దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వ ముచితజ్జతా
అభ్యాసేన నలభ్యన్తే చత్వారః సహజాగుణాః! 17-1
అంటాడు, చాణక్యుడు.
దానమిచ్చే
స్వభావము, అందరితో ప్రీతిగా మాట్లాడే స్వభావము,
ధీరత్వము అనగా నిదానము లేదా నెమ్మదితనము, మరియు
సరైన వస్తువులను గుర్తించడము ఇవి ప్రతి వ్యక్తికీ సహజ సిద్ధమైన గుణాలు. ఇవి
పుట్టుకతోనే అందరికీ అలవడతాయి. అభ్యాసంతో వీటిని సాధించలేము. అభ్యాసం చేసినా చేయక
పోయినా వీటిని పొందుతాము అంటాడు, చాణక్యుడు.
జీవితము
అతి సహజమైనది. సహజమైనది అనడంలోనే అన్నీ మనతో కూడా జనించినవే అని అర్థం. అంటే
అనుకూలాంశాలు, ప్రతికూలాంశాలు రెండూ మనతో ఉదయించేవే.
దేన్ని మనం ఆదరిస్తాము దేనిని దూరంగా పెడతాము అనే దానిపైనే మన జయాపజయాలు ఆధారపడి
ఉంటాయి.
పైన
ఉటంకించిన స్వభావాలే కాదు అన్ని సానుకూలాంశాలూ మన సహజాతాలే అయినప్పుడు మనమందరం
ఎందుకని విజయం సాధించడం లేదు? విజయ సాధనలో పైన
ఉదహరించిన అంశాలు సానుకూలాంశాలు కాని వాటిపై లోభత్వం, అభిజాత్యం,
అహంభావం, పిరికితనం, అజ్జానం
లాంటి ముసుగులను కప్పి పెట్టడం వల్ల సహజాతాలను గుర్తించడం లేదు.
దీనికి
ప్రధాన కారణం; మనలో చాలామంది ప్రతికూలాంశాలకు ఇచ్చిన
ప్రాధాన్యతను అనుకూలాంశాలకు ఇవ్వకపోవడమే అనాలి. ఎందుకు ఇవ్వడంలేదు అంటే మనలో చాలా
మందిమి ప్రాకృతికమైన ఒక ముఖ్యమైన ధర్మాన్ని విస్మరించడమే. అదే ఆకర్షణ ధర్మం లేదా
అధ్యాత్మిక ధర్మం. అంటే మనం దేనిని బలంగా కోరుకుంటామో అది సాకారమౌతుంది. మన
జీవితాన్ని ఏ కేంద్రం నుండి నిర్వహిస్తున్నామనేది ఇక్కడ చాలా ముఖ్య భూమిక
నిర్వహిస్తుంది. నమ్మకం కేంద్రంగా పనిచేస్తే సానుకూలాంశాలు సాకారమౌతాయి. అలాకాక
అపనమ్మకం కేంద్రమైతే ప్రతికూలాంశాలు సాకారమౌతాయి.
తదాస్తు
దేవతలుంటారని చెడు కోరుకుంటే అలాగే దీవిస్తారని చిన్నప్పుడు మనకు మన పెద్ద వాండ్లు
చెప్పే వారు. ఇప్పుడు మనం వారి కంటే చదువులలో మించి పోయాము. సాంకేతికత అభివృద్ధి
చెందింది. విదేశీ సంస్కృతి మనకు ప్రీతిపాత్రమైంది. పాత తరం పాత చింతకాయ
పచ్చడయింది. అవన్నీ మూఢ నమ్మకాలయ్యాయి. కాబట్టి వాటిని విశ్వసించము. ఒకవేళ
విశ్వసించాలి అంటే ఎవరో రష్యావాడో అమెరికా వాడో చెప్పాలి.
కాని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారత దేశంలో
యోగులు మునులు మన మనస్సు యొక్క అపూర్వమైన శక్తియుక్తులను గుర్తించగలిగారు. దానిని
ఎలా మాలిమి చేసుకోవాలో ఎలా ఉపయోగించు కోవాలో బోధించారు. మన Subconscious
Mind అదే సుప్తచేతనాత్మకమైన అంతర్మనస్సుకున్న శక్తిని తెలుసుకుంటే,
దానికి చేతన నివ్వగలిగితే అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయవచ్చు. ఒక ఇనుప ముక్క లోకి ఆయస్కాంత శక్తిని నింప
గలిగితే, అది దానికి 12 రెట్ల బరువును పైకెత్త గలుగుతుంది.
ఇదే సూత్రం పై స్వభావాలకు అన్వయిస్తుంది. సానుకూలాంశాలను పదే పదే గుర్తుచేసుకోవడం,
ప్రతికూలాంశాలను పట్టించుకోక పోవడం వల్ల మన అంతర్మనస్సు
సానుకూలాంశాల వైపు ఆకర్షించ బడుతుంది. ఒకసారి అలా ఆకర్షించబడ్డ మనస్సు తన
విజయానికి కావలసిన అన్ని అంశాలను మన ముందుంచుతుంది. విజయం కరతలామలక మౌతుంది.
Subconscious
Mind అదే సుప్తచేతనాత్మకమైన అంతర్మనస్సుకు మంచి చెడ్డలు తెలియవు.
ఏది మనం బలోపేతం చేస్తే దానినే అది ఆవిష్కరిస్తుంది. దాని పట్ల జాగ్రత్తగా
ఉండాల్సిన బాధ్యత మనదే.
No comments:
Post a Comment