Saturday, December 30, 2017

చతురాశ్రమ ధర్మాలు - వ్యాపార నిర్వహణా ధర్మాలు (వయసుల వారీగా ఒక ఆలోచన)

చతురాశ్రమ ధర్మాలు - వ్యాపార నిర్వహణా ధర్మాలు
(వయసుల వారీగా ఒక ఆలోచన)

            భారతీయ జీవన విధానంలో పిల్లలకు ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉపనయన సంస్కారాన్నిచ్చి  తదుపరి ఉపాకర్మ నిర్వహించి వారిని విద్యాభ్యాసానికై గురువు వద్దకు ఆశ్రమ వాసానికి పంపించేవారు. గురుకులంలో ఆ విద్యార్థి  గురు శుశ్రూష చేస్తూ, బ్రహ్మచర్య వ్రత దీక్షలో వేద వేదాంగాలను అధ్యయనం చేసి విద్యాపారంగతుడై గురువు అనుమతితో స్నాతక వ్రత మాచరించి సమావర్తను డౌతాడు అంటే తన ఇంటికి తిరిగి వస్తాడు.
అందరితో కలసి చదువుకోవడం వల్ల ఏకత్వ సమ భావన కలుగుతుంది. కలసి నివసించడం, కలసి భుజించడం, కలసి శ్రమించడం, కలసి కష్టసుఖాలను మరియు  సంపదను అనుభవించడంలో ఉండే ఉన్నతత్త్వం, ఉదాత్తత అర్ధం అవుతుంది.
            గురువు జీవితాంతం నేర్చుకునేందుకు అవసరమైన ప్రేరణ నిస్తాడు. కష్టాలను సృజించి (అవసరమైతే) వాటిని అధిగమించే నేర్పును వెలికి తీసుకునేందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తాడు. అలాంటి వాతావరణం నుండి బయటపడిన విద్యార్థి జీవితాన్ని రసమయం చేసుకునేందుకు సన్నద్ధమై ఆశ్రమం నుండి జనావాసానికి బయలుదేరుతాడు. ఇది బ్రహ్మచర్యాశ్రమం.
            తదుపరి దేశాటన చేసి, ధనాన్ని సంపాదించి ఒక కన్యను వివాహమాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాడు. గృహస్థాశ్రమంలో అవసరమైన ధనాన్ని సంపాదించి విధ్యుక్త ధర్మాలను నిర్వహించి ప్రాపంచిక కార్య కలాపాలను వారసుల కప్పగించి గృహిణితో కలసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. వానప్రస్థాశ్రమంలో లౌకిక విషయాలకు పూర్తిగా దూరంగా ఉండటం, వారసుల వృత్తి ఉద్యోగాలలో వారికి అవసరమైన వేళ అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తూ ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తాడు. ఇది వానప్రస్థాశ్రమం.
తదుపరి నెమ్మదిగా ఆ వాసనలకూ దూరంగా తానేంటో అన్వేషిస్తూ తపశ్చర్యలో తన జీవితాన్ని ముగించేస్తాడు. ఇది సన్యాసాశ్రమం.
            ఈ క్రమాన్ని వయసు రీత్యా ఒకసారి పరిశీలిస్తే.... ఏడు  నుండి ఎనిమిది సంవత్సరాలు బాల్యోచిత చేష్టలకు పోతుంది. తదుపరి విద్యాభ్యాసానికి సుమారు పన్నెండు నుండి ఇరువది సంవత్సరాల కాలం పడుతుంది. అంటే వటువు అప్పటికి సుమారు ఇరువది నుండి ఇరువది ఎనిమిది సంవత్సరాల వయస్సుకు చేరుకుంటాడు. సమావర్తనం మరొక్క సంవత్సరం. అప్పుడు గృహస్థాశ్రమం. సుమారు ఇరువదైదు నుండి ముప్పదైదు సంవత్సరాల కాలం గృహస్థాశ్రమంలో సంపాదన వినియోగ కార్యక్రమాలలో జరిగిపోతుంది. తదుపరి పది సంవత్సరాల కాలం వానప్రస్థాశ్రమంలో గడపాల్సి ఉంటుంది. తదుపరి అయితే సన్యాస దీక్ష లేకపోతే పూర్తిగా నివృత్తి మార్గంలో జీవించడం.
ఇప్పుడు, సమకాలీన సమాజంలో సామాజిక దృక్ఫథంతో వ్యాపారాన్ని స్థాపించి; సమర్ధతతో నిర్వహించి; లాభాలను ఆర్జించి; కుటుంబ బాధ్యతను, సామాజిక బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి; ప్రయోజకులైన వారసుల అర్హతలను పరీక్షించి, వారి వారి అర్హతలు ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించి, భార్యాయుతుడై తామరాకుపై నీటిబొట్టు విధంగా, ఆనందంగా తన అభిరుచుల మేరకు తన జీవితాన్ని మలుచుకునే ఒక వ్యాపార నిర్వహణా దక్షుని జీవితాన్ని పై ఆశ్రమ ధర్మ నేపథ్యంలో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
            వ్యాపార నిర్వహణా దక్షతకు నిర్నిబద్ధమైన వయసును నిర్ధారించలేము. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు నిర్వహించిన సర్వేక్షణలు లేదా పరిశీలనల ప్రకారం ఏ యే వయసులో ఏమేమి చేయడం యుక్తమౌతుందో తెలుస్తుంది. సాధారణమైన విజ్ఞానం కొరకు ఆయా వయసుల ప్రకారం చేయవలసిన ధర్మాలను సింహావలోకనం చేసుకుందాము. అలాగే పైన పేర్కొన్న ఆశ్రమ ధర్మాలను వ్యాపార స్థాపనా రీతిని బేరీజు వేసుకునే ప్రయత్నమూ చేద్దాం.
            విద్యార్థిగా 20 నుండి 25 సంవత్సరాలు వచ్చేవరకూ చదువును మాత్రమే ప్రేమించాలి. అత్యున్నత విద్యార్థిగా నిలవాలి. ఎంత ఎక్కువగా అధ్యయనం చేయగలిగితే అంత ఎక్కువగా చదువుకోవడం, విశ్లేషణ చేసుకోవడం, అవగతం చేసుకోవడం చేయాలి. అవగత మైన అనుభవాన్ని వివేచనగా మలచుకోవాలి.
            తదుపరి మన కిష్టమైన లేదా అభిరుచి కలిగిన రంగాన్ని ఎన్నుకొని మరొక 10 సంవత్సరాల కాలం ఒక మార్గదర్శిని, గురువును  లేదా దారి చూపించగలిగిన చైతన్యం కలిగిన వానిని ఆశ్రయించి అతని వద్ద నమ్మకంగా ఉద్యోగం చేయాలి. చిన్న పెద్ద అనే భేదం లేకుండా అన్ని పనులూ స్వయంగా నిర్వహిస్తూ వ్యాపార సంబంధిత అంగాలన్నింటిలో అపారమైన అనుభవాన్ని సంపాదించాలి. ముఖ్యంగా చిన్న సంస్థలలో పని చేయడం ద్వారా  పనిని అభిమానించడం తెలుస్తుంది. పని సంస్కృతిని ప్రేమించడం తెలుస్తుంది, పనిని గౌరవించడం తెలుస్తుంది. అన్ని రంగాలపై అవసరమైన పట్టు వస్తుంది. అవగాహన వస్తుంది. విజయ సాధనపై బలీయమైన కోరిక  ఏర్పడుతుంది. కలలు గనడం ఎలాగో, ఆ కలలను సాకారం చేసుకోవడం ఎలాగో తెలుస్తుంది. నిర్వహణా నైపుణ్యం అవగతమౌతుంది. ఒకే సమయంలో ఎక్కువ సమస్యలను పరిష్కరించగల ధీ శక్తి స్వంతమవుతుంది. కలసి పని చేయడం వల్ల ఒక బృందాన్ని నిర్మించడం, ఆ బృందాన్ని సమన్వయం చేస్తూ నడిపించడం ఎలాగో తెలుస్తుంది. కార్య సాధనలో ప్రణాళికలు రచించడం ఎలాగో, ప్రణాళికలు అమలు చేయడం ఎలాగో, మధ్యలో సమస్యలు ఎదురైతే వాటిని సమన్వయంతో అధిగమించడం ఎలాగో నేర్చుకోవడం వీలవుతుంది.
            ఉత్తమమైన గురువు లేదా మార్గదర్శకుడు ఏది ఎలా నిర్వహించాలో నేర్పడు, ఎలా నిర్వహించాలో నేర్చుకునేందుకు అవసరమైన ప్రేరణ నందిస్తాడు. అన్నీ సమగ్రంగా ఆలోచించి రంగం సిద్ధం చేసుకోవాలి. ఇది దాదాపుగా బ్రహ్మచర్యాశ్రమానికి ప్రతీకగా చెప్పుకోవాలి.
            తదుపరి కొద్ది కాలం స్పష్టంగా ఆలోచించాలి. ఏ రంగంలో అభిరుచి ఉంది, ఏ రంగంలో మన అనుభవం, నైపుణ్యం ఉన్నతీకరించ బడుతుంది. మన సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక వనరులు, మానవ వనరులు ఏ మేరకు మన అవసరాలు తీరుస్తాయి. దానిని ఎలా ప్రకటించుకోవాలి. ఇలా అన్ని విషయాలపై సమగ్ర నివేదికను తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. అదే సమావర్తనం.
            ఇప్పుడు మరొక 10 సంవత్సరాల కాలం ఒక పరిశ్రమను స్థాపించి కష్టపడగలిగిన యువతను ఆకర్శించి, వారికి అవగాహన కల్పించి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారి వారి అర్హతల ప్రాతిపదికగా వారికి ఉపాధిని కల్పించడం వల్ల వారి శ్రమ శక్తి జాతికి ఉపయుక్త మౌతుంది, సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉద్యోగుల నందరినీ సమభావనతో చూడాలి. వినియోగదారుల అవసరాలను సరైన సమయంలో గుర్తించడం, వారికి ఇచ్చిన మాట ప్రకారంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం, సరైన ధరను, కొలతలను పాటించడం ద్వారా వ్యాపార బాధ్యతలను నిర్వర్తించాలి. తమ ప్రయోజనాలనూ కాపాడుకోవాలి. అంతేకాదు తన తదుపరి ఆ సంస్థ యొక్క నిర్వహణా బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించ గలిగిన మరొక ప్రత్యామ్నాయ నాయకత్వ బృందాన్ని తయారు చేయాలి. తన ప్రయోజనం, తన కుటుంబ ప్రయోజనం, తన ఉద్యోగుల ప్రయోజనం, తన వినియోగదారుని ప్రయోజనం, తన సంస్థ ప్రయోజనం సిద్ధించేలా సంస్థను సాంకేతికంగా, ఆర్ధికంగా పరిపుష్టి చేస్తూ అదే క్రమంలో తన వారసులను ఆయా నైపుణ్యాలు పెంపొందిచుకునే విధంగా తయారుచేసి సంస్థను వారి కప్పగించడం, నెమ్మదిగా తన బాధ్యతలనుండి వెలుపలికి రావడం చేయాలి. ఇది గృహస్థాశ్రంతో సమానం.
            మరొక 5 సంవత్సరాల కాలం సంస్థ నిర్వహణా బాధ్యతకు దూరంగా ఉంటూ వారు తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలతో వారికి ఒక మార్గదర్శిగా మారాలి. అనవసర విషయాలకు దూరంగా పుస్తకపఠనం లాంటి అలవాట్లు చేసు కోవడం లేదా ఇతః పూర్వం పని ఒత్తిడిలో మరుగున పడిన ప్రవృత్తికి సంబంధించిన విషయాలపై మనసును లగ్నం చేయడం ఉత్తమం. ఇది వానప్రస్థాశ్రమం.
            తదుపరి జీవితాంతం... మనమేంటో వెదుక్కొనే తాత్త్విక చింతనలో గడపడం, సామాజిక కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించడం, లేదా సాధిత విజ్ఞానాన్ని ఆర్తులకు అందించడం లాంటి విషయాలపై వ్యయించాలి. ఇది సన్యాసంతో సమానం.
            ఈ "వర్ణ" విధానాన్ని మరొక కోణంలో పరిశీలిస్తే....
ప్రతి వ్యక్తీ ముందుగా కోరుకునేది భుక్తి. ఆకలి తీర్చుకోవడం ప్రాథమికావసరం. దాని కోసం అను నిత్యం శ్రమిస్తాము. ఆ నిరంతర శ్రమ జీవనంలో ఒకసారి అనిపిస్తుంది... ఈ రోజు శ్రమించకున్నా భోజనం దొరికితే బాగుండునని. ఆ ఆలోచన కనుగుణంగా మొదటి నాడు సంపాదించుకున్న ఆహారంలో కొంత భాగాన్ని రేపటి కొరకు దాచుకుంటాడు. దాచుకోవడం కాలక్రమంలో వ్యాపారం (వృత్తి) గా మారుతుంది. సంపద పెరుగుతుంది. దానిని పదిల పరచు కోవడం, రక్షించుకోవడం కోసం తాపత్రయ పడతాడు. ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ సమయంలో కనీసం క్షణ కాలమైనా తన కోసం తన వారి కోసం వ్యయించలేని దుస్థితి ఏర్పడుతుంది. అప్పుడీ సంపద, అధికారం వెగటు పుట్టి తానేంటో తెలుసుకోవాలనే  జిజ్ఞాస కలుగుతుంది. తనకున్న దాని నంతా త్యజించి ఆత్మ జ్ఞానాన్వేషణలో నిమగ్నుడౌతాడు. ఇదీ మనిషి జీవిత చక్రం. దీని నిప్పుడు మనువు చెప్పిన "వర్ణ" విభాగంలో ప్రతిక్షేపించి చూద్దాం.
            భుక్తిని మాత్రమే కోరి చరించే స్థితి "శూద్ర స్థితి". దాచుకునే ఆలోచనా క్రమంలో ఏర్పడిన స్థితి "వైశ్య స్థితి". దాచుకున్న దానికి రక్షణ కల్పించడం, అధికారాన్ని ప్రదర్శించడం "క్షత్రియ స్థితి". ఒక సమయంలో ఈ సంసార మంతా వెగటు కలగడం వల్ల ఆత్మ జ్ఞానాన్ని అన్వేషించాలన్న ఆలోచన కలగడం "బ్రాహ్మణ స్థితి". ఈ నాలుగు స్థితులూ సమాజంలో ప్రతిబింబించడం మనం చూడవచ్చు.

పాలకుర్తి రామమూర్తి

భువనగిరి

No comments: