ఇతరుల కష్టాలు పట్టించుకొనని వారు
రాజా వేశ్యా యమశ్చాగ్నిః చోరాః
బాలక యాచకః
పరదుఃఖం నజానంతి అష్టమో గ్రామ
కంటకాః!
అంటాడు, చాణక్యుడు. చాణక్యనీతి 17-17
రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు మరియు గ్రామ కరణం... ఈ ఎనిమిది మందికీ ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ధ్యాస ఉండదు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోలేరు
అంటారు, చాణక్యులు.
రాజుకు సాధారణంగా కష్టాలు దుఃఖాలు తెలియవు. స్వయంగా దుఃఖం ఏమిటో అనుభవించని వానికి ఎదుటి వారి కష్టం అర్ధంకాదు కదా. అంతేకాదు, నిరంతరం రాచకార్యాలలో మునిగితేలే వానికి
కొంత కఠినంగా ఉండవలసిన అవసరమూ ఉంటుంది. రాజుల మనస్సు దారుణా ఖండల శస్త్ర తుల్యం, మాట మాత్రము నవ్య నవనీత సమానంగా ఉంటుంది అంటారు నన్నయ గారు
భారతంలో.
ఎదుటి వారి కష్టాలకు కరిగినట్లే కనిపించాలి కాని ఎప్పుడూ
కరగిపోవద్దు.
ఇతరుల సలహాలు తీసుకోవాలే కాని తన పద్ధతిలో తాను నడవాలి. అందరికీ స్నేహితునిగా నటించాలి కాని గూఢాచారిలా వ్యవహరించాలి. మిత్రులను, బంధుగణాన్ని చివరకు భార్యా పిల్లలను కూడా
అతిగా నమ్మవద్దు.
దీనినే విరాట పర్వంలో తిక్కనగారు చక్కని పద్యంలో చెప్పారు.
పుత్రులు పౌత్రులు భ్రాతలు
మిత్రులనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్
శత్రుల కా దమ యలుకకు బాత్రము
సేయుదురు నిజ శుభస్థితి పొంటెన్!
తమ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవ్వరయినా ఏ పరిస్థితులలో ఉన్నా చివరకు తమ
సంతానమైనా శిక్షిస్తారే కాని ఎదుటివారి బాధలను దుఃఖాన్ని అర్థంచేసుకొని క్షమించడం
జరగదు. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదుగా ఉంటారు. తమ భద్రత, తమ మేలు లక్ష్యంగా సాగే వారి కార్యాచరణలో
శాసన ధిక్కారాన్ని ఏ పరిస్థితులలో కూడ సహించరు.
వేశ్య... ఆమె వృత్తి విటులను ఆకర్షించడం
వారి వద్ధ ధనాన్ని పొందడం.
అయ్యో! వారి ఇల్లు నావల్ల గుల్ల అవుతుందే అని బాధ పడుతూ కూర్చుంటే
తన వృత్తి సాగదు.
కాబట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఎదుటివారి కష్ట
నష్టాలతో సంబంధం లేకుండా విటులను ఆకర్షిస్తుంది ధనాన్ని ఆర్జిస్తుంది.
యమధర్మ రాజు యొక్క కర్తవ్యం ... ఆయువు తీరిన జీవుల ప్రాణాలు
హరించడమే. మనకు సంబంధించిన వారు ఏ వయసులో ఉన్నా మనల్ని వీడి అనంత
లోకాలకు వెళితే మనకు బాధయే.
అయితే మృతుల బంధువులు స్నేహితులు దుఃఖిస్తున్నారని
కరుణాయత్త చిత్తంతో కూర్చుంటే తన కర్తవ్య పాలనను యముడు చేయలేడు కాబట్టి ఎదుటివారి
బాధలను పట్టించుకోకుండా తనపని తాను చేసుకు పోతాడు. అలా చేయకపోతే పెరిగే జన సాంద్రతకు ఈ భూమండలమే కాదు ఎన్ని
భూమండలాలైనా సరిపోవు.
ఆహార పానీయాదులకూ కష్టమౌతుంది. అయినా పాత నీరు అలాగే ఉంటే క్రొత్తనీరు వచ్చేందుకు అవకాశం
ఉండదు కదా.
అగ్ని లక్షణం కాల్చడం. అగ్నిని సర్వ భక్షకుడు అంటారు. అన్నింటినీ దహించి వేసే అగ్ని శిఖలకు తరతమ భేదం లేదు. ఎవరి బాధలు, కష్టాలను, దుఃఖాలను
పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.
చోరులు అంటే దొంగల వృత్తి దోచుకోవడమే. అయ్యో ఈ ఇంటి యజమాని కష్టాలలో ఉన్నాడు ఇతని సంపదను దోచుకో
వద్దని అనుకుంటే, జాలి కనికరం ఉంటే తన పని నడవదు. అంతే కాదు ఇతరుల బాధలను అర్థంచేసుకోవడానికి అతనేమీ మహానుభావుడు కాదు కదా. అనుసరించి, అదను చూసి, ఆదమరచిన
వేళ దోచుకోవడం అలవాటయిన వాడు ఇతరుల దుఃఖానికి స్పందించే సున్నితత్త్వాన్ని ప్రయత్న
పూర్వకంగా నైనా వదలివేస్తాడు.
చిన్నపిల్లలు తమకు కావలసిన దానిని సాధించుకునే క్రమంలో
తామెక్కడ ఉన్నదీ, అడిగేందుకది సరైన సమయమా కాదా, ఎలా అడగాలి అనే విషయాలను పట్టించుకోరు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా తాము కోరింది
జరిగేదాక హఠం చేస్తారు.
అవకాశం ఉంటే గారాబంగా అడిగి సాధిస్తారు. లేదంటే ఏడ్చి, గోల చేసి, పంతం పట్టి,
అలిగి అల్లరి చేసి లేదా బ్లాక్ మెయిల్ చేసైనా సాధిస్తారు. ఈ క్రమంలో ఎవరి బాధలనూ వారు పట్టించుకోరు.
యాచకులు ఎవ్వరినైనా యాచిస్తారు. తమ వృత్తిపరంగా ఎదుటివారు ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారనే
విషయం వారికవసరం లేదు.
అందరి ముందు చేయిచాచడమే వాడికి తెలిసిన విద్య.
ఇక చివరగా... గ్రామ కరణాలు... ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి వారి నుండి వీరి నుండి లబ్ధిపొందడమే వృత్తిగా
కలిగి కరణీకం చేసే వ్యక్తులకు ఎవరైనా బాధపడతారనే ఆలోచన ఉండదు. వీరికి మిత్రులు శత్రులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. తమ స్వార్థానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించుకోవాలో నేరుస్తారు. నమ్మకద్రోహం చేయడం వీరి నైజం. ఈర్ష్యాసూయ భావాలు
కలిగిన వీరు అందరి వద్దా తలలో నాలుక లాగా చనువుగా వ్యవహరిస్తూ అవకాశం రాగానే ఎదుటి వారిని ముంచివేసే ప్రయత్నం
చేస్తారు. ఎదుటివారి బాధలలో తమ
సంతోషాన్ని వెదుక్కునే ఇలాంటి వారిని "గ్రామ కంటకాః" అని సంబోధిస్తాడు, చాణక్యుడు.
ఇలా చాణక్యులు ఎదుటివారి
బాధలను, దుఃఖాన్ని
పట్టించుకోని వారిని గూర్చి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మానవులు
మంచికన్నా చెడుకే ఎక్కువగా స్పందిస్తారు.
సింహం నోట్లో తలపెడితే
ఏమౌతుందో తెలిస్తే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాము
No comments:
Post a Comment