పుస్తకం ప్రత్యాధీతం నాధీతం గురు సన్నిధౌ
సభా మధ్యే న శోచన్తే జార గర్భా ఇవ స్త్రియః!
చాణక్య నీతి --- 17-1
విద్య నభ్యసించడం గురుముఖతః జరగాలని చాణక్యుల అభిప్రాయం. యోగ్యుడైన గురువు
వద్ద విద్య నభ్యసించని వాడు పుస్తకాలనుండి గ్రహించిన విజ్ఞానంతో తానే
విద్వాంసుడనని భావిస్తే అది అతని భ్రమయే అంటాడు, చాణక్యుడు.
ఉదాహరణగా... జార స్త్రీ గర్భం దాల్చి సభలో నిలిస్తే ఎలాగో పుస్తకస్తమైన విజ్ఞానం
ఆలంబనగా సభలో నిలవడం అలాంటి గౌరవాన్నే ఇస్తుందని అంటున్నాడిక్కడ. సక్రమ సంబంధంతో
గర్భం దాల్చిన స్త్రీకి, అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన
స్త్రీకి లభించే గౌరవ మర్యాదలు ఎలాంటివో... అలాంటి గౌరవమే గురు ముఖతః విద్య
నేర్చిన వానికి, పుస్తకస్తమైన విజ్ఞానాన్ని మాత్రమే పొందిన
వానికి విద్వత్సభలలో లభిస్తుందంటాడు, చాణక్యుడు.
లోతుగా
పరిశీలిస్తే, విజ్ఞానం ముఖ్యంగా అధీతి,
బోధ, అవగతం, ప్రచారం అనే
నాలుగు మార్గాలలో ప్రయాణిస్తుంది. అధీతి అంటే గురు ముఖతః లోతుగా అధ్యయనం చేయడం.
విషయాన్ని లోతుగా పరిశీలించడం వల్ల అవగాహన పెరుగుతుంది. ఒక విద్యాలయంలో తనతో చదివే
విద్యార్థుల అవగాహనా పరిధి చర్చల ద్వారా విస్తృత మౌతుంది. అనుమానాలు
తీర్చుకునేందుకు గురువు యొక్క అవగాహన తోడవుతుంది. ముఖ్యంగా కలసి పనిచేయడం వల్ల
సంయమనత అలవడుతుంది. ఎదుటి వ్యక్తి దృష్టి కోణం నుండి అర్థం చేసుకోవడం, ఆలోచన చేయడం అలవాటవుతుంది. ప్రజ్ఞాపూర్ణుడైన గురువు వద్ద విద్య పలుకుల
ఆధారంగా కాక ఆత్మ నుండి ఆత్మకు (presence to presence) చేరుతుంది.
విషయ పారీణత పుస్తకాలలో కొంత పరిధిలో మాత్రమే లభిస్తుంది. అదీ రచయిత అవగాహన మేరకు
మాత్రమే లభ్యమయ్యే విజ్ఞానం సమగ్రతను సంతరించుకునే అవకాశం తక్కువ. ఒకవేళ రచయితకు
సమగ్ర అవగాహన ఉన్నా వ్యక్తీకరణలో లోపం లేదా పఠిత అవగాహనా లోపం వల్ల అసమగ్రత చోటు
చేసుకుంటుంది.
బోధ
అంటే విషయాన్ని అన్ని కోణాలలో పరిశీలించి విద్యార్థి అవగాహనకు గురువు అవగాహనకు
లేదా తోటి వారి అవగాహనకు మధ్య ఉండే భేదాన్ని గుర్తించడం. ఎదుటి వాడెందుకు
చెప్పాడనే అవగాహన పెరగడమే బోధ. అన్వయం చేసుకోవడంలోని క్లిష్టత గురు ముఖతః తెలుసు
కోగలిగే అవకాశం ఉంటుంది.
అవగతం
అంటే దానిని ప్రతిక్షేపించి ఫలితాన్ని సరి చూసుకోవడం. పుస్తకగతమైన విజ్ఞానాన్ని
సరి చూసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నైపుణ్యం కావాలి అంటే ఫలితాన్ని స్వయంగా
ప్రతిక్షేపించి పరిక్షించాలి.
ప్రచారం
అంటే... తాను నేర్చిన విజ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడం. తాను సంతృప్తి పొందిన
పిమ్మట, విషయాన్ని సభలలో ప్రస్తావించడం
వల్ల సభాసదుల ప్రశ్నలను ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొన గలుగుతాము. అనుమానాలకు, సందిగ్ధతకు తావులేని విధంగా చెప్పడం గురు ముఖతః నేర్చిన వారికి
సాధ్యపడినంతగా పుస్తకాలతో సాధించిన విజ్ఞానం ఆలంబనగా నిలిచే వారికి సాధ్యపడదు.
ఒక
డాక్టర్ తాను పుస్తకాలలో ఎంత నేర్చినా అది మిడి మిడి జ్ఞానమే అవుతుంది కాని
ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. అలాగే ఒక ఇంజనీర్, ఒక ఉపాధ్యాయుడు అలాగే ఏ ఇతర వృత్తి వారయినా తాము గురు ముఖతః నేర్చిన
దానికి పుస్తకాల ద్వారా తెలుసుకున్న దానికి భేదం ఉంటుందనేది ఆచార్య చాణక్యుల
అభిప్రాయం.
మరొక్క
విషయం దీనికి జోడించాలి. అక్షరాలు ఒక విషయాన్ని చూపుతాయి. వాటిని పద్ధతి ప్రకారం
అమరిస్తే అది సమాచారం అవుతుంది. సమాచారాన్ని భావానికి అను సంధానిస్తే అది విజ్ఞానం
అవుతుంది. విజ్ఞానం పరీక్షింపబడి సంతృప్తికర ఫలితాలు వస్తే అది సాక్షాత్కార
మౌతుంది. అది గురు ముఖతః జరిగితే, అనుమానాలు
మాయమవుతాయి.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment