Sunday, July 10, 2016

సమస్య పరిష్కారానికి రెండవ కోణం కూడా అవసరమే!
ఆహార నిద్రా భయ మైధునంచ, సమాన మేతత్ పశుభిర్నరాణాం
విజ్ఞానమేకం అధికం నరాణాం, విజ్ఞాన హీనం పశుభిస్సమానః!
ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి లాంటివి పశువులకు, మానవులకు సమానమే. అయితే మానవులను పశువుల నుండి వేరు చేసేది "విజ్ఞానం" మాత్రమే. ఆ విజ్ఞానానికి ప్రాతిపదిక మనిషి "ఊహాశక్తి". ఊహను యదార్ధం చేయాలి, సాక్షాత్కరించాలి అనే తపన "తపస్సు"గా మారి అంతశ్చేతనలో జ్వలనగా రూపాంతరం చెంది, ప్రజ్ఞగా ఆవిష్కృతమై సత్య శోధనకు మార్గం చూపుతుంది. సత్యశోధన వల్ల తనలో నిర్మాణాత్మకమైన వ్యక్తిత్వం సాకృతమై సత్సమాజ దర్శన సాధ్యపడుతుంది. ఆత్మ శోధనా స్పూర్తితో సమాజాన్ని దర్శించే దార్శనికులు తరతమ భేద భావానికి లోనుకాకుండా సమసమాజ స్థాపనకు సోఫానాలౌతారు.
సూక్ష్మ దృష్టితో విచారిస్తే ప్రకృతిలో మంచిచెడులను విడదీసి నిర్వచించడం చాలావరకు సాధ్యపడదు. ఒక కోణంలో న్యాయంగా కనిపించే అంశం మరొక కోణంలో అన్యాయంగా కనిపిస్తుంది. ఒకరి మంచి మరొకరికి చెడుగా కనిపించవచ్చు.
ఆకలితో నకనక లాడే పులి ఆహారం కోసం జింకను వేటాడడం న్యాయమా అన్యాయమా? అంటే చూసే కోణాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి నిర్ణయించాలే కాని మనం చూసేకోణం నుండే ప్రపంచం అంతా చూడాలనుకోవడం సమంజసం కాదు. అది అసాధ్యంకూడ. బలహీనమైన జింకను పులి వేటాడి భుజించడం అసమంజసం అనే వారు, ఆ వేట పులికి అవసరమా లేక "ఆశ" యా అన్న కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పులి ఆకలితో చావాలి అనికోరుకోవడం కూడా సమంజసం కాదు కదా. భగవంతుని సృష్టిలో జింక ఎలాంటి ప్రాణియో పులి అలాంటిదే. జింకకు జీవించే హక్కు ఎంతగా ఉందో పులికీ అంతే ఉంటుంది. జింకకు బ్రతికేందుకు గడ్డిలాంటి ఆహారం ఎలా అవసరమో పులికి మాంసాహారం అలాగే అవసరం. ఈ జింకను కాకపోతే మరే జంతువునో అది భుజించాల్సి ఉంటుంది. అది కూడా న్యాయం కాదు కదా. పులికూడా శాకాహారిగా మారి గడ్డిలాంటివి భుజించి బ్రతుక వచ్చుగా అని వాదించే మేధావులకు జవాబు నివ్వడం సాధ్యంకాదు. రోజూ మాంసాహారం తీసుకునే పెద్ద మనుషులు తాము భుజించే జంతువులు బలహీనమైనవనే విషయాన్ని గుర్తిస్తున్నారా?
మనం చూసే కోణంలో కూడా ఒక్కొక్క సందర్భంలో పరస్పర సంఘర్షణ ఏర్పడ వచ్చు. ఒక కోణాన్ని ఆవిష్కరించే క్రమంలో మరొక కోణం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదానితో మరొక దానిని సమన్వయం చేసుకునే ఆలోచనా విధానం లోపిస్తే అవగాహనా లోపం ఏర్పడుతుంది. ఈ క్రమంలో దేనికి ప్రాధాన్యత నివ్వాలి, అవసరమైతే దేనికోసం దేనిని వదిలేయాలి అనేదే "మానవుని" విజ్ఞత. అదే సూక్ష్మ దృష్టి.
ఆటవిక న్యాయం ఆలంబనగానే మానవుని ఉనికి ఏర్పడింది. జంతువుల వలె పీక్కుతినే స్థాయి నుండి క్రమక్రమంగా "నాగరికత" ను సంతరించుకుంటూ "మానవు"లుగా మనం ఎదిగాము. ఈ ఎదిగే క్రమంలో మనిషిలో ఆవిష్కృతమైన సంస్కారం కొన్ని సామాజిక "విలువల" కు నెలవయింది. ఈ విలువలు ధర్మాలు కాని సిద్ధాంతాలు కాని కాక పోవచ్చు. కావలసిన అవసరమూ లేకపోవచ్చు.
మార్పు సహజమైన కాలచక్రభ్రమణంలో ఒక సమాజ విలువలు మరొక సమాజానికి అనుసరణీయం కాకపోవచ్చు. ఈనాడు గొప్పగా కనిపించే ఆలోచనా సరళి మరి కొంత కాలం గడిచాక పనికి రానిదిగా కనిపించవచ్చు. అంతేకాదు, ఒక సమాజ జీవన విధానానికి రూపొందించబడిన విలువలు, సంప్రదాయాలు మరొక సమాజానికి అనుసరణీయం కాకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా మానవజాతి ఆలోచనా సరళి అంతా ఒకేవిధంగా ఉండాలనుకోవడం అత్యాశయే కాదు, అసాధ్యం కూడా.
ఒక సమస్య వచ్చిన వేళ అనుసరించిన విధానం వల్ల సత్ఫలితాలు వచ్చి ఉండవచ్చు. అది ఆ సమాజానికి, ఆకాలంలో చూపబడ్డ పరిష్కారం మాత్రమే. మరొక కాలంలో, వచ్చే సమస్యలను పాతకాలపు దృష్టితో పరిష్కరించాలి అనుకుంటే ఉన్నతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు... ఎక్కువలో ఎక్కువగా పాత ఫలితాలనే సాధించగలం. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా ఆలోచనా విధానం, దృష్టికోణం మారకపోతే మనం వెనకబడిపోవడం ఖాయం,
"నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళ"నే వాదన సరైనది కాదనేది నా అభిప్రాయం. మార్పును అర్థం చేసుకోలేని వారు, అర్థం అయినా మేము మారమని భీష్మించుకొని కూర్చునే వారు, తామే "మేధావుల"మనే భావనలో తమ వాదనను వ్యతిరేకించే వారిపై "తిరోగమన" వాదులుగా ముద్రలు వేస్తూ తమ అహంభావాన్ని, ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలనే మేకవన్నె పులుల ప్రగతిశీల వాదం ఎవరికీ ఉపయుక్తం కాదని నేను విశ్వసిస్తాను. పడికట్టు పదాలతో చెప్పిందే చెపుతూ, జింకలలాంటి వారిని రెచ్చగొడుతూ, ఈ సమాజాభ్యుదయానికి మేమే కర్తలమంటూ వ్రాసే వ్రాతలు చేసే నినాదాలతో ఈ మారుతున్న సమాజంలో సాధించేది శూన్యమనే నా నమ్మకం.
నిజానికి "నవత" అంటే క్రొత్తదనం మానవునిలోనే ఉంది. ఏ సమస్యకైనా విభిన్న కోణాలలో నుండి పరిష్కారాన్ని ఆలోచించి అందులో ఉత్తమమైనది గ్రహించినప్పుడే అభ్యుదయం సాకారమౌతుంది.
ఏ విషయాన్నైనా అర్థం చేసుకునేందుకు అక్షరాల సహకారం అవసరమే కాని ఆ అక్షరాలనే పట్టుకు కూర్చుంటాము భావాన్ని గుర్తించమనే మేధావుల చూపు రెండవ కోణం వైపు పోదు కదా. ప్రతీకాత్మకమైన గాధల ద్వారా ఒక సత్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తాము. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏ ఉదాహరణను ఉటంకించినా ఆ ఉదాహరణలో తమకు తెలిసిన ఆవు వ్యాసాన్నే ప్రతిక్షేపిస్తామనే ఆలోచనా విధానం వల్ల ప్రయోజనం శూన్యం. వీరికి వీరే సంఘ సంస్కర్తలుగా చెలామణి చేసుకోవడం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది.
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఒకరు ఒక కంపనీ పెడతారు. ఆ కంపనీ ఉత్పత్తి నచ్చడంతో కొందరు లాభాపేక్షతో వాటాదారులుగా చేరుతారు. మరికొందరు తమ డబ్బును దానిలో పెట్టుబడిగా పెడతారు. కొందరు తమ నైపుణ్యాలను అందులో వెచ్చిస్తూ ఉన్నతోద్యోగులౌతారు. మరి కొందరు ఉద్యోగులుగా చేరిపోతారు. వీరు అందరూ కంపనీ నుండి ఏం కోరుతారు. కంపనీకి లాభాలు రావాలి తమ శ్రమకు న్యాయమైన ప్రతిఫలం రావాలి. ఇక్కడ న్యాయమైన అంటే ఎంత అనేదానికి సాధారణంగా జవాబు ఉండదు. ఒకవేళ ఉన్నా వివిధ రకాలుగా ఉంటుంది. ఇకపోతే, అంతంత పెట్టుబడి పెట్టి కంపనీ నడుపుతూ ఎంతో మంది ఉద్యోగులను సాకే ఆ పెట్టుబడిదారు జింకనా లేక పులా? ఒకవేళ ఆ కంపనీ యాజమాన్యం సామాజిక విలువలకు తిలోదకాలిచ్చి లాభాపేక్షతో నడిపే రక్తంతాగే "పులి" అనుకుంటే అక్కడ ఉద్యోగం చేయాలా వద్దా? ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆ దోపిడీ విధానంలో ఈ ఉద్యోగులూ భాగస్వాములా కాదా?
చాలామంది ఇలాంటి నీతులు వల్లిస్తూనే తమ విధానంలో కొట్టుకుపోతుంటారు. సమాజం ఎన్ని మార్పులకు లోనయినా వీరు మారరు మారే ప్రయత్నమూ చేయరు. మారాల్సిన అవసరాన్ని గుర్తించరు, మారాలనుకోరు. కాకపోతే వీరికి అండదండలందించే పత్రికలూ ఉన్నాయి కాబట్టి తెలిసిన నాలుగు పదాలనే మార్చి మార్చి వ్రాస్తూ తమ మేధో దీప్తిని ప్రకటించుకుంటారు. పనీపాట లేని కొందరి స్పందన వీరికి ఉత్తేజాన్నిస్తుంది. వీరి రచనలే ప్రచురితమౌతాయి. ప్రచురణ చేసే యాజమాన్యానికి ఎక్కువ కాపీలు ఆమ్ముడుపోవాలి. వారికి తెలుసు వీరి రచనలపై వచ్చే స్పందన ఎంతో.
చివరగా, ఒక విషయం. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో రెండు వ్యాసాలు చదివాను. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పై విభిన్న కోణాలలో వ్రాసిన వ్యాసాలవి. పరస్ఫర వైరుధ్యం కలిగిన ఆ వ్యసాలను ప్రచురించడం వల్ల నిర్ణయాన్ని పాఠకులకే విడిచిపెడుతున్నారు. దీని వల తెలిసేదేమంటే ఏ సమస్యపైనైనా చర్చ జరిగినప్పుడు ఆ చర్చలోని విభిన్న కోణాలను గ్రహించి గౌరవించాలే కాని తమ మతమే (అభిప్రాయం) ఉన్నతమైనదనే అభిప్రాయంతో ఇతరులను తక్కువ చేసి చూడడం సమంజసం కాదని గ్రహించడం మంచిది.
పాలకుర్తి రామమూర్తి
9441666943

No comments: