనలో వ్యక్తులకు సమాన స్థాయి ఉంటుంది, వారి ఆకలి దప్పులు, కనీస అవసరాలు సమానమే. కాని దోపరి వర్గం ఎప్పుడూ బలహీనులను పీడిస్తూనే ఉంటుంది కాబట్టి వారిపై తిరుగుబాటు చేయడమే ఉత్తమం, అనే వాదన కూడా ఆలోచింప చేస్తుంది. అయితే ఈ రెంటినీ సమన్వయం చేయగలిగిన అలోచనా విధానం రూపు దిద్దుకుంటే సమాజానికి ఉపయుక్తమౌతుంది.
సరే, ఈ వాదనలెలా ఉన్నా, మహాభారతంలో పంచపాండవులు చివరిదాకా ఒక్కటిగానే ఉన్నారు. అంటే వారి మధ్య అభిప్రాయ భేదాలు లేవని అనలేము. వాదనలూ లేవనలేము. అభిప్రాయ భేదాలెన్ని ఉన్నా, కష్టకాలంలో కూడా వారు పరస్పర దూషణలతో విడిపోలేదు. వీరిని సమన్వయం చేయగలిగిన శక్తిమంతురాలు... ద్రౌపది. ఆమె కార్య నిర్వహణలో తమ వైషమ్యాలను పరిష్కరించుకుంటూ, తాము ఏర్పరచుకున్న "విలువల"కు కట్టుబడి కడదాకా ఒక్కటిగా నిలిచారు. విజయం సాధించారు.
ఆ పాండవుల వ్యక్తిత్వాలను పరిశీలిస్తే....
ధర్మరాజు: ఒక నాయకునిగా లేదా రాజుగా తన వద్దకు వచ్చేవారు సమస్యలతో కాకుండా పరిష్కారాలతో రావాలని కోరుకునే మనస్తత్వం కలిగినవాడు. ఏ సామాజిక చట్టాలు ఆనాడు అమలులో ఉండేవో ఆ చట్టాలప్రకారమే అందరూ నడవాలనే ఆలోచనా సరళి అతనిది. చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్యనూ సమర్థించని వ్యక్తిత్వం అతనిది. ధర్మానికి న్యాయానికి తానే ప్రతినిధిగా ఊహించుకునే వాడు. దానితో తన తప్పిదాలకు తానే కాకుండా తన వారుసైతం బాధపడడం భారతంలో కనిపిస్తుంది.
భీముడు: ఆలోచనలకన్నా ఆచరణకు ప్రాధాన్యత నిచ్చేవాడు. దైవ నిర్ణయం అనుకుంటూ క్రియా శూన్యులై తమ సామర్ధ్యాన్ని గుర్తించని సోమరితనాన్ని అసహ్యించుకునే తత్వం భీమునిది.
అర్జునుడు: ధనుర్ధారి. తాను బాణం వేయడం నేర్చిన వాడు. అలాగే తనపై సంధించ బడిన బాణాన్ని ఎదుటి వారిపైకి త్రిప్పి కొట్టగల సామర్థ్యం కలిగినవాడు. ఎవరికీ జవాబుదారీగా ఉండడానికి ఇష్టపడని వాడు.
నకులుడు: శారీరక సౌందర్యం పరాక్రమం కలిగిన వాడే కాని ఆలోచనా శక్తితో పనిచేసేవాడు కాదు. తనకప్పచెప్పిన పనిని నిరాటంకంగా నిర్వహించేందుకు ఇష్టపడేవాడు.
సహదేవుడు: చాలా తెలివి కలవాడు. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని వాడు. ఆలోచనా పటిమ, విశ్లేషణా శక్తి ఎక్కువ. సమస్య ఏదైనా పరిష్కారాన్ని కనుగొనేందుకు సిద్ధమౌతాడు. తన దాకా వచ్చిన ఏ సమస్యనైనా తానే పరిష్కరించడానికి ఇష్ట పడతాడే కాని ఇది నా సమస్య కాదని తప్పుకునే స్వభావం లేదతనికి. తన సలహా కోరని సన్నివేశాలలో మౌనంగా ఉండడం అతని తత్వం.
ఇలా వైవిధ్య భరితమైన వ్యక్తిత్వాలు జీవితాంతం ఒకటిగా నిలబడి భిన్నత్వంలో ఏకత్వం సాధించడం సాధ్యమేనని నిరూపించాయి.
Palakurthy Rama Murthy

No comments: