మీ ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గకుండా చూచుకోండి.
నిర్ధనం
పురుషం వేశ్యాం, ప్రజా భగ్నం నృపాం త్యజేత్,
ఖగాః వీత ఫలం
వృక్షం, భుక్త్వా చాభాగతో గృహమ్!
చాణక్య నీతి 2-17
వస్తువుల
వినియోగానంతరం, అవి నిరుపయోగం అనిపిస్తే వాటిని విడిచి
వేస్తాము. అలాగే ఎంతగా బంధాన్ని పెంచుకున్నా కొన్నింటిని విడవడం లోకంలో
కన్పిస్తుంది. వాటిని ప్రస్తావిస్తున్నాడు, చాణక్యుడు.
విటుడు, పొట్టి వాడు, నడ్డి ముక్కు, బాన కడుపు, గార పండ్లు కలిగి కురూపి యైనా, వాని వద్ద డబ్బు ఉంటే నీవే మన్మధుడవని వేశ్య ఆదరిస్తుంది. నిన్ను
ప్రేమిస్తున్నాని వగలు పోతుంది. అదే వ్యక్తి సంపద పోగొట్టుకొని నిర్ధనుడైతే అతను
నిజంగా మన్మధుడైనా వేశ్య అతని పట్ల విముఖత ప్రదర్శిస్తుంది. అతడిని విడిచి
వేస్తుంది.
ఒక రాజు
ఆర్ధికంగా, సైనికపరంగా బలవంతుడు, శక్తివంతుడూ అయితే సామంతులు అతనిని గౌరవిస్తారు. ప్రజలు అభిమానిస్తారు.
అదే రాజు ఆర్ధికంగా చితికి పోయి బలహీనుడై గౌరవ మర్యాదలు కోల్పోతే, సామంతులే కాదు తన ప్రజలు సైతం
అతనిని వదలివేస్తారు.
అడవిలో
బాగా పుష్పించి ఫలాదులతో కళకళలాడుతున్న చెట్టుపైకి పక్షులు చేరతాయి. అక్కడ ఆనందం, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. అదే చెట్టు ఫలపుష్పాలకు దూరమై
మోడువారితే పక్షులు ఆ చెట్టును విడిచి మరోచోటుకు చేరుతాయి.
అలాగే, విందు భోజనానికి ఆహ్వానితులైన అతిధులు చాలా సంతోషంగా యజమాని
గృహాన్ని చేరుకుంటారు. కోలాహలాన్ని సృష్టిస్తారు. ఆనందాన్ని పంచుకుంటారు.
భోజనానంతరం, ఆ ఇంటిని విడిచిపెట్టి మరో చోటికి వెళతారు.
ఇది
ప్రపంచంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఉపయోగపడేంత వరకే ఏ వస్తువుకైనా విలువ ఉంటుంది.
ఒకసారి అది నిరుపయోగ మనిపిస్తే అది ఎంత గొప్పదైనా త్యక్తమౌతుంది. మనిషి జీవితమూ
ఇందుకు భిన్నం కాదు.
To maintain your independence you
must always be needed and wanted. The more you are relied on, the more freedom
you have. Make people depend on you for their happiness and prosperity and you
have nothing to fear. Never teach them enough so that they can do without you. అంటాడు రాబర్ట్ గ్రీన్, తన "THE 48 LAWS OF POWER" అనే పుస్తకంలో.
మన అవసరం ఇతరులకు ఉన్నంత వరకే మనకు
గౌరవం. మనల్ని గుర్తిస్తారు. We should learn the art of Keeping People Dependent on us. దీని వల్ల మన అస్థిత్వం
కాపాడబడుతుంది.
మనం
నీతిగా, నిజాయతీగా ప్రవర్తించడం వల్ల గౌరవం పెరుగుతుంది, ప్రయోజనం ఉంటుంది. కాని దాని కన్నా ఇతరులు మనపై
ఆధారపడితే మనకెక్కువ లాభం ఉంటుంది. దాహంతో
ఉన్న వ్యక్తికి బావి అవసరం ఉంటుంది. ఎంత దూరమైనా ఓరిమితో నడుస్తాడు, అన్వేషిస్తాడు, సాధిస్తాడు, సంతోషిస్తాడు. కాని దాహం తీరాక, ఆ బావితో అవసరం తీరాక, దానిపై ఆధారపడడం తగ్గిపోతుంది. మరో ప్రత్యామ్నాయం లభిస్తే ఎన్నో ఏండ్లుగా తన
దాహార్తిని తీర్చిన బావియైనా సరే, దానిపై మన్నన, మర్యాద తగ్గిపోతాయి, దానిని అనాదరణం చేస్తాడు.
చిన్నప్పుడు
ఒక కథ విన్నాము. ఒక మల్ల యోధుడు శిష్యులకు యుద్ధ విద్య నేర్పిస్తున్నాడు. అందరిలో
చురుకైన ఒక శిష్యునికి యుద్ధ విద్యలన్నింటిలో నిష్ణాతుడయ్యేలా శిక్షణ నిచ్చాడు.
శిష్యునిలో అహంకారం పొడసూపింది. గురువునే తనతో యుద్ధం చేసి గెలవమని సవాలు చేసాడు.
తప్పని పరిస్థితులలో గురువు ఒప్పుకున్నాడు. కొద్ది సమయంలోనే గురువు శిష్యునికి
తెలియని పట్టుతో శిష్యుని ఓడించాడు. ఈ విద్య నాకు నేర్పలే దెందుకని
శిష్యుడడిగాడు. అన్ని విద్యలూ నీకు
అందిస్తే, నాపై నీకు గౌరవం తగ్గిపోతుంది. అహంకారం తలకెక్కుతే
నన్నే సవాలు చేస్తావు. నా రక్షణ, గౌరవాన్ని గూర్చి కూడా ఆలోచించాలి
కదా. అందుకే నీ వైఖరి, అర్హతల ప్రాతిపదికగా విద్య
నందించడం జరిగిందని చెపుతాడు. దానితో శిష్యుని గర్వం సమసి పోవడమే కాక, జీవితాంతం గురువుపై ఆధారపడి ఉన్నాడు.
దాదాపుగా
ఇదే విషయాన్ని
ప్రతిపాదిస్తున్నాడు, చాణక్యుడు. మన అవసరం తీరితే మనమెంత
గొప్పవారమైనా ప్రక్కన పెడతారు. ఆరబోసిన అందాలకన్నా, మరుగున ఉన్న అందలకే విలువ ఎక్కువ. ఏం చేసినా, మన అవసరం ఎదుటివారికి ఉండేట్లుగా చూడడం, మనకు విషయం తెలుసునన్నట్లుగా ప్రవర్తించడం, మనం లేకపోతే పనులు జరగవన్నట్లు గా పరిస్థితులను చూపెట్టడం నేర్చిన వారి
ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదు.
పాలకుర్తి రామమూర్తి.
No comments:
Post a Comment