Sunday, July 10, 2016

శ్రీ భూపుత్రియు దమ్ములు
ధీ భాస్వన్మూర్తి హనుమ ధిషణా ధుర్యుల్
ప్రాభవమున కొలువ; సభను
శోభిలు శ్రీ రాము డిడుత శోభన మిలకున్!
సార వచో విలాస రుచి సన్నుతి సేయగ వేద శాస్త్రముల్
నేరువ లేదు; నిన్నరయు నిర్మల సత్కవితావధాన వి
ద్యా రమ దక్క లేదు; భవ తాపము బాపగ మ్రొక్కెదన్, శుభా
కార, వికార దూర, గత కల్మష నాశన; జానకీపతీ!
పదిమాటల్ యొక దాని వెంటొకటి గూర్పన్ గల్గి యేదో సభన్
జదువన్ నేర్చిన జాలు, దా కవియగున్, సత్కారముల్ వంది మా
గద కైవార తతుల్ లభించు జగతిన్; కానీ చిదానంద సం
పద దక్కన్ గలదే భవత్పదయుగంబర్చింపకన్ రాఘవా!
వసియింపగా నీవు వాల్మీకి హృదయాన
రామాయణ మతడు వ్రాయ గలిగె
భవభూతి పలుకులో భాసించగా నీవు
తరియించె నతడు నీ చరిత వ్రాసి
త్రాతవై మొల్లను రక్షింప నాయమ
తాదాత్మ్యమొందె నీ తలపు లోన
కరుణాపయోధివై గనుటచే గోపన్న
త్వత్కథామృతమిచ్చి దనిపె బుధుల
విశ్వనాథుని భావాబ్ధి వెలుగ నీవు
కల్ప వృక్షంబు రమణీయ కాంతు లీనె
అట్టి ధన్యుల పాలించు టరుదె నీకు
మమ్ము బోంట్లను చూడు రామయ్య యింక!
నీ వైవాహిక వేళ శంభుడు, భవానీ, భారతీ, బ్రహ్మలున్
ఆ వైకుంఠ పురంబు వారలు, సురేంద్రాదుల్ సభావేది నిన్
దీవింపన్ దగు కట్న కానుకలతో; ధీ వర్య, నల్పజ్ఞుడన్
భావింతున్ రతనమ్ములైదు యొసగన్ భవ్యాత్మ గైకో దయన్!
Like

No comments: