Sunday, July 10, 2016

ఓం శ్రీ సరస్వత్యై నమః
సముద్ర మథనం జరిగితేనే అమృతాన్ని ఆస్వాదించగలం.
చర్య ప్రతిచర్యలు సమానంగానూ వ్యతిరిక్త దిశలోనూ జరుగుతాయని సైన్స్ చెపుతుంది. ఒక చర్య జరుగుతూన్న సమయంలో ఎదురుగా జరగాల్సిన ప్రతిచర్య ఆగిపోవాలి లేదా ఇటు వైపు చర్యను జరగనివ్వాలి. ఇదే పద్ధతి తదుపరి మరొకవైపు నుండి జరగాలి. అప్పుడే సముద్ర మథనం జరిగి అమృతం ఆవిర్భవిస్తుంది. అలా జరగని వేళ అక్కడ మథనం జరగక పోగా "టగ్ ఆఫ్ వార్" జరుగుతుంది. నేను గొప్ప... కాదు కాదు నేనే గొప్ప అనే భావనతో కూడిన చర్చల వల్ల సంఘర్షణలకు బీజంపడుతుంది.
సమాజం పురోగమన దిశలో నడుస్తున్న సమయంలో మేధో మథనం వల్ల ప్రయోజనం ఉంటుంది. అభిప్రాయాలు పంచుకునే సమయంలో జనించే వైవిధ్యం వల్ల సంఘర్షణలు సహజంగానే ఉద్భవిస్తాయి. ఆ సంఘర్షణల పరంపర వల్లనే హాలాహలం రావచ్చు. దానిని అధిగమించాకనే అమృతం ఆవిర్భవిస్తుంది. అయితే ఒక సత్సమాజ స్థాపన లక్ష్యంగా పనిచేసే సమయంలో జరిగే చర్చలలో ఒక వర్గం వెలిబుచ్చే అభిప్రాయాన్ని మరొక వర్గం గౌరవించాలి, ఆ వాదనలో అసమంజసమైన విషయాన్ని సున్నితంగా తెలియచేయాలే కాని తమ వాదనలే గొప్పవనీ ఎదుటి వారి వాదన పనికి రానిదని వితండవాదనలు చేయడం వల్ల ఆ వాదనలు సకలజనామోదన పొందే అవకాశం ఉండదు. ఎవరికి వారు తమ వాదనను ఎదుటివారిపై రుద్దాలనుకోవడం వల్ల ఆమోదింపచేయాలనే భావన వల్ల సంఘర్షణ తీవ్రమౌతుందే కాని ఎదుటివారిని ఒప్పించలేదు. విషయం లేకపోయినా వాదనా పటిమ వల్ల ఎదుటివారి నోరు మూయించగలరే కాని తమ దృక్కోణాన్ని ఆమోదింపచేసుకోలేరు.
ఈనాడు టి.వీలలో ఏ ఛానల్ పెట్టినా అందులో ఏదో ఒక చర్చ చేస్తుంటారు. చేపల మార్కెట్ ను తలపించే రీతిలో ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటూ పెద్ద గొంతుకలతో అసహనంగా వ్యవహరించే విధానం చూస్తుంటే అసహ్యంగా ఉంటుంది. ఈ చర్చల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఒక వ్యక్తి ఒక పార్టీనుండి గతంలో మాట్లాడుతూ ఖండించిన అంశాన్ని మరొక పార్టీ తరఫున సమర్ధన చేయడం.
అందుకని ఏ విషయాన్నైనా సమగ్రంగా చర్చ చేయాలని తలచినప్పుడు "మథనం" చేయాలే కాని "టగ్ ఆఫ్ వార్" గా మలచ రాదు.
Palakurthy Rama Murthy
9441666943

No comments: