సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే
త్రిషుచైవ నకర్తవ్య౨ధ్యయనే జప దానయోః!
ప్రతి వ్యక్తీ సంతృప్తి చెందాల్సిన విషయాలు సంతృప్తి పడకూడని విషయాలు
గూర్చి చెపుతున్నాడు, ఆచార్య చాణక్యుడు. ముందుగా సంతృప్తి
చెందాల్సిన విషయాలు... భౌతిక జీవన లక్ష్యాలు... స్వదార అంటే తన భార్య తో సంసారిక
జీవనంలో; భోజనంలో; ధనార్జనలో.... ఈ
మూడింటిలో సంతృప్తి ఉండాలి. అలాగే పారలౌకిక విషయాలైన ఆధ్యయనము, జపము, దానము ఈ మూడింటిలో సంతృప్తి కూడదంటాడు.
స్వదారా..
ధర్మపత్నిని.. "సఖా సప్తపదాభవా" అనే మంత్ర పూర్వకంగా ఏడు అడుగులు నడచి
ఆమెను మనజీవితంలోకి అహ్వానిస్తున్నాము. స్నేహాన్ని, ప్రేమను, అనురాగాన్ని ఇరువురం పరస్పరం
పంచుకుందాము. సంపదను కలసి అనుభవిద్దాము. నాతి చరామి, నాతి
చరితవ్య.... ధర్మార్ధకామ్యాలను కలసి ఆచరిద్దాము ఈ ప్రతిజ్ఞను నేను అతిక్రమించను
అంటూ ఇరువురూ ప్రమాణాలు చేసి ఒకరి జీవితంలోకి మరొకరు వచ్చే క్రమంలో ఆ ప్రమాణాలను
పాటించడం ఇరువురి కర్తవ్యం. కాబట్టి భార్యా భర్తలిరువురూ ఒకరికి ఒకరుగా మనసా వాచా
కర్మణా బద్ధులై ఉండాల్సిన అవసరాన్ని చెపుతూ ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపడం
కాకుండా లోపాలను సరిదిద్దుకుంటూ తోడూ నీడగా ఉండాల్సిన అవసరాన్ని చెపుతూ పరస్తీ
కామన కూడదంటున్నాడు, చాణక్యుడు. ధర్మ బద్ధంగా అనుభవించడం
శృంగారం కాగా అధర్మ బద్ధమైన అనుభవం కామంగా చెపుతారు.
భోజనం...
ముందుగా అది అవసరమనిపిస్తుంది, కొద్దిగా
తిన్నాక అదే అనవసరమనిపిస్తుంది, ఇంకా తింటే అరుచి గా
మారుతుంది, మరింతగా తింటే అసహనీయమౌతుంది. అవసరానికి మించి
భుజించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మితాహారం మంచిది. మితాహారానికి
సంతృప్తి ప్రధానం అంటాడు, చాణక్యుడు.
ప్రతి
వ్యక్తికీ ధన సంపాదన అవసరం. అభివృద్ధి కావాలి అంటే ధనం కావాలి. కాని ఎంత
సంపాదించాలి? మన భౌతిక అవసరాలకు సరిపోయిన
దానికన్నా అధికంగా ఉంటే అది అభివృద్ధి అనబడుతుంది. ఈ నిర్ణయం వ్యక్తిగతమే. అయితే
మన ఆరోగ్యాన్నీ, కుటుంబాన్ని, ఆనందాన్నీ
త్యాగం చేసి సంపాదిస్తే దాని వల్ల ప్రయోజనం ఏమిటి? ఆలోచించాలి.
భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను సంతృప్తికరంగా నిర్వహించేందుకు అవసరమైన సంపదను
గడించడం, అందులో సంతృప్తిపడడం మంచిదని చాణుక్యుల అభిప్రాయం.
ఇక
సంతృప్తి పడకూడని విషయాలు...
అధ్యయనం...
అధ్యయనం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం వల్లనే బ్రహ్మ తత్త్వాన్ని, ఆత్మ తత్త్వాన్నీతెలుసుకో గలుగుతాము. లోతైన ఆధ్యయనం వల్ల సామాజిక ఆర్ధిక సాంకేతిక
ప్రగతి వెలుగు చూస్తుంది. కాబట్టి నిరంతర ఆధ్యయనం చేయమనై చెపుతారు. ఈ ఆధ్యయన
ప్రక్రియలో సంతృప్తి కూడదని చెపుతున్నాడు, చాణక్యుడు.
జపం.
జపించడం వల్ల పురాకృత పాపసంచయం ప్రక్షాళనమౌతుంది అనేది ఋషి వాక్యం. ఎన్ని వేల
జన్మలనుండి మనం మూట గట్టుకున్న పాపాలు ఎన్నో మనకు తెలియదు. కాబట్టి జప సాధన
అపరిమితంగా ఉండాలంటాడు.
"త్యాగేనైకేనేతి
అమృతత్వ మానుషుః" త్యాగం వల్లనే అమృతత్త్వాన్ని సాధించగలము. దానం చేయడం వల్ల
కలిగే ఆనందానుభూతి అపరిమితం. దానం అంటే డబ్బే కానక్కర్లేదు ప్రేమ, సేవ, ఆనందం, భరోసా ఇలాంటివి ఎన్నో... వీటిని కలసి అనుభవించడం వల్ల కలిగే అనుభూతి
ఆనందానికి పరాకాష్ట యైన బ్రహ్మ తత్త్వాన్ని దర్శింపచేస్తుంది. కాబట్టి త్యాగభావన
పెంపొంద చేసుకోవాలని ప్రబోధిస్తున్నాడు, చాణక్యుడు.
ఇలా
చిన్న శ్లోకం ద్వారా అలఘు తత్త్వాన్ని ప్రబోధిస్తున్నాడు, చాణక్యుడు.
పాలకుర్తి రామమూర్తి
No comments:
Post a Comment