Saturday, July 30, 2016

అణిమాది సిద్ధులను ఆధ్యాత్మిక సాధనలోనే కాక భౌతిక జీవనంలో ఎలా అన్వయించుకోవచ్చు (ఒక పరిశీలన)...

శ్రీ పతంజలి మహర్షి ప్రవచించిన అణిమ ఆదిగా గల అష్ట సిద్ధులు సాధన ద్వారా లభిస్తాయి. మూలాధారంలో సుప్తావస్థలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమయి సహస్రారం దాకా పయనించడం లక్ష్యంగా సాగే సాధనయే యోగ సాధన. ఈ మార్గంలో సాధన చేసే సాధకుడు అనంతత్త్వాన్ని దర్శించి ప్రదర్శించ గలుగుతాడు. అనంత చైతన్యంలో తానూ అంతర్భాగమనే జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో గలుగుతాడు. అనంతం నుండి అనంతం దాకా సాగే జీవుని సాధనా పథంలో "మూలాధార చక్రం"లో జాగృతమైన కుండలినీ శక్తి "స్వాధిష్ఠాన చక్రం" ద్వారా "మణిపూరకాని"కి, అక్కడి నుండి "అనాహతాని"కి అక్కడి నుండి "విశుద్ధ చక్రా"నికి అక్కడి నుండి "ఆజ్ఞా చక్రా"నికి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి "సహస్రారా"నికి చేరడం వల్ల అమృతత్త్వాన్ని సాధించడం జరుగుతుంది.
నిజానికి ప్రతి వ్యక్తీ అమృత స్వరూపుడే, అనంత శక్తివంతుడే, సకల సిద్ధులనూ సంగ్రహించుకున్న వాడే అయినా తనను తాను అనుభవ పూర్వకంగా తెలుసుకునే విధానానికి లేదా తన యదార్ధ రూపాన్ని దర్శించే విధానానికి దూరమవడం జరుగుతుంది. స్వస్వరూపాన్ని సందర్శింప గలిగిన ప్రజ్ఞ, అజ్ఞానం అనే మాయ వల్ల "అభాస" మయింది లేదా మూసివేయబడింది. ఆ ప్రజ్ఞను లేదా "తెలివి"ని లేదా "యెఱుక"ను జాగృతం చేసుకునే విధానమే యోగ సాధన.
ఈ యోగ సాధన క్రమంలో సాధకుడు అష్ట సిద్ధులను (ఎనిమిది అతీంద్రియ శక్తులను) సాధిస్తాడు. అవి....
అణిమా, మహిమా చైవ గరిమా లఘిమా తధా
ప్రాప్తిః ప్రాకామ్య మీశిత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
అణిమా, మహిమా, గరిమా లఘిమా, ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశిత్వం మరియు వశిత్వం అనేవి అష్ట సిద్ధులుగా చెపుతుంది యోగ శాస్త్రం.
కుండలినీశక్తి స్వాధిష్ఠానంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో అణిమ అనే సిద్ధి ప్రవేశిస్తుంది. దాని వల్ల సాధకుడు అవసరమైన వేళ పరమాణువు కన్నా కూడా సూక్ష్మంగా మారగలుగుతాడు. దానివల్ల తన మానసిక శక్తిని తన లక్ష్యానికి అనుసంధానించుకో గలుగుతాడు.
కుండలినీ శక్తి మణిపూరకంలోనికి ప్రవేశిస్తే సాధకునిలో మహిమ మరియు గరిమ అనే సిద్ధులు ప్రవేశిస్తాయి. వాటి వల్ల సాధకుడు దివ్యత్వాన్ని పొందుతాడు.
కుండలినీ శక్తి అనాహతంలో ప్రవేశించగానే లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం అనే శక్తులు సాధకునిలో ప్రవేశిస్తాయి. వాటి వల్ల అన్ని విషయాలూ తనకనుకూలంగా మారడం సంభవిస్తుంది.
కుండలినీ శక్తి విశుద్ధ చక్రంలో ప్రవేశించగానే ఈశిత్వ సిద్ధి సాధకునికి లభిస్తుంది. సకల చరాచర సృష్టిలో తానే నిండి యుండడం తాను దర్శించగలుగుతాడు.
కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించగానే సాధకునిలో వశిత్వ సిద్ధి ప్రవేశిస్తుంది. దీని వల్ల సకల సృష్టినీ శాసించ గలుగుతాడు.
సాధారణంగా సాధకులు ఈ స్థితిలో స్తబ్దతను ఆశ్రయిస్తారు. సమాధి స్థితిగా పిలువబడే ఈ స్థితిలో ప్రశాంతతను అనుభవిస్తూ ఉండే సాధకుడు ముందుకు పోవడానికి ఇష్టపడడు. కాని ఎవరైతే తమ సాధనను నిలిపివేయకుండా, ఆనందంద్వారా లభిస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ముందుకు సాగుతూ సహస్రారాన్ని చేరుతారో వారికి అమృతత్త్వం సిద్ధిస్తుందని యోగ శాస్త్రం చెపుతుంది.
ఇది ఆధ్యాత్మిక సాధనా మార్గంలో కలిగే సిద్ధి. అందరికీ ఆ సాధన సాధ్యమా? అంటే సాధ్యమే కాని అందరూ ఆ సిద్ధులను పొందేంత ప్రయత్నశీలురై ఉండకపోవచ్చు. వారికి ఆధ్యాత్మిక సాధనలో తమ ఎదుగుదల కన్న సమాజప్రగతిపై ఎక్కువ ఆకాంక్ష ఉండవచ్చు. అలాంటి వారికి ఈ సిద్ధుల ప్రయోజనం ఉండదా?
బౌతిక జీవనంలో ప్రభావవంతమైన లేదా ప్రకాశవంతమైన నాయకుని ఎదుగుదలలో అణిమాది అష్ట సిద్ధులను ఎలా అన్వయిస్తాము?

అణిమ అంటే పరమాణువు కన్నా చిన్నగా కావడం: ఒక సంస్థలోని ఉద్యోగి; ఒక అటెండర్ కావచ్చు లేదా జనరల్ మేనేజర్ కావచ్చు, C.E.O. కావచ్చు లేదా యజమాని కావచ్చు తోటి వారిని సాదరంగా చిరునవ్వుతో పలకరించడం, ముందుగా తానే పలకరించడం, అందరికీ అందుబాటులో ఉండడం వల్ల తోటి ఉద్యోగులతో అనుబంధాన్ని పెంచుకోవడం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య అరమరికలు లేని సంబంధం ఏర్పడుతుందో అప్పుడు అక్కడ భయం తొలిగిపోతుంది. ఆ సంస్థలో చిన్న పెద్ద అనే భేదభావన తొలిగిపోయి సంస్థ అభివృద్ధిలో అందరమూ భాగస్వాములమే అనే విశాల దృక్ఫథం ఏర్పడుతుంది. సంస్థలో ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క రంగంలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించి గౌరవించడం, ఆ నైపుణ్యం ముందు తన నైపుణ్యం చిన్నదనే సత్యాన్ని గుర్తించడం వల్ల తను చిన్నవాడిననే భావనను పొందగలిగితే (ఆత్మ న్యూనతను కాదు) అందరితో కలసిపోవడం సులభమే. వినయంతో ఎదుటి వారికి అవకాశం ఇస్తే సంస్థ అభివృద్ధికై ఉత్తమమైన సలహాలను పొందవచ్చు. సాధారణంగా ఉన్నతాధికారి ఎంత చనువిచ్చినా క్రింది స్థాయి ఉద్యోగి తన పరిధులు దాటడు. ఎప్పుడైనా అలాంటి అవాంఛనీయ సంఘటన లెదురైతే వాటిని మొగ్గలోనే త్రుంచివేయడం వల్ల ఇతరులకూ ఆ సంకేతాలను పంపడం సాధ్యపడుతుంది. క్రింద నిలుచోవడం వల్ల స్థిరత్వాన్ని పొందగలుగుతాము.
మహిమ అంటే ప్రభావవంతమైన స్థాయికి చేరడం. మన నిర్ణయాలు, మాటతీరు, ఇతరులతో మన సంబంధాలు, పనిచేసే విధానం, ఒక బృందాన్ని ఏర్పరచి ఆ బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను చేరే మార్గంలో అందరి వ్శ్వసనీయతను పొందడం వల్ల మనలోని ఉన్నత వ్యక్తిత్వం ఆవిష్కృతమై తోటివారిని ఆకర్శిస్తుంది. ఇతరులకు సేవలు అందించడం, ఇతరుల పనిలో సహకరించడం, తగిన సూచనలతో ప్రేరణ నందివ్వడం వల్ల పని సమయానికి పూర్తికావడమే కాక మనమూ మహిమాన్వితులుగా సంస్థలో నిలుస్తాము.
గరిమ అంటే గొప్పదనం. మన పనివిధానం మన స్థాయిని సూచిస్తుంది. ఏ అడ్డంకులూ లేకుండా నడచే పనివిధానం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించడం కష్టసాధ్యం. అడ్డంకుల నధిగమిస్తూ, తోటివారి బరువు బాధ్యతలలో భాగస్వామిగా నిలవడం వల్ల మన గొప్పదనం ఇనుమడిస్తుంది. బృందంలో మన విలువా పెరుగుతుంది. మనపై మనకు కలిగిన నమ్మకం వల్ల, మనపై పై అధికారులకు కలిగిన నమ్మకం వల్ల క్లిష్టతరమైన బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. దానితో మనకు నిర్వహణా సామర్ధ్యం పెరుగుతుంది. సంస్థలో మన కంటూ గుర్తింపు కలిగిన ఉన్నత స్థానం పదిలపడుతుంది.
లఘిమ అంటే అవసరమైన వేళ బరువు తగ్గించుకోవడం. ఏ సంస్థలోనైనా అన్ని పనులు ఒక్కరెవ్వరూ చేయలేరు. ఏ సంస్థ విజయమైనా ఉమ్మడి భాగస్వామ్యంతోనే సంభవిస్తుంది, స్థిరీకరింపబడుతుంది. బాధ్యతలను ఎదుటివారి సామర్ధ్యాన్ని గుర్తించి ఎవరెవరి స్థాయికి తగిన రీతిలో వారికి అప్పగించడం వల్ల మన పని సులువవుతుంది. అధికార వికేంద్రీకరణ వల్ల పనులు వేగవంత మౌతాయి. నిర్ణయాధికారాలు, తగిన వనరుల సమీకరణ అధికారం యోగ్యులు అర్హులు అయిన వారికి అప్పగించడం వల్ల అతి ముఖ్యమైన విషయాలపై మనసును కేంద్రీకృతం చేయగలుగుతాము. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్పాదనా సామర్ధ్యాన్ని పెంచడంవల్ల సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఉద్యోగులందరికీ ఉపాధి లభిస్తుంది. అప్పుల భారం తగ్గిన సంస్థ మరియు అహంభావం తగ్గిన వ్యక్తీ గమనం ప్రశాంతంగా ఉంటుంది.
ప్రాప్తి అంటే ప్రాప్తించడం లేదా లభించడం. ఏది లభించాలి? దేనినైతే లక్ష్యంగా పెట్టుకొని వెదుకుతున్నామో అది లభించడమే ప్రాప్తి. అయాచితంగా ఏదీ మనకు లభించదు... ఒకవేళ లభించినా అది సంతోషాన్నిస్తుందేమో కాని ఆనందాన్నివ్వదు. అదృష్టాన్ని నమ్ముకొనో, జ్యోతిష్యాన్ని నమ్ముకొనో సోమరిగా కూర్చుంటే ఏ ఫలితమూ రాదు. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం ప్రకృతిలో మరేదీ లేదు. అన్వేషణాశీలియై ముందుకు సాగిపోయే వ్యక్తి తప్పనిసరిగా విజయాన్ని పొందుతాడు. విజయమెప్పుడూ కృషీవలురనే వరిస్తుంది. సాధనాపటిమతో నిరంతరం ఉత్సాహం, సాహసం ఊపిరులుగా ఉద్యమించే వారే దేనినైనా పొందుతారు. అది అపజయమైనా బాధపడరు. ఆ అపజయాన్నుండి పొందిన స్పూర్తితో మరొక మార్గంలో గమిస్తారు, ఎక్కడ ఏ లోపం వల్ల తాము ఆశించిన ఫలితాన్ని పొందలేక పోయారో విచారించి, అవసరమైన మార్పులతో, చేర్పులతో విజయ మార్గంలో గమిస్తారు.
ప్రాకామ్యము అంటే విశిష్టంగా లేదా విశేషంగా కోరదగినది. కోరదగినది ఏది? ఏది భౌతిక జీవనంలో ప్రేయస్సును, ఆధ్యాత్మిక జీవనంలో శ్రేయస్సును ఇస్తుందో దానినే కోరాలి, అదే కోరదగినది కూడా. యద్భావం తద్భవతి. ఏది బలంగా కోరుకుంటామో అదే లభిస్తుంది లేదా భవిస్తుంది. దృఢ నిశ్చయంతో, సాధించగలననే అపారమైన విశ్వాసంతో, అచంచలమైన మనస్సుతో దేనిని కోరుతామో అది లభిస్తుంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. మన మనస్సుకు అఖండమైన శక్తి ఉంది. మన అంతర్మనస్సును నిత్యం ధ్యానాదులతో బలీయం చేసి దానికి నివేదించిన కోరికలను ఆ అంతర్మనస్సే భవించేట్టుగా చేస్తుంది. భక్తిశ్రద్ధలతో సమర్పణాభావంతో నలుగురికి మేలుకలగాలనే కాంక్షతో మనం నివేదించే కోరికలు కోరదగినవని ప్రకృతి తలుస్తే "తధాస్తు" అంటూ ఆ కోరికలను సిద్ధింప చేస్తుంది. కాకపోతే గాలిలో దీపం పెట్టి దైవంమీద భారం వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. మనవంతు కృషి చేయడం తప్పనిసరి.
ఈశిత్వం అంటే అంతటా వ్యాప్తి చెందడం. బాధ్యత తీసుకొని సమర్ధతతో వ్యవహరిస్తూ కార్యాన్ని చక్కదిద్దే వ్యక్తికి కుటుంబంలో కాని, సంస్థలో కాని, సమాజంలో కానీ గుర్తింపు ఉంటుంది. అన్నింటా అతనే అవుతూ కార్యాన్ని చక్కదిద్దే సామర్ధ్యానికి తన తెలివితేటలను ప్రతినిత్యం పదను పెట్టుకోవడం, తన విజ్ఞానాన్ని అధునీకరించుకోవడం, అవసరమైన మార్పులు చేసుకుంటూ అనునిత్యం క్రొత్తదనాన్ని అన్వేషించడం వల్ల తన పరిధి పెరుగుతుంది. విస్తరించిన పరిధి విలువను పెంచుతుంది. విలువ ఔన్నత్యాన్ని పెంచుతుంది.
వశిత్వం అంటే అందరూ తన వశులై పనిచేయడం. ఎప్పుడైతే తోటివారికి తన సామర్ధ్యంపై నమ్మకం పెరుగుతుందో, తన విలువ సమాజంలో లేదా సంస్థలో పెరుగుతుందో అప్పుడు తన సూచనల కనుగుణంగా అందరూ పనులు చేయడం జరుగుతుంది. ప్రేమ, దయ, దాక్షిణ్యము, కరుణ, సంతోషం, ఆదరణ లాంటి చక్కని గుణాలు ఎవరిలోనైతే వెల్లివిరుస్తాయో అతడు వశిత్వ సిద్ధిని పొందినట్లే.
ఈ ప్రకృతిలో ఉన్నది ఒక్కటే... చూచేదృష్టిలో బేధమే కాని సృష్టిలో బేధం లేదు. ఏ విజ్ఞానమైన అన్వయించుకునే విధానాన్ని బట్టి దాని ప్రయోజనం కనిపిస్తుంది.
పైన చేసిన అన్వయం సరైనదా అంటే కావచ్చు కాకపోవచ్చు. ఇది ఒక రూపం. దీనికి మరెన్నో రూపాలు ఉండవచ్చు. ఒక్కొక్కరి ఆలోచనా విధానంలో రూపుదిద్దుకున్న ప్రజ్ఞ సమాజాన్ని ఒక్కొక్క కోణంలో చూపించవచ్చు, అభివృద్ధి చేయవచ్చు. ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా ఎవరి ఆలోచనా విధానం ఏ ఫలితాన్నిస్తుందో అది సమాజానికి ఎంత మేరకు ఉపకరిస్తుందో ఆ ఆలోచనను ప్రతిక్షేపించి నప్పుడు తెలుస్తుంది.
నా అలోచనకు ప్రతి రూపం పై అన్వయం. ఇదీ మొత్తంగా నాది అని చెప్పలేను. యోగ మార్గానికి సంబంధించిన విషయం యోగశాస్త్ర గ్రంథాలలో నుండి గ్రహించినది కాగా శ్రీ గట్టు నారాయణ గురూజీ గారి పాతంజలి యోగసూత్ర బోధామృతలహరి చదివాక మదిలో మెదిలిన భావానికి అక్షరరూపం రెండవ భాగం. (With due apologies to Sri Narayana guruji)
ఏ సూచనలైనా కృతజ్ఞతతో స్వీకరిస్తాను, అవసరమైన మేరకు మార్చుకుంటాను.
నమస్సులతో
Palakurthy Rama Murthy
9441666943

Wednesday, July 13, 2016

భిన్నత్వంలో ఏకత్వం

చేతికి ఉన్న ఐదు వేళ్ళు సమానంగా ఉన్నాయా? అని కొందరి ప్రశ్న. సామాజిక ఆర్ధిక అంతరాలు ఉంటాయనే వాదన వారిది. పులి న్యాయపు చూపు ఎంత ప్రమాదకరమైనదో, ఈ వాదనా అంతే ప్రమాదకరమైనదనే వాదన మరొకరిది. విభిన్న దృక్కోణాలతో సమాజాన్ని పరిశీలించే వారికి ఈ రెండు వాదనలు సమంజసమే అనిపిస్తాయి. ఎందుకంటే, ప్రతి సమాజంలో వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తుల ఆలోచనా సరళి వారి వారి నైపుణ్యాలు, పనిచేసే విధానాలు వేరు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వారి లక్ష్యాలూ వేరుగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ మనుషులందరూ సమానమే అనేది వారు ఒప్పుకోరు. అలాగే సమసమాజ స్థాపనలో వ్యక్తులకు సమాన స్థాయి ఉంటుంది, వారి ఆకలి దప్పులు, కనీస అవసరాలు సమానమే. కాని దోపరి వర్గం ఎప్పుడూ బలహీనులను పీడిస్తూనే ఉంటుంది కాబట్టి వారిపై తిరుగుబాటు చేయడమే ఉత్తమం, అనే వాదన కూడా ఆలోచింప చేస్తుంది. అయితే ఈ రెంటినీ సమన్వయం చేయగలిగిన అలోచనా విధానం రూపు దిద్దుకుంటే సమాజానికి ఉపయుక్తమౌతుంది.
సరే, ఈ వాదనలెలా ఉన్నా, మహాభారతంలో పంచపాండవులు చివరిదాకా ఒక్కటిగానే ఉన్నారు. అంటే వారి మధ్య అభిప్రాయ భేదాలు లేవని అనలేము. వాదనలూ లేవనలేము. అభిప్రాయ భేదాలెన్ని ఉన్నా, కష్టకాలంలో కూడా వారు పరస్పర దూషణలతో విడిపోలేదు. వీరిని సమన్వయం చేయగలిగిన శక్తిమంతురాలు... ద్రౌపది. ఆమె కార్య నిర్వహణలో తమ వైషమ్యాలను పరిష్కరించుకుంటూ, తాము ఏర్పరచుకున్న "విలువల"కు కట్టుబడి కడదాకా ఒక్కటిగా నిలిచారు. విజయం సాధించారు.
ఆ పాండవుల వ్యక్తిత్వాలను పరిశీలిస్తే....
ధర్మరాజు: ఒక నాయకునిగా లేదా రాజుగా తన వద్దకు వచ్చేవారు సమస్యలతో కాకుండా పరిష్కారాలతో రావాలని కోరుకునే మనస్తత్వం కలిగినవాడు. ఏ సామాజిక చట్టాలు ఆనాడు అమలులో ఉండేవో ఆ చట్టాలప్రకారమే అందరూ నడవాలనే ఆలోచనా సరళి అతనిది. చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్యనూ సమర్థించని వ్యక్తిత్వం అతనిది. ధర్మానికి న్యాయానికి తానే ప్రతినిధిగా ఊహించుకునే వాడు. దానితో తన తప్పిదాలకు తానే కాకుండా తన వారుసైతం బాధపడడం భారతంలో కనిపిస్తుంది.
భీముడు: ఆలోచనలకన్నా ఆచరణకు ప్రాధాన్యత నిచ్చేవాడు. దైవ నిర్ణయం అనుకుంటూ క్రియా శూన్యులై తమ సామర్ధ్యాన్ని గుర్తించని సోమరితనాన్ని అసహ్యించుకునే తత్వం భీమునిది.
అర్జునుడు: ధనుర్ధారి. తాను బాణం వేయడం నేర్చిన వాడు. అలాగే తనపై సంధించ బడిన బాణాన్ని ఎదుటి వారిపైకి త్రిప్పి కొట్టగల సామర్థ్యం కలిగినవాడు. ఎవరికీ జవాబుదారీగా ఉండడానికి ఇష్టపడని వాడు.
నకులుడు: శారీరక సౌందర్యం పరాక్రమం కలిగిన వాడే కాని ఆలోచనా శక్తితో పనిచేసేవాడు కాదు. తనకప్పచెప్పిన పనిని నిరాటంకంగా నిర్వహించేందుకు ఇష్టపడేవాడు.
సహదేవుడు: చాలా తెలివి కలవాడు. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడని వాడు. ఆలోచనా పటిమ, విశ్లేషణా శక్తి ఎక్కువ. సమస్య ఏదైనా పరిష్కారాన్ని కనుగొనేందుకు సిద్ధమౌతాడు. తన దాకా వచ్చిన ఏ సమస్యనైనా తానే పరిష్కరించడానికి ఇష్ట పడతాడే కాని ఇది నా సమస్య కాదని తప్పుకునే స్వభావం లేదతనికి. తన సలహా కోరని సన్నివేశాలలో మౌనంగా ఉండడం అతని తత్వం.
ఇలా వైవిధ్య భరితమైన వ్యక్తిత్వాలు జీవితాంతం ఒకటిగా నిలబడి భిన్నత్వంలో ఏకత్వం సాధించడం సాధ్యమేనని నిరూపించాయి.
Palakurthy Rama Murthy

బోధించడం - నేర్చుకోవడం


గురువు బోధిస్తాడు, శిష్యుడు నేర్చుకుంటాడు. ఈ ప్రక్రియలో బోధన, నేర్చుకోవడం మాత్రమే లేవు. దీనిని పరిసరాలు, వాతావరణం, స్నేహాలు, శ్రద్ధ ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తావి. అన్నీ సమకూరినప్పుడే ఈ ప్రక్రియ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది. గురువు బోధించినా ఒక్కొక్కప్పుడు శిష్యుడు నేర్చుకోలేక పోవచ్చు. గురువు చెప్పకపోయినా శిష్యుడు అనేక విషయాలు నేర్వనూ వచ్చు. గురువు అభ్యాసకుడుగా మారినప్పుడు మాత్రమే శిష్యుడిని ప్రభావితం చేయగలుగుతాడు, ప్రేరణ నివ్వగలుగుతాడు. ఎందుకంటే బోధన పరిమితమైనది కాగా నేర్వడం అపరిమితమైనది. ప్రేరణ ఆసక్తిని పెంచుతుంది. ఆసక్తి జిజ్ఞాసగా మారి ప్రశ్నను వేసుకుంటుంది, వేస్తుంది. ఆ ప్రశ్నించే తత్త్వమే సాంకేతికతకు మూలమౌతుంది. అయితే ప్రశ్నించడం ఎలా? దేనిని ప్రశ్నించాలి? ఎందుకని ప్రశ్నించాలి? ఈ విషయాలపై అవగాహన లేని నాడు ప్రశ్న అపేక్షిత ఫలితాన్నివ్వదు.
గురువు శిష్యునిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలనుకున్నప్పుడు ప్రశ్నించడం చేస్తాడు. ఆ ప్రశ్నలు భౌతిక, మానసిక, భావోద్వేగాలను స్పృషించే విధంగా ఉంటాయి. జవాబులు తానివ్వడు. జవాబులు రావాలని కూడా కోరుకోడు. వచ్చినా మంచిదే రాకపోయినా మంచిదే. శిష్యునిలో ఆలోచన రేకెత్తాలి. వివిధ కోణాలలో ఆలోచనలను విశ్లేషించుకొని ప్రతి పరిష్కారానికీ ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి అందులో ఉత్తమమైన దానిని ఆచరణలో పెట్టే విధంగా ప్రేరణ నిస్తాడు. ఆ ప్రయత్నంలో శిష్యుడు పొరబడి తప్పుచేస్తున్న సమయంలో లేదా ఆపదలో ఇరుక్కున్న సమయంలో అతనిని కాపాడే ప్రయత్నంచేస్తాడు. ఈ ప్రక్రియ ద్వారా శిష్యుని ఆత్మ విశ్వాసాన్ని పెంచడమే కాక శిష్యుని మార్గాన్ని నిష్కంటకం చేయడం కూడా (ప్రచ్ఛన్నంగా లేదా ప్రత్యక్షంగా) గురువు లక్ష్యంగా ఉంటుంది.
శిష్యుడు నేర్చుకుంటే అతనికే మంచిది లేదా నష్టపోయేదీ అతడే.
ఏకలవ్యుని బొటన వేలు కోరిన ద్రోణుడు దుర్మార్గునిగా చిత్రీకరిస్తారు కొందరు మేధావులు. ఆ మేధావులు భారతం జరిగింది అంటే ఒప్పుకోరు. ఎందుకంటే విదేశీ చరిత్రకారులు చెపితేనే అది వారికి వేదం.
అభివృద్ధి ఫలాలు అర్హత ప్రాతిపదికగా పంచబడితే ఆ సమాజంలో శాంతి నెలకొంటుంది. అనర్హత సాంకేతికతను ఆలంబన చేసుకుంటే అశాంతి రాజ్యమేలుతుంది.

Tuesday, July 12, 2016

అంతర్గత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించండి - సహజంగా జీవించండి

ఓక రైతు తన పొలంలో తిరుగుతూ ఉండగా గట్టుపై అతనికి ఒక గద్ద పిల్ల కనిపించింది. ఆ గద్దపిల్లను చూచి ముచ్చట పడ్డ రైతు దానిని తీసుకొని వెళ్ళి తాను పెంచుతున్న కోళ్ళ తో పాటుగా పెంచ సాగాడు. గద్ద పిల్ల కొద్దిగా పెరుగుతూ వస్తుంది. దాని ఆకృతి తప్ప అలవాట్లన్నీ తనతో ఉన్న కోడి పిల్లల వలెనే ఉన్నాయి. కోడి పిల్లల వలెనే నడవడం, అరవడం తినడం లాంటివి నేరుస్తున్నది, ఆ గద్ద పిల్ల. ఆ గద్దపిల్లను చూస్తున్న రైతుకు దానిపై ప్రేమ అభిమానం జనించాయి.
ఒకనాడు ఆ రైతు ఇంటికి ఒక మిత్రుడు వచ్చి కోళ్ళతో పాటుగా పెరుగుతూ ఉన్న గద్దపిల్లను చూచాడు. ముచ్చటపడ్డాడతను. అసహజంగా పెరుగుతున్న గద్దపిల్లను దాని జాతికి సహజమైన రీతిలో పెంచుతానని చెప్పి రైతు అనుమతితో ఆ గద్ద పిల్లను తీసుకొని వెళతాడు.
గద్ద పిల్ల ఇప్పుడు మరొక చోటికి మారింది. స్థానం మారింది. వాతావరణం మారింది. సంరక్షణా విధానం మారింది. తనతోపాటు ఉన్న సహచరులూ మారిపోయారు. అంతా క్రొత్త. సహచరులను అనుసరిస్తూ, అనుకరిస్తూ యజమాని విసిరిన గింజలను ఏరుకొని తినే అలవాటుకు భిన్నంగా క్రొత్త యజమాని నియంత్రణలో ఆహారాన్ని వెతుక్కుంటూ స్వయం నిర్ణయాలతో ముందుకు సాగాల్సిన అవసరం వచ్చింది. ఆలోచనకు బీజంపడింది. నెమ్మదిగా ఈ పరిస్థితులకు అలవాటయింది గద్దపిల్ల. ఈ విధానాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్న రైతు మిత్రుడు ఒకనాడు దానిని తీసుకొని ఒక పెద్ద గుట్టపైకి వెళ్ళి గద్దతో అన్నాడు: అటువైపు ఎగురుతున్న గద్దపిల్లలను చూడు... ప్రయత్నిస్తే నీవు అలా ఎగరగలవు, అంటూ పైనుండి గద్దపిల్లను ఆకాశంలోకి ఎగరవేసాడు. ఎగరడం అలవాటు లేని గద్దపిల్ల భయంతో క్రింద పడిపోయింది. మళ్ళీ అతనా ప్రయత్నమే చేయడం ఆ గద్ద పిల్ల పడిపోవడం జరిగింది.
ఇప్పుడు గద్దపిల్ల తానిక ఎగరలేననే నిశ్చయానికి వచ్చి అతనితో మీ ప్రయత్నం వృధా నేను ఇక ఎగరలేనని చెప్పింది. చెప్పడమేకాదు ఆ ప్రయత్నం చేయడమే మానుకుంది. కాని ఆ రైతు మిత్రుడు తానా గద్ద పిల్లకు ఎగరడం నేర్పగలననే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి తన ప్రయత్నం మానలేదు. కాకపోతే విధానం మార్చుకున్నాడు.

ముందుగా ఆ గద్ద పిల్లను మానసికంగా తయారుచేసే ప్రయత్నం చేసాడు. నీవు కోడిపిల్లవు కాదు గద్దవు. నీ జాతిలో పెరిగిన గద్దపిల్లలను పరిశీలించు. నీకు కోడిపిల్లలకు ఉన్న భేదాన్ని గమనించు. గద్ద పిల్లలతో ఉన్న సారూప్యాన్ని గమనించు. నీవు పెరిగిన వాతారణం, తోటి పిల్లల ప్రవర్తన నీ ఆత్మ విశ్వాసాన్ని తగ్గించి నీ సహజమైన శక్తిసామర్థ్యాలను గుర్తించనీయడంలేదు. ప్రయత్నిస్తే నీవు ఆ గద్ద పిల్లల వలెనే ఎగరగలవు. వినీలాకాశంలో హాయిగా అనంత దూరాలకు ఎగరడంలో కలిగే ఆనందం అనుభవైకవేద్యమే. నిరంతర ప్రయత్నం నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. ప్రయత్నంలో ఓడిపోతే అదొక పాఠంగా మరొక ప్రయత్నానికి బీజం వేయాలి అంతేకాని నిష్క్రియాపరతకు బీజంవేస్తే అనుకున్న గమ్యాన్ని ఏనాడూ చేరలేవు. ఇలా వివిధ రీతులలో ప్రేరణ నందిస్తూ చిన్న లక్ష్యాలను ఏర్పరుస్తూ వచ్చాడు. ఆ గద్ద పిల్ల కూడా నెమ్మది నెమ్మదిగా ఎగరడం నేర్చింది. అలా పైపైకి ఎగిరిన ప్రతిసారీ దానిని అభినందిస్తూ రైతు మిత్రుడు ప్రేరణనందివ్వడం వల్ల కొద్దికాలంలోనే గద్దపిల్ల తన సహజమైన ప్రకృతికి అలవాటుపడింది. ఆరంభంలో ఇరువురూ (రైతు మిత్రుడూ, గద్దపిల్ల) వైఫల్యాలను ఎదురుక్కున్నా, నిరంతర ప్రయత్నం వారికి విజయ మార్గాన్ని చూపించింది. ఆ గద్దపిల్ల కూడా అనంతాకాశంలో తోటి గద్దలతో పాటుగా తన ప్రయాణాన్ని అనంతంగా కొనసాగించింది. ఆ ప్రయాణం, ప్రయత్నం దానికి ఉత్సాహాన్నిచ్చింది. ఉత్సాహం ఉద్యమానికి (ప్రయత్నానికి) ఊపిరులూదగా తన ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్న గద్ద యొక్క ప్రయత్నం, దానిని తీర్చిదిద్దిన రైతు మిత్రుని కార్యదీక్ష మనకు ఆదర్శం కావాలి.

అలాగే మరొక కథ....


ఒక అడవిలో ఒక పులి ప్రసవించి చనిపోయింది. అసహాయురాలైన చిన్న పులిపిల్లను చూసి అటుగా వెళుతున్న ఒక మేకల కాపరి జాలిపడి ఆ పులిపిల్లను తనతో తీసుకు వెళతాడు. ఆ పులిపిల్ల కూడా మేకలమందలో ఒక మేక వలె పెరుగుతూ వస్తుంది. దానితో పాటుగా పెరిగిన మేకపిల్లల ప్రభావం వల్ల దానికి శాకాహారం అలవాటవడమే కాక భయం, పిరికి తనం అలవాటయ్యాయి. దాని పలుకు తీరులో మార్పు వచ్చింది. మేకల వలె "మే మే" అంటూ ఉన్నదే కాని ఎప్పుడూ గాండ్రించి ఎరుగదు. దానికి తోడుగా ఆ మందలోని పెద్ద మేకలు కొన్ని విషయాలు బోధిస్తూ ఉండేవి. మేకలమైన మనం అడవిలో ఆకులలములే తినాలి, ఎక్కువ సంతానాన్ని కని మనయజమాని ఎదుగుదలకు తోడ్పడాలి. మనం బలహీనులం కాబట్టి అలాగే బ్రతకాలి. అంతేకాదు, అడవిలో ఒక దయ్యం ఉంది, దాని పేరు "పులి" అది ఎదురైనప్పుడు దాని కందకుండా పారిపోవాలి లేకపోతే అది మనల్ని చంపి తినేస్తుంది... ఇలా ఆ పెద్ద మేకలు మళ్ళీ మళ్ళీ బోధిస్తుండేవి.
ఆ ప్రభావంతో పులి పిల్లకూడా మేకపిల్ల వలెనే పూర్తిగా మారిపోయింది.
ఇలా ఉండగా, ఒకనాడు అడవిలో ఒక పులి వచ్చింది. ఆ మేకల మందను చూడగానే భయంకరంగా గాండ్రించింది. ఆ గాండ్రింపు వినగానే ఎక్కడి మేకలు అక్కడే పరుగు లంఘించుకున్నాయి. ఈ పులిపిల్ల కూడా పరుగుతీయడం చూసింది, వచ్చిన పులి. పులికి ఆశ్చర్యం వేసింది. మేకలు పరుగెత్తడం సహజమే కాని పులిపిల్ల పరుగుదీయడం ఏంటని ఆలోచిస్తూ దానిని వెంబడించి పట్టుకుంది. అప్పుడా పులి పిల్ల భయంతో తనను విడిచిపెట్టమంటూ పులిని ప్రార్ధిస్తుంది. అప్పుడా పులి పులిపిల్లను అనునయిస్తూ నీవు పులివి నేనూ పులినే నన్ను చూసి నీవెందుకు పరుగుదీస్తున్నావని అడుగుతుంది. దానికా పులి పిల్ల వణుకుతూ... నీవు పులివి నేనేమో మేకను... నీవు నన్ను చంపుతావని మా పెద్దవాండ్లు చెప్పారు. అందుకే భయపడుతున్నానని చెపుతుంది. దానితో పులిపిల్ల భయానికి కారణం తెలిసిన పులి అనునయంతో దానిని ఒక నీటి గుంట వద్దకు తీసుకు వెళ్ళి ఆ నీటిలో దాని ప్రతిబింబాన్ని చూడమంటుంది. అలా నీటిలో తన ప్రతిబింబాన్ని చూచిన పులిపిల్లకు, తనకూ పులికీ ఉన్న పోలికలు మరియు మేకలకూ తనకూ ఆకారంలో ఉన్న వైవిధ్యం అర్ధం అవుతుంది. దానితో తన సహజత్వాన్ని అర్ధంచేసుకొని గంభీరమైన పులి వలె నడవడం, గాండ్రించడం వేటాడడం నేర్చుకుంటుంది. సహజ సిద్ధమైన ప్రకృతిని పొందుతుంది.
ఈ రెండు కథలను జాగ్రత్తగా పరిశీలిస్తే మన వ్యక్తిత్వం ఏమిటో బోధ పడుతుంది. ముఖ్యంగా ఎవరి వ్యక్తిత్వమైనా మూడురకాలుగా ఉంటుంది. మొదటిది; మనల్ని మనం నమ్మే విధానం, రెండవది; మనల్ని ప్రభావితం చేసిన లేదా చేస్తున్న సమాజం లేదా తల్లిదండ్రులు, గురువులు, కాగా మూడవది; సహజంగా మనం ఏమిటో అది..... ఇలా మూడు రకాలయిన వ్యక్తిత్వాలు ప్రతి వ్యక్తిలో ఆవిష్కృతమౌతుంటాయి.
మొదటి వ్యక్తిత్వం... అసమగ్రం ఎందుకంటే మనల్ని మనం సరిగా అంచనా వేసుకోగలిగిన మానసిక అవగాహన ఏర్పడకపోతే అంచనా తారుమారవుతుంది. రెండవ వ్యక్తిత్వంలో.... మనల్ని తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, సమాజం అభిమానిస్తారు ఆదరిస్తారు. కాని ప్రేమ అధికం కావడం వల్ల జాగ్రత్తలు చెప్పవలసిన వేళ భయాన్ని మనలో నింపుతారు. ఇది కావాలని చేయక పోవచ్చు కాని వారి భయాలను మనకు నూరిపోస్తారు. దాని వల్ల మనమూ అలాగే తయారవుతాము. ఇక మూడవ వ్యక్తిత్వంతో.... మన లోని సహజమైన లక్షణాన్ని గుర్తించగలుగుతాము. దానికి ఒక మెంటార్/ ఆదర్శప్రాయుడై మనకు ప్రేరణ నివ్వగలిగిన వ్యక్తి అవసరం అవుతారు. ఆ ప్రేరణ ప్రభావంతో మన స్వస్వరూపాన్ని దర్శించగలుగుతాము ప్రదర్శించగలుగుతాము.
మొదటి రెండు వ్యక్తిత్వాలు మనల్ని కొన్ని పరిమితులలో నిలుపుతాయి. మన శక్తిసామర్థ్యాలను సరిగా గుర్తించనీయవు. మన పనితనం లేదా సామర్థ్యం ఆ పరిమితులలోనే ఆవిష్కృతమౌతుంది.
ముందుగా చెప్పుకున్న రెండు కథలలో కూడా.... అటు గద్ద ఇటు పులి పిల్ల రెండూ కూడా తాము సాధించ గలమనే నమ్మకాన్ని కలిగి యుండ లేదు. అలాగే వాటిని పెంచిన వ్యక్తులు వాటిపై ఉన్న ప్రేమతో వాటికి తిండిపెట్టడం లాంటివి చేసారే కాని వాటిని తమ సహజమైన శక్తి సామర్ధ్యాలను ప్రదర్శన చేయగలిగిన వాతావరణాన్ని కల్పించలేకపోయారు. అంతేకాక, అవి పెరిగిన వాతావరణం, వాటి సహవాసులూ, తమ పరిమితులలో వాటిని చూపారే కాని వాటి అంతర్గత శక్తులను గుర్తించి ఆ శక్తులను ప్రదర్శించే అవకాశాలను ఇవ్వలేకపోవడం జరిగింది. అంతేకాక, ప్రతిసారి వాటిని నిర్వీర్య పరచే మాటలు లేదా సూచనలతో వాటి పరిధులను కుంచించుకుపోయే విధంగా చేసారు.
ఇక ఎప్పుడైతే, వాటికి నిజమైన మెంటార్ దొరికాడో (మొదటి కథలో రైతు మిత్రుడు రెండవ కథలో పులి) అప్పుడు అవి వాటి పరిమితుల బంధనలను త్రెంచుకొని నిజ స్వరూపాన్ని దర్శించగలిగాయి ప్రదర్శించగలిగాయి.
ఈ కథలను లేదా వ్యక్తిత్వాలను నిజ జీవితంలో దర్శించండి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉండే అమితమైన ప్రేమతో పిల్లల అంతర్గత శక్తి సామర్ధ్యాలను గుర్తించరు గుర్తించినా అవసరంలేని భయాలను ఊహించుకొని వారిని ఆ మార్గంలో నడిపించరు, నడవ నీయరు. వీరికి మిత్రులు సమాజం ఉపాధ్యాయులు వెనుకకు లాగే వారు దొరికితే వీరు సాధించేది శూన్యమే. ఒక సంస్థలో పనిచేసే సమయంలో కూడా తనపై అధికారి తల్లిదండ్రుల స్థాయిలో వ్యవహరిస్తే ఉద్యోగి శక్తి సామర్థ్యాలు కూడా సంస్థకు ఉపయోగ పడవు.
ఎప్పుడైతే అవగాహన కలిగిన ఒక ఉపాధ్యాయుడు, లేదా పై ఉద్యోగి సరైన మార్గంలో అవసరమైన ప్రేరణ నందివ్వగలుగుతారో అప్పుదు ఆ విద్యార్థి లేదా ఉద్యోగి అద్భుతాలు సృష్టించగలుగుతారు.
దీనిని అర్థంచేసుకొని మనచుట్టూ ఉన్న సమాజంలో మన కర్తవ్యాన్ని నిర్వహిస్తే... ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
పాలకుర్తి రామమూర్తి

Sunday, July 10, 2016

యక్ష ప్రశ్నలు


యక్షుడు ధర్మరాజును అడుగుతున్నాడు....
ఏమి కతమున భూదేవు డెసగు దేవ భావమున? నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు? నసాధుత్వ మెద్దాన జెందు? మానుషుండగు నాతడే దాన? జెపుమ!
౧) దేని వల్ల భూదేవుడు (బ్రాహ్మణుడు) దివ్యత్వాన్ని సాధిస్తాడు?
౨) అతనికి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది?
౩) అతను ఎలా మాలిన్యుడౌతాడు?
౪) దేని వల్ల బ్రాహ్మణుడు మర్త్యుడు అవుతాడు?
ధర్మ రాజు ఇలా చెపుతున్నాడు....
అనవుడు ధర్మజుండనియె; "అధ్యయనంబున దేవ భావముం"
గను నవనీ సుపర్వు; డధిక వ్రతశీలత సాధుభావమా"
తనికి; "విశిష్ట వృత్తి దిగద్రావి యసాధువ"నంగ నుండు; "శౌ
చ నియతి లేక మృత్యు భయ సంగతి" నాతడు మానుషుండగున్!
౧) దానికి ధర్మ రాజు ... వేదపఠన వల్ల విప్రుడు దివ్యుడౌతాడంటాడు. "విద్" అనే ధాతువు నుండి వచ్చింది వేదం అనే మాట. విద్ అంటే తెలుసుకొనుట. ఇది నిరంతరం జరిగే... జరగాల్సిన ప్రక్రియ. అధ్యయనాధ్యాపకాలు ఎంత ఎక్కువగా జరిగితే మేధస్సు అంత చురుకుగా పనిచేస్తుంది. మీమాంసతో (హేతువుతో సాధించే శాస్త్రము) ఆ మేధస్సు సరైన మార్గంలో పయనిస్తుంది... సరైన విధానంలో ఆలోచిస్తుంది. బ్రాహ్మణుడు విజ్ఞానానికి ప్రతీక... నిర్వహణకు అధికారి. అందువల్ల నిర్వహణ సలిపేవాడు ఎలా దివ్యాత్వాన్ని సాధిస్తాడు? అని యక్షుని ప్రశ్నలో అంతరార్థం. నిర్వహణ మేధస్సుకు సంబంధించినది. విషయ సేకరణ ఎక్కువగా జరగాలి. సంగ్రహించిన విషయాన్ని సరైన కోణంలో విశ్లేషణ చేసుకోవాలి. తాన ఆధ్వర్యంలో నడచే సంస్థలో విజ్ఞానం కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వస్తు సంభారాలు కావచ్చు, యంత్ర సామాగ్రి కావచ్చు... ఏదైనా నివహణకు అవసరమైనవి - అవసరంలేనివి... ఇప్పుడు కాకపోయినా తదుపరియైనా అవసరం అయ్యేవి.. నిరర్ధకమైనవి... ఇలా గుర్తించడం వ్యర్ధాలను నియంత్రించడం, అవసరమనవాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం లోనే నిర్వహణాధికారి సామర్ధ్యం నిరూపితమౌతుంది. క్రొత్తను ఆవిష్కరించడం, మార్పును ఆహ్వానించడం, సమర్ధులైన అనుచరులను గుర్తించడం, బాధ్యతలను పంచుకోవడం వల్ల తన సామర్ధ్యాన్ని ప్రకాశం చేసుకోగలుగుతాడు నిర్వహణాధికారి. క్రొత్తను అన్వేషించడం (Reasearch) ఉన్న దానిని అభివృద్ధిపరచడం(Development) వల్ల సంస్థ పురోగతి సాధ్యపడుతుంది. సంస్థను నమ్ముకున్న వారికి ప్రగతి సాధ్యపడుతుంది. ఆ సంస్థను నిర్వహించే నిర్వహణాధికారి దివ్యుడౌతాడు.
౨) నిర్మలత: నిష్ఠ వల్ల నిర్మలత్వం ఏర్పడుతుంది. నియమబద్ధమైన నిష్ఠ, క్రమశిక్షణాపూర్ణ జీవన విధానం వల్ల నిర్మలత వికసిస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టడం, సత్య నిష్ఠ వల్ల మనసులో నెలకొన్న ధైర్యం.... తన మార్గంలో ఎదురయ్యే ఆటుపోటులను భరించగలిగే స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. దాని వల్ల ఎంత ఒత్తిడిలోనైనా సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. స్వార్థ ప్రయోజనాలకు దూరంగా కర్తవ్య నిష్ఠతో చరించే వ్యక్తి నిర్మలుడౌతాడు.
౩) మలినం ఎలా? స్వచ్ఛమైన శీలవంతుడై, స్వార్ధానికి దూరంగా సంస్థ ప్రయోజనాలను, జాతి ప్రయోజనాలను కాపాడేవాడు ఉత్తమ నిర్వహణాధికారి. అలాకాక శీలానికి విలువ నివ్వకుండా, అధర్మ వర్తనుడై, స్వార్థపరుడైన వ్యక్తి ఎంత సమర్థుడైనా, విద్యావంతుడైనా అతడు పాపవర్తనుడే అవుతాడు. అతని వర్తనలో మాలిన్యం కనిపిస్తుంది.
౪) మర్త్యుడెలా అవుతాడు? భయం వల్ల ఎంతటి వాడైనా మర్త్యుడవుతాడు. అంతశ్చేతనలో పొడసూపే భయం తన విజయంపై తనకే అనుమానాన్ని కలిగిస్తుంది. అనుమానం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏకాగ్రత లేమి తన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దానితో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేక పోవడం దాని వల్ల కార్య విఫలతా కలుగుతాయి. ఎవడైతే భయాన్ని ఆశ్రయిస్తాడో అతడు అపజయం పాలవుతాడు. అపజయం పొందడం వల్ల దివ్యుడైనా మర్త్యుడౌతాడు.
ఎవరైతే మనో వాక్కాయ కర్మలతో శుచిత్వం పొందుతాడో అతడు దివ్యుడు. దానికి దూరమైన వాడు మర్త్యుడు.

ప్రజ్ఞా ధురీణుడు కీ.శే. శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు

ప్రజ్ఞా ధురీణుడు కీ.శే. శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు. శరీరము అశాశ్వతమే ఏ క్షణమైనా రాలిపోతుంది. కాని ఆ జీవిత కాలంలో మనం చేసిన మంచిని కాలం చాలా కాలం శాశ్వతం చేస్తుంది. పాలనా వ్యవస్థలో మచ్చ లేకుండా నిర్వహించడం, తన కవిత్వాధీన మనస్సును శాంత పరచడం, వివిధ సభలలో ప్రసంగిస్తూ శ్రోతలను ఆలోచింపచేయడం, పాఠకుల నాడిని గ్రహించి వారికి ఆనందంతో పాటుగా అభ్యుదయాన్ని ఇవ్వగలిగిన రచనలు చేయడం... ఒక వ్యక్తికి సాధ్యపడే విషయాలు కావు. అయినా ఆ కార్య నిర్వహణలో సఫలీకృతుడై పలువురు పండితుల మన్ననలందిన రాళ్ళబండి ధన్య జీవి.
అతుకులబొంతకవిత్వము
ప్రతిదినమును చదివి చదివి, రసహీనంబౌ
మతిహీన రచన లొల్లక
హిత సురుచిర రస కవిత్వ మింపుగ గ్రోలన్!
పుంభావ సరస్వతి యని
సంభావన చేయ దగిన సద్గుణ శీలిన్
శుంభద్వధానరతిచే
జంభారియె పిలిచె నేమొ సంభావింపన్!
అక్షరార్చనా రతియుల్ల మందు యుబ్బ
సార సంస్కార చైతన్య సరస భావ
లోక సంధాత్రి సాహిత్య లోక జనని
పజ్జ కరిగిరొ మా రాళ్ళ బండి వారు!
తిరుపతి వేంకటేశ కవి ధీమణులన్ గని ముచ్చటింపనో
స్థిరమతి విశ్వనాధ కవి స్నిగ్ధ కవిత్వ విభూతి గాంచనో
సురుచిర కొప్పరంపు కవి శుద్ధ వచోధుని సార మాననో
యరిగె, యకాలమం చెరుగ డక్కట; యెంతటి స్వార్ధ చిత్తుడో!
ఆతని నేలుగాక; సతమాత్మను నిల్పి భజించు పండిత
వ్రాత ముఖ ప్రసూతయగు పల్కుల తల్లి; విశుద్ధ భావ సం
జాత కవిత్వ తత్వ విలసన్మహిదోదధి; భారతాంబ; సం
భూత కృపా పయోధి; కవి భూషణు మా కవితా ప్రసాదునిన్!

నవ్య సాహితీ నిర్మాణంలో యువ సాహితీ వేత్తల బాధ్యత

ఈ విశ్వంపై జీవి ఆవిర్భావం నుండి పరస్పర భావ వ్యక్తీకరణ జరుగుతూనే ఉంది. అంతర్నిహితమైన భావాన్ని ఎదుటి వారికి తెలియ చేసేందుకు భాష అవసరమైంది. అందరూ ఆ భాషను అర్ధం చేసుకునేందుకు శాస్త్రీయ విధానంతో కూడిన వ్యాకర్ణం రూపుదిద్దుకుంది. వ్యక్తిలోని భావ చైతన్యాన్ని ఎదుటి వారిని అలరిస్తూ వారి హృదయాలకు హత్తుకునేలా చెప్పడం కవిత్వంగా పరిచయమయింది. ధర్మాన్ని, సత్యాన్ని హితంగా చెప్పడం సాహిత్యంగా ప్రాచుర్యాన్ని పొందింది.. ఆనాటి నుండి నేటిదాక సమ సమాజంలోని మంచి చెడ్డలను ప్రతిబింబింపచేస్తూ ఆ సమాజం లోని అనాదరణీయమైన అంశాలను, అంధ విశ్వాసాలను ఖండిస్తూ కావ్యాలు వెలువడ్డాయి. సామాజిక అవసరాలు, బడుగు బలహీన వర్గాల చైతన్యం లక్ష్యంగా సాగిన కవిత్వంలో కూడా భావావేశం వర్ణనల నాశ్రయించింది. ఊహాతీతమేదీ కాదనే సత్యం ఆవిష్కృతమైంది కావ్యాలలో. భాషలో ప్రౌఢిమ పెరిగింది. ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, సామాజిక చైతన్యం, విశ్వ మానవ సౌభ్రాతృత్త్వం లాంటివి కావ్య వస్తువులయ్యాయి. భావనా పటిమ సర్వకాలీన సత్యాలకు నాంది పలికింది. మానవ సమాజ వికసన లక్ష్యంగా వాటికి అవసరమైన అన్నిరంగాలనూ సమన్వయపరుస్తూ ఎన్నో గ్రంథాలు ఆవిష్కృత మయ్యాయి. ఇలా ఎంత సాహిత్యం రూపు దిద్దుకున్నా పిపాసాయాత్త చిత్తులైన రసజ్ఞుల దాహార్తిని చల్లార్చలేక పోవడం వల్ల సాహిత్యం ఇంకా ఆవిర్భవిస్తూనే ఉంది... ఉంటుంది కూడా.
ఒక సమాజంలోని మానవ జీవనశైలి, విలువలు, సిద్ధాంతాలు, నవ్యావిష్కరణలు ఆ సమాజంలోని కవిత్వాలలో ఆవిష్కృతమౌతావి. సామాజిక వేత్తలు సమ సమాజంలో ఏయే మార్పును కోరుకుంటున్నారో అది సాహిత్యం ద్వారా సాహితీ వేత్తల ద్వారా ప్రకటితమౌతుంది. కావ్యాలుగా రూపు దిద్దుకొని తరువాతి తరాలకు అందించ బడుతుంది. ముందే చెప్పుకున్నట్లుగా, ప్రతి సమాజంలో, సాహిత్యంలో మంచి చెడులు ఉంటాయి. దానికి కారణం అది తత్కాలీన అవసరాల నేపథ్యంలో రూపు దిద్దుకోవడమే. పాతను ప్రాతిపదికగా తీసుకొని దాని కన్న ఉన్నత సమాజావిష్కరణకు వర్తమానంలో పునాదులు వేస్తూ భవితను దర్శించగలిగిన వాడే దార్శనికుడౌతాడు. అలాంటి కవిత్వమే నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. పాతను ద్వేషించడం వల్ల మాత్రమే క్రొత్త సమాజాన్ని ఆవిష్కరించ గలమనే భ్రమలో కవిత్వాన్ని వ్రాయడం ఆరంభిస్తే ఎన్నడూ సత్ఫలితాలను సాధించలేము. అపారమైన విజ్ఞానం ఏ ఒక్కని సొత్తు కాదు. ఎవరికీ పేటెంట్ హక్కు ఉండదు. భావాన్ని స్వేచ్ఛగా తెలుపుకోవచ్చు. నచ్చని వారు ఆదరించరు. నచ్చిన వారు ఆదరిస్తారు. తమదే పై చేయి కావాలని ద్వేషభావనతో రచనలు చేసేవారు ఏ కాలంలోనైనా ఆదరణీయులు కాలేరు. రచనలో కవి యొక్క కవితాత్మకత, రస పరిప్లుతమైన ఊహా శక్తిని గుర్తించి ఆనందించి మెచ్చుకో గలిగిన రసజ్ఞులు ఏ కాలంలో నైనా ఉత్తమ సాహిత్యాన్ని ఆదరిస్తారు. 
వ్యక్తి ప్రతిభా పాటవాలు, దార్శనికత, సామాజిక స్ఫృహ, నిబద్ధత తన రచనలో పల్లవించాలి. ఏదో ఇజానికి కట్టుబడ్డాము... లేదా నాలుగు అక్షరాలు తెలుసు కాబట్టి ఏదో వ్రాద్దాం... అనుకోవడం దానిని ఏదో పత్రిక అచ్చు వేసింది... నలుగురు అంతేవాసులు భళీ అన్నారు కాబట్టి మనమే గొప్ప మనకు తెలియని దానిపై విషం చిమ్ముతూ సమాజంలో మెప్పు సాధిద్దామనుకునే రచయితల వల్ల ఏ సమాజానికీ ఉపయోగం ఉండదు.
అదీతి, బోధ, అవగతం, ప్రచారం అనే నాలుగు మార్గాల గుండా సాహిత్య ప్రస్థానం జరిగితే అది నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. అదీతి అంటే అధ్యయన అభ్యసనాదులను శ్రద్ధగా నిర్వహించడం. విస్తృత పఠన వల్ల విషయం పరిపూర్ణంగా కరతలామలకమై ఉంటుంది. ఇక బోధ.... అధ్యయనం చేసిన విషయాన్ని వివిధ గతులలో వివిధ కోణాలలో అర్థం చేసుకోవడం. క్షుణ్ణంగా లోతుగా హేతుబద్ధంగా పరిశీలించి విషయంపై సరైన విధానంలో ప్రజ్ఞాయుతుడై నిలవడం. ఇక అవగతం... పై విధానంలో అలవడిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఫలితాలను బేరీజు వేసుకుంటూ లోపాలను సరిచేసుకునే విధానాలను అన్వేషించుకుంటూ ముందుకు నడవడం. చివరగా.. ప్రచారం... అన్ని మార్గాలలో తనకు సంతృప్తి నిచ్చిన విషయాన్ని లేదా విజ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేయడం. అలా వెలుగు చూచిన విజ్ఞానం సర్వజనీనమై సర్వకాలీనమౌతుంది. 
అలాకాక అధ్యయనం సరిగా లేక లోతుగా అవగాహన చేసుకోలేక పక్షపాత సహితంగా ఏదో కొన్ని ఇజాలకు కట్టుబడి (వాటిపై కూడా సరైన అవగాహన లేకుండా) వ్రాయాలి కాబట్టి వ్రాస్తూ అపరిణత మనస్కుల మెచ్చుకోలుతో ఉబ్బి తామేదో సాధించామనే భ్రమలో తామే సాహితీ వేత్తలమనుకునే వారి రచనలు ఏ ప్రయోజనాన్నీ పొందలేవు. మనం చూడవచ్చు.... ఈ మధ్యకాలంలో ఎందరో కవులు రచయితలు ఎన్నో రచనలు చేసారు. వాటిని గుర్తుపెట్టుకున్న వారు ఎంతమంది.
అలాగని అధ్యయనం చేయని వారి రచనలు శాశ్వతత్త్వాన్ని సంతరించుకోవా? అంటే... సంతరించుకోవనే నా నమ్మకం. ఈ నాటి డిగ్రీలతో పనిలేదు కాని పక్షపాత రహితంగా పైన ఉదహరించిన నాలుగు మార్గాలలో నుండి నడవని సాహిత్యం ఏ నాడూ పరిణతి నందలేదు. ప్రజ్ఞాపాటవాలు సహజమైనవే కావచ్చు కాని వాటికి సరిగా పదను పెట్టి సరైన మార్గంలో నడిపించక పోతే అది విపరీతమౌతుంది. "సాక్షర" విపరీతమైతే అది "రాక్షస" మౌతుంది.
నన్నయ నుండి ఈ నాటి యువకవుల వరకు వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల వైవిధ్య భరిత కోణాలు ఆవిష్కృతమౌతాయి. అంతకన్నా ఉన్నతమైన ఆలోచనా విధానం తో రచనలు చేయాలనే తపన సృజనాత్మకతకు తెరతీస్తుంది. సమ సమాజ సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రాచీన విధానాలతో సమన్వయం చేసుకుంటూ క్రొత్త సమాజావిష్కరణకై తపించే రచనలకు విజ్ఞులు పట్టకడతారు. అది అభిలషణీయమని నా నమ్మకం.
మరొక్క విషయం.... ఇంత కసరత్తు చేసి చేసిన రచనలలో కూడా అన్ని రచనలనూ ఆదరించలేదు. వాటిని నిగ్గుదీసి అందులోని సారాన్ని గ్రహించిన పిమ్మటనే అవి సమాజ హితకరమైనవని నమ్మకం కుదిరాకనే ఆదరించింది. ఏ సమాజమూ సమకాలీన సాహితీ వేత్తలనందరినీ ఒప్పుకోలేదు. వారిలో ఆవిష్కృతమైన శీలం ప్రాతిపదికగానే వారిని గౌరవించింది. కాని ఈనాడు పరిస్థితులలో మార్పు వచ్చింది. అధ్యయనం తక్కువ... తెలిసిన నాలుగు మాటలనే అటు ఇటుగా త్రిప్పి వ్రాసి తామొక సాహితీవేత్తగా తమకు తామే గుర్తించుకుంటున్నారు. అందులోని భావనా విధానంలో కాని, భాషా విధానంలో కాని దొర్లిన లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే సహించే ఔదార్యం వారిలో లేదు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మూర్ఖత్వం వారిలో ఆవిష్కృతమై ఉంది. 
ఈ పరిస్థితిలో నుండి సాహితీ వేత్తలు ముఖ్యంగా అభివృద్ధిలోకి రావలసిన వారు బైటకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఔత్సాహికులైన యువ సాహితీవేత్తలే నవ సాహితీ భవన నిర్మాణంలో భాగస్వాములు కాగలుగుతారనే విశ్వాసంతో ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను.
పాలకుర్తి రామమూర్తి

"ఈ నాటికీ అవధానమేనా"


ఈ రోజు నమస్తే తెలంగాణ లో ప్రచురితమైన "ఈ నాటికీ అవధానమేనా" అనే వ్యాసం శ్రీ తోకల రాజేషం గారు వ్రాసింది చదివాను. సమున్నత సాహితీ విలువలు భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో నింపడానికి నడుం బిగించి ప్రాచీన సాహితీ రూపాలన్నింటినీ రూపుమాపాలనే సంకల్పంతో కృషి చేస్తున్న విధానం కనిపిస్తుంది అందులో. (అలా కాకపోతే మంచిదే) కుల నిర్మూలనా లక్ష్యం మంచిదే కాని అందులో బ్రాహ్మణ ద్వేషం ఎంతవరకు సమంజసం. అత్త మీది కోపం దుత్త మీద చూపారనే సామెత ఉంది. బ్రాహ్మణుల మీది కోపం అవధాన కళమీద కాని పద్య సాహిత్యంపైన కాని చూపటం వల్ల ప్రయోజనం ఉండదు.
"ఈ అవధానాలు ఫ్యూడల్ భావజాలంలో పుట్టి అదే భావజాలానికి కట్టుబడి, అదే భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ముందుకు సాగుతున్నాయి". చాలా చక్కగా సెలవిచ్చారు. ఫూడల్ భావజాలం అనే గొప్ప మాట నాకైతే అర్థంకాదు.. మరి పల్లెలలో నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ లేదా కూలీలుగా బ్రతుకులోడ్చే ఎంతమందికి ఫ్యూడల్ భావజాలం అర్ధం అవుతుందో నేనూహించలేను కూడ. వ్రాసే వారికి కూడా సరైన అవగాహన లేని పడికట్టు పదాలను ఉపయోగించడం ఈ నాటి సాహితీ వేత్తలమనుకునే వారికి ఒక ఫ్యాషనయింది. ఒకనాడు ఈ తెలుగు గడ్డపై పల్లెలలో తిరుపతి వెంకట కవుల పద్యం ఒక్కటైనా రాని వ్యవసాయదారుడు లేడు. పద్య నాటకాలను ఆదరించింది బ్రాహ్మణులే కాదు సామాన్య ప్రజానీకం కూడ.
ఒకే సమయంలో ఒక వ్యక్తి ఎన్ని విషయాలపై తన ఏకాగ్రత నిలుపగలడు? అలవాటు చేస్తే మానవ మేధ ఎంత గొప్పగా పని చేస్తుందో తెలియాలంటే ద్వేష భావన వీడి అవధాన విద్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ధారణా శక్తిని పెంచుకునేందుకు ఉపయోగ పడేది అవధాన విద్య. అనేకానేక ప్రాచీన ఆధునిక సాహిత్య రీతులపై విశ్లేషణా పూర్వకమైన సరైన అవగాహన పెంచుకుంటే కాని ఒక అవధాని సభారంజకంగా అవధానం చేయగలడు. ఆ అవధానం యువతకు ఉపకరిస్తుంది. అవధానికి ధైర్యంతో పాటుగా సమయ స్ఫూర్తి, భావావేశం, భాషపై పట్టు, ఏకాగ్రత, ధారాశుద్ధి, ధారణ, స్ఫురణ లాంటి ఎన్నో లక్షణాలు అవసరమౌతాయి. ఇవి అన్నింటినీ బాగా ఆలోచించి ప్రదర్శించేందుకు సమయం ఉండదు. తక్కువ సమయంలో ప్రదర్శించాలి.
ఈనాటి ఉన్నత ఉద్యోగాలకు తీసుకునే అభ్యర్ధులకు కావలసిన అర్హతలుగా అటు ప్రభుత్వంకాని, ప్రైవేటు సంస్థలు కాని ఈ లక్షణాలనే కోరుకుంటున్నాయి. పై అంశాలపై అయాచితంగా లభించే అవగాహన వివేచనల లాంటివి అవధాన విద్య అందిస్తుంది. ఆ విద్యను అనాదరం చేస్తున్నాం కాబట్టే వీటికి కావలసిన శిక్షణ నిచ్చే శిక్షణా సంస్థలూ పుట్టుకొచ్చాయి. ఇలా ఎంత వ్రాసినా నిద్ర నటించే వారు గ్రహించేందుకు సిద్ధ పడరు.
జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు. పారిపోతారా లేక పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తారా? అలాగే అవధానంలో ఒక సమస్య నిస్తారు. దాని పరిష్కారంలో మనలోని సృజనాత్మకతకు పదను పెడతాము. ఉదాహరణకు... "రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతంబునన్" ఇది నిజానికి క్లిష్టంగా కనిపిస్తుంది. కాని అవధానిలోని సమయ స్ఫూర్తి, సృజనాత్మకతలు, బహు గ్రంథ పారీణత, అభ్యసన లాంటివి వెలుగు చూడడం వల్ల కొన్ని సెకన్ల కాలం లోనే దానికి పరిష్కారం కనుగొన గలిగాడు. Out of Box thinking లేదా Lateral thinking వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మూసలో పోసిన ఆలోచనలు, అవగాహనలు, ద్వేషభావనలు ఎన్నటికీ Vertical thinking నే అనుగ్రహిస్తాయి కాని ఆలోచనా పరిధిని పెంచవు. చేకూరి రామారావు గారు కానీ మరెవ్వరైనా వారి ఆలోచనలకు బంధీలే కాని పరిధి దాటి చూస్తేనే పరిణతి కనిపిస్తుంది. మనకిష్టం కానంత మాత్రాన, మనకర్ధం కానంత మాత్రాన, మనం చేయలేనంత మాత్రాన ఒక ప్రక్రియపై విషం చిమ్మడం, సమాజంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఒక సామాజిక వర్గాన్ని కించబరుస్తూ వ్యాసాలు వ్రాయడం ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించండి.
మరొక్క మాట... ఏ ప్రక్రియ యైనా ఆదరణ ఉన్నంత వరకే మనగలుగుతుంది. అవధాన విద్యకూడా ఆదరించ గలిగిన వారున్నంత వరకూ ఎవరెంత ఛీదరించుకున్నా, రసజ్ఞుల నలరిస్తూనే ఉంటుంది. మరొక్క అంశం... అవధానులకే కాదు... ఎవ్వరికైనా ఈనాటి గ్లోబల్ మార్కెట్ లో తమకు తెలిసిన లేదా తమకు పట్టున్న అంశాన్ని మార్కెట్ చేసుకోవడం అలవాటయింది. వ్యవసాయదారునికి గిట్టుబాటు ధర రావడం లేదంటూ గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నాయకులు గాని వారికి సానుభూతిగా ఉద్యమించే ఉద్యోగులు గాని జీతభత్యాలు తీసుకోవడం లేదా? అది జీవనోపాధికి అంటారేమో... జీత భత్యాలు పెరగాలని ఉద్యమించడం ఎందువల్ల. మన జీవన స్థితిగతులను మెరుగు పరుచుకునేందుకే. అందరూ అలానే కాకపోవచ్చు. కొందరు తమ జీతాలలోనుండి కొద్ది భాగాన్ని సమాజ సేవకై వ్యయిస్తున్న వారు నాకు తెలిసి ఎందరో ఉన్నారు. అందులో అన్ని కులాల వారు ఉన్నారు.
ముగింపుగా... దయచేసి సాహితీ విలువలు నడి బజారులో అమ్మబడుతున్న ఈ నాడు వాటికి విలువలే కాదు అంతకన్నా ఉత్తమమైన సంస్కారాన్ని ఇచ్చిన ప్రాచీన సాహితీ ప్రక్రియలను ద్వేషించకండి. అనాదరణకు గురైతే అవే కనుమరుగవుతాయి.
పాలకుర్తి రామమూర్తి .... 9441666943
మహా భారతంలో కద్రువ, వినత ల కథ (సౌవర్ణోపాఖ్యానం)
పూర్వం కశ్యపుడనే మహాఋషికి కద్రువ, వినత లనే ఇరువురు భార్యలు ఉండేవారు. ఒకనాడు ఇరువురూ ఆయన వద్దకు సంతానాపేక్షతో వెళ్ళి ఆయనను భక్తితో సేవించారు. సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి "మీకేం కావాలో కోరుకోండని" అన్నాడు. ఇదారూ తమకు సంతానం కావాలని ప్రార్థించారు. ఆ క్రమంలో కద్రువ... నాథా... వినుత సత్వులు, దీర్ఘదేహులు, అనలతేజులు (అగ్ని లాంటి తేజస్సు కలిగిన వారు) అయిన ఒక వేయి మంది పుత్రులు కావాలని కోరుకొన్నది. ఇక వినత... మంచి కుమారులు... కద్రువ సంతానానికన్న బలవంతులు, తేజో వంతులు అయిన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. తధాస్తు అన్నాడు... కశ్యపుడు.
కశ్యప ప్రజాపతి చాలాకాలం తపస్సు చేసి.. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారికిస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండని చెపుతూ తపస్సుకు వెళ్ళాడు. ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి.... గర్భవతులయ్యారు. కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇరువురూ ఆ అండాలను నేతి కుండలలో భద్రపరచి జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కటొకటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా వేయి మంది జనించారు. వినత భద్రపరచిన అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన... అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత తన రెండు అండాలలో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు (అనూరుడు... ఊరువులు లేని వాడు) జన్మించి... తల్లితో ఇలా అంటాడు. తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బ్రద్దలు చేసావు... కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా అయిదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయి. అంతేకాదు... మిగిలిన ఆ అండాన్ని అది పక్వం అయేంతవరకూ ఛిద్రం చేయకు. ఆ అండంలోనుండి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ.. సూర్యుని రధానికి సారధిగా వెళతాడు.
ఒకనాడు, సవతులిరువురూ సముద్ర తీరానికి వాహ్యాళికై వెళ్ళారు. అలా వారు విహరిస్తుండగా వారికి అక్కడ ఉచ్ఛైశ్రవం కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని చూపిస్తూ కద్రువ వినతతో "పాలనురుగు లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చ లాగా ఆ తోక నలుపుగా ఉండడం" బాగా లేదు కదా అంటుంది. దానికి ప్రతిగా వినత... అక్కా నీవే కన్నులతో చూస్తున్నావు.... ఆ హయానికి తోక కూడా తెల్లగానే ఉంది, అంటుంది. కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని తోక అని... ఇలా ఇరువురూ వాదించుకోవడం జరుగుతుంది. చివరగా... కద్రువ అంటుంది.... ఇన్ని మాటలెందుకు ఒక పందెం వేసుకుందాము; ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు... అలాకాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసి నౌతాను, అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ... దగ్గరకు వెళ్ళి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ... ఇప్పుడు ప్రొద్దు పోయింది... భర్త సేవ చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వస్తుంది. ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి... జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలాగైనా నలుపు చేయండని ఆజ్ఞాపిస్తుంది. పిల్లలెవరూ ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానికి అశక్తతతో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందుకాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా భస్మమవండని శపిస్తుంది. తల్లి శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు. తెల్లవారింది.. యధావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇరువురూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూచారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడడం మూలంగా ఆ తోక నల్లగా కనిపించడమూ... ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరుగుతుంది.
ఇలా ఐదు వందల సంవత్సరాలు గడచిపోయాయి.... ఒకనాడు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడనే పక్షి జనిస్తాడు. మహా బలవంతుడైన గరుడుడు కూడా తల్లి ఎలాగైతే కద్రువకు ఆమె సంతతికి దాసీత్వం చేస్తుందో అలాగే ఊడిగం చేస్తూంటాడు. ఒకనాడు.. ఆ పాములను తన వీపుపై మోస్తూ సూర్య మండలానికి ఎగరడం... ఆ తాపాన్ని భరించలేని పాములు భూమిపైపడి మూర్ఛ పోవడం, అది చూచిన కద్రువ కోపగించడం.... జరుగుతుంది. అప్పుడు, గరుత్మంతుడు తమ దాసీత్వం పోవాలంటే ఏం చేయాలని ఆ పాములను అడగడం వారు అమృతాన్ని తెచ్చిమ్మనడం... వారు కోరిన రీతిగానే దేవతలను జయించి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి ఇస్తూ సర్పాలతో .... కృతస్నాతులై శుచిగా అమృతాన్ని సేవించడని చెప్పి... వారితో తన తల్లి దాసీత్వం పోయిందనిపించుకొని తల్లితో కలసి వెళ్ళిపోతాడు. ఆ పాములూ అమృతం లభించిందనే సంతోషంతో... ఆ అమృత భాండాన్ని శుచియైన ప్రదేశంలో దర్భలపై ఉంచి స్నానాదికాలు పూర్తి చేయడానికై వెళతారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళి దేవలోకంలో భద్ర పరుస్తాడు.
అమృతాన్ని తెచ్చే క్రమంలో ఆ అమృతాన్ని తాను ఉపయోగించని గరుడుని నిబద్ధతకు మరియు ఆతని జవసత్వాలను చూసి సంతోషించిన విష్ణువు గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు.
స్థూలంగా ఇదీ కథ. ఇందులో ఎన్నో సందేహాలు..
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
ఈ సందేహాలు మీకూ వస్తే... నా ఆలోచనలు పంచుకునేందుకై రేపటి దాక వేచి ఉండండి. లేదా మీ మీ ఆలోచనలను పంచుకోండి
భారత గాథ సర్వ కాలీనమైనది

౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
అ) అసూయాగ్రస్తులైన సవతుల మధ్య జరగబోయే పరిణామాలను ముందుగా గ్రహించ గలిగాడు కాబట్టి కశ్యపుడు ఆ పరిణామాలకు తాను సాక్షీభూతుడుగా ఉండదలచుకోక తపస్సు చేసుకోవడానికై వెళ్ళాడు.
ఆ) ఒకరు ఇద్దరు లేదా పది మంది సంతానాన్ని కోరడం లోక సహజం కాని కద్రువ వేయి మందిని అదీ దీర్ఘదేహులు, అనిల తేజులు, వినుత సత్వులను కోరడంలోనే ఆమె అత్యాశ తెలుస్తుంది.
ఇ) తాపసి సంతానం విజ్ఞానార్జన లక్ష్యంగా దానికి అవసరమైన దేహాభిరతి తో ఉండాలి. కాని ఆమె కోరిక దానికి వ్యతిరిక్తంగా ఉండడమే కాక వారి నుండి ఆమె ఆశించేదేమిటి?
ఈ) ఇక వినత... కోరింది ఇరువురినే కాని సుపుత్రులను కోరింది. ఐనా అందులోనూ సవతిపై మాత్సర్యం కనిపిస్తుంది. అమిత సత్వులను, వీరులను ముఖ్యంగా కద్రువ సంతానాని కన్నా బలవంతులనూ కోరుకొంది.
ఉ) ఇరువురూ స్వధర్మాన్ని కాదని పరధర్మానికి అవసరమైన లక్షణాలు కలిగిన కుమారులను కోరారు.
ఊ) దీని వల్ల జరగబోయే పరిణామాలను ఊహించగలిగిన కశ్యపుడు తానారంగం నుండి నిష్క్రమించాడు.
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
అ) నమ్మక పోయే అవకాశం లేదు. ఎందుకంటే... మొదటగా భర్త తపోశక్తిపై అపార విశ్వాసం ఉంది అందునా కద్రువకు పుత్ర సంతానం కలిగింది. అదీ వేయి మంది దీర్ఘదేహులు... తక్షకాది అమిత సత్వులు కలిగారు.
ఆ) కద్రువకు రోజుకు కొంతమంది చొప్పున చాలా రోజులుగా సంతానం కలుగుతూ ఉంది. ఒకరి తదుపరి ఒకరుగా కలుగుతున్న సంతానాన్ని గూర్చిన సమాచారం చెలికత్తెల ద్వారా చిలువలు పలువలుగా అందుతూనే ఉంది. ఆ పిల్లలు చేసే ముద్దు ముచ్చట్లు తెలుస్తున్నాయి. కద్రువ ఎంత సంతోషిస్తున్నదో అర్థం అవుతూనే ఉంది. ఆ సమాచారం మనసులో తెలియని ఆవేదనను కలిగిస్తున్నది. తనకు తెలియకుండానే మనసు అసూయాగ్రస్తమై తొందర చేస్తుంది. కద్రువకు సంతానం కలగనంత వరకు తనూ ప్రశాంతం గానే ఉంది. ఎప్పుడైతే సవతి సంతానవతి యై ఆనందిస్తున్నదో అప్పుడే తనలో తెలియని ఆవేదనాపూర్ణ భావనలు అసూయను ఆశ్రయించడం చేత తాను చేస్తున్న పనిపైన ఆలోచిస్తున్న విధానంపైన అవగాహనను, పట్టును కోల్పోయింది.
ఇ) ఒక దానిని విచ్ఛిన్నం చేసి చూద్దామనే కోరిక తీవ్రమై తనను నిలువనీయని స్థితిలో అదుపు తప్పి ప్రవర్తించడం వల్ల అండ విచ్ఛిత్తికి పాల్పడింది.
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
అ) ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వినత తొందరపాటు వల్ల అనూరుడు జన్మించాడు, తల్లిని శపించాడు. నిజంగా తన తప్పును తెలుసుకున్న వినత పశ్చాత్తాప పడుతుంది. ఇక కద్రువ తన చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కారణంగా, సవతియైన వినతను దాసీగా పొందాలనే దురాలోచనతో దాసీత్వం పందెంగా పెట్టింది.
ఆ) సొమ్ముల లాంటివి భర్తతో సాధించుకునే అవకాశం ఉంది... కాని మాత్సర్యగ్రస్తయైన కద్రువ భౌతిక సంపదలకతీతంగా సవతి దాసీత్వాన్ని కోరుకుంది.
ఇ) రోగీ పాలనే కోరాడు... వైద్యుడూ పాలే ఇచ్చాడు... అన్నట్లుగా శాప నిమిత్తంగా వినతా దాసీత్వం వైపే ఆకర్శితురాలైంది.. కద్రువా అదే కోరుకున్నది. కాబట్టి ఇక్కడ న్యాయాన్యాయాలకన్నా వారిరువురి మనసులు ఆవిష్కరింప బడ్డాయని అనుకోవడం సమంజసం.
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
అ) నిజానికైతే ఉండకూడదు. కాని వినత మనసులో చెలరేగుతున్న అపరాధ భావన ఆ ప్రమత్తతను ఆహ్వానించింది.
ఆ) సవతికి వేయి మంది సంతానం కలిగారు. తనకు పుత్రులు పుట్టలేదని ఒకప్పుడు బాధ పడింది. తన అవివేకం వల్ల పుట్టిన వాడు శారీరక అవలక్షణంతో జన్మించాడు. తన కుమారుడే తనను శపించాడు... అయినా బాధలేదు. తనకు దాసీగా ఉండే యోగం ఉంటే ఉండవచ్చుగాక. కాని అమిత సత్వపూర్ణుడైన కుమారుడు పుడతాడనే సంకేతం ఆమెకందింది ఆ శాపంలోనే అదే ఆమె ప్రమత్తతకు కారణం.
ఇ) తను పొందిన శాపంలోనే ఒక ఊరట ఉంది. ఐదు వందల సంవత్సరాల తదుపరి తనకు పుట్టే కుమారుని వల్ల తన దాస్య విముక్తి జరుగుతుంది అలాగే తాను అనూరుని పట్ల అనుసరించిన అపచారం దాసీత్వం వల్ల ఉపశమిస్తుంది. కాబట్టే వినతకు ఆ ప్రమత్తత.
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
అ) దాస్యం చేయడం వల్ల ఏం కలుగుతుంది? ఆమె అంతరంగంలోని ప్రశ్న... దానికి జవాబు తనకు రెండవ అండంనుండి కలిగే కుమారుని వల్ల తనకు దాస్య విముక్తి. తాను దాసీ అయితేనే కదా దాస్య విముక్తి, శాప విముక్తి. అందుకే ఉచ్ఛైశ్రవం యొక్క తోక నల్ల అని కద్రువ అంటే తనకది అబద్ధమని తెలిసినా దగ్గరికి వెళ్ళి చూడలేదామె. దగ్గరకు వెళితే తన దాసిత్వం కద్రువకు చెందుతుంది. అది తన లక్ష్యానికి వ్యతిరిక్తమవుతుంది. కాబట్టే దగ్గరకు వెళ్ళే ఆలోచనను వినత చేయలేదు... అందులోని మోసం దగ్గరకు వెళితే తేటతెల్లమవుతుంది కాబట్టి కద్రువా దూరం నుండే చూద్దామని అంది.
ఆ) ఐదు వందల సంవత్సరాలు సవతిని సేవించినా వినత ఆ పనిని ఇష్టంగానే చేసిందట. చేసే పనిని ఇష్టపడండి... ఇష్టాన్ని ప్రేమించండి... ఆ ఫలితాన్ని ఆస్వాదించండి అనే సామాజిక, వ్యక్తిత్వ సూత్రానికి ప్రతినిధిగా ఆమె కనిపిస్తుంది.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
అ) ఇక్కడ లోక సహజమైన రీతిని ప్రతిబింబించాడు మరియు స్త్రీ మనసును ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు లోకంలో సహజంగా రోగం తగ్గాక వైద్యుని సేవలను వైద్యుడినీ మరచిపోతాడట రోగి అలాగే భార్యను పరిగ్రహించాక తల్లిని మరచిపోతారట... ఇంకా సంతానం కలిగాక భర్తను దూరంగా ఉంచుతారట. ఆ లోక రీతిని ఆవిష్కరిస్తున్నాడు వ్యాసభగవానుడు.
ఆ) అసూయాగ్రస్తులైన వారి పాట్లు ఎలా ఉంటాయనే విధానాన్ని చెపుతున్నాడు
ఇ) ఓర్పు, క్షమా గుణాన్ని సంతరించుకోవడం వల్ల ఎలాంటి ఉత్తమ ఫలితాలను సాధిస్తామో చెపుతున్నాడు. వినత దాసీత్వాన్ని నిష్ఠతో ఆచరించింది. కుమారుడు కలిగాక కూడా కద్రువపై చాడీలు చెప్పి వాని మనసు విరిచే ప్రయత్నం చేయలేదు.
ఈ) సమయం, సందర్భం వచ్చే వరకు నిరీక్షించింది. కద్రువ కుమారులను మోసుకుంటూ గరుత్మంతుడు సూర్యమండలానికి ఎగరడం వల్ల ఆ తాపాన్ని తట్టుకోలేని పాములు మూర్ఛపోవడం.. దాన్ని చూసి కద్రువ కోపంతో గరుడుని కోపగించడం, ఆ పరిణామానికి వ్యధ చెందిన గరుత్మంతుడు తన తల్లిని దాసీత్వం గూర్చి ప్రశ్నించడం కనిపిస్తుంది వ్యాసుల రచనలో.
ఉ) కార్య సాధకుని నిబద్ధతను గరుత్మంతుని అమృతాపహరణ నేపథ్యంలో చూపాడు. గరుత్మంతుడు నిబద్ధతతో అమృతాన్ని తాను వినియోగించక, తల్లికి గాని సోదరునికి గాని వినియోగించక కద్రువ కడకు తీసుకు వెళ్ళడం ఆతని నియమ బద్ధతకు తార్కాణం.
ఊ) దీనివల్ల గరుత్మంతునికి విష్ణువుకు వాహనంగా సేవచేసుకునే భాగ్యం కలిగింది. అంతేకాక, ఏ అమృత సేవన వల్ల జరామృత్యు భయం లేకుండా ఉండగలమో ఆ భాగ్యం విష్ణువు వరం వల్ల పొంద గలిగాడు.
ఋ) గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి పాములకు ఇచ్చాడు. అయినా ఆ అర్హతను వారు సాధించుకోలేక పోవడం వల్ల వారది అనుభవించుకోలేక పోయారు. కోరుకునే ముందే దానికి తగిన అర్హత సాధించాలనే సామాన్య సూత్రం ఇక్కడ ప్రతిపాదించబడింది.
ౠ) ఫలితంపై ఆశలేకుండా.. చేసే పని పెద్దదా చిన్నదా అనే భావన లేకుండా నియమబద్ధంగా మనసుతో చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే సందేశం కనిపిస్తుంది.
ఎ) అనింటికన్నా ముఖ్యంగా ఈ కథ ద్వారా భారత గాధను ఆవిష్కరించాడు వేదవ్యాసుడు. ఇక్కడ వినత కద్రువల మధ్య అసూయా ద్వేషాలు అదీ సంతానం కారణంగా. భారతంలో గాంధారీ కుంతిల మధ్య అసూయాద్వేషాలు. కుంతికి కుమారుడు కలిగాడు... గాంధారి ఆ మాటను విన్నది... వెంటనే ఈర్ష్యాసూయలు క్రమ్ముకొనగా తన గర్భాన్ని తాడనం చేసింది. గర్భం వంద ముక్కలయింది. అసూయతో చేసిన తాడనం వల్ల అసూయాగ్రస్తులైన కౌరవులు జన్మించారు. నిష్కల్మషంగా కుంతి సంతానాన్ని కనింది. వారిలో సౌజన్యం వెల్లివిరిసింది. వినత అసూయతో చేసిన ప్రయత్నం వల్ల అనూరుడు జన్మించాడు. ఫలితాన్ని చూచాక పశ్చాత్తాపంతో తన మనసులోని అసూయను కడిగి వేసుకున్నాక తనకు కలిగిన సంతు బలవంతుడూ, కార్య దక్షుడూ అయ్యాడు. కద్రువ సంతానం క్రూరాత్ములు కాగా కౌరవులూ క్రౌర్యచిత్తులుగానే మిగిలిపోయారు.
ఏ) కౌరవులు అనుక్షణం పాండవుల శక్తి సామర్ధ్యాలు తలుచుకొని భయపడుతూ జీవచ్ఛవాల వలె జీవించారు. అందుకే వారి నంతమొందించేందుకు అవసరమైన అన్ని దుర్మార్గ ప్రయత్నాలనూ అనుసరించారు. బ్రతికినన్ని రోజులూ చస్తూ బ్రతికారు. అలాగే కద్రువ సంతతీ అనుక్షణం భయపడుతూ ఆ భయాన్నుండి బయట పడేందుకు అమృతాన్ని తెచ్చి ఇవ్వమని కోరారు. భయగ్రస్తులై ద్వేషానికి బానిసలై బ్రతికారు. ఇక పాండవులు తమను రక్షించేది తామారించే ధర్మం మరియు తమ స్వ ప్రయత్నమనే సిద్ధాంతాన్ని నమ్మడం చేత తమ పౌరుషాన్నే నమ్ముకొని "జీవించారు". అలాగే గరుత్మంతుడూ అమృతాన్ని సంగ్రహించినా స్వశక్తిపై ఉన్న నమ్మకంతో ఆ అమృతాన్ని సేవించలేదు.
ఐ) ఇలా పలు విధాలుగా భారతంతో సంబంధం కలిగిన ఈ కథను చేర్చి ముందుగా చెప్పడం ద్వారా భారత పాత్రలను సర్వకాలీనం చేస్తూ... అసూయాద్వేషాలకు దూరంగా ఉండండని ప్రజలను హెచ్చరించడం కనిపిస్తుంది.
మహా భారతంలో కద్రువ, వినత ల కథ (సౌవర్ణోపాఖ్యానం)
పూర్వం కశ్యపుడనే మహాఋషికి కద్రువ, వినత లనే ఇరువురు భార్యలు ఉండేవారు. ఒకనాడు ఇరువురూ ఆయన వద్దకు సంతానాపేక్షతో వెళ్ళి ఆయనను భక్తితో సేవించారు. సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి "మీకేం కావాలో కోరుకోండని" అన్నాడు. ఇద్దరూ తమకు సంతానం కావాలని ప్రార్థించారు. ఆ క్రమంలో కద్రువ... నాథా... వినుత సత్వులు, దీర్ఘదేహులు, అనలతేజులు (అగ్ని లాంటి తేజస్సు కలిగిన వారు) అయిన ఒక వేయి మంది పుత్రులు కావాలని కోరుకొన్నది. ఇక వినత... మంచి కుమారులు... కద్రువ సంతానానికన్న బలవంతులు, తేజో వంతులు అయిన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. (ఈ కోరడం లో కద్రువలోని అత్యాశ, వినతలోని లోకజ్ఞత ప్రకటితమౌతున్నాయి. వినత కోరిక విన్న కద్రువలో తెలియని అశాంతి. తాను బలవంతులైన సంతానాన్ని వేయి మందిని కోరితే వినత తెలివిగా ఇద్దరినే ఈ వేయి మందికన్నా బలవంతులను కోరడం ఆమె జీర్ణించుకో లేక పోయింది. వినతను ఎలా దెబ్బతీయాలని ఆలోచించింది) తధాస్తు అన్నాడు... కశ్యపుడు. 
కశ్యప ప్రజాపతి చాలాకాలం తపస్సు చేసి.. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారికిస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండని చెపుతూ తపస్సుకు వెళ్ళాడు. ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి.... గర్భవతులయ్యారు. కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇరువురూ ఆ అండాలను నేతి కుండలలో భద్రపరచి జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కటొకటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా వేయి మంది జనించారు. వినత భద్రపరచిన అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన... అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత తన రెండు అండాలలో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అందులో నుండి క్రింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు (అనూరుడు... ఊరువులు లేని వాడు) జన్మించాడు. వినతకు భర్త తపోశక్తిపై నమ్మకం ఉండాలి. కనీసం కద్రువకు భర్త ఇచ్చిన వరం వల్ల కలిగిన వేయి మంది పిల్లల్ని చూచాకనైనా నమ్మకం కలగాలి. కాని వినత దుఃఖంతో కూడిన అసూయ, చాపల్యం, సవతిపై మాత్సర్యం వల్ల సృష్టి నియమాన్ని (గ్రుడ్డు తనంత తానే పగిలి బిడ్డ బయటకు రావడం) ఉల్లంఘించింది. అలా జన్మించిన అనూరుడు తల్లితో ఇలా అంటాడు. తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బ్రద్దలు చేసావు... కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా అయిదు వందల సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయి. 
తనకు కుమారుడు జన్మించాడని సంతోషించాలా లేక తన తొందరపాటుకు అవివేకానికి ఆ పుత్రుడు అంగ వైకల్యంతో జన్మించాడని బాధపడాలా? తాను తన సవతికి దాసీత్వ శాపాన్ని పొందానని బాధపడాలా లేక ఐదు వందల సంవత్సరాల తరువాత నైనా తనకు అమిత బలవంతుడైన పుత్రుడు జన్మించి తనకు దాస్య విముక్తి కలిగిస్తాడని సంతోషించాలా? ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన దానికి వేదనా చిత్తయైన వినత నిశ్చేష్టితురాలై చూస్తూ ఉండిపోయింది. తనకు సరైన ఆకృతి లేకుండా ప్రపంచం మీదకు తెచ్చిన తల్లిపై కోపంతో శపించాడే కాని తదుపరి కలిగిన పశ్చాత్తాపంతో అనూరుడు... అమ్మా, ఇదంతా విధివశాత్తు జరిగిపోయింది. నీవేమీ విచారించకు.. అయితే మిగిలిన ఆ అండాన్ని మాత్రం అది పక్వం అయేంతవరకూ ఛిద్రం చేయకు. ఆ అండంలోనుండి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ.. సూర్యుని రధానికి సారధిగా వెళతాడు. 
ఇది ఇలా ఉండగా, సవతులిరువురూ ఒకనాడు సముద్ర తీరానికి వాహ్యాళికై వెళ్ళారు. అలా వారు విహరిస్తుండగా వారికి అక్కడ ఉచ్ఛైశ్రవం కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని చూపిస్తూ కద్రువ వినతతో "పాలనురుగు లాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చ లాగా ఆ తోక నలుపుగా ఉండడం" బాగా లేదు కదా అంటుంది. దానికి ప్రతిగా వినత... అక్కా నీవే కన్నులతో చూస్తున్నావు.... ఆ హయానికి తోక కూడా తెల్లగానే ఉంది, అంటుంది. కద్రువ నల్లని తోక అని వినత కాదు అది తెల్లని తోక అని... ఇలా ఇరువురూ వాదించుకోవడం జరుగుతుంది. చివరగా... కద్రువ అంటుంది.... ఇన్ని మాటలెందుకు ఒక పందెం వేసుకుందాము; ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు... అలాకాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసి నౌతాను, అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ... దగ్గరకు వెళ్ళి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ... ఇప్పుడు ప్రొద్దు పోయింది... భర్త సేవ చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వస్తుంది.
ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి... జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలాగైనా నలుపు చేయండని ఆజ్ఞాపిస్తుంది. పిల్లలెవరూ ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానికి అశక్తతతో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందుకాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా భస్మమవండని శపిస్తుంది. కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతా నభవతి అంటారు. (ప్రపంచంలో చెడు సంతానం ఉండవచ్చు కాని చెడు తల్లులు ఉండరని అంటారు) కాని దానికి భిన్నంగా ధర్మపరులైన సంతానాన్ని అధర్మ మార్గంలో నడవమని శాసించి అలా చేయని పాపానికి వారిని శపించడం కద్రువ యొక్క మానసిక అసహజస్థితిని సూచిస్తుంది. అనుశాసనిక పర్వంలో తిక్కన గారు ఈ సందర్భంలో కద్రువకు "భుజంగ" శబ్దం వాడుతారు. పాము తన పిల్లలను తానే తింటుందనే నానుడిని ఈ భుజంగ శబ్దం ధ్వనిస్తుంది.
శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు. తెల్లవారింది.. యధావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇరువురూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూచారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేళ్ళాడడం మూలంగా ఆ తోక నల్లగా కనిపించడమూ... ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరుగుతుంది. 
ఇలా ఐదు వందల సంవత్సరాలు గడచిపోయాయి.... ఒకనాడు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడనే పక్షి జనిస్తాడు. మహా బలవంతుడైన గరుడుడు కూడా తల్లి ఎలాగైతే కద్రువకు ఆమె సంతతికి దాసీత్వం చేస్తుందో అలాగే ఊడిగం చేస్తూంటాడు. ఒకనాడు.. ఆ పాములను తన వీపుపై మోస్తూ సూర్య మండలానికి ఎగరడం... ఆ తాపాన్ని భరించలేని పాములు భూమిపైపడి మూర్ఛ పోవడం, అది చూచిన కద్రువ కోపగించడం.... జరుగుతుంది. 
అత్యంత బలవంతుడైన తాను అల్పప్రాణులైన పాములకు సేవ జేయడం చూచి ఆవేదన జెందిన గరుత్మంతుడు కద్రువ వద్దకు వెళ్ళి అమ్మా! నీ చెలియల్ చరిమ్చు నివ్వరవుడపుం చరిత్రమున వచ్చునె నీకొక పేర్మి" అంటాడు. నీ చెల్లెలు నీ వద్ద దాసిగా ఉండడం నీకు గౌరవంగా ఉంటుందా? ఇంకా "నీ సతిం గరుణ యెలర్పగా విడువ గౌరవ సంపద జేయు నెంతయున్" అంటాడు. నీ చెల్లెలు దాసీత్వం నుండి విముక్తమైతే నీకెంతో గౌరవంగా ఉంటుందంటాడు. మా అమ్మ అనడం వేరు, నీ చెల్లెలు అనడం వేరు. మా అమ్మ అనడం వల్ల తనదనే భావన నీ చెల్లెలు అనడంలో కద్రువకు ఆత్మీయురాలనే భావన ధ్వనిస్తుంటాయి. ఇక్కడ సమయోచితంగా, సగౌరవంగా గరుత్మంతుడు వేడుకోవడం కనిపిస్తుంది. తాను బలవంతుడు.. కాబట్టి మా అమ్మ దాసీత్వం విముక్తం చేయకుంటే ఊరుకోను అవసరమైతే మీ జాతిని నాశనం చేస్తానని బెదిరించవచ్చు. 
కద్రువ ఉలుకూ పలుకూ లేకుండా ఉంటుంది. అప్పుడంటాడు, అమ్మా నేనూ నీ కుమారుడినే కదా నన్ను చూసైనా మా అమ్మను విడిచి పెట్టు, అంటాడు. పోనీ మా అమ్మ దాసీత్వం పోవాలంటే ఏం చేయాలని కద్రువను అడగుతాడు. కుటిలత్వం, కపటత్వం, క్రౌర్యం పాములకు సహజ లక్షణాలు కావడం అలాంటి పాములను కన్న తల్లి కద్రువ కాబట్టి ఇలా అంటుంది. "బలవంతుడవు, నైపుణ్యం కలిగిన వాడివి కాబట్టి "లోకులు నిన్నుం ప్రణుతింప తెమ్ము అమృతము" అంటుంది. ఇలా అనడంలో కద్రువలో లౌక్యం ఉంది. అమృతం తేవడం అలవికాని పని. కాబట్టి ఎలాగూ వినత దాసిత్వం పోదు. ఒకవేళ గరుత్మంతుడు ఆ కార్యాన్ని సాధించి అమృతాన్ని తెస్తే... జరా మృత్యు భయం లేని అమృత పానం చేత తాను తన సంతానం చిరంజీవులై వర్ధిల్లుతారు. ఏ విధంగా చూచినా కద్రువకు ఆ కోరిక ఉపయుక్తమే అవుతుంది. 
కపట మతి యైన కద్రువ ఇన్ని రోజులుగా వినతతో సాధారణ పరిచారికలతో చేయించే అన్ని పనులు చేయిస్తూనే ఉంది. తనతో సమానురాలు అనే భావన ఆమెకేనాడూ లేదు. వినత మాత్రం ఎక్కువ తక్కువ పనులు అనకుండా అన్ని పనులూ కద్రువ అభీష్టానుసారంగా చేస్తూనే ఉంది. దీనికి మొదటి కారణం వినతలోని ధర్మ బద్ధత కాగా రెండవది తనకు అయిదు వందల సంవత్సరాల పిమ్మటనైనా అత్యంత బలవంతుడైన కుమారుడు ఉదయిస్తాడనీ అతని వల్ల తన దాసీత్వం పోతుందనే భావన ప్రేరణలుగా కనిపిస్తాయి. 
కద్రువ కోరిన రీతిగానే దేవతలను జయించి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి శుచి ప్రదేశంలో దర్భలపై పెడుతూ సర్పాలతో .... కృతస్నాతులై శుచిగా అమృతాన్ని సేవించడని చెప్పి... వారితో తన తల్లి దాసీత్వం పోయిందనిపించుకొని తల్లితో కలసి వెళ్ళిపోతాడు. ఆ పాములూ అమృతం లభించిందనే సంతోషంతో... స్నానాదికాలు పూర్తి చేయడానికై వెళతారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళి దేవలోకంలో భద్ర పరుస్తాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. కోరే కోరికలో స్ఫశ్ఠత లేకపోతే వచ్చే అనర్ధం ఇది. అమృతాన్ని తమకు "ఇవ్వు" అని కద్రువ అడగలేదు... "లోకులు నిన్నున్ ప్రణుతింప తెమ్ము అమృతము" అందామె గరుడుడు తెచ్చాడు. కద్రువాదులు అమృతాన్ని ఉపయోగించే లోపే దానిని ఇంద్రుడు అపహరించాడు. మోసంతో వినతను దాసీగా చేసుకుంది కద్రువ అలాగే అమృతాన్ని కోరే క్రమంలో మోసపోయింది. 
అమృతాన్ని తెచ్చే క్రమంలో ఆ అమృతాన్ని తాను ఉపయోగించని గరుడుని నిబద్ధతకు మరియు ఆతని జవసత్వాలను చూసి సంతోషించిన విష్ణువు గరుత్మంతుని తన వాహనంగా చేసుకుంటాడు.
స్థూలంగా ఇదీ కథ. ఇందులో ఎన్నో సందేహాలు.. 
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
౧) కశ్యపుడు మహాఋషి అన్నాము. ఋషి అంటేనే భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించ గలిగినవాడు. (అందులోనూ ఇతడు పశ్యకః...కశ్యప తిరగ వ్రాస్తే పశ్యక) అలాంటప్పుడు భార్యల కోరికలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక పోయాడా?
అ) అసూయాగ్రస్తులైన సవతుల మధ్య జరగబోయే పరిణామాలను ముందుగా గ్రహించ గలిగాడు కాబట్టి కశ్యపుడు ఆ పరిణామాలకు తాను సాక్షీభూతుడుగా ఉండదలచుకోక తపస్సు చేసుకోవడానికై వెళ్ళాడు.
ఆ) ఒకరు ఇద్దరు లేదా పది మంది సంతానాన్ని కోరడం లోక సహజం కాని కద్రువ వేయి మందిని అదీ దీర్ఘదేహులు, అనిల తేజులు, వినుత సత్వులను కోరడంలోనే ఆమె అత్యాశ తెలుస్తుంది. 
ఇ) తాపసి సంతానం విజ్ఞానార్జన లక్ష్యంగా దానికి అవసరమైన దేహాభిరతి తో ఉండాలి. కాని ఆమె కోరిక దానికి వ్యతిరిక్తంగా ఉండడమే కాక వారి నుండి ఆమె ఆశించేదేమిటి? ఈ ప్రపంచంలో తానే అత్యంత గౌరవనీయురాలుగా చెలామణి కావాలనే అత్యాశ చేతనే దీర్ఘదేహులు, అమిత బలాఢ్యులు కావాలని కోరడం
ఈ) ఇక వినత... కోరింది ఇరువురినే కాని సుపుత్రులను కోరింది. ఐనా అందులోనూ సవతిపై మాత్సర్యం కనిపిస్తుంది. అమిత సత్వులను, వీరులను ముఖ్యంగా కద్రువ సంతానాని కన్నా బలవంతులనూ కోరుకొంది. 
ఉ) ఇరువురూ స్వధర్మాన్ని కాదని పరధర్మానికి అవసరమైన లక్షణాలు కలిగిన కుమారులను కోరారు.
ఊ) దీని వల్ల జరగబోయే పరిణామాలను ఊహించగలిగిన కశ్యపుడు తానారంగం నుండి నిష్క్రమించాడు. 
౨) మహా తపస్వియైన భర్త చేసిన ఇష్టి యొక్క ప్రసాద మహాత్యాన్ని వినత నమ్మలేకపోయిందా లేక భర్తపై నమ్మకం పోయిందా? కద్రువకు సంతానం కలగగానే తన అండాన్ని విచ్ఛిన్నం చేయడం ఎందుకు?
అ) నమ్మక పోయే అవకాశం లేదు. ఎందుకంటే... మొదటగా భర్త తపోశక్తిపై అపార విశ్వాసం ఉంది అందునా కద్రువకు పుత్ర సంతానం కలిగింది. అదీ వేయి మంది దీర్ఘదేహులు... తక్షకాది అమిత సత్వులు కలిగారు. 
ఆ) కద్రువకు రోజుకు కొంతమంది చొప్పున చాలా రోజులుగా సంతానం కలుగుతూ ఉంది. ఒకరి తదుపరి ఒకరుగా కలుగుతున్న సంతానాన్ని గూర్చిన సమాచారం చెలికత్తెల ద్వారా చిలువలు పలువలుగా అందుతూనే ఉంది. ఆ పిల్లలు చేసే ముద్దు ముచ్చట్లు తెలుస్తున్నాయి. కద్రువ ఎంత సంతోషిస్తున్నదో అర్థం అవుతూనే ఉంది. ఆ సమాచారం మనసులో తెలియని ఆవేదనను కలిగిస్తున్నది. తనకు తెలియకుండానే మనసు అసూయాగ్రస్తమై తొందర చేస్తుంది. కద్రువకు సంతానం కలగనంత వరకు తనూ ప్రశాంతం గానే ఉంది. ఎప్పుడైతే సవతి సంతానవతి యై ఆనందిస్తున్నదో అప్పుడే తనలో తెలియని ఆవేదనాపూర్ణ భావనలు అసూయను ఆశ్రయించడం చేత తాను చేస్తున్న పనిపైన ఆలోచిస్తున్న విధానంపైన అవగాహనను, పట్టును కోల్పోయింది.
ఇ) ఒక దానిని విచ్ఛిన్నం చేసి చూద్దామనే కోరిక తీవ్రమై తనను నిలువనీయని స్థితిలో అదుపు తప్పి ప్రవర్తించడం వల్ల అండ విచ్ఛిత్తికి పాల్పడింది.
౩) ఒక అంశంపై ఇరువురికీ వాద ప్రతివాదాలు చెలరేగాయి. పందెం వేద్దామనుకున్నారు. అది సహజమే కావచ్చు. కాని దానికి సొమ్ముల లాంటివి పందెంగా పెట్టడం సామాన్యమే కావచ్చు కాని ముందుకు ముందే దాసీత్వం పందెంగా వేసుకోవడం న్యాయమా?
అ) ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వినత తొందరపాటు వల్ల అనూరుడు జన్మించాడు, తల్లిని శపించాడు. నిజంగా తన తప్పును తెలుసుకున్న వినత పశ్చాత్తాప పడుతుంది. ఇక కద్రువ తన చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న కారణంగా, సవతియైన వినతను దాసీగా పొందాలనే దురాలోచనతో దాసీత్వం పందెంగా పెట్టింది. 
ఆ) వినత సంతానాన్ని కోరే క్రమంలో తన సంతానాని కన్నా బలవంతులు కావాలని కోరింది. ఆ వినతా పుత్రులతో తన సంతానం అపకారం పొందొద్దను కుంటే వారు తన ఆధీనంలో ఉండాలి. సమాన స్థాయిలో ఉండే తమ మధ్య ఎదుటి వారిని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం సాధ్య పడుతుంది. కాబట్టి తరతరాలు వారు తన ఆధీనంలో ఉండాలంటే వినత తనకు దాసీగా ఉండడ మొక్కటే మార్గం. అదీకాక సొమ్ముల లాంటివి భర్తతో సాధించుకునే అవకాశం ఉంది. ఇన్నీ దృష్టిలో పెట్టుకునే మాత్సర్యగ్రస్తయైన కద్రువ భౌతిక సంపదలకతీతంగా సవతి దాసీత్వాన్ని కోరుకుంది. 
ఇ) రోగీ పాలనే కోరాడు... వైద్యుడూ పాలే ఇచ్చాడు... అన్నట్లుగా శాప నిమిత్తంగా వినతా దాసీత్వం వైపే ఆకర్శితురాలైంది.. కద్రువా అదే కోరుకున్నది. కాబట్టి ఇక్కడ న్యాయాన్యాయాలకన్నా వారిరువురి మనసులు ఆవిష్కరించ బడ్డాయని అనుకోవడం సమంజసం.
౪) ఒక పెద్ద పందెం; అదీ జీవితాలకు సంబంధించినది ఐనప్పుడు, తెల్లవారి చూద్దాం లే అనే ప్రమత్తత ఉంటుందా?
అ) నిజానికైతే ఉండకూడదు. కాని వినత మనసులో చెలరేగుతున్న అపరాధ భావన ఆ ప్రమత్తతను ఆహ్వానించింది. 
ఆ) సవతికి వేయి మంది సంతానం కలిగారు. తనకు పుత్రులు పుట్టలేదని ఒకప్పుడు బాధ పడింది. తన అవివేకం వల్ల పుట్టిన వాడు శారీరక అవలక్షణంతో జన్మించాడు. తన కుమారుడే తనను శపించాడు... అయినా బాధలేదు. తనకు దాసీగా ఉండే యోగం ఉంటే ఉండవచ్చుగాక. కాని అమిత సత్వపూర్ణుడైన కుమారుడు పుడతాడనే సంకేతం ఆమెకందింది ఆ శాపంలోనే అదే ఆమె ప్రమత్తతకు కారణం.
ఇ) తను పొందిన శాపంలోనే ఒక ఊరట ఉంది. ఐదు వందల సంవత్సరాల తదుపరి తనకు పుట్టే కుమారుని వల్ల తన దాస్య విముక్తి జరుగుతుంది అలాగే తాను అనూరుని పట్ల అనుసరించిన అపచారం దాసీత్వం వల్ల ఉపశమిస్తుంది. కాబట్టే వినతకు ఆ ప్రమత్తత.
౫) తెల్లవారి వెళ్ళి చూద్దామనుకున్నారు సరే! కాని ఆ తోక నలుపో తెలుపో దగ్గరకు వెళ్ళి చూస్తారే కాని దూరం నుండే దానిపై ఒక నిర్ణయానికి రావడం సమంజసమేనా? అలా ఎక్కడైనా జరుగుతుందా... అదీ దాసీత్వం పందెంగా ఉన్నప్పుడు.
అ) దాస్యం చేయడం వల్ల ఏం కలుగుతుంది? ఆమె అంతరంగంలోని ప్రశ్న... దానికి జవాబు తనకు రెండవ అండంనుండి కలిగే కుమారుని వల్ల తనకు దాస్య విముక్తి. తాను దాసీ అయితేనే కదా దాస్య విముక్తి, శాప విముక్తి. అందుకే ఉచ్ఛైశ్రవం యొక్క తోక నల్ల అని కద్రువ అంటే తనకది అబద్ధమని తెలిసినా దగ్గరికి వెళ్ళి చూడలేదామె. దగ్గరకు వెళితే తన దాసిత్వం కద్రువకు చెందుతుంది. అది తన లక్ష్యానికి వ్యతిరిక్తమవుతుంది. కాబట్టే దగ్గరకు వెళ్ళే ఆలోచనను వినత చేయలేదు... అందులోని మోసం దగ్గరకు వెళితే తేటతెల్లమవుతుంది కాబట్టి కద్రువా దూరం నుండే చూద్దామని అంది.
ఆ) ఐదు వందల సంవత్సరాలు సవతిని సేవించినా వినత ఆ పనిని ఇష్టంగానే చేసిందట. చేసే పనిని ఇష్టపడండి... ఇష్టాన్ని ప్రేమించండి... ఆ ఫలితాన్ని ఆస్వాదించండి అనే సామాజిక, వ్యక్తిత్వ సూత్రానికి ప్రతినిధిగా ఆమె కనిపిస్తుంది.
౬) ఈ కథ ద్వారా వేద వ్యాసుడు ఏ సందేశాన్ని ఇవ్వదలిచాడు?
అ) ఇక్కడ లోక సహజమైన రీతిని ప్రతిబింబించాడు మరియు స్త్రీ మనసును ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు లోకంలో సహజంగా రోగం తగ్గాక వైద్యుని సేవలను వైద్యుడినీ మరచిపోతాడట రోగి; అలాగే భార్యను పరిగ్రహించాక తల్లిని మరచిపోతారట; ఇంకా స్త్రీలు సంతానం కలిగాక భర్తను దూరంగా ఉంచుతారట. ఆ లోక రీతిని ఆవిష్కరిస్తున్నాడు వ్యాసభగవానుడు. 
ఆ) అసూయాగ్రస్తులైన వారి పాట్లు ఎలా ఉంటాయనే విధానాన్ని చెపుతున్నాడు
ఇ) ఓర్పు, క్షమా గుణాన్ని సంతరించుకోవడం వల్ల ఎలాంటి ఉత్తమ ఫలితాలను సాధిస్తామో చెపుతున్నాడు. వినత దాసీత్వాన్ని నిష్ఠతో ఆచరించింది. కుమారుడు కలిగాక కూడా కద్రువపై చాడీలు చెప్పి వాని మనసు విరిచే ప్రయత్నం చేయలేదు.
ఈ) సమయం, సందర్భం వచ్చే వరకు నిరీక్షించింది. కద్రువ కుమారులను మోసుకుంటూ గరుత్మంతుడు సూర్యమండలానికి ఎగరడం వల్ల ఆ తాపాన్ని తట్టుకోలేని పాములు మూర్ఛపోవడం.. దాన్ని చూసి కద్రువ కోపంతో గరుడుని కోపగించడం, ఆ పరిణామానికి వ్యధ చెందిన గరుత్మంతుడు తన తల్లిని దాసీత్వం గూర్చి ప్రశ్నించడం కనిపిస్తుంది వ్యాసుల రచనలో. గరుడుని మానసంలో కద్రువ పట్ల కలిగిన జుగుప్సా భావన వల్ల తల్లిని దాసీత్వానికి కారణం ఏమిటని ప్రశ్నించాలనే ఆలోచన కలిగింది. ప్రశ్నించాకే ఆ జిజ్ఞాస సమంజసమే అనే భావన కలిగాకే వినత కారణాన్ని వివరించింది. 
ఉ) కార్య సాధకుని నిబద్ధతను గరుత్మంతుని అమృతాపహరణ నేపథ్యంలో చూపాడు. గరుత్మంతుడు నిబద్ధతతో అమృతాన్ని తాను వినియోగించక, తల్లికి గాని సోదరునికి గాని వినియోగించక కద్రువ కడకు తీసుకు వెళ్ళడం ఆతని నియమ బద్ధతలకు తార్కాణం. 
ఊ) దీనివల్ల గరుత్మంతునికి విష్ణువుకు వాహనంగా సేవచేసుకునే భాగ్యం కలిగింది. అంతేకాక, ఏ అమృత సేవన వల్ల జరామృత్యు భయం లేకుండా ఉండగలమో అలాంటి భాగ్యాన్ని అమృత సేవనం లేకుండానే విష్ణువు వరం వల్ల పొంద గలిగాడు.
ఋ) గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి పాములకు ఇచ్చాడు. అయినా ఆ అర్హతను వారు సాధించుకోలేక పోవడం వల్ల వారది అనుభవించుకోలేక పోయారు. కోరుకునే ముందే దానికి తగిన అర్హత సాధించాలనే సామాన్య సూత్రం ఇక్కడ ప్రతిపాదించబడింది. 
ౠ) ఫలితంపై ఆశలేకుండా.. చేసే పని పెద్దదా చిన్నదా అనే భావన లేకుండా నియమబద్ధంగా మనసుతో చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే సందేశం కనిపిస్తుంది.
ఎ) అనింటికన్నా ముఖ్యంగా ఈ కథ ద్వారా భారత గాధను ఆవిష్కరించాడు వేదవ్యాసుడు. ఇక్కడ వినత కద్రువల మధ్య సంతానం కారణంగా కలిగిన అసూయా ద్వేషాలే మహాభారతంలోనూ గాంధారీ కుంతిల మధ్య కనిపిస్తాయి. కుంతికి కుమారుడు కలిగాడు... గాంధారి ఆ మాటను విన్నది... వెంటనే ఈర్ష్యాసూయలు క్రమ్ముకొనగా తన గర్భాన్ని తాడనం చేసింది. గర్భం వంద ముక్కలయింది. అసూయతో చేసిన తాడనం వల్ల అసూయాగ్రస్తులైన కౌరవులు జన్మించారు. నిష్కల్మషంగా కుంతి సంతానాన్ని కనింది. వారిలో సౌజన్యం వెల్లివిరిసింది. వినత అసూయతో చేసిన ప్రయత్నం వల్ల అనూరుడు జన్మించాడు. ఫలితాన్ని చూచాక పశ్చాత్తాపంతో తన మనసులోని అసూయను కడిగి వేసుకున్నాక తనకు కలిగిన సంతు బలవంతుడూ, కార్య దక్షుడూ అయ్యాడు. కద్రువ సంతానం క్రూరాత్ములు కాగా కౌరవులూ క్రౌర్యచిత్తులుగానే మిగిలిపోయారు. 
ఏ) కౌరవులు అనుక్షణం పాండవుల శక్తి సామర్ధ్యాలు తలుచుకొని భయపడుతూ జీవచ్ఛవాల వలె జీవించారు. అందుకే వారి నంతమొందించేందుకు అవసరమైన అన్ని దుర్మార్గ ప్రయత్నాలనూ అనుసరించారు. బ్రతికినన్ని రోజులూ చస్తూ బ్రతికారు. అలాగే కద్రువ సంతతీ అనుక్షణం భయపడుతూ ఆ భయాన్నుండి బయట పడేందుకు అమృతాన్ని తెచ్చి ఇవ్వమని కోరారు. భయగ్రస్తులై ద్వేషానికి బానిసలై బ్రతికారు. ఇక పాండవులు తమను రక్షించేది తామారించే ధర్మం మరియు తమ స్వ ప్రయత్నమనే సిద్ధాంతాన్ని నమ్మడం చేత తమ పౌరుషాన్నే నమ్ముకొని "జీవించారు". అలాగే గరుత్మంతుడూ అమృతాన్ని సంగ్రహించినా స్వశక్తిపై ఉన్న నమ్మకంతో ఆ అమృతాన్ని సేవించలేదు.
ఐ) ఇలా పలు విధాలుగా భారతంతో సంబంధం కలిగిన ఈ కథను చేర్చి ముందుగా చెప్పడం ద్వారా భారత పాత్రలను సర్వకాలీనం చేస్తూ... అసూయాద్వేషాలకు దూరంగా ఉండండని వ్యాస భగవానులు ప్రజలను హెచ్చరించడం కనిపిస్తుంది.
రాజకీయాలలో నైతిక విలువలు - నాడు నేడు
రాజకీయాలకు ఆరంభం ఎక్కడ? రాజ్యానికి సంబంధించింది రాజకీయం కనుక ఎక్కడైతే రాజ్యం ఉంటుందో అక్కడ రాజకీయం ఉంటుంది. ఈ రాజ్య వ్యవస్థ భారత దేశంలో ఎప్పుడు ఎక్కడ ఆరంభం అయింది అంటే మన పురాణాల ప్రకారం మనువు నాటి నుండి ఆరంభమయినట్లుగా తెలుస్తుంది. మనువు నాటికే సమాజం ఉంది.... ఆ సమాజంలో ఆధిపత్య పోరు ఉంది. బలవంతుడు బలహీనులను దోచుకునే సంస్కృతి ఉంది. ఆ సమాజంలోనూ ప్రజల మేలును పట్టించుకొని ఆ వైపుగా ఆలోచించిన వ్యక్తులు ఉన్నారు. సామాజిక దార్శనికు లైన అలాంటి వ్యక్తులంతా ఒక్క దగ్గరగా కూర్చొని తమ తమ ఆలోచనలను పంచుకొని సమాజం ఎలా ఉంటే ప్రజలంతా శాంతియుతంగా సహజీవనం చేయగలరో ఆలోచించారు. సమర్ధుడైన వ్యక్తిని గుర్తించారు, అతనికి పాలనా పగ్గాలను అందించారు. అతడే మనువు. ప్రజలంతా తమ ఆధీనంలో ఉన్న సంపదలో 10% అతని కిచ్చి పాలించమని కోరారతనిని. 
సాధారణంగా మన భారతీయ సంప్రదాయవాదులు మానవ జీవనం ఆరంభమయి కొన్ని లక్షల సంవత్సరాలు అయినట్లుగా చెపుతారు. కాని ఆధునిక వాదం దానిని ఒప్పుకోదు. మనువు పురాతన కాలానికి సంబంధించిన వానిగా సంప్రదాయవాదులు చెపుతున్నా ఆధునిక చరిత్రకారులు 200 BC కి సంబంధించిన వానిగా చెపుతున్నారు. ఏది ఏమైనా... తన కాలానికి సంబంధించిన సమాజానికి అవసరమైన స్మృతిని అందించిన వానిగా మనువును చెప్పుకోవాలి. 
కొన్ని లక్షల సంవత్సరాలుగా సాగుతున్న మానవ జీవనంలో మంచి చెడులు ఉన్నాయి. ప్రేమలు, ద్వేషాలు కనిపిస్తున్నాయి. ఆయా సమాజాలలో వాటిని సరిచేసేందుకు కృషిచేసిన వారూ ఉన్నారు. మానవ సమాజం చాలా పురాతనమైనదని... ఆ సమాజంలో కూడా బలవంతులు బలహీనులపై ఆధిపత్య ధోరణి కనపరచారని దానికి దేశాల ఎల్లలు లేవని తెలియచేసే సమాచారాన్ని క్రింద పొందుపరుస్తున్నాను.
(The Hindu daily news paper has published the following article on of 29th May, 2015 
Evidence of earliest murder comes to light
Lethal fractures preserved in an almost fully preserved early human skull indicate the earliest instance of murder in human history, some 4,30,000 years ago (Middle Pleistocene). 
The skull was recovered from an archaeological site Sima de los Huesos in northern Spain. 
The presence of two fractures of similar size and shape but running in two different directions on the frontal bone strongly suggests that the early human was killed when another member of his group stuck the skull twice using the same object. The fractures are present on the left side of the frontal bone suggesting that a right-handed member had stuck the skull during a face-to-face conflict.) 
మనువు తనపై ప్రజలంతా ఉంచిన నమ్మకానికి అనుగుణంగా తనదైన ఒక రాజ్యాంగాన్ని అదీ సమకాలీన పరిస్థితుల కనుగుణంగా వ్రాసుకున్నాడు. ఆనాటికే ప్రజలలో ఉన్న వృత్తులను అధ్యయనం చేసి ఆ యా వృత్తులను ఆచరించే వారిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణాలుగా విభజించాడు. (ఇవి వర్గాలు గాని కులాలు గానీ కావు… వర్ణాలు మాత్రమే) ఆధ్యయన ఆధ్యాపకత్వాలను నిర్వహిస్తూ సృజనాత్మకతకు మెరుగులు పెడుతూ ఆచరణాత్మకమైన విజ్ఞానాన్ని ప్రజావసరాలకు అనుగుణంగా ఆవిష్కరించేందుకు శ్రమించే వారిని బ్రాహ్మణులుగా పేర్కొన్నాడు. ఈ ప్రక్రియ అంతా మెదడుకు సంబంధించింది ఆ మెదడు తలలో ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు విశ్వమనే పురుషునికి తలగా (బ్రాహ్మణస్య ముఖమాసీత్) చెప్పాడు. అలాగే ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఎదుటి వారి కష్టానికి స్ఫందిస్తూ తోటి వారి రక్షణకు నిలిచి శ్రమించే వారిని క్షత్రియులు అన్నాడు. భుజాలు బలానికి, శక్తికి ప్రతీకలు కాబట్టి క్షత్రియులు విశ్వమనే పురుషునికి బాహువులుగా చెప్పారు. (బాహో రాజన్య కృతః) సంపద లేకపోతే అభ్యుదయం లేదు స్థిరత్వం లేదు. కాబట్టి సంపదను సృజించడం దానిని అవసరాల కనుగుణంగా వినిమయం చేయడం పట్ల ఆసక్తి కలిగిన వారిని వైశ్యులుగా చెప్పాడు (ఊరో తదస్య యద్వైశ్యః). దానినే వైశ్యులు విశ్వమనే పురుషునికి ఊరువులు (తొడలు .. స్థిరత్వాన్నిస్తావి) గా చెప్పడం జరిగింది. సమాజంలో ఉన్న వ్యక్తులలో పై మూడు వృత్తులలో ఇమడలేని వారిని లేదా ఆసక్తి లేని వారిని శూద్రులుగా చెప్పాడు (పద్యాగుం శూద్రో అజాయత). వీరు శ్రామికులే కాని నైపుణ్యం లేని వారు. అంతేకాక ఇతరుల సూచనల కనుగుణంగా పనిచేసే తత్త్వం కలిగిన వారు. పని చేయడంలో చలనం ఉంటుంది. పాదాలు చలనానికి ప్రతీకలు. తల ఆలోచనకు ప్రతీక కాగా పాదాలు కార్యాచరణకు ప్రతీక. సామాజిక అభ్యుదయానికి చేసే ప్రతి ఆలోచన రక్షణ కోణంలో వడగట్టబడి స్థిరత్వాన్ని సాధించి ఆచరణయోగ్యమై ఆచరించబడడంగా రూపొందించబడిన వర్ణ వ్యవస్థను రాజ్యాంగం చేసాడు, మనువు. మనువు చేత రూపొందించబడినది కాబట్టి దీనిని మను స్మృతి అన్నారు.
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి. మనకు తెలిసినంతలో స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను స్మృతి, అత్రిస్మృతి, విష్ణుస్మృతి, హరితస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ఉశానస్మృతి, ఆంగీరసస్మృతి, యమస్మృతి, ఆపస్తంబస్మృతి, సమ్వర్తస్మృతి, కాత్యాయనస్మృతి, బృహస్పతిస్మృతి, పరాశరస్మృతి, వ్యాసస్మృతి, శంఖస్మృతి, లిఖితాస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, శాతాతపస్మృతి, వసిష్టస్మృతి ఇవన్నీ అయా కాలాలలో ఆయా సామాజిక అవసరాల ననుసరించి సవరించ బడినవి లేదా మార్చి వ్రాయబడినవి. (కొందరు ఈ స్మృతులు ఇరువది ఎనిమిది అంటారు) కలి యుగంలో పరాశర స్మృతి (కలౌః పరాశరః)అనుసరణీయమని చెపుతారు. 
ఒక సమాజాన్ని మరొక సమాజానికి పోల్చి తప్పొప్పులు నిర్దారించడం సరియైన పద్ధతి కాదు. చరిత్రను మార్చలేము. ఆ చరిత్రను అలాగే చదువుకోని అందులో మంచిని (ఏమైనా ఉంటేనే) గ్రహించడం, సమ సమాజానికి ఆ మంచిని అందించడం వల్ల సంస్కృతి నిలబడడమే కాదు ఆ విజ్ఞానం సమాజానికి ఉపయోగ పడుతుంది కూడా. 
మనువు కాలం వరకు 50 వృత్తులలో ఉన్న వారిని గుర్తించి వారిని నాలుగు వర్ణాలుగా విభజించినా తదుపరి కాలంలో అవి కొన్ని వేల కులాలుగా మారి రాజకీయ విష నాగు పడగ క్రింద ఒక కులానికి మరొక కులానికి మధ్య విషాన్ని చిందించుకునే దౌర్భాగ్య స్థితిని ప్రసాదించాయి. దీనికి తోడు పరాయిపాలనలో మ్రగ్గడం, వారి సంస్కృతి ఆచార వ్యవహారాలకు బానిసలం కావడం వల్ల ఆ ఆలోచనా సరళిలో భారతీయ సంస్కృతి పట్ల ఏహ్య భావాన్ని పెంచుకోవడం, లోతుగా అధ్యయనం చేసే అలవాటుకు దూరం కావడం వల్ల భారతీయ సాహిత్య సంస్కృతులను పనికి రానివిగా భావించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇది చదువుకున్న “విజ్ఞానులు” తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యతిరేక ప్రచారాన్ని చేయడం వల్ల అవగాహన లేని వారికి దూరమౌతుంది. మరొక్క విషయం... వర్ణాన్ని కులంగా చిత్రీకరించడం వర్ణాన్ని వర్గంగా చిత్రీకరించడం వల్ల మూలాన్ని తప్పుగా చిత్రీకరణ చేయడం జరుగుతుంది. (ఇలా వ్రాయడం వల్ల మను ధర్మశాస్త్రాన్ని సమర్ధించడమో విమర్శ చేయడమో నా ఉద్దేశ్యం కాదు. తమకు తెలియకపోయినా ఎవరో ఎక్కడో ఉదహరించిన దానిని అది తప్పుడు ఉదాహరణ అయినా పరిశీలన చేయకుండా వర్ణాన్ని కులాలుగా చిత్రీకరిస్తూ తమ రచనల ద్వారా తప్పుడు సందేశాలిస్తున్న మిత్రులకు వారి ననుసరించే మిత్రులకు అవగాహన కోసం మాత్రమే వ్రాయడం జరుగుతుంది, వారి ఆలోచనా సరళి మారదని తెలిసినా.)
ఇకపోతే... ప్రతి సమాజానికీ విలువలతో కూడిన గమనం ఉంటుంది. ఆ సమాజం లేదా ఆ సమాజంలోని వ్యక్తులు వారి సమగ్ర జీవన విధానం ప్రాతిపదికగా ఏర్పరచుకొన్న విధి విధానలే ఆ సమాజపు విలువలు. ఆ సమాజానికి అనుగుణమైన వేష భాషలు, ఆహార విహారపు అలవాట్ల పట్ల ఆ సమాజంలోని వ్యక్తులు కొన్ని విలువలు ఏర్పరచుకొని ఆ విలువల ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. అందుకే... విలువలు వ్యక్తుల ప్రవర్తన ప్రాతిపదికగా రూపొందుతాయి. ఆ ప్రవర్తనను శాసిస్తాయి. ఎప్పటి దాకా నైతే ఆయా సమాజాలలోని వ్యక్తులు తామేర్పరచుకొన్న విలువలకు బద్ధులై ఉంటారో అప్పటి వరకు ఆ సమాజం నీతి నియమాలతో అభ్యుదయం వైపు నడవడం కనిపిస్తుంది.
(శ్రీకాకుళం జిల్లాలో ఒక అటవీ ప్రాంతంలో ఒక గిరిజన బాలిక చదువు పేరుతో తన సంస్కృతికి దూరమై తామాపాదించుకున్న విలువలకు దూరమై ఒక నాగరకుడిని ప్రేమించింది. అది తప్పు కాదు. కాని ఆ ప్రేమికుడు మోసగించడం వల్ల ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎప్పటి వరకు తన సంప్రదాయాలకు ఆ సమాజ విలువలకు కట్టుబడి ఉన్నారో ఆ గిరిజన స్త్రీలు మోసపోలేదు. గిరిజన పురుషులూ స్త్రీలను మోసగించలేదు. ఒక్కసారి ఆ విలువలను వదలి వేసాక తాను మోసపోవడమే కాక చనిపోవడం జరిగింది.)
అనాది నుండి ఏ సమాజ చరిత్రను పరిశీలించినా లేదా పురాణాల పాత్రలను పరిశీలించినా నైతిక (నీతి నియమాల ననుసరించడం) విలువలతో కూడిన నేతల మార్గదర్శనలో ఆ సమాజం అభ్యుదయాధ్యంలో పయనించింది. ఏ సమాజంలో నైతే వ్యక్తులు "నాకోసం నీవేం చేస్తావని కాక నీ కోసం నేనేం చేయాలి" అని ప్రశ్నిస్తారో ఆ సమాజం విలువల ప్రాతిపదికన నడుస్తున్నట్లుగా భావించాలి. విలువలతో కూడిన రాజకీయ చైతన్యం అభ్యుదయం వైపు నడవాలి అంటే ఆ సమాజంలోని వ్యక్తులకు...
౧) విలువలతో కూడిన విద్యా విధానం అందించబడాలి
౨) ఆ సమాజ ఆర్థిక సంపత్తి అభ్యుదయం తో కూడిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయుక్తమవ్వాలి
౩) దార్శనికులైన నాయకుల నాయకత్వంలో సమాజంలోని ప్రతిపౌరుడూ తన కాళ్ళపై తాను నిలుచునేందుకు అవసరమైన ఉపాధి అవకాశాలను దానికి అవసరమైన వ్యూహాలను రచించుకో్గలగాలి
౪) ఆధ్యాత్మిక శక్తి వంతమైన సమాజంగా రూపొందగలిగిన మార్గ దర్శన కావాలి (ప్రతి వ్యక్తి జీవితం నాలుగు పార్శ్వాలుగా సాగుతుంది. మొదటిది భౌతికం.. రెండవది మానసికం... మూడవది భావోద్వేగ సంబంధితం... నాలుగవది ఆధ్యాత్మికం. భౌతికం అంటే శరీరం ఉంటేనే వ్యక్తికి అస్థిత్వం ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం అంటే సరైన భౌతిక జీవనం కావాలి. ఇక మనస్సు ఉంటేనే ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. ఆలోచనల వల్లనే ప్రగతి, సుగతి సాధించ గలుగుతాము కాబట్టి ఆరోగ్యవంతమైన మనస్సు కావాలి. ఇక భావోద్వేగాలు లేని జీవనం రాయిరప్పల లాంటిది. ప్రక్కవారి కష్ట సుఖాలకు స్ఫందించ లేని వ్యక్తిగత జీవనం వల్ల ఏ సమాజమూ బాగుపడదు. కాబట్టి అవసరమైన మేర స్ఫందించగలిగిన భావోద్వేగాలు ప్రతి వ్యక్తిలో నిలవాలి. ఇక ఆధ్యాత్మిక జీవనం... అంటే ఈ మూడింటిలో సమగ్రత సాధించి అన్నింటినీ సమన్వయించి ఒకే త్రాటిపై నడప గలిగిన అంతర్గత చైతన్యం.) 
ఏ కాలంలో చూసినా వ్యక్తుల మానసిక స్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మంచి చెడులు అన్ని కాలాలలో వ్యక్తులలో ప్రతిఫలించడం చరిత్రలో చూడవచ్చు లేదా పురాణాల పాత్రలలోనూ చూడవచ్చు. వ్యక్తులుగా మంచి వారయినా సమాజం చెడ్డదిగా మారడం కూడా మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరకత కలిగిన దేశాలు రెండే రెండు... అంటాడు, స్పార్క్ అనబడే చరిత్రకారుడు. అవి భారత దేశం మరియు చైనా దేశాలు మాత్రమే. ఇందులో కూడా భారతదేశం తన సంస్కృతిలో సాహిత్యంలో పరిణతి చెందిన నాయకత్వాన్ని పలు సందర్భాలలో నిర్వచించింది. సమగ్రమైన తన దృష్టికోణం నుండి నాయకత్వాన్ని నిర్వచించే సందర్భంలో అయిదు ముఖ్యమైన లక్షణాలను గుర్తించి ఆ లక్షణాలను సంతరించుకున్న వారే నిజమైన నాయకులు కాగలరని చెప్పింది. అవి స్థూలంగా...
1) Global Mind set ... సర్వ కాలీన సర్వజనీనమైన సమగ్రమైన దార్శనికత
2) Extensive & Effective Communication network ...సమర్ధవంతమైన సమగ్రమైన సమాచార పంపిణీ వ్యవస్థను ఏర్పరచడం
3) Team building Competency .... వైవిధ్య భావాలు నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను జట్టుగా ఏర్పరచి ఆ జట్టును ఒకే లక్ష్యం వైపు నడిపించే సామర్ధ్యం
4) Conflict Management ..... జట్టులోని వ్యక్తుల మధ్య లేదా సమాజంలోని వ్యక్తుల మధ్య అసంకల్పితంగా లేదా సంకల్పితంగా నైనా ఏర్పడే సంఘర్షణలను నిర్వహించి, నివారించి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించడం
5) Trust Building ... నమ్మకం కలిగించడం ... నిజానికి వ్యక్తులు లేదా కుటుంబాలు కలసి ఉండేందుకు కావలసింది ప్రేమ కాని మరొకటో కాదు. ఆయా వ్యక్తుల మధ్య ఉండాల్సింది పరస్పర నమ్మకం మాత్రమే. నమ్మకమే కూటమిని సంఘటితంగా ఉంచగలుగుతుంది. నమ్మకమే పరస్పరాధారిత వ్యవస్థకు మూలమవుతుంది. 
భారత దేశ తాత్విక ఋషి సంతతి తరువాత గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌... అతని శిష్యుడు ప్లాటో... ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్‌ - ఈ ముగ్గురు మానవజాతికి తర్కించడం, విశ్లేషించడం, పరిశీలించడం... నేర్పిన తత్వవేత్తలుగా పేరొందిన వారు. ఈ సందర్భంలో నాయకత్వ విషయంలో గ్రీకు తత్వవేత్త ప్లాటో ఆలోచనా సరళిని ఒకసారి గుర్తుచేసుకోవడం ప్రయోజనకారి. Governance అనే పదం గ్రీకు భాషలో నుండి గ్రహింపబడింది. దానికి పరిపాలన అని తెలుగులో అర్థం చెప్పుకుంటున్నాము. నిజానికి Governance అనే పదానికి అర్థం సారథ్యం వహించడం. ప్లాటో మొదటిసారిగా ఈ పదాన్ని రూపకాలంకారం (Metaphorical) గా వాడారు. ప్లాటో ఉద్దేశ్యం ప్రకారం నాయకుడు లేదా పాలకుడు తత్త్వవేత్తయై ఉండాలి. ఏబది సంవత్సరాల వయసు దాటి ఉండాలి. కుటుంబ జంజాటం లేని వాడై ఉండాలి. నిస్వార్థంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. 
అకాడమీ (మేధావులంతా మంచి ప్రభుత్వం ఏర్పాటుకు ఆలోచన చేసేదే అకాడమీ) ఏర్పాటు చేసి ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనే విలువలతో కూడిన Commitment (నిబద్ధత) ఏ నాయకుడిలోనైతే ఆవిష్కృతమౌతుందో అతని సారధ్యంలో ప్రజలకు అభివృద్ధి సాధ్యపడుతుంది. ముందే చెప్పుకున్నట్లుగా అన్ని కాలాలలో అన్ని దేశాలలో నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని చూడవచ్చు ప్రజాకంటకులైన పాలకులను (అలాంటి వారిని నాయకులు అనకూడదు పాలకులనడమే సబబు) చూడవచ్చు. ఎన్ని విధాలయిన రాజ్యాంగాలు ప్రకాశంలో ఉన్నా ఈనాదు ఎక్కువ దేశాలు అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యాన్నే. Democracy is a form of government in which people choose leaders by voting. అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యాన్ని (Democracy) నిర్వచిస్తూ It is a government of the people, by the people and for the people అంటాడు. (ప్రజలయొక్క, ప్రజల చేత ప్రజల కొరకు ప్రభుత్వము. అదే ప్రజాస్వామ్యం) అయితే ఈ వ్యవస్థలో ప్రజలు విద్యావంతులై, విజ్ఞానవంతులై మంచి చెడుల మధ్య విశ్లేషణ చేయగలిగిన ప్రజ్ఞాపూర్ణులై ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాకాని నాడు ఆ ప్రజాస్వామ్యం... పశువుల యొక్క, పశువుల చేత, పశువుల కొరకు మాత్రమే (Democracy without educated people is the country of the cattle, by the cattle and for the cattle) అని చెప్పుకోవాల్సి ఉంటుంది. 
సాధికారికంగా విశ్లేషించే తత్వం, ప్రశ్నించే తత్త్వం, అభివృద్ధిలో భాగస్వాములయే తత్త్వం ప్రజలలో నెలకొన్న వేళ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది, ఆశించిన ఫలితాలిస్తుంది. దీనికి విలువలతో కూడిన నాయకత్వం కావాలి. కాని చాలా దేశాలు, దేశాధినేతలూ తమ స్వార్ధ ప్రయోజనాలకు విలువలను ఫణంగా పెట్టడం కనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉందని తెలుస్తుంది. ఈ దేశాలలో గమనిస్తే దాదాపు అన్ని దేశాలలోని రాజకీయ పార్టీలు తమ విలువలకు తిలోదకాలిచ్చాయి. రష్యా తన కమ్యునిస్ట్, సోషలిస్ట్ సిద్ధాంతాలను వెనిక్కి నెట్టివేసింది. చైనాకూడా WTO లో భాగస్వామ్యం తీసుకొంది. మన దేశంలోని కమ్యునిస్ట్ పాలిత రాష్ట్రాలు కూడా పెట్టుబడి దారుల భావనల వైపు ఆకర్శితులౌతున్నారు, వారిని ఆహ్వానిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ పార్టీలు మారడం కనిపిస్తుంది. ఆదాయం కన్నా అధికంగా అక్రమమార్గంలో ఆస్థులు కూడబెట్టుకోవడం, డబ్బులు ఎరగా చూపి తమ పార్టీలకు ఓట్లేసే విధంగా ప్రలోభ పెట్టడం, భయపెట్టి తమకు మద్దతు కూడగట్టుకోవడం లాంటివి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. టి.డి.పి. యం.ఎల్.ఏ రేవంత్ రెడ్డి ఉదంతం దిగజారుతున్న రాజకీయ విలువలకు ఉదాహరణగ చెప్పుకోవచ్చు. ఒక పార్టీ టికెట్ తో గెలిచి మరొక పార్టీ లోకి మారి మంత్రులవడం కూడా రాజకీయ దిగజారుడు తనానికి ఉదాహరణయే. 
విలువలకు తిలోదకాలిచ్చే పార్టీలు ఆధిక్యత ప్రాతిపదికగా పాలనాధికారాన్ని చేపడితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అందుకే అంటారు... In the country of blind one-eye man will be the king. 
అలాగని అందరు నాయకులను అవినీతిపరులుగా లేదా విలువలు లేని వారిగా చెప్పుకోవడం తప్పవుతుంది. ఒకనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు తన కూతురికి మందులు కొనలేని పరిస్థితులలో ఆమె మరణించడం, అతని మరణానంతరం అతని బాంక్ ఖాతాలో 300 రూపాయలు మాత్రమే ఉండడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు తను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కాలంలో కూడా సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్ళడం అతని విలువలతో కూడిన నిబద్ధతకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన తనకు సంతానం ఉంటే స్వార్థం పెరుగుతుందనే ఆలోచనతో వివాహానికన్నా ముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం ఆతని విలువల జీవితానికి ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతీకగా చెప్పుకోవాలి. కలాం లాంటి నాయకుడు తమ జీవితాలను విలువలకు అంకితం చేయడం చరిత్రలో చూడవచ్చు.
ఇలా విలువలతో జీవితాలను సాగించిన నాయకులను, విలువలకు తిలోదకాలిచ్చి పశువుల గడ్డిని సైతం మేసిన నాయకులను ఎందరినైనా చూపవచ్చు. అయితే ఈ విలువలతో కూడిన సమున్నత నాయకత్వం కావాలి అంటే సమాజంలో ఉండ వలసిన విధానాలు ఏమిటి?
౧) విద్యా విధానంలో మార్పు రావాలి. బట్టీ పట్టే విధానం కాకుండా విశ్లేషణా పూర్వకంగా నేర్చుకునే విధానం అమలులో ఉండాలి. ఉదాహరణగా చెప్పుకుంటే... 2X2=4 అని విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇది బట్టీ పడుతున్నారు. దీనికి బదలుగా 2X2=4 ఎందుకవుతుంది 5 లేదా 3 ఎందుకు కాదు అనే ఆలోచన పిల్లలలో రేకెత్తే బోధనా విధానం అమలుకు వచ్చిన వేళ విద్యార్థిలో పరిణతి వస్తుంది. పరిణతి క్రొత్త మార్గాలను అన్వేషిస్తుంది... 
౨) పౌరులలో ప్రశ్నించే తత్త్వం రావాలి. దాని వల్ల పాలకులలో జవాబుదారితనం నెలకొంటుంది. 
౩) ఉపాధి అవకాశాలు ఎవరెవరి అర్హత ప్రాతిపదికగా వారికి దక్కాలి. ఏ రంగంలో అభిరుచి ఉంటే ఆ వ్యక్తిని ఆ రంగంలో నియమించ గలిగితే ఆ వ్యక్తి విలువలను సంతరించుకో గలుగుతాడు. 
౪) ప్రజ్ఞ గౌరవించ బడాలి. ఎప్పుడైతే ప్రజ్ఞావంతుడు అగౌరవం పాలవుతాడో అతని ప్రజ్ఞ నీరసపడి పోతుంది లేదా అపమార్గంలో (ఎక్కడైతే తనకు గౌరవం లభిస్తుందో అక్కడ) పయనిస్తుంది.
౫) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలలో చిన్నతనం నుండే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జీవించే విధానాన్ని బోధించాలి. వ్యక్తి కన్నా కుటుంబం, కుటుంబం కన్నా జాతి ముఖ్యమనే భావనను పిల్లలలో నింపగలగాలి. ఇక్కడ ప్రముఖమైన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా పిల్లలు చెపితే నేర్చుకోరు. అనుకరిస్తారు... అనుసరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుగా తాము మారాలి, తమ నడతను మార్చుకోవాలి. దాని వల్ల పిల్లలు ప్రేరణ పొందుతారు.
౬) శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు, ఆధ్యాత్మిక స్వావలంబన పట్ల అవగాహన సమాజంలో పెరగాలి
౭) జీవితాంతం నేర్చుకునే విధానానికి ప్రతి ఒక్కరూ అంకిత మనస్కులై ఉండాలి.
పాలకుర్తి రామమూర్తి