అవధానం
అవధానం
అంటే ఏకాగ్రత. వేదాభ్యాసంలో క్రమ, జట, ఘన లాంటి పాఠబేధాలు ఉంటాయి. వీటిని సాధించేందుకు ఏకాగ్రత అవసరం. పై వరస
క్రమంలో వేదాన్ని అభ్యసించిన వేద విద్యార్థిని అవధానిగా వ్యవహరిస్తారు. విద్యాభ్యాసానంతరం
వేద విద్యార్థిని పరీక్షించే సమయంలో మొత్తం వేదంలో ఎక్కడ ఏ పదంతో ఆరంభించమన్నా,
ఎక్కడ ఆపమన్నా అతడు తడుముకోకుండా స్వరభంగం కాకుండా
చెప్పాల్సి ఉంటుంది. ధారణా ప్రాధాన్యత కలిగిన ఈ విధానానికి అనేకాగ్రమైన మనస్సును ఏక మార్గంలో నడిపించే విధంగా ధ్యాన
యోగాది విధానాలలో శిక్షణ నివ్వాల్సి ఉంటుంది.
ఇక
సాహిత్య పరిభాషలో అవధానాన్ని ఒక “కళాత్మక క్రీడ”గా చెపుతారు. ఎందుకంటే అది సాహిత్య "క్రీడ" అలాగే అభ్యసించ దగిన
ఒక "కళ"కూడా కాబట్టి. అవధానం స్థూలంగా పద్య ప్రక్రియకు సంబంధించింది.
చెప్పదలచిన రసరమ్యమైన భావాన్ని ఛందోబద్ధంగా చెప్పడం వల్ల అది పద్యమౌతుంది. తెలుగు
భాషలో మాత్రమే బహుముఖాలుగా విస్తరించి పండిత పామర జనామోదాన్ని పొందిన ఈ అవధాన
ప్రక్రియ అంతర్జాతీయంగా తెలుగు వారికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది.
అవధానాలలో అష్టావధానమని, శతావధానమని, సహస్రావధానమని,
మహా సహస్రావధానమని ఇలా భేదాలు ఉన్నాయి. ధైర్యం, ధీ పటిమ, ధార, ధారణ, సమయ స్ఫూర్తి, భావావేశం, సామాజిక స్పృహ, లౌక్యంతో పాటుగా విస్తృతాధ్యయనం చేసిన వ్యక్తి అవధానిగా రసజ్ఞుల మన్ననలను
పొందుతాడు. విషయ పరిజ్ఞానం ఉండటమే కాదు దానిని సరైన సమయంలో సరైన రీతిలో
సృజనాత్మకంగా ఉపయోగించగల స్ఫురణ, ఓరిమి, భావోద్వేగాల
నదుపులో పెట్టుకోవడమూ అవధానికి అవసరమైన అర్హతలు. ఒక అవధాని పృచ్ఛకుల
ప్రశ్నలకు (అవధానంలో ప్రశ్నలను సంధించే వారిని
పృచ్ఛకులంటారు) సహేతుకమైన సరసమైన జవాబులు అదీ ఛందోబద్ధంగా చెప్పాల్సి
ఉంటుంది.
ఒకే సమయంలో ఒక వ్యక్తి ఎన్ని విషయాలపై తన
ఏకాగ్రత నిలుపగలడు? అలవాటు చేస్తే మానవ మేధ ఎంత
గొప్పగా పని చేస్తుందో తెలియాలంటే ద్వేష భావన వీడి అవధాన విద్య నర్థం చేసుకునే
ప్రయత్నం చేయాలి. ధారణా శక్తిని పెంచుకునేందుకు ఉపయోగ పడేది అవధాన విద్య. అనేకానేక
ప్రాచీన ఆధునిక సాహిత్య, సామాజిక రీతులపై విశ్లేషణా
పూర్వకమైన సాధికారికమైన అవగాహన పెంచుకుంటేనే కాని ఒక అవధాని సభారంజకంగా అవధానం
చేయలేడు. సభా వేదికపై అన్నింటినీ బాగా ఆలోచించి, పదుగురితో విచారించి ప్రదర్శించ కూడదు. అతి తక్కువ సమయంలో వీటినన్నింటినీ
సమర్ధవంతంగా పండిత పామర రంజకంగా ప్రదర్శించాలి.
అవధాన విద్య యువతకు ఎలా ఉపకరిస్తుంది?
ఈనాటి ఉన్నత ఉద్యోగాలకు, సంక్లిష్టమైన బాధ్యతా
నిర్వహణకు ఎన్నుకునే అభ్యర్ధులకు కావలసిన అర్హతలుగా అటు ప్రభుత్వంకాని, ప్రభుత్వేతర సంస్థలు కాని పై లక్షణాలనే
కోరుకుంటున్నారు. పై అంశాలపై అవగాహన వివేచనల లాంటివి అవధాన విద్య అయాచితంగా
అందిస్తుంది. ఆ విద్యను అనాదరం చేస్తున్నాం కాబట్టే వీటికి అవసర మైన శిక్షణ నిచ్చే
శిక్షణా సంస్థలూ పుట్టుకొచ్చాయి.
జీవితంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎలా
పరిష్కరిస్తారు. పారిపోతారా లేక పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తారా? అలాగే అవధానంలో ఒక సమస్య నిస్తారు. దాని
పరిష్కారంలో మనలోని సృజనాత్మకతకు పదను పెడతాము. ఉదాహరణకు... "రాముని తండ్రి
భీష్ముడని వ్రాసెను పోతన భారతంబునన్" ఇది నిజానికి క్లిష్టంగా కనిపిస్తుంది.
కాని అవధానిలోని సమయ స్ఫూర్తి, సృజనాత్మకతలు, బహు గ్రంథ పారీణత, అభ్యసన లాంటివి వెలుగు చూడడం వల్ల
కొన్ని సెకన్ల కాలం లోనే దానికి పరిష్కారం కనుగొన గలిగాడు. Out of Box
thinking లేదా Lateral thinking వల్ల మాత్రమే
ఇది సాధ్యపడుతుంది. మూసలో పోసిన ఆలోచనలు, అవగాహనలు, ద్వేషభావనలు ఎన్నటికీ Vertical thinking నే
అనుగ్రహిస్తాయి కాని ఆలోచనా పరిధిని పెంచవు.
మననం చేయడం వల్ల విషయం మనసులో అట్టిపడుతుంది.
మెదడుకు శిక్షణ నివ్వడం వల్ల అది అప్రయత్నంగా మనం ఇచ్చిన విషయాన్ని గుర్తు
పెట్టుకొని మళ్ళీ అవసరమైన వేళ మనకందిస్తుంది. Recitation,
Reproduction మనసుకు అలవాటవుతాయి. వద్దనుకున్నా స్పురణ పెరుగుతుంది.
ధారణ పెరుగుతుంది. దీనినే Mind mapping క్రింద
చెప్పుకోవచ్చు.
సమున్నత
సాహితీ విలువలు భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో నింపడానికి నడుం
బిగించి ప్రాచీన సాహితీ రూపాలన్నింటినీ రూపు మాపాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నామనే భ్రమలో
విహరిస్తున్న కొందరంటారు... ఈ అవధానాలు ఫ్యూడల్ భావజాలంలో పుట్టి అదే భావజాలానికి
కట్టుబడి, అదే భావ జాలాన్ని వ్యాప్తి
చేస్తూ ముందుకు సాగుతున్నాయని. అలాంటి భావజాలంలో విహరించే మరికొందరి దృష్టిలో
అవధానాలు బొత్తిగా సామాజిక స్పృహలేని సాహిత్య ప్రక్రియలని. ఇంకా కొందరు; అవధానమంటే అర్ధం పర్ధంలేని పద్యాల రచన అంటారు. అసలు పద్యమే జీవచ్ఛవమైనదని,
సామాన్యులకు పద్యం అందదని మరికొందరి భావన. ఇలా ఎవరే రీతిగా
తలచినా... అవధానం ఒక్కటే పరిపూర్ణ సామాజిక స్పృహ కలిగిన సాహిత్య ప్రక్రియ. పండిత
పామరులను రంజింప చేయగలిగిన ఏకైక ప్రక్రియ అవధానమే. వ్రాసే వారికి కూడా సరైన అవగాహన
లేని కొన్ని పడికట్టు పదాలను అరువుతెచ్చుకొని వాటినే ఉపయోగించడం ఈ నాటి సాహితీ వేత్తల మనుకునే
వారికి కొందరికి ఫ్యాషనయింది. అశాస్త్రీయమైన, అవాస్తవమైన,
పునాదులు లేని విమర్శలు, సిద్ధాంతాలు, ఆశయాలు ప్రక్కన పెడితే పద్య ప్రక్రియ సామాన్యజనుల హృదయాలను జాగృతం
చేయబట్టే ఇన్నాళ్ళు నిలబడ గలిగింది. పంట పొలాలలో పరవశించి శ్రమైకజీవులు
రాగయుక్తంగా పాడుకోబట్టే పద్య ప్రక్రియ ఈనాటికీ నిలవగలిగింది. పరోక్షంగా
అవధానానికి ఊత మిచ్చింది.
తిరుపతి
వెంకట కవుల ప్రతిభ అవధానానికి ప్రాణంపోయగా ఈ నాడు శ్రీయులు మేడసాని మోహన్, మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి
నరసింహారావు గారల వంటి వారు సహస్రావధాన పరిణతి సాధించగా కీ.శే. గుమ్మన్నగారి
లక్ష్మీ నరసింహశర్మ, శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ, డా. గౌరీభట్ల మెట్టురామశర్మ, శ్రి ముద్దు రాజయ్య
గారి లాంటి వారు ఎందరో ఆ మార్గంలో అష్టావధాన, శతావధాన ప్రక్రియలతో
అవధాన సరస్వతికి ఊపిరు లూదుతున్నారు.
సమర్ధుడైన
అవధాని చేతిలో పద్యం అవధాన వేదికపై కూడా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది.
వస్తుకళ, భావకళ, రచనాకళలకు
తోడుగా ఆధునికతనూ సంతరించు కుంటుంది. దుష్కర ప్రాసలు, ఇతర
భాషాపదాలు కూడా అవధాని చేతిలో చక్కనైన భావ స్ఫూర్తితో ఒదిగిపోతాయి.
సాధారణంగా
అష్టావధానాలలో సమస్య, దత్తపది, నిషిద్ధాక్షరి, వర్ణన, ఆశువు,
అప్రస్తుత ప్రసంగం అనే ఆరు అంశాలు తప్పని సరిగా ఉంటాయి. పూగణన,
తేదీలు వారాలు, న్యస్తాక్షరి, పురాణపఠన, స్వీయ కవితా పఠన, వ్యస్తాక్షరి,
చదరంగం, చందో భాషణ ఇలాంటి వాటిలో మరో
రెండింటిని కలిపి సాధారణంగా అష్టావధాన ప్రక్రియను నిర్వహిస్తారు.
సమస్య:
రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను పోతన భారతమ్మునన్!
ఇందులో అన్నీ అసంబద్ధంగానే ఉన్నాయి. రాముని తండ్రి భీష్ముడు
కాదు, అసలు భీష్మునికి పెండ్లి కాలేదు సంతానం లేదు.
పోతన భారతాన్ని వ్రాయలేదు. అయినా ఈ సమస్యను అవధాని పూరించాలి. అదీ తీరికగా
చర్చించి కాదు. వేదిక పైనా అదీ మిగతా అంశాలు తనను ఇరుకున పెడుతున్నప్పుడు కూడా. ఈ
సమస్యకు ఒక పూరణను చూద్దాం.
ధీమతి నంచు గర్విత మతిన్; యొక
డాధునికుండు, భారత
శ్రీ మహితోక్తు లిప్డు పచరించెద నంచు, వివేక హీను డి
స్సీ! మతి లేక వ్యాసముని జీవిత రీతులు
చెప్పువేళ; నౌ
రా! ముని తండ్రి భీష్ముడని వ్రాసెను పో; తన భారతంబునన్!
ఇక్కడ వివేక హీనుడవడం వల్ల లోతైన అధ్యయనం లేని
వాడవడం వల్ల వ్యాసుని తండ్రి భీష్ముడని వ్రాసాడనవచ్చు. అలాగే భీష్మ శబ్దానికి ఉన్న భయంకరుడన్న
అర్ధాన్ని తీసుకుంటే పరాశరుని భయంకరుడన్నాడని చెప్పుకోవచ్చు. పోతన లో వ్రాసెనుపో గా విడదీయడం వల్ల సంక్లిష్టత
విడిపోతుంది.
దత్తపది:
డప్పు. ఢమరు, తబలా, మృదంగం ఈ నాలుగు పదాలను
స్వీకరించి గీతా ప్రాశస్త్యాన్ని శార్ధూల వృత్తంలో చెప్పాలి.
వ్యర్థాలోచన లేల సేతువు, భువిన్
ప్రాప్తించు తోడప్పుడే
అర్థిన్, ప్రౌఢమరుత్సుతాదుల సహాయంబంది
కర్మిష్టివై
స్వార్థ స్వాంతు సుయోధనాత్తబల విధ్వంసంబొనర్పంగ, లే
పార్థా! ధర్మ మృదంగమ స్వనము భాస్వల్లీల విన్పింపగన్!
తోడప్పుడే అనడంలో డప్పు; ప్రౌఢమరుత్సుదాదులలో ఢమరు; సుయోధనాత్తబల లో తబల; ధర్మ మృదంగమ స్వనములో మృదంగం
ఒదిగి పోయాయి.
వర్ణన:
ఆకాశం నుండి గంగ అవతరించే సమయంలో ఎలా ఉంటుంది
ధారాపాత
నితాంత వేగమున అత్యంతోరు గంభీర వాః
పూరభ్రాజిత
మూర్తి గంగ దిగ( దిగ్భూమీ నభో భాగముల్
ఘోరాకార
వికీర్ణ భీమగతులన్ ఘూర్ణిల్లు, పెల్లౌ తరం
గారాటా రభటీ
మహోద్ధతి సమాక్రాంతంబులౌ ముజ్జగాల్!
ఇక నిషిద్ధాక్షరి:
పృచ్ఛకుడు ఒక అంశాన్నిస్తాడు. అది సాధారణంగా కంద పద్యంలో
పూరించాల్సి ఉంటుంది. అవధాని పద్యాన్ని
ఆరంభించే సమయం నుండి ప్రతి అక్షరాన్ని పృచ్ఛకుడు నిషేధిస్తుంటాడు. సాధారణంగా రెండు
పాదాల నిషేధం ఉంటుంది కాని నాలుగు పాదాలూ అక్కడక్కడ నిషేధించిన సందర్భాలు ఉన్నాయి.
యతి ప్రాస స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలను నిషేధించడం జరుగుతుంది. ఉదాహరణకు
రాముని వర్ణించ మంటాడు కాని "రా" నిషేధమంటాడు. అవధాని "రా" ను
కాకుండా మరొక అక్షరంతో పూరించుకోవాలి.
ఇలా అడుగడుగుకూ అడ్డుపడే
పృచ్ఛకుని బారి నుండి తప్పించుకుంటూ రసవత్తరంగా పూరించిన అవధాని ప్రతిభావంతునిగా
పేర్కొనబడతాడు.
ఆశువు:
ఆశువు అంటే వేగము. అడిగిన వెంటనే వేగంగా పద్యాన్ని చెప్పడం
ఆశువుగా చెప్పబడుతుంది. ఇది ఒక్కసారే నాలుగు పాదాలు పూరిస్తారు. తిరిగి ధారణ చేసి
అప్పగించాల్సిన అవసరం ఉండదు. వృత్త నియమం ఉండదు. అవధాని స్వేచ్ఛా వృత్తంలో
పూరించవచ్చు.
ఉదాహరణకు: మహా సహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు, వారి మహా సహస్రావధానంలో అవధాన ప్రయోజనం గూర్చి చెప్పమని అడగగా
పూరించిన పద్యం.
అవధానం బది
ధారణాపటిమకే యాధారమై యొప్పెడిన్
భువిలో లెక్కల పెట్టెలందుకొని నొప్పుల్ పుట్టగా నొక్కుచున్
సవరింపన్ పనిలేదు; మేధయనగా జ్ఞానామృతాంబోధియౌ
నవధానంబు నిరూపణంబిడిన సత్యంబిద్ది ముమ్మాటికిన్!
న్యస్తాక్షరి:
సాధారణంగా
నాలుగు అక్షరాలను ఇచ్చి ప్రతిపాదంలో ఏ అక్షరం ఏ స్థానంలో రావాలో సూచిస్తారు
పృచ్ఛకులు. దీనికి తోడు పృచ్ఛకుడు వృత్త నియమం ఇస్తాడు.
ఉదాహరణకు:
"దానవత" అనే నాలుగు అక్షరాలు చంపకమాల వృత్తంలో నాలుగు పాదాలలో వరసగా 11, 9, 10 మరియు 3 వ
స్థానాలలో వచ్చేట్లుగా చెప్పమని పృచ్ఛకుడు కోరగా.. అవధాని శ్రీ అష్టకాల నరసింహ రామ
శర్మ గారు పూరించిన విధానం చూడండి.
ధనమును పెంచి మించి సముదారత లేకను గీర్తి ముంచి, ని
ర్ధనుల గురించి యోచన సుతారముగా రహి మించు మానవుల్
మనము మనీష గల్గిన వలాహకముల్ సరితూగ గల్గునే
జనత మనీషిగా దలచి సత్కృతి సేయదె, యెల్లవేళలన్!
వ్యస్తాక్షరి:
సాధారణంగా
పదునైదు నుండి ఇరువదైదు అక్షరాలను (వివిధ భాషల నుండి గ్రహించినవి కూడా కావచ్చు)
క్రమంలేకుండా అవధాని ఆలోచనలో ఉన్నప్పుడు ఇస్తాడు పృచ్ఛకుడు. అవధానం చివరలో ధారణా
సమయంలో అవధాని వాటిని క్రమంగా అప్ప చెప్పవలసి ఉంటుంది.
ఉదాహరణకు: "రాముడు అచ్ఛా person" అనే 11 అక్షరాలను వివిధ
సందర్భాలలో క్రమం తప్పించి ఇస్తారు. మొదటా 7 వ అక్షరం ఇవ్వవచ్చు. తదుపరి మూడవది
తరువాత 9వది. ఇలా ఇచ్చిన పదాలను మనసులోనే మననం చేసి చివరగా "రాముడు అచ్ఛా
person" అని వరసగా చెప్పాలి.
చివరగా
నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది,
వర్ణన లలో చెప్పిన పద్యాలను ధారణ చేయడం. వ్యస్తాక్షరిని పూరించడంతో
అవధానం ముగుస్తుంది.
శుభం భవతు
Palakurthy Rama Murthy
No comments:
Post a Comment