Thursday, May 11, 2017

దేనిని త్యజించాలి

త్యజేద్ధర్మం దయాహీనం, విద్యాహీనం గురుం త్యజేత్
త్యజేత్ క్రోధముఖీ భార్యానిః స్నేహాన్బాంధవాంత్యజేత్!
                                                            చాణక్య నీతి 4-16
దేనిని త్యజించాలో అంటే విడిచి పెట్టాలో ఇక్కడ ఆచార్య చాణక్యులు చెపుతున్నారు.
మొదటగా....ఏ ధర్మంలోనైతే దయాగుణం లేదా ఆ ధర్మం ఎంత గొప్పదైనా దానిని విడిచి పెట్టాలి. ధర్మం అంటే ఆచరించ దగినది లేదా ఆచరణ యోగ్యమైనది. ధర్మం ఈనాడు మతంగా మారింది. సామాజిక ప్రయోజనం లేని సమాజానికి ఉపయుక్తం కాని ధర్మాన్ని ఆచరించడం వల్ల వ్యక్తికీ ప్రయోజనం ఉండదు, సమాజానికీ ప్రయోజనం ఉండదు. కాబట్టి అది విడిచి పెట్టదగినది. ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయో అది ఆచరణీయమైనది, ఆదరణీయమైనది. అహింస, దయ, ప్రేమ, వాత్సల్యత లాంటి గుణాలు సమాజాన్ని ఒక్క త్రాటిపై నిలిపేందుకు సహకరిస్తాయి. ఆ గుణాలు మృగ్యమైతే స్వార్ధం పెరిగితే ఒకరినొకరు హింసించు కునేందుకు సమాయత్తమై అరాచకాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఆ ధర్మాన్ని(మతాన్ని) విడిచి పెట్టమని చెపుతున్నాడు.
రెండవది... విద్యాహీనుడైన గురువు: విద్య వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. కలసి బ్రతకడానికి అవసరమైన మానసిక చైతన్యాన్ని ఇవ్వాలి. దూరదృష్టిని... శాస్త్రీయ భావాన్ని నింపాలి. సరైన విధానంలో సరైన సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన అలోచనా విధానాన్ని రేకెత్తించాలి. అప్పుడే వ్యక్తి సంస్కారవంతుడౌతాడు. అతని సంస్కారం సమాజానికి ఉపయుక్త మౌతుంది. ఇక గురువు వ్యక్తిలోని అంధకారాన్ని లేదా అజ్ఞానాన్ని తొలగించ గలగాలి. ఉపాధ్యాయుడు అక్షరాలు నేర్పిస్తాడు. ఆచార్యుడు సంస్కృతిని పరంపరగా అందిస్తాడు, గురువు జ్ఞానజ్యోతిని మనస్సులో వెలిగిస్తాడు. అలాగే మామూలు ఉపాధ్యాయుడు పాఠం చెపుతాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు భావార్ధాలను వివరిస్తాడు. అత్యుత్తమ ఉపాధ్యాయుడు ఆ విలువలను ప్రతిక్షేపించడం ఎలాగో తెలియ చేస్తాడు. గురువు లేదా మార్గదర్శి (Mentor) "తెలుసుకునేందుకు" కావలసిన ప్రేరణ నిస్తాడు. ఆ తెలుసుకోవడమే "యెఱుక" దానికే విద్య కావాలి. ఆ విద్య లేనివాడు గురుత్వానికి పనికిరాడు. కాబట్టి అతనిని విడిచిపెట్టమంటాడు.
మూడవది... క్రోధమూర్తియైన భార్య. కోపం ఒక భావోద్వేగానికి సంబంధించినది. కోపాన్ని ప్రదర్శించడం సమంజసమే. అయితే కోపాన్ని అట్టే పెట్టుకుంటే  అది క్రోధంగా మారుతుంది. అది తనకు గాని తన చుట్టూ ఉండే వారికి గాని మంచిది కాదు. "క్రోధాద్భవతి సమ్మోహా, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశో బుద్ధినాశః, బుద్ధి నాశో ప్రణశ్యతి" అంటుంది గీత. అలాంటి క్రోధాన్ని పూనిని భార్యను విడిచి పెట్టమంటాడు, చాణక్యుడు. భార్యనే కాదు అలాంటి భర్తనూ విడిచిపెట్టవలసిందే.
అంతే కాదు, కోపిష్టులైన స్నేహితులు, బంధువులనూ విడిచి పెట్టమంటాడు, చాణక్యుడు.
కొన్ని బంధుత్వాలు సహజమైనవి.  తల్లి తండ్రి, సోదరులు ఇలాంటి వాటిని త్రొసిపుచ్చ లేము. భార్య, భర్తస్నేహితులు లాంటివి సహజమైనవి కావు అవి ఏర్పరచుకున్నవి. ఏ బంధుత్వమైనా సమాజానికి ప్రతిబంధకంగా మారినా, మన అభివృద్ధి నిరోధకంగా ఉన్నా అలంటి బంధుత్వాన్ని స్నేహాన్ని విడిచిపెట్టాల్సిందే.
నిజానికి ఏ బంధుత్వానికీ చావులేదు. మన అహంభావం, మూర్ఖత్వం, స్వార్థం మరియు ఆధిపత్యధోరణి లాంటివే మన బంధుత్వాలను మలినం చేస్తాయి, పాడు చేస్తాయి.

దీనిని గ్రహించి ఆ తీరుగా నడుచుకొమ్మని ప్రబోధిస్తున్నాడు, ఆచార్య చాణక్యులు.

No comments: