దృష్టి పూతం న్యసేత్
పాదం, వస్త్రపూతం జలం పివేత్,
శాస్త్ర పూతం వదేద్
వాక్యం, మనః పూతం సమాచరేత్!
చాణక్య నీతి -- 10-2
ముందుకు
అడుగు వేసేప్పుడు బాగా పరికించి చూసి మరీ అడుగు వేయాలి. నీరు త్రాగేప్పుడు
బట్టతో బాగా వడగట్టి శుభ్రమైన నీటినే
త్రాగాలి.
మాట్లేడేప్పుడు బాగా ఆలోచించి శాస్త్ర సమ్మతమైన
విధానంలోనే మాట్లాడాలి. కార్యాచరణలో మనసు చెప్పిన విధంగా మనసుకు నచ్చిన
విధంగానే పనులు శ్రద్ధతో ఏకాగ్రతతో ఆచరించాలి, అంటాడు, చాణక్యుడు.
వ్యక్తి
జీవితం సార్ధకత సాధించాలి అంటే జీవితంలో ఏదైనా సాధించాలి. నిస్సారమైన బ్రతుకుతో ప్రయోజనమేమీ లేదు. ఏ కార్యమైన
నిర్వహించాలి అంటే ముందు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే సమగ్రమైన కార్య స్వరూపం
అవగతమైతే అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. చాలా సులువైన పని..... నానుండి
కాదని విడిచిపెట్టడం. కాని దానిని తుది దాకా నిర్వహించు కోవడంలోనే వ్యక్తి యొక్క మానసిక బలం, చైతన్యం నిరూపిత మౌతుంది. కాబట్టి కార్య రంగంలోకి అడుగు వేయాలి అంటే ఆ కార్య స్వరూప
స్వభావాలపై స్పష్టత రావాలి. అందుకే ముందువెనుకలు ఆలోచించి... ఆ కార్య
నిర్వహణలో తుది ఫలితం ఏమిటో దర్శించిన పిమ్మటనే ముందడుగు వేయమంటున్నాడు ఆచార్య చాణక్యుడు. కలలు కనండి ఆ కలలు సాకారమయ్యేందుకు కృషి చేయండి, అన్నారు, మాజీ
రాష్ట్రపతి, డా. ఏ.పి.జే అబ్దుల్ కలాంగారు. నిజానికి కలలు కనడం
ఆగిపోతే జీవితమే ఆగిపోయినట్లుగా పరిగణించాలి. సాధించగలననే నమ్మకంతో, ఆశతో అణువణువూ ఆ తపనలో దహించుకు పోతూ నిద్రపోనీయని
స్థితిలో కనే కలలే కలలు. అంతే
కాని సుష్టుగా మెక్కి సుఖంగా పడకపై చేరి గాఢనిద్రలో సుషుప్తిలో వచ్చే కలలు కలలు
కావు అవి కల్లలు మాత్రమే.
"శరీరమాద్యం ఖలు ధర్మ
సాధనం"
అన్నారు పెద్దలు. ఆ శరీరంలో దాదాపు 70%
ఉన్న నీటిని అవసరమైన పరిమాణంలో తీసుకోవడం వల్ల
మాత్రమే మన జీవ యాత్ర కొనసాగుతుంది. అయితే నీరు త్రాగడం కూడా ఒక కళయే. ఏ నీటిని త్రాగాలి? స్వచ్ఛమైన
నీటిని మాత్రమే త్రాగాలి. నీటిని
వడగట్టడం ద్వారా స్వచ్ఛతను సంతరించుకుంటుంది. ప్రాచీన భారతీయ సమాజంలో నీటిని వడగట్టేందుకు
బట్టను లేదా చీరను 6 నుండి 8 మడతలుగా చేసి నీటిని వడగట్టేవారు. ఈ విధానం ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో
అత్యుత్తమమైన విధానంగా నిరూపితమైంది. కాబట్టి వడగట్టబడిన శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? సుఖాసనంలో 90 డిగ్రీల కోణంలో కూర్చొని గ్లాసును నోట కరుచుకొని నెమ్మదిగా
చుక్కచుక్కగా చప్పరించి త్రాగాలి. ఎప్పుడు ధారగా పోసుకోవద్దు. ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక లీటర్ నీటిని
తీసుకోవాలి. అదీ గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అలాగే భోజనం చేసిన
పిమ్మట నలుబది నిమిషాల సమయం ఇచ్చి గోరువెచ్చని నీటిని త్రాగాలి. చల్లని నీటిని వీలైన
మేరకు వాడకూడదు. అలాగే
నిలుచొని నీరుత్రాగడం కూడా పనికి రాదు. రాత్రి పడుకునేందుకు ముందు ఒక గ్లాసు పరిశుభ్రమైన నీటిని
త్రాగడం వల్ల గుండె పోటు సమస్యలను నివారించ వచ్చునంటారు వైద్యులు. మరొక్క ముఖ్యవిషయం... శరీరం
కోరుకోక ముందే (దాహం వేయక ముందే) నీటిని త్రాగడం
అలవాటు చేసుకోవాలి.
మాట్లాడడం ఒక కళ. అది స్వతహాగా రాకున్నా... కష్టపడైనా
అభ్యసించి అలవాటు చేసుకోవాలి. తుపాకీ గుండు ఎలాగైతే బయటికి వస్తే వెనిక్కి
తీసుకోలేమో అలాగే మాటనూ వెనిక్కి తీసుకోలేము. శాస్త్రం శాసిస్తుంది. ఏది మాటాడేందుకు
యోగ్యమైనదో ఏది అయోగ్య మైనదో నిర్దిష్టంగా చెప్పేదే శాస్త్రం. మాటలతోనే సామ్రాజ్యాలను గెలవవచ్చు కోల్పోవనూ వచ్చు. ఒకసారి నాలుకతో
దంతాలు అన్నాయట... మేము తలచుకుంటే నిన్ను నలిపేయగలమని. నవ్వుతూ నాలుక
అన్నదట.. నేను
ఒక్క మాట మాట్లాడితే మీరు 32 మందీ రాలిపోతారని. మాటకున్న శక్తి
అలాంటిది. అందుకే బాగా విచారించి శాస్త్ర సమ్మతమైన మాటలను
మృదువుగా, తగిన అంతరాలలో, మార్దవంగా మాట్లాడేవారికి విజయ సాధన కరతలామలకం.
మనస్సు
చెప్పిన విధంగా ఆచరణ ఉండాలి. మన ఆంతశ్ఛేతనకు భిన్నంగా ప్రవర్తిస్తే అలజడికి
గురౌతాము. అలజడి ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల మానసిక
సమతుల్యత దెబ్బతింటుంది. దానితో కార్య స్వరూపాన్ని సరిగా అంచనా వేయలేము. అందువల్ల ప్రణాళికలో లోపం ఏర్పడి ఆచరణ తప్పుతుంది. కార్య భంగం అవుతుంది. మరి అంతశ్చేతనకు
ప్రాతిపదిక ఏది? సామాజిక ప్రయోజనం, మనకు ఎదుటివారికి ఆనందం కలగడం. ప్రలోభాలకు లొంగి పనిచేయడం లేదా భయపడి పని
చేయడం వల్ల మనసును ఆ కార్యంపై వంద శాతం లగ్నం చేయలేము. అలాచేయడం పరధర్మంగా
చెప్పబడుతుంది. మన అంతశ్చేతన సూచితఅ మార్గంలో వెళ్ళడం
స్వధర్మంగా చెప్పబడుతుంది. గీతలో చెప్పిన విధంగా పరధర్మమెప్పుడూ భయావహమే.
ఇలా
చిన్న శ్లోకం ద్వారా అనల్పమైన జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు, ఆచార్య చాణక్యులు.
శుభం
భూయాత్
పాలకుర్తి
రామమూర్తి
No comments:
Post a Comment