Thursday, May 11, 2017

ప్రయత్నం లేనిదే ప్రపంచంలో ఎవరూ ఏదీ సాధించలేరు.

ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః!
(కవి ఎవరో తెలియదు)

            ఉద్యమించనిదే అంటే ప్రయత్నం లేనిదే ప్రపంచంలో ఎవరూ ఏదీ సాధించలేరు. బలవంతమైన సింహమైనా సరే ప్రయత్నం చేయనిదే తన ఆకలి తీర్చుకోలేదు. అరే సింహం మృగరాజుకదా, బలవంతమైనది, ఆకలితో ఉన్నది కాబట్టి దానికి ఆహారమవుదామని ఏ జంతువూ కోరుకోదు కదా.
            సుప్త జాతికి ప్రగతి లేదు. పురోగతి లేని జాతికి సుగతి దుర్లభం. నిస్వార్థమైఅన్ చైతన్యంతో జాతి జాగృతమై అడుగు ముందుకు వేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుంది. నిస్వార్థత, నిరంతర తపన, కార్య దీక్ష, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం ఆయుధాలుగా ఉదాత్తమైన లక్ష్యాన్ని ఛేదించాలనే ఆశయంతో పురోగమించే వారికి భగీరథుడు ఆదర్శప్రాయుడు. (నేను వ్రాసిన గంగావతరణం పద్య కావ్యంలో  భౌతిక  లక్ష్యమైనా ఆధ్యాత్మిక లక్ష్యమైనా సరైన అవగాహనతో ముందడుగు వేస్తేనే విజయ సాధన సాధ్యమౌతుందనే సత్యాన్ని భగీరథుని చరిత్ర ద్వారా చెప్పించడం జరిగింది) భారత జాతి అలాంటి జాతులన్నింటికి ఆదర్శప్రాయమైనది. "భా" అంటే ప్రకాశం, "రతము" అంటే కోరిక. ప్రకాశము అంటే ఉన్నతిని సాధించాలనే తపన కలిగిన వారే భారతీయులు.
            సాధ్యాన్ని సాధనతో తప్ప సాధించడం సాధ్యం కాదు. లక్ష్య సాధన దిశలో గరుత్మంతుడైనా రెక్క లాడించనిదే గమ్యాన్ని చేరలేడు అలాగే తాబేలైనా ప్రయత్నిస్తే లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. నిరంతర కృషి మాత్రమే విజయ సాధనకు దగ్గర దారి. ప్రలోభాలకు లొంగిపోయే మానసిక వికలాంగులు ఏనాడూ లక్ష్య సాధకులు కాలేరు.
            మరొక్క ముఖ్య విషయం ఏమంటే మానవ ప్రయత్నానికి ప్రాకృతిక శక్తుల సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రాకృతిక ధర్మాన్ని తెలియచేయడమే ఈ చిన్ని శ్లోకం ఉద్దేశ్యం.
            పాలకుర్తి రామమూర్తి



No comments: