Thursday, May 11, 2017

భార్యా భర్తల సంబంధం ఎలా ఉండాలి

సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తదైవచ
యన్నిన్నైవ కులోన్నిత్యం, కళ్యాణం తత్రవైధృవం!

            ఏ ఇంటిలో నైతే భార్యవల్ల భర్త, భర్తవల్ల భార్య సంతోషం పొందుతారో; ఆ ఇంటిలో సకల శుభములు, కళ్యాణములు  నిలుస్తాయని అంటాడు, మనువు.
            సంసారం అనే రథానికి భార్యా -- భర్త ఇరువురూ రెండు చక్రాల లాంటి వారు. అవగాహనతో కూడిన సమన్వయం వారిని సంతోషం అనే మార్గం ద్వారా ఆనందం అనే గమ్యాన్ని చేరుస్తుంది. ఆ అవగాహన కొరవడి అసహనాన్ని ఆశ్రయిస్తే వారి గమనం, గమ్యం రెండూ మారి పోతాయి.
            మారుతున్న కాలంలో వేగం పెరిగింది. భార్యాభర్త లిరువురూ సంపాదిస్తేనే తప్ప కనీస జీవన ప్రమాణాలతో జీవించడం సాధ్య పడదు. వ్యక్తిగత ఉద్యోగ జీవనముల మధ్య సమన్వయం సాధించ లేకపోవడం వల్ల పెరిగే ఒత్తిడి వల్ల దంపతుల మధ్య దూరం పెరుగ వద్దంటే వారి మధ్య అవగాహన పెరగాలి.
            చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలు విడిపోయి వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నారు. ఎవరి కారణాలను వారు సమర్థించుకోవచ్చు కాని ఫలితం సమాజానికి చెడు సంకేతాలను పంపుతుంది. ఇది సమర్థనీయమా?
            స్వేఛ్చ - రక్షణ ఈ రెండూ ముఖ్యమైనవే అయితే స్వేఛ్చకన్నా రక్షణయే ప్రాధాన్యతాంశంగా గుర్తించాలి.
            స్త్రీ పురుషులు ఇరువురూ రెండు విభిన్న కుటుంబ నేపథ్యాలనుండి ఒకచోట సహజీవనం చేసేందుకు, అనుభూతులు, అనుభవాలు, ఆకాంక్షలు, ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొని ఒకరికొకరిగా కలసి ఉండేందుకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. వైవిధ్య భరితమైన ఆశలతో, ఆశయాలతో, ఆపేక్షలతో ఒకచోట చేరిన వారి ఊహలు యదార్ధం కాకపోతే వారిలో పొడసూపే అసంతృప్తి వారి సంసార జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.
            మనువు "సంతుష్ట" అనే పదాన్నే వాడాడు. సంతుష్ట అంటే సంతోషం అని అర్థం. అది ఇంద్రియాలకు సంబంధించింది మాత్రమే. ఇంద్రియాలకు అతీతంగా మనసు స్ఫందించేది "ఆనందం".
            జాన్ గ్రే అనే రచయిత "Men are from Mars, Women are from Venus" అనే పుస్తకం వ్రాసాడు. దాదాపు 2 కోట్ల ప్రతులు అమ్ముడు పోయిన ఆపుస్తకంలో రచయిత ఇద్దరి మధ్య ఉండాల్సిన సున్నితత్త్వాన్ని గురించి చెప్పాడు. సంతోష సమయంలో అందరూ ఒకరి ప్రక్కకు ఒకరు నిలుస్తారు కాని కష్ట సమయంలో నిలిచినప్పుడే అనుబంధం గట్టి పడుతుందని చెపుతాడాయన.
            దీనిని గుర్తించిన భారతీయ సమాజం ఒకరిపట్ల ఒకరి నిబద్ధతను న్యాయం, చట్టం పరిధిలో నిర్వచించింది. నాతి చరితామి, నాతి చరితవ్య అంటూ ప్రమాణాలు చేయించింది.
            దీనిని యువతరం అర్థంచేసుకోగలిగితే ప్రశాంతమైన జీవనం సాధ్య పడుతుంది, ఆదర్శవంతమైన సమాజం ఆవిష్కరించ బడుతుంది.

            పాలకుర్తి రామమూర్తి

No comments: