ఓం శ్రీ సరస్వత్యై నమః
శ్రీ రాజ రాజేశ్వరీ స్నిగ్ధ తత్త్వంబిలన్
వ్యక్తమయ్యెను సృష్టి
భావమంది
సర్వ జన హృదయ సమ్యక్ స్వభావమై
వారాహి రూపమై ప్రభవమయ్యె
అమల రాజశ్యామ లాఢ్య తత్త్వంబునై
ప్రకటిత మూర్తియై రాణగాంచె
ముగురమ్మలకు శక్తి మూలంబు తానయై
మంత్రార్థ భావమై మహిమ గాంచె
జనని యొక్కతే అఖిల విశ్వంబు కైన
సాధకావళి సాధనా స్థాయి నరసి
ప్రకటితంబయ్యె వివిధ రూపంబులందు
అట్టి ఆది శక్తికి భక్తి నంజలింతు!
యోగియై యొకచోట భోగియై యొకచోట
యలరు ననేకత్వమ్మరయ నొకటె
విషమైన సుధయైన భేదంబు చూపని
అద్వైత భావనా వ్యాప్తి
యొకటె
భోగ భాగ్యంబుల భూతి అస్థిర మెన్న
అక్షయాక్షర మిలన్
త్యాగమొకటె
అష్ట సిద్ధులనైన ఆసురీ శక్తుల
నైన సమత జూపు నట్టి దృష్టి
అమల తపదీప్తి విశ్వ విశ్వాంతరముల
యేకమై నిండ యోగ లింగేశ్వరాఖ్య
వెలసి భక్తుల బ్రోచెడు విశ్వమయుని
ఆది యోగికి ఈశుని కంజలింతు!
తత్త్వంబు నారసి దర్శింప పూర్ణమై
వ్యాప్తమై యొప్పారు
ఆదిశక్తి
అమ్మయై అయ్యయై అలరారు భక్తుల
భావనా విస్తృతి పరిధి యందు
పరిమిత దృష్టిలో పరికింప భిన్నమౌ
దేవతా మూర్తియై దీర్చు
కోర్కు
లే రూపు దర్శింప నా రూపుమున్ బొంది
సంకల్ప మీడేర్చు శక్తి
నొసగు
నట్టి జగదేక శక్తి నా ఆత్మలోన
కర్త, కర్మయు, క్రియయు నేకత్వ మగుచు
నిలిచి శ్రీయును కైవల్య నిరతిశయము
నొసగి బ్రోచుత సాధనోద్యోగ మందు!
ఆద్యయు విద్యయు నఖిల తత్త్వంబులు
తానయై
క్రీడించు జ్ఞాన మూర్తి
భావంబు శబ్దంబు భాషయు తానయై
జగతిలో
భాసించు సుగతి దాయి
కాలమున్ శాసించు కాల స్వరూపిణి
కాళుని
శాసించు కాళి యనగ
దుష్ట శిక్షణ కన్న దుష్టత్వ శిక్షణ
పరమోత్త
మంబన్న ప్రాజ్ఞురాలు
సకల సృష్టికి చేతనా శక్తి యైన
పరమ పావని "పూర్వజా" "పరయు"
నైన
అమ్మ, విశ్వ కుటుంబిని నాశ్రయింతు
దివ్య తత్త్వంబు యెదలోన దీప్తి చెంద! 1
గుణ భేదములె గాని కులభేదములు లేని
సత్సంస్కృతీ
స్ఫూర్తి సమయ జగతి
మతముల పేరిట మారణ హోమంబు
లాసురీ
భావంబు లలుము కొనగ
లలితవై దుర్గవై లాలించి పాలించి
సంస్కార
రీతుల సారమలది
పరిపూర్ణ మానవత్వమ్ము దివ్యత్వమ్ము
పల్లవించెడు
శీల సంపదను బెంచి
స్వార్ధమును వీడి పరులకై పాటుపడెడు
చిత్త పరిణతి నీయవే చిత్స్వరూప
వివృత వాత్సల్య హృదయ ! సంప్రీత చరిత!
స్నిగ్ధ చైతన్య మూర్తి! సుశ్రేయ దయిత! 2
అరుణారుణ ద్యుతీ భరితమౌ గగనాన
ప్రాభాత
రుచిర సంప్రసవ శోభ
వృక్షాగ్రముల జేరి పక్షి సంతతి సల్పు
కిల
కిలారావ సంగీత రుచులు
లలిమీర గిరిబాల తలజారు జలపాత
రమణీయ
నటనా విలాస దీప్తి
ఆర్ఘ్య ధారల దాకి అర్క మయూఖాళి
ప్రకటిత
ప్రకట శంపా విభూతి
కెరలు కెరటాలు సలుపు సంక్రీడ సరణి
సాంధ్య కాంతుల రసమయోత్సాహ భరిత
ప్రకృతి సోయగ మందు నీ ప్రాభవమ్మె
గనగ నయ్యెడు: తల్లిరో గనవె దయను! 3
ప్రత్యూష కిరణాలు లాలించ పద్మమ్ము
ఫుల్ల
శోభల నంది పల్లవించు
హరివిల్లు దలదాల్చి అతిశయించును నింగి
తొలకరించగ
నేల పులకరించు
ఘన పయోధుల దాటి గగన వీధుల దాటి
విహరించు
పక్షి తా విరియ బాఱు
పరవళ్లు ద్రొక్కుచు ప్రవహించు నది తాను
వార్ధి
సంస్పర్శచే పరవశించు
అడవి పూవుల పరిమళం బలుము కొనగ
నర్తనము చేయు వృక్షాళి నవ్య గతుల
అట్టి ప్రకృతి సౌందర్య సోయగ విభూతి
కెయ్య దాధార మా తల్లి నెద దలంతు! 4
మంగళ దాయియై మంగళమ్ములు గూర్చు
శోభనంబుల
నిచ్చు సుభగ మూర్తి
వాగ్వైభవములిచ్చి వరణీయులను జేయు
అతిశయింపగ
జేయు నక్షరముల
జన్మ మూల మెఱుంగు జ్ఞాన దీప్తి నొసంగు
రసమయ
భావ సామ్రాజ్య మిచ్చు
ఐహికమ్ముల నిచ్చు నాముష్మికము లిచ్చు
వేద
వేదాంగాది విద్య లిచ్చు
ప్రజ్ఞ జాగృతి గనెడు సౌభాగ్య మిచ్చు
ధిషణ సన్మార్గమున సాగు స్థిరత నిచ్చు
భోగ భాగ్యమ్ము లిచ్చును మోక్షమిచ్చు
అమ్మ లలితాంబ నెదనిల్పి అర్చ సేయ! 5
మెరుగు తీగల బోలు మేని కాంతిని బూని
ఆశ్రయ
శక్తియై అలరు మూర్తి
శరదిందు రుచిరమౌ దరహాస విలసిత
వదనాంబుజంబుతో
వఱలు మూర్తి
అష్ట హస్తాలతో అష్ట దిక్కుల యందు
తనరారు
విశ్వ చైతన్య మూర్తి
సంకల్ప శక్తియు జ్ఞాన శక్తియు క్రియా
శక్తియు
తానయౌ సత్వ మూర్తి
సింహ వాహనాసీనయై చెలులు గొలువ
భద్ర సౌభాగ్య దాయియై భవ్య గతుల
జగము లేలు జనని సుప్రసన్న మూర్తి
ప్రజల కష్టముల్ బాపి కాపాడు గాక! 6
శివకరీ శుభకరీ స్నిగ్ధ విద్యాధరీ
ప్రణవార్ధ
రూపిణీ భద్ర మూర్తి
సకలాగమ జ్ఞాన సంవిత్స్వరూపిణీ
జ్ఞాన
ప్రకాశినీ జ్ఞాన దాయి
ప్రేయస్కరీ భవ్య శ్రేయస్కరీ దివ్య
విభవ
ప్రదాయినీ వేదమాత
షట్చక్ర సంచారి చైతన్య రూపిణీ
అష్ట
సిద్ధుల నేలు ఆదిశక్తి
పంచ కోశాంతరస్థితా పరమ పూజ్య
త్రిపుర వాసిని కళ్యాణి త్రిపుర హంత్రి
పంచ కృత్య పరాయణా వందనమ్ము
శాశ్వతానంద రూపిణీ శరణు, శరణు! 7
ఏదేవి నిరుపాధి, ఏదేవి నిర్గుణ
బ్రహ్మంబు
యేదేవి పరయు నపర
యేదేవి క్రీడార్థ మీ జగత్సర్వంబు
సృజియింప
బడియె విశిష్ఠ గతుల
యేదేవి శుభదృష్టి నించుక గనినంత
సృష్టి
సమస్తంబు స్థితిని బొందు
యేదేవి క్రీగంట యిసుమంత గాంచిన
లయమౌను
సృష్టి విలాస మెల్ల
అమిత సౌందర్య లహరియై వ్యాప్తమైన
శివము యేదేవి విభవమై చెన్ను మెరయు
నట్టి కాత్యాయనీ దేవి కంజలింతు
నభయ దాయియై జగముల నాదరింప! 8
ఏతల్లి చిద్రూప యేతల్లి చిన్మయి
యేతల్లిని
స్మరింపఁ నిహము పరము
యేతల్లి చిచ్ఛక్తి యేతల్లి ఆత్మ వి
ద్యకు
మూల మేతల్లి అగ్రగణ్య
యేతల్లి అవ్యక్త మేతల్లి వ్యక్తంబు
యేతల్లి
కనుదోయి నినుడు శశియు
యేతల్లి గాయత్రి యేతల్లి గుణనిధి
యేతల్లి
సర్వమయీ భవాని
అట్టి సాక్షర రూపయౌ ఆదిశక్తి
ముగ్గురమ్మల జనయిత్రి మూల ప్రకృతి
సర్వ లోక వశంకరి చారు హాస
యైన లలితాంబ నర్చింతు నహరహమ్ము! 9
కాలమే బ్రహ్మంబు కాలమే విఘ్నమ్ము
కాలమే
ప్రణవమౌ కల్పమదియ
కాలమే సత్యమ్ము కాలమే నిత్యమ్ము
కాలమే
శూన్యమ్ము కాష్ఠ మదియ
కాలమే జ్ఞాతయున్ కాలమే జ్ఞేయమ్ము
కాలమే
జ్ఞాన మజ్ఞాన మదియ
కాలమే బిందువౌ కాలమే పూర్ణమౌ
కాలమే
తత్వ మక్షరము నదియ
కాలమే అంధకారమ్ము కాంతి యదియ
కాలమే కాళ రాత్రియు కాళి యదియ
కాలమె అఖండ విశ్వ వికాస శక్తి
అట్టి కాలమ్ము యిడుత శ్రేయస్సు ప్రజకు! 10
సత్య స్వరూపమై సర్వ సంవ్యాప్తమై
అద్వితీయం
బైన ఆదిశక్తి
తేజోమయంబైన స్త్రీ పూరుషాకృతుల్
నిజ
విలాసార్ధమై నియతి నంది
దివ్యత్వ భావనల్ దీపింప సముదాత్త
పంచ
కృత్యమ్ముల వరుస సలుప
అయ్యదే సృష్టియై వ్యాపించ దిక్కుల
విశ్వ
విశ్వాంతరాల్ వెలుగు చూచె
ముగ్గురమ్మలు నయ్యలు భువన తతియు
సకలమున నాత్మ రూపమై శక్తి నిండె
అట్టి శక్తియె చిచ్ఛక్తి అప్రమేయ
భద్ర మూర్తియై మనల కాపాడుగాక! 11
క్షేత్రమ్మొ తీర్థమ్మొ గిరులొక్కొ తరులొక్కొ
భూతసంచయమొకో
భువియొ దివియొ
నీ స్థాన మెయ్యదో నీ రూప మెయ్యదో
యే
స్వభావమొ నీది యెచటొ యునికి
వెతికితి తమములో వెతికితి వెలుగులో
విశ్వ
మంతట నిన్ను వెదికి, గనక;
ఆరాటమును బొంది ఆవేదనను చెంది
దారి
తెన్నును గాంచ తరము గాక.
ఆశ్రయించితి "గురువు"; నా అలఘు మూర్తి
పలికె... సర్వేశు వెదుక నీ బాహ్య జగతి
కాదు; వెదుకుము అంతరంగమ్ము నందు..
"ఎఱుక" నద్దాన గలిగె నా హృదయ సీమ! 12
పరిమితుల్ లేనట్టి పరిపూర్ణ తత్త్వమ్ము
అప్రమేయంబు
నవ్యక్త మదియ
అదె సచ్చిదానంద మదె అద్వితీయమ్ము
పరమేష్టి
యయ్యదే పరమశక్తి
మహదహంకారమ్ము మట్టియు జలమును
అగ్నియు
గాలియు నాకసమ్ము
నగుచు వ్యక్తంబయ్యె నయ్యదే దృశ్యమౌ
ప్రకృతి
బ్రహ్మాండమై పరిఢవిల్లె
అపరిమితము నవ్యక్తమౌ నాది శక్తి
పరిమితము నంది వ్యక్తమౌ వలను పుటుక
పరిమిత మపరిమితము నవ్యక్త మగుట
మరణ, మయ్యదే సంక్రీడ మాత నీకు! 13
ఉద్వేగమును బెంచు ఉద్యోగ చదువులు
విద్యా
విభూతిని వెలితి చేయ
అర్థమ్ముపై మోహ మధికార కాంక్షయు
యశము
కామములందు నారటమ్ము
బ్రతుకుపై నాపేక్ష రాగమ్ము ద్వేషమ్ము
ఔద్ధత్య
మోర్వమి నతిశయమ్ము
అహరహమ్మెదలోన అగ్గియై జ్వలియింప
బాధామయమ్మునై
బ్రతుకు సాగె
అట్టి చింతనా ఛాయల నాశ్రయించి
అలఘు జీవన సౌందర్య మానలేక
అలమటించెడు నాదు దైన్యమ్ము మాన్చి
పథము చూపవే తల్లి! భవాని శరణు! 14
ఉద్వేగ రహితమై యొప్పారు భాషణ
సత్య
ప్రియత్వమ్ము శాస్త్ర చర్చ
వాజ్మయ తపమును పలుకులో హితమును
నిరతాధ్యయన
కాంక్ష నియమ నిష్ఠ
సౌమ్య వర్తనమ్ము శ్రధ్ధయు గురుభక్తి
మనసు
నియంత్రణ మౌన దీక్ష
సంతోష సంతాప సంస్కార వృత్తుల
నధిగమించెడు
స్థితి నందు బుద్ధి
ఆత్మ సహచరత్వమ్ము విద్యా విభూతి
ధార ధారణ స్ఫురణయు ధ్యాన ధైర్య
గతుల నిలుపంగ మది నేక కాలమందు
తగిన సామర్ధ్య మీయవే తల్లి నతులు! 15
వ్యావహారిక సత్య వాదంబులే గాని
పారమార్థిక
సత్య ఫణితి లేదు
సమతయు మమతయు సద్భావనలు పల్కు
సరణియే
గాని ఆచరణ లేదు
అర్ధ నారీశ్వరు లాదర్శమే గాని
వారితో
నడచు దంపతులు లేరు
పలు ధర్మ పన్నముల్ ప్రవచించుటే గాని
ధర్మాధ్వ
గమన తత్పరత లేదు.
వలయు చర్చలు, మతభేదములను బాప
ననుటయే గాని; విడరు వాదనల నెపుడు
చూడ నేటికి త్రికరణ శుద్ధి లేని
బ్రతుకు నిచ్చితి వజ్ఞాన భావ మమర! 16
ప్రకటితంబయ్యె నీ పరిపూర్ణ తత్త్వమ్మె
భవ్య
ప్రపంచమై భద్ర గతుల
ప్రసవితంబయ్యె నీ ద్వంద్వ ప్రవృత్తులు
మాయాంధకారాన
మ్రగ్గ జనులు
త్రిగుణాళి క్రమ్మగా త్రిపురాళి చెర జిక్కి
జనన మరణ
చక్ర సంచయముల
తమ మూల మెయ్యదో తామెఱుంగగ లేక
అపమార్గ
గాములై అలమటించు
ప్రజల దయ నేలు టదె నీకు ప్రాభవమ్ము
కాక, భయ తాప గతుల సంఘర్షణముల
బ్రతుకు లీడ్చెడి జీవుల భ్రమలు బెంచి
తగునె ఆనంద మొందుట, తల్లి నీకు! 17
బ్రహ్మాండ భాండ సంవ్యాప్తమౌ చిచ్చక్తి
చేతనాచేతన
జీవ తతుల
ప్రాణశక్తి యగుచు రాజిల్ల పూర్ణమై
భువన
భాండమ్ములు అవతరించె
ఆర్ద్రమై జ్వలితమై అల చంద్ర తత్వమ్ము
అగ్ని
తత్వమ్ములు అమరె జగతి
ఆర్ద్ర జ్వలన తత్వ మంబువుల్ తేజస్సు
లీ రెంటి
కలయికే సృష్టి రచన
“అదితి” యనగ నఖండమై అఖిల జగతి
యందు వ్యాప్తమౌ తేజస్సు అదియ సుప్ర
కాశ మయ్యదే తొలగించు కర్మ ఫలము
అట్టి అదితికి భక్తి మున్నంజలింతు! 18
లలితాంబ తత్వమ్ము లాలించి పాలింప
గ్రహతారకాదుల
గతులు నిలిచె
శ్రీ సరస్వతి తత్వ చిద్విలాసంబున
విభవంబు
చూపె నవిద్య విద్య
శ్రీ లక్ష్మి తత్త్వ సుశ్రీ విభవ ద్యుతిన్
సిరులు
నైశ్వర్యముల్ స్థితిని గాంచె
శ్రీ పార్వతీ దేవి స్నిగ్ధ తత్వమ్మున
సౌశీల్య
విభవంపు సత్వ మమరె
రాజ రాజేశ్వరీ తత్త్వ రమ్య దీప్తి
నిత్య సౌభాగ్య సంపదల్ నియత మయ్యె
దుర్గ తత్వమ్ము రక్షణోద్యోగ మిచ్చె
నట్టి ఆది శక్తికి భక్తి నంజలింతు! 19
మంత్రమ్ము లెఱుఁగను తంత్రంబు లెఱుఁగను
స్తుతి చేసి మెప్పించు మతియు లేదు
ఆహ్వానమును చేయు నట్టి విధ మెఱుఁగ
నిన్నుపాసన చేయు నియమ మెఱుఁగ
ఎఱుఁగను ధ్యానమ్ము లెఱుఁగను ముద్రలు
బాధల నెఱిగించు పథ మెఱుంగ
ఎటుల పూజించుటో ఎటుల ప్రార్థించుటో
ఎటుల నిన్నరయుటో యెఱుగ నేను
అయిన తెలిసిన దొక్కటే అమ్మ నాకు
నిన్ననుసరించి నడచిన, నీవె నాదు
దురితముల బాపి పోగొట్టి దుఃఖ వితతి
భవ్య పథమిత్తు నను సత్య వాక్కు; శరణు! 20
పాలకుర్తి రామమూర్తి
ఆర్యా..
నా పేరు పాలకుర్తి రామమూర్తి
ఉండేది.. భువనగిరిలో.
సింగరేణి కాలరీస్ కంపెనీలో, బెల్లంపల్లి, ఏరియాలో ఆర్థిక మరియు గణాంక శాఖలో Dy. Supt. గా ఉద్యోగించినది.
తెలుగు సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవడం, వ్యక్తిత్వ నిర్మాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం
ప్రవృత్తి. ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక
యాజమాన్య నిర్వహణ నేపథ్యంలో వ్యాఖ్యానించడం అత్యంత ఇష్టమైన అంశం. ఇప్పటి వరకు 21 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
అందులో పద్య కవిత్వానికి సంబంధించినవి 6 పుస్తకాలు. యాజమాన్య నిర్వహణ ఆధారితంగా 10
పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
వివిధ విద్యాలయాలలో 10 వ
తరగతి నుండి పి.జి. వరకు 300 పైగా వ్యక్తిత్వ నిర్మాణం, ప్రాచీన సాహిత్యం నేపధ్యంలో ఆధునిక యాజమాన్య నిర్వహణ, మానవ విలువలు, వృత్తిలో నైతికత అనే అంశాలపై ప్రసంగించాను. వివిధ తెలుగు పత్రికలలో ఆధ్యాత్మిక
వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి
సౌజన్యంతో పద్యాలయంలో నా భావాలను పంచుకోవడం, పెద్దలు ఎందరో వ్రాసిన పద్య సాహిత్యాన్ని ఆధ్యయనం చేయడం
ఆనందంగా ఉన్నది. ఆచార్య భూమయ్య గారికి కృతజ్ఞతా పూర్వక నమస్సులు.
కృతజ్ఞతా నమస్సులతో...
పాలకుర్తి రామమూర్తి
ఇం.నెం. 5-6-25
టీచర్స్ కాలనీ, భువన గిరి; 508116
యాదాద్రి భువనగిరి జిల్లా