లోక యాత్రా భయం లజ్జా దాక్షిణ్యం త్యాగశీలతా
పంచయత్ర న విద్యంతే న
కుర్యాత్తత్ర సంగతిమ్!
చాణక్య
నీతి --- 1-10
ప్రశాంత
నివాసానికి అయిదు స్థానాలను వర్జనీయాలుగా చెపుతున్నాడు, చాణక్యుడు. జీవనోపాధి దొరకని స్థలం, పౌరులలో భయము, సిగ్గు, ఉదారత మరియు దానశీలత లాంటివి కనిపించని
స్థలాలు నివాస యోగ్యం కాదంటాడు, చాణక్యుడు.
జీవనోపాధికి
వృత్తి వ్యాపారాలు దొరకని స్థలాలు: ప్రతి జీవికీ ఆకలి ప్రాథమిక అవసరం. ఉపాధికి
అవకాశాలు లభించడం వల్ల శరీరాన్ని పోషించుకునే అవకాశం ఉంటుంది. శరీరం, నేను లేదా ఆత్మ ఈ రెండింటి సంయోగం వల్ల
మనకు ఉనికి కనిపిస్తుంది. శారీరక అవసరాలు వేరు ఆత్మ లేదు నేను యొక్క అవసరాలు వేరు.
ఉదాహరణకు... ఆకలి వేస్తుంది.. ఆహారం తీసుకుంటాము.. ఆకలి తీరుతుంది. ఇది శారీరక
అవసరం. ఏం తింటున్నాము ఎక్కడ తింటున్నాము అనేది శరీరానికి అవసరం లేదు. శరీరం
కోరుకునేది తన పోషణకు అవసరమైన పోషకాహార విలువలతో కూడిన ఆహారం దొరికితే చాలు. మరి
"నేను"కు కావలసింది? గౌరవంతో కూడిన ఆహారం, రుచితో కూడిన ఆహారం. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆహారం. ఉన్నత వర్గంతో
కూర్చొని భుజించేందుకు అవకాశం ఇచ్చిన ఆహారం. తన అహాన్ని సంతృప్తి పరచ గలిగిన ఆహారం
కావాలి. దానికై అది తపిస్తుంది. నిరంతరం శ్రమిస్తుంది, ఆలోచిస్తుంది,
ఆవైపు గమిస్తుంది, దానిని సాధిస్తుంది.
కనీస
అవసరాలు దొరకని నాడు సమాజంలో అభద్రతా భావన నిండుతుంది. జనంలో ఒకరి పట్ల ఒకరికి
నమ్మకం లేమిచేత సమాజం లో అలజడి ఏర్పడుతుంది. అలజడి సంఘర్షణకు దారి చూపుతుంది.
శాంతి సౌహార్ద్రతలు సన్నగిల్లి బలహీనులను దోచుకునే అరాచక శక్తులు రాజ్య మేలుతాయి.
ఈర్శ్యాసూయలు ఎక్కువై జీవనానికి విఘాతం కల్పిస్తాయి. అందువల్ల ప్రజలకు కనీస
అవసరాలు తీర్చుకుని గౌరవంగా బ్రతుక గలిగేందుకు అవసరమైన ఉపాధి అవకాశాలు లభించే
ప్రదేశంలో జీవించాలని చెపుతున్నాడు, చాణక్యుడు.
ఎక్కడైతే
భయము, సిగ్గు, లజ్జ
లాంటివి ఉండవో: వైవిధ్య
భరితమైన నమ్మకాలతో, అలవాట్లతో ఒకే ప్రదేశంలో
ఒక్కటిగా జీవించే వ్యక్తుల సమూహమే సమాజం.
ఆ సమాజంలో ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండాలి, స్పందనలుండాలి,
అభిమానాలుండాలి. అప్పుడే అక్కడ శాంతి సౌభాగ్యాలు నిలుస్తాయి. ఏ సమాజమైనా కొన్ని విలువల ప్రాతిపదికన నడుస్తుంది.
ఏది యుక్తమైనదో ఏది చేయకూడనిదో సమాజం
నిర్దేశిస్తుంది. అనుసరణీయమైన పనులు చేయడం వర్జనీయాలను చేయకపోవడం ఆదర్శణీయం,
ఆదరణీయం. చేయకూడని పనులు చేయడంలో భయం, బిడియం,
సిగ్గు, లజ్జల ప్రమేయం ఉంటుంది. ఆ
సున్నితత్త్వం ప్రజలలో లోపిస్తే వ్యక్తులకు జంతువులకూ మధ్య బేధం ఉండదు. కాబట్టి
అలాంటి సమాజం వర్జనీయం అంటాడు, చాణక్యుడు.
దాక్షిణ్య
భావం లేని సమాజం: ఏ సమాజంలో నైతే ఒకరి పట్ల మరొకరికి కృప, కనికరం, జాలి,
దయ, దాక్షిణ్యం లాంటి భగవద్గుణాలు ఉండవో అక్కడ
రాక్షసత్వం రాజ్యమేలుతుంది. అశాంతి కోరలు చాస్తుంది. అనైతిక భావనలు వెలుగు
చూస్తాయి. విద్వాంసులు నిరాదరణకు గురవుతారు. తద్వారా ప్రగతి కుంటుపడుతుంది. ప్రగతి
లేని సమాజానికి సుగతి ఉండదు. కాబట్టి అలాంటి సమజం వాసయోగ్యం కాదంటాడు, చాణక్యుడు.
త్యాగశీలత
లేని సమాజం: పరులకు ఉపకారం చేయడం వల్ల మనమేదో ఘన కార్యం చేసినట్టుగా భావించడం
సమంజసం కాదు. ఎదుటి వారి సుఖసంతోషాలపైనే మన సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయి. స్వార్థం
నిండిన సమాజంలో అనుమానాలు, అవమానాలు ఎక్కువవుతాయి.
ఒకరికొకరు అవసరాలలో సాయపడడం వల్ల త్యాగ భావన చిగురిస్తుంది. అక్కడ చట్టాలు గౌరవించ
బడుతాయి. మానవత వెలుగు చూస్తుంది. ఎదుటి వారి సంతోషానికై మనం కొంత త్యాగం చేయడం
వల్ల ఆనందాన్ని అనుభవిస్తాము. అలాంటి త్యాగభావన లేని సమాజం వర్జనీయం అంటాడు,
చాణక్యుడు.
ఏ సమాజమైతే సమగ్ర వికసనను కోరుకుంటుందో.. ఆ
సమాజం అభ్యుదయ కారక మైన పై లక్షణాలను సంతరించుకోవాలి. వర్జనీయమైన లక్షణాలను విడిచి
పెట్టాలి. ఒకవేళ అలాంటి సమాజం లభ్యం కాని పక్షంలో అక్కడ నివాసం యుక్తం కాదంటాడు, చాణక్యుడు.
No comments:
Post a Comment