Monday, May 15, 2017

ఎలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

ఎలాంటి వారితో ఎలా వ్యవహరించాలి?

కృతే ప్రతికృతిం కుర్యాత్, హింసేన ప్రతిహింసనం
తత్ర దోషో న పతతి, దుష్టే దౌష్ట్యం సమాచరేత్!
                                                            చాణక్య నీతి -- 17-2
            ఉపకారికి ఉపకారం చేయాలి అలాగే హింసకు ప్రతిహింసయే మార్గము. దుష్టులతో దౌష్ట్యంగానే వ్యవహరించాలి. అది తప్పుకాదు అంటాడు, చాణక్యుడు. ఉపకారం చేసిన వానికి ఉపకారము చేయడం సమంజసమే. కాని మనం చిన్నప్పుడు చదివాము కదా "అపకారికి ఉపకారము నెపమెన్నక చేయాలని". అలా చేస్తే ఈ నాడది పిరికితనంగా వ్యవహరించ బడుతుంది. క్షమాగుణం ప్రధానమైనదే కాని అర్హులను మాత్రమే క్షమించాలి. బలం బలాన్ని గౌరవిస్తుంది. నీవొక చెంపకొడితే మరొక చెంప చూపుతాననడం ఈనాడు మూర్ఖత్వంగా పరిగణించ బడుతుంది.
            అన్ని ధర్మాలలో కెల్లా అహింసయే ఉత్తమం. పవిత్రంగా ఉండండి. నిజాయతీగా ఉండండి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపండి. కష్టపడి పనిచేయండి. ఇలాంటి నీతులు మనమెన్నో విన్నాం. కాని ఈ నీతులకు భిన్నంగా ప్రవర్తించిన వారూ విజయ సాధకులైనారు. ఫలితాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనావేసే నేటి కాలంలో మంచిగా ఉండగలగడం మంచిదే కాని అది మన అసమర్ధతకు ప్రతీక కావద్దు. మీరంటే ప్రాణాలర్పించే అనుచరులు, మిత్రులు ఉండడం మంచిదే. వారిని ఉచిత రీతిని గౌరవించాలి కాని అతి చనువు నీయవద్దు.  దుష్టత్వాన్ని ఉపేక్షించ వద్దు. ఎవరికి ఏ విధంగా చెపితే అర్ధం అవుతుందో అలాగే చెప్పాలని సుచిస్తున్నాడు, చాణక్యుడు.
            మిత్రులకన్నా శత్రువును దగ్గరకు తీయాలంటాడు, రాబర్ట్ గ్రీన్ అనే రచయిత. శత్రువును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి అంటాడాయన. ఉపకారం చేసినట్లు నటించే స్నేహితుడు కూడా నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. అందుకే అతిగా నమ్మొద్దు. మరి శత్రువును దగ్గరికి తీస్తే అతడు తనను తాను విశ్వాసపాత్రునిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో పని చేస్తాడు. మనకు కావలసిన విజయాన్ని అతనే సాధిస్తాడు. అలాగని హింసామార్గంలో ప్రతిఘటించే శత్రువును ఎట్టిపరిస్థితులలో కూడా విడిచిపెట్ట వద్దంటాడు, చాణక్యుడు.

            

No comments: