సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం
అర్థస్యమూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియ జయం!
అంటుంది
చాణక్య నీతి.
ప్రతి
వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కాని దాని మూలం ధర్మాచరణ అనే విషయాన్ని
విస్మరిస్తాడు. రాజ్యంలోని ప్రజలు తమకు సంక్షేమాలు కావాలని కోరుకుంటారు. అది
న్యాయమే కాని అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే సకల సంపదలతో విలసిల్లే రాజ్యం మాతమే
ప్రజలకు సంక్షేమాలు అందించ గలుగుతుంది. కాని దానికి ఆ రాజ్య సుస్థిరత అవసరమౌతుంది.
స్థిరమైన ప్రజ్ఞాపూర్ణమైన రాజ్యం కావాలంటే ప్రజలు ముఖ్యంగా నాయకుడు ఇంద్రియ
నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిన నాయకుడు విజయ సాధకుడౌతాడు.
అలాంటి వ్యవస్థ ప్రజలకు ప్రశాంతతను ఇస్తుంది.
నాయకుని
విజయ సాధనను నాలుగు ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేస్తాయి.
మొదటిది....
తన మేధో సంపద. బాగా తెలివి కలవాడు కావాల్సిన అవసరం లేదు కాని అవసరమైన చోట
తెలివితేటలు ప్రదర్శించ వలసిన అవసరం ఉంటుంది. అలాగే అతి తెలివి అనర్ధ దాయకమని
గుర్తించడం అవసరం.
రెండవది...
ఊహాశక్తి. ఎంతగా ఊహా శక్తిని పెంచుకోగలిగితే అంతటి విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. ఊహా శక్తి
ప్రాధాన్యతను గుర్తించి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ను మానసిక శాస్త్రవేత్తలు
తయారు చేసారు. సుప్త చేతనావస్థలో ఉన్న అంతర్మనస్సును జాగృతం చేయడం వల్ల దాని
అపారమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు అనేది ఆ సిద్ధాంత కర్తల అభిప్రాయం.
మూడవది...
తనపై తనకు నమ్మకం. నమ్మకాన్ని మించిన విజయ సారధి మరొకటి లేదు. విజయం సాధించ గలననే
నమ్మకం కలిగితే సగం విజయం వరించినట్లే నంటారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాధారణంగా మనం అందరినీ నమ్ముతాము కాని మనల్ని
మనం నమ్మం. మనలోని అంతర్గత శక్తిని నమ్మం. మనల్ని మనం ప్రేమించినట్లుగా మనల్ని
ప్రేమించ గలిగిన వారీ ప్రపంచంలో ఎవరూ లేరనే విషయం అర్థం అవుతే మనల్ని మనం
ప్రేమిస్తాం. మన శక్తియుక్తులను ప్రేమిస్తాం. విజయాన్ని సాధిస్తాం.
ఇక
నాలుగవది అతి ముఖ్యమైనది.... అపజయం పొందడం. నిజానికి ఏ వ్యక్తీ కావాలని అపజయాన్ని
ఆస్వాదించాలని అనుకోడు. కాని దానిని కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. దాని అనుభవం
ఎలాంటిదో అనుభవ పూర్వకంగా గుర్తించాలి. అపజయం వల్ల కలిగే బాధల లోతులు అర్ధం
కావాలి. అయ్యో అపజయం పాలవుతామనే భయం దూరం కావాలంటే దానిని అనుభవించాల్సిందే.
అప్పుడే మనలో పరిణతి వస్తుంది. పరిణతి వల్ల మరింత సాహసోపేత నిర్ణయాలు తీసుకో
గలుగుతాము. మన కంఫర్ట్ జోన్ నుండి బయటపడ గలుగుతాము. ఇలాంటి అనుభవాలను రుచి
చూసినప్పుడే విజయ సాధనలో ఉండే మాధుర్యం అవగతమౌతుంది. ఆ ఆస్వాదనను ఆనందంగా
స్వీకరించ గలుగుతాము. ద్వంద్వ భావ సమన్వితమైన సృష్టిలో విజయాన్ని అంటి పెట్టుకునే
అపజయం ఉంటుంది. దానిని గుర్తించడంలో జాగ్రత్త అవసరం. అపజయానికి భయపడడం బెంబేలెత్తి
పోవడం వల్ల విజయం రాదు. ఓపిక కావాలి. సంయమనత కావాలి. ఆలోచన పదను తేలాలి. ప్రణాళిక
ఆచరణయోగ్యమై ఉండాలి. ఆచరణలో నిబద్ధతకావాలి. జయాపజయాలను సమంగా స్వీకరించ గలిగిన
మానసిక స్థిరత కావాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
పై నాలుగు లక్షణాలను సాధించాలంటే ఇంద్రియాలపై పట్టు సాధించాలి. ఇంద్రియ సాధన అంటే వాటికి దూరంగా ఉండటం కాదు. అవసరమైన చోట అవసరమైన మేరకు అవసరమైన విధంగా వాటిని ఉపయోగించడం మాత్రమే. కొద్ది అవగాహనతో సాధ్యపడే ఇంద్రియ సాధన వల్ల విజయాన్ని సాధించడం జీవితాన్ని ఆస్వాదించడ సాధ్యపడుతుందని చాణక్య నీతి ప్రబోధిస్తుంది.
పై నాలుగు లక్షణాలను సాధించాలంటే ఇంద్రియాలపై పట్టు సాధించాలి. ఇంద్రియ సాధన అంటే వాటికి దూరంగా ఉండటం కాదు. అవసరమైన చోట అవసరమైన మేరకు అవసరమైన విధంగా వాటిని ఉపయోగించడం మాత్రమే. కొద్ది అవగాహనతో సాధ్యపడే ఇంద్రియ సాధన వల్ల విజయాన్ని సాధించడం జీవితాన్ని ఆస్వాదించడ సాధ్యపడుతుందని చాణక్య నీతి ప్రబోధిస్తుంది.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment