Monday, May 15, 2017

వర్తమానాన్ని ఆస్వాదించండి

వర్తమానాన్ని ఆస్వాదించండి

గతం శోకో  కర్తవ్యం, భవిష్యతో నైవ చింతయేత్
వర్తమనేన కాలేన ప్రవర్తన్తే విచక్షణాః!
చాణక్య నీతి 13-2
            జరిగిపోయిన దాన్ని గూర్చి విచారించకు. గతం గతః అని దానిని విడిచిపెట్టు. గతం గోష్ఠి నకర్తవ్యం. జరిగిన దాన్ని పట్టుకు వేళ్ళాడడం వల్ల ఉపయోగం ఉండదు. గతం ఒక చెల్లని చెక్కులాంటిది. దానిపై ఎంత సొమ్ము వ్రాసి సంతకం చేసినా అది మనకు ఉపయోగపడదు. అయిపోయిన దానిని గూర్చి పట్టించుకుంటూ అయ్యో ఇలా అయిందే... ఇలా కాక అలా చేసి ఉంటే బాగుండేది. అలా కాదు ఈ మాట అని ఉంటే బాగుండేది. ఇక్కడ కాదు మరోచోట మన డబ్బును దాచిఉంటే నష్టపోకుండా ఉండే వాళ్ళం. ఇలా చింతించడం వల్ల ప్రయోజనం శూన్యం. అలాగే, ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడడం లేదా సంతోష పడడం వల్ల కూడా ప్రయోజనం శూన్యం. జరుగుతుందో లేదో తెలియని దాన్ని గూర్చి ఊహించి వర్తమానాన్ని విస్మరించడం వల్ల వర్తమానంపై శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి విజ్ఞులైన వారు వర్తమానాన్ని సంతోషంగా స్వీకరించాలి. సుఖవంతం చేసుకోవాలి. మార్చుకో గలిగి నంతగా మార్చు కోవాలి, అంటారు, చాణక్యులు.
            భూతకాలం లేదా గడచిపోయిన కాలం మనకు అనుభవాన్నిస్తుంది. కాని ఆ అనుభవాలు మన నిర్ణయాలపై ఆధారపడినవే కదా. తప్పుడు నిర్ణయాల ఫలితం తప్పుడుగానే ఉంటుంది. అయితే ఎవరైతే అయ్యో తప్పుడు నిర్ణయల ద్వారా నష్ట పోయామని బాధ పడుతూ కూర్చుంటారో వారికి బాధ మాత్రమే మిగులుతుంది. అలాకాక ఎవరైతే ఆ అనుభవాల ద్వారా పాఠాలను నేర్చుకొని జీవితానికి అన్వయించు కుంటారో వారే విజయాన్ని సాధిస్తారు. అదే జీవితం.
            ఒక బాంక్ ఉంది. అది తన ఖాతాదారుల ఖాతాలో ప్రతి నిత్యం 86400 రూపాయలు జమచేస్తుంది.  ఆ డబ్బును మీరు నిరభ్యంతరంగా మీ ఆలోచన ప్రకారం ప్రతి నిత్యం ఖర్చుచేసుకోవచ్చు. కాని ప్రతిరోజు సాయంత్రం మీ ఖాతా సరిచూడబడి అందులో మీరు వాడని డబ్బు వెనుకకు మళ్ళించ బడుతుంది. అలాగని మీ అవసరానికి ఆ 86400 లకు మించి తీసుకునే వెసులుబాటు కూడా ఉండదు. ఆ పరిస్థితులలో మీరు ఎలా ఆ డబ్బును వాడుతారు. మీ ప్రణాళిక ఎలా ఉంటుంది?
            ఆ 86400 మనం ఒక రోజు గడపే కాలం సెకన్లలో. ఆ సమయాన్ని ఎంత ప్రణాళికా బద్దంగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటే అంత ప్రశాంతంగా ఉండ గలుగుతాము. అంతగా విజయ సాధకులమౌతాము.
            ప్రతి రోజు ఉదయమే నిద్రలేవగానే ఒక ప్రశ్న వేసుకోండి. నా ప్రమేయం లేకుండా నాకు విజయం కాని అపజయం కాని వస్తుందా? అదే మన బ్రతుకుకు (Adding Age to our Life) లేదా జీవితానికి (Adding Life to our Age) పునాది అవుతుంది. 
            మనలో చాలా మందిమి భగవంతుడిని నమ్ముతాము, ప్రార్థిస్తాము. కాని చాలా మందికి మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకం తక్కువ. ఇక నుండి ఆ ఆలోచన మానుకుందాము. మన ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకంతో ఆరంభిద్దాం. ప్రయత్నించి విఫలమవడం ప్రయత్న హీనతకన్నా మంచిది. కనీసం అనుభవమైనా వస్తుంది. ఎదుటి వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. దానికి ముందు వారు ఏం చెపుతున్నారో శ్రద్ధగా విందాం. సాధించ గలమనే నమ్మకం పెంచుకుందాం... అది మనం సాధించలేనిదైనా సరే, ప్రయత్నిద్దాం. సంకల్ప బలం ముందు కాలం కూడా దిగ తుడుపే.
            చివరగా... భవిష్యత్తు అనే ఆశల పల్లకిలో ఊరేగే దాని కన్నా ముందుగా వర్తమానాన్ని ఆస్వాదిద్దాం. ఆశల కన్నా ఆశయాలు గొప్పవి. ఆశ వ్యక్తిగతమైనది (Exclusive). ఆశయం సమష్టికి (Inclusive) సంబంధించినది. ఆశయ సాధన వర్తమానంలోనే సాధ్యపడుతుంది.
            శుభం భూయాత్...
            పాలకుర్తి రామమూర్తి.


No comments: