యక్షుడు ధర్మరాజును అడుగుతున్నాడు....
ఏమి కతమున భూదేవు డెసగు దేవ భావమున? నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు? నసాధుత్వ మెద్దాన జెందు? మానుషుండగు నాతడే దాన? జెపుమ!
౧) దేని వల్ల భూదేవుడు (బ్రాహ్మణుడు) దివ్యత్వాన్ని సాధిస్తాడు?
౨) అతనికి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది?
౩) అతను ఎలా మాలిన్యుడౌతాడు?
౪) దేని వల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు?
ధర్మ రాజు ఇలా చెపుతున్నాడు....
అనవుడు ధర్మజుండనియె; "అధ్యయనంబున దేవ భావముం"
గను నవనీ సుపర్వు; డధిక వ్రతశీలత సాధుభావమా"
తనికి; "విశిష్ట వృత్తి దిగద్రావి యసాధువ"నంగ నుండు; "శౌ
చ నియతి లేక మృత్యు భయ సంగతి" నాతడు మానుషుండగున్!
౧) దానికి ధర్మ రాజు ... వేదపఠన వల్ల విప్రుడు దివ్యుడౌతాడంటాడు. "విద్" అనే ధాతువు నుండి వచ్చింది వేదం అనే మాట. విద్ అంటే తెలుసుకొనుట. ఇది నిరంతరం జరిగే... జరగాల్సిన ప్రక్రియ. అధ్యయనాధ్యాపకాలు ఎంత ఎక్కువగా జరిగితే మేధస్సు అంత చురుకుగా పనిచేస్తుంది. మీమాంసతో (హేతువుతో సాధించే శాస్త్రము) ఆ మేధస్సు సరైన మార్గంలో పయనిస్తుంది... సరైన విధానంలో ఆలోచిస్తుంది. బ్రాహ్మణుడు విజ్ఞానానికి ప్రతీక... నిర్వహణకు అధికారి. అందువల్ల నిర్వహణ సలిపేవాడు ఎలా దివ్యాత్వాన్ని సాధిస్తాడు? అని యక్షుని ప్రశ్నలో అంతరార్థం. నిర్వహణ మేధస్సుకు సంబంధించినది. విషయ సేకరణ ఎక్కువగా జరగాలి. సంగ్రహించిన విషయాన్ని సరైన కోణంలో విశ్లేషణ చేసుకోవాలి. తాన ఆధ్వర్యంలో నడచే సంస్థలో విజ్ఞానం కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వస్తు సంభారాలు కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు... ఏదైనా నివహణకు అవసరమైనవి - అవసరంలేనివి... ఇప్పుడు కాకపోయినా తదుపరియైనా అవసరం అయ్యేవి.. నిరర్ధకమైనవి... ఇలా గుర్తించడం వ్యర్ధాలను నియంత్రించడం, అవసరమనవాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం లోనే నిర్వహణాధికారి సామర్ధ్యం నిరూపితమౌతుంది. క్రొత్తను ఆవిష్కరించడం, మార్పును ఆహ్వానించడం, సమర్ధులైన అనుచరులను గుర్తించడం, బాధ్యతలను పంచుకోవడం వల్ల తన సామర్ధ్యాన్ని ప్రకాశం చేసుకోగలుగుతాడు నిర్వహణాధికారి. క్రొత్తను అన్వేషించడం (Reasearch) ఉన్న దానిని అభివృద్ధిపరచడం(Development) వల్ల సంస్థ పురోగతి సాధ్యపడుతుంది. సంస్థను నమ్ముకున్న వారికి ప్రగతి సాధ్యపడుతుంది. ఆ సంస్థను నిర్వహించే నిర్వహణాధికారి దివ్యుడౌతాడు.
౨) నిర్మలత: నిష్ఠ వల్ల నిర్మలత్వం ఏర్పడుతుంది. నియమబద్ధమైన నిష్ఠ, క్రమశిక్షణాపూర్ణ జీవన విధానం వల్ల నిర్మలత వికసిస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టడం, సత్య నిష్ఠ వల్ల మనసులో నెలకొన్న ధైర్యం.... తన మార్గంలో ఎదురయ్యే ఆటుపోటులను భరించగలిగే స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. దాని వల్ల ఎంత ఒత్తిడిలోనైనా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. స్వార్థ ప్రయోజనాలకు దూరంగా కర్తవ్య నిష్ఠతో చరించే వ్యక్తి నిర్మలుడౌతాడు.
౩) మలినం ఎలా? స్వచ్ఛమైన శీలవంతుడై, స్వార్ధానికి దూరంగా సంస్థ ప్రయోజనాలను, జాతి ప్రయోజనాలను కాపాడేవాడు ఉత్తమ నిర్వహణాధికారి. అలాకాక శీలానికి విలువ నివ్వకుండా, అధర్మ వర్తనుడై, స్వార్థపరుడైన వ్యక్తి ఎంత సమర్థుడైనా, విద్యావంతుడైనా అతడు పాపవర్తనుడే అవుతాడు. అతని వర్తనలో మాలిన్యం కనిపిస్తుంది.
౪) మర్త్యుడెలా అవుతాడు? భయం వల్ల ఎంతటి వాడైనా మర్త్యుడవుతాడు. అంతశ్చేతనలో పొడసూపే భయం తన విజయంపై తనకే అనుమానాన్ని కలిగిస్తుంది. అనుమానం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏకాగ్రత లేమి తన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దానితో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేక పోవడం దాని వల్ల కార్య విఫలతా కలుగుతాయి. ఎవడైతే భయాన్ని ఆశ్రయిస్తాడో అతడు అపజయం పాలవుతాడు. అపజయం పొందడం వల్ల దివ్యుడైనా మర్త్యుడౌతాడు.
ఎవరైతే మనో వాక్కాయ కర్మలతో శుచిత్వం పొందుతాడో అతడు దివ్యుడు. దానికి దూరమైన వాడు మర్త్యుడు.
No comments:
Post a Comment