Sunday, July 10, 2016

సమష్టి తత్వమే ఆదరణీయం
అడవి ఉంటుంది. అందులో చెట్లు చేమలు పిచ్చిమొక్కలు ఒక నిర్దిష్టమైన పద్ధతి లేకుండా పెరుగుతాయి. నగరం ఉంది. అక్కడ ఒక ఉద్యానవనం ఉంది. అందులో ఏ చెట్టు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి దేని మధ్య ఎంత అంతరం ఉండాలి అనే వివిధ అంశాలను అధ్యయనం చేసి తోటమాలి ఆధ్వర్యంలో అన్ని రకాల మొక్కలు చెట్లు పెంచబడతాయి. చాలా అందంగా మనోహరంగా ఉంటుంది, ఆ ఉద్యాన వనం. ప్రకృతి మరియు ఉద్యానవనం వీటిలో ఏది అందమైనది ఆదరణీయమైనది అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము. రెండూ మనోహరమైనవే. కాని అడవి స్వతంత్రంగా పెరిగింది. దానిపై ఏ నియమ నిబంధనలు లేవు. ఉద్యానవనం ఒక తోటమాలి ఇష్టాయిష్టాలపై ఆధారపడి పెరిగింది. ప్రతి విషయంలో తోటమాలి అభిప్రాయం మూలమవుతుంది. అడవిలో ఆటవిక న్యాయం అమలులో ఉంటుంది. ఉద్యానవనంలో సామాజిక న్యాయం ఆదరణీయమౌతుంది. అడవిలో బలవంతులదే రాజ్యం. ఉద్యానవనంలో బలహీనమైనవి రక్షించబడతాయి. అడవిలోని ప్రకృతి స్వాభావికం కాగా ఉద్యానవనం కల్పితం లేదా సంస్కృతి.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనలోని ప్రతి వ్యక్తిలో ప్రకృతి ఉంటుంది, ఉద్యానవనం ఉంటుంది. ఒక పులి ఉంటుంది, లేడీ ఉంటుంది. రేపటి ఆకలి పై భయం ఉంటుంది. ఇక్కడ ఆకలి అంటే ఒక్క కడుపుకు తినే తిండి మాత్రమే కాదు. ఆకలి... ఒక కోరిక కావచ్చు, విజ్ఞానేచ్ఛ కావచ్చు, లైంగికాసక్తి కావచ్చు, తానే గొప్పవాడిననే భావన కావచ్చు, తన స్టేటస్ కావచ్చు... ఇలా ఏదైనా ఆకలి దాదాపు 99 శాతం మందిలో ఉంటుంది. పులికి ప్రతినిత్యం ఆహార సాధనకై పరుగు తీయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఆహారం వడ్డించిన విస్తరికాదు. ఆ క్రమంలో ఎదుటి జంతువు చేతిలో అది చనిపోయే అవకాశమూ ఉంటుంది. అలాగే జింక కూడా ప్రతినిత్యం పులికన్న ఎక్కువ వేగంతో పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది. దాని ఆహారం దానిచుట్టే దానికి అందుబాటులో ఉంటుంది. కాని నిరంతర ప్రాణ భీతితో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కనీసం కడుపు నిండుగా తినే అవకాశం ఉండదు. కడుపు నిండుగా తింటే పరుగెత్తలేదు, పరుగెత్తకుంటే పులికి ఆహారమౌతుంది. పులికి ఆహారం దొరికినప్పుడు కడుపు నిండుగా తింటుంది హాయిగా నిద్రిస్తుంది. ఈ రెండు మానసిక స్థితులు ప్రతివ్యక్తిలో అభివ్యక్తమౌతుంటాయి.
ఆటవిక న్యాయం నుండి సంస్కృతి వైపు పయనించే క్రమంలో మనిషిలో వివిధ ఆలోచనా సరళి వ్యక్తమౌతుంది. ముందుగా ప్రతి వ్యక్తి ఆహారం కావాలని కోరుకుంటాడు. తరువాత ఆ ఆహారం నిరంతరం లభించాలని దానిని దాచుకోవాలని తన తరువాతి తరాలకు అందించాలని ఆలోచిస్తాడు. అలా దాచిన ఆహారాన్ని ఇతరులు దొంగిలించకుండా రక్షణ నేర్పాటు చేసుకుంటాడు. కాగా ఇవేవీ తనకు శాంతిని సమకూర్చని పక్షంలో వీటినన్నింటినీ త్యజించి తానెవరనే ఆత్మ శోధనలో పడిపోతాడు. వేదాంతిగా మారిపోతాడు. ఇవి మనిషిలో అభివ్యక్తమయ్యే ఆలోచనా తరంగాలు. ఆ క్రమంలో తాను తన సాధనా క్రమంలో సాధించిన పరిణతిని ఇతరులతో పంచుకోవాలనే తపనను అక్షరబద్ధంచేయడం వల్ల అది సాహిత్యంగా రూపుదాలుస్తుంది.
మతం అనేది ఒక అభిప్రాయం. ఒక విజ్ఞాని తన అన్వేషణలో సాధించిన విజ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతి ప్రకారం ఏర్పరచి ఆ మార్గం ముందుకు వెళ్ళేందుకు సుగమమైనది అని చెపుతాడు. ఆ మార్గం నచ్చిన వారు లేదా ఆ పద్ధతి నచ్చిన వారు దానిని అనుసరిస్తుంటారు. కొందరికి అందులో దోషాలు కనిపించవచ్చు. అందుకని వారు మరొక మార్గాన్ని అన్వేషిస్తారు దానిని అనుసరిస్తారు. ఇలా ఎన్నైనా మతాలు అభివ్యక్తం కావచ్చు. ప్రతి మతంలో కొన్ని ఉన్నత భావనలు ఉంటాయి అలాగే సామాజిక ప్రగతికి విఘాతం కలిగించే అంశాలు ఉండవచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి ఆలోచనా సరళీ నూటికి నూరుశాతం సమగ్రమూ కాదు, సంపూర్ణమూ కాదు. ఆనాటి వ్యవస్థపై ఆధారపడిన భావజాలంలో రూపు దిద్దుకున్న ఆలోచనా సరళి మారుతున్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక కాదు. యధాతధ వాదన ఎప్పుడైనా అసంపూర్ణమే. మరొక విషయం, ఒక సమాజపు ఆలోచనా సరళి మరోసమాజపు ఆలోచనా సరళితో మమేకం కాలేదు. ఎందుకంటే అక్కడక్కడి ఆహార విహారాలు సామాజిక నేపథ్యాలు వేరువేరుగా ఉంటాయి.
సంస్కృతీ వికసన క్రమక్రమంగా జరిగిందే కాని ఏ అర్ధరాత్రో అమాంతంగా ఊడిపడ్డదికాదు. ఒక విధానాన్ని ఆలోచించడం అమలు పరచడం అందులో ప్రతిబింబించే సమాజ వ్యతిరిక్త ఆలోచనలను సరిచేయడం ప్రతికాలంలోనూ జరిగింది... జరుగుతూనే ఉంటుంది. అయితే, ఒక సమాజంలో కనిపించిన ఒక విధానాన్ని పదేపదే ఉదహరిస్తూ ఆ సామాజికత లోపభూయిష్టమైనది మొత్తంగా పరిత్యజించ వలసిందేనని గొంతులు చించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏ సంస్కృతికైనా పరంపర ఉంటుంది. పరంపర వికాసంలో లోటుపాట్లు సరిచేసుకుంటూ పోతాము. ఒకటి బాగుండలేదని దాని స్థానంలో మరొకటి వచ్చాక పాతది మంచిది కాదని పదేపదే అరవడం వల్ల ప్రయోజనం ఉండదు. అది మంచిది కాదనే నేటి అవసరాలకనుగుణంగా మరొక వ్యవస్థ వచ్చాక పాతది కనుమరుగైనట్లే కదా.
నిత్య అసంతృప్తులు సమాజ ప్రయోజనాన్ని ఏ విధంగానూ కాపాడలేరు. వీరికి ఎప్పుడూ ఏదో వివాదంకావాలి. మనదేశ చరిత్రను వక్రీకరిస్తూ విదేశీయులు వ్రాస్తే అది వారికి ఆదరణీయం. దేశ చరిత్రలో వక్రీకరించ బడిన అంశాలను సరిచేసి వ్రాసిన స్వదేశీయుల చారిత్రక వ్రాతలు వీరికి నిషిద్ధం. విదేశీ ఎంగిలి నినాదాలను పట్టుకొని అసంబద్ధమైన పడికట్టు పదాలతో వ్రాసే వ్రాతలతో మేమే చరిత్ర నిర్మిస్తున్నామనే భ్రమతో తమ ఆలోచనలలో ఉన్న లోపాలను సరిచేసుకోలేక, ఉన్నాయని లోపాలను ఎత్తిచూపిన వారిపై అక్కస్సును ప్రకటించే మహనీయుల వల్ల ఈ సమాజానికి ప్రయోజనమేమిటో ఆలోచించాలి. సమష్టి కార్యా చరణతో సామాజికోద్యమాలు నడపాలనే ఆలోచన ఆదరణీయం కాని ఈ సమజంలోనే శాస్త్రీయ భావజాలం పునాదిగా సహజీవనం చేస్తున్న మానవతా వాదులను ద్వేషించడం వల్ల "సమష్టి" తత్త్వానికి విఘాతం కలగదా... విజ్ఞులు ఆలోచించాలి.
Palakurthy Rama Murthy
9441666943

No comments: