Thursday, May 11, 2017

ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వాడే పండితుడు

ప్రస్తావనదృశం వాక్యం, ప్రభావనదృశం ప్రియమ్
            ఆత్మశక్తి సమం కోపం యో జానాతిన పణ్డితః!
            సందర్భానుసారంగా మాట్లాడడం, ప్రభావవంతంగా, ప్రియంగా మాట్లాడడం, తన పరిధిలో ఎంత వరకు ఎవరిపై కోపం చూపాలో తెలిసిన వాడు పండితుడు అంటాడు, చాణక్యుడు. ఆ తెలుసుకునేదే "జ్ఞానం" అంటాడాయన.
            పండితుడైన వానికి సభలలో సమావేషాలలో ఏమి చెప్పాలో ఎంత వరకు చెప్పాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ కోపం నటించాలో తెలియాలి. ఒక శాస్త్రజ్ఞుల సమావేశానికి వెళ్ళి సామాన్య విషయాలు ప్రస్తావించినా, సామాన్యుల సమావేశంలో వేదాంతాన్ని సంస్కృతంలో ఉపన్యసించినా వక్తకు గౌరవం దక్కదు.
            విషయం మనకెంత తెలుసన్నది కాదు ముఖ్యం. దానిని ఎంత సమర్ధవంతంగా ఎదుటివారితో పంచుకోగలమన్న దానిపైననే మన విజయం ఆధారపడి ఉంటుంది. మన భావాన్ని ఎదుటివారికి సమర్ధవంతంగా తెలియజేయడం వల్ల మన జీవితానికి క్రొత్త మార్గం కనిపిస్తుంది. సమర్ధవంతంగా భావాన్ని పంచుకోవడం ద్వారా అంతర్గత ఆలోచనా సరళి వికసిస్తుంది. మన వైఖరి వ్యాప్తమై విశాలమౌతుంది. నమ్మకాలు లోతుగా పాతుకుపోతావి. దృక్కోణంలో స్పష్టత వస్తుంది. ఆశలు పరిమళిస్తాయి. నిరాశా నిస్పృహలు చెదరిపోతాయి. దెబ్బతిన్న హృదయ స్పందనలు సాధారణమౌతాయి. ఎదుటి వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
            అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడకూడదు? అంటే చిన్న ఉదాహరణ... ఒక మతపెద్ద ఒక పెద్ద పట్టణానికి వచ్చాడు. ఆయన విమానం దిగగానే ఒక విలేఖరి త్వరగా అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడి వ్యభిచారిణుల గూర్చి మీరేం చెపుతారని ప్రశ్నించాడు.  అయితే అక్కడ ఉన్న కొందరా విలేఖరిని మందలించి పంపించారు. కాని విలేఖరుల సమావేశంలో మరో విలేఖరి ఆ విషయాన్నే ప్రస్తావించాడు. దానికి మీ ఊర్లో వ్యభిచారిణు లున్నారా అని ఎదురు ప్రశ్నించాడు, మతపెద్ద. అయితే తెల్లవారి అన్ని పేపర్లలో ప్రచురితమయిన ప్రముఖ వార్త ఫలానా మత పెద్ద విమానం దిగగానే అడిగిన మొదటి ప్రశ్న"మీ ఊర్లో వ్యభిచారిణులున్నారా" గా ప్రచురితమయింది. అందుకే ఆలోచించి మాట్లాడాలి.
            అలాగే సరైన పద్ధతిలో సరైన పదాలను ఎన్నుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. ఆలోచనలు చేయడం ఎలాగో ఎక్కడ ఆ ఆలోచనలు ఉద్భవిస్తాయో గమనించి అక్కడే ఏవి ఉపయుక్తమైనవో, ఏవి కావో గ్రహించి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించడం అభ్యసించాలి.
            అవసరమైన చోటా కోపాన్ని నటించక పోతే మనం తేలిక కావడం జరుగుతుంది. అలాగని కోపాన్ని మనస్సులో ఉంచుకోకూడదు. దాని వల్ల మన ఆరోగ్యమే పాడవుతుంది. సంబంధాలూ చెడిపోతావి.

    ఫై విషయాలు తెలిసి ఎవరైతే ప్రవర్తిస్తారో అతడే పండితుడంటాడు, చాణక్యుడు.                                                                                                                               పాలకుర్తి రామమూర్తి

No comments: